breaking news
Master Minds college
-
‘మాస్టర్‌మైండ్స్’పై విచారణ కొనసాగుతోంది
సిద్దిపేట రూరల్: పట్టణంలోని మాస్టర్‌మైండ్స్ కళాశాలలో జరిగిన సంఘటనపై విచారణ చేస్తున్నామని సిద్దిపేట డీఎస్పీ శ్రీధర్‌రెడ్డి అన్నారు. ఆదివారం రాత్రి స్థానిక టూటౌన్ పోలీసు స్టేషన్లో విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సిద్దిపేటలోని మాస్టర్‌మైండ్స్ కళాశాలలో నాలుగు నెలలుగా వాసవి అనే లెక్చరర్ పనిచేస్తోందని తెలిపారు. అయితే కొద్ది రోజులుగా కళాశాలకు చెందిన డెరైక్టర్ కిరణ్‌కుమార్‌రెడ్డి ఆమెను వేధిస్తున్నాడని, ఇదే క్రమంలో ఈ నెల 16న తను కళాశాలకు రాగానే వేధింపులకు గురిచేశాడని వాసవి ఫిర్యాదు చేసిందన్నారు. ఈ మేరకు వన్‌టౌన్ పీఎస్‌లో సెక్షన్ 509 కింద కిరణ్‌కుమార్‌రెడ్డిపై కేసు నమోదు చేసినట్లు తెలిపారు. అదే విధంగా కళాశాలలో అల్లరి చేసి, ఫర్నిచర్ ధ్వంసం చేశారంటూ కాలేజీ యాజమాన్యం చేసిన ఫిర్యాదు మేరకు వాసవి భర్త తిరుపతితో పాటు మరో 10మంది విద్యార్థి నాయకులపై 448, 427, 307 సెక్షన్ల కింద కేసులు బుక్ చేసి వారిని రిమాండ్‌కు తరలించినట్లు వివరించారు. 16వ తేదీన తాను కళాశాలకు వెళ్లినప్పుడు కాలేజీ నిర్వాహకులైన కిరణ్‌కుమార్‌రెడ్డి, విజయ్‌కుమార్‌రెడ్డి, మల్లారెడ్డి, పవన్‌కుమార్‌లు తదితరులు కులం(ఎరుకల) పేరుతో తనను దూషించారంటూ వాసవి భర్త తిరుపతి చేసిన ఫిర్యాదు మేరకు పైనలుగురిపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేసి రిమాండ్‌కు పంపినట్లు తెలిపారు. ఈ కేసును తానే ప్రత్యేకంగా దర్యాప్తు చేస్తున్నానని డీఎస్పీ చెప్పారు. ఎవరిపైనా పక్షపాతం చూపకుండా బాధితుల ఫిర్యాదుల మేరకు కేసులు నమోదు చేశామని పేర్కొన్నారు. అలాగే కేసుల నమోదులో పక్షపాతం, ఓ వర్గంపై ఓవరాక్షన్ చేశారంటూ వన్‌టౌన్ సీఐ సురేందర్‌రెడ్డిపై వస్తున్న ఆరోపణలపై దర్యాప్తు చేస్తున్నామని తెలిపారు. ఈ సంఘటనపై దర్యాప్తులో ఏది తేలితే సెక్షన్లు కూడా అలాగే మారుతాయని వివరించారు. దీనిపై ఎవరికీ అపోహలు అవసరం లేదన్నారు. పట్టణంలో ఆందోళనలు, ర్యాలీలు చేపట్టి శాంతి భద్రతలకు విఘాతం కలిగించొద్దని సూచించారు. ఆయన వెంట టూటౌన్ సీఐ సైదులు ఉన్నారు. -
లైంగికంగా వేధిస్తున్నారు
సిద్దిపేట: మాస్టర్ మైండ్స్ కళాశాల డెరైక్టర్లు తనను లైంగిక వేధింపులతో పాటు ఈవ్ టీజింగ్ చేస్తున్నారంటూ అదే కళాశాలలో సంస్కృతం బోధిస్తున్న లెక్చరర్ వాసవీ గురువారం పోలీసులకు ఫిర్యాదు చేశారు. వివరాలు.. కొంత కాలంగా కళాశాల డెరైక్టర్లు కిరణ్‌కుమార్‌రెడ్డి, మల్లారెడ్డి, విజయ్‌కుమార్‌రెడ్డి, పవన్‌కుమార్‌రెడ్డిలు తనను లైంగిక వేధింపులకు గురిచేస్తున్నారని వాసవి తన భర్త తిరుపతికి తెలిపింది. దీంతో ఆయన విషయాన్ని పట్టణ ఏబీవీపీ నాయకుల దృష్టికి తీసుకువెళ్లారు. వారు గురువారం కళాశాలకు వెళ్లి ఇదే విషయమై డెరైక్టర్ కిరణ్‌కుమార్‌రెడ్డిని నిలదీశారు. దీంతో వారి మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. ఆగ్రహించిన పలువురు ఏబీవీపీ నాయకులు ఫర్నిచర్‌ను ధ్వంసం చేశారు. కళాశాల యాజమాన్యం ద్వారా విషయం తెలుసుకున్న వన్‌టౌన్ పోలీసులు ఏబీవీపీ నాయకులపై లాఠీ ఝళిపించారు. అనంతరం వారితోపాటు కళాశాల డెరైక్టర్ కిరణ్‌కుమార్‌రెడ్డిని పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. బాధితురాలి ఫిర్యాదు మేరకు నిందితులపై పోలీసులు ఎస్సీ,ఎస్టీ అట్రాసిటీ కింద కేసు నమోదు చేశారు.