breaking news
madhavapeddi gokhale
-
బహిష్కృతుడు
- మాధవపెద్ది గోఖలే స్కూలు మాష్టరు సాంబయ్య రైలు ప్లాట్ఫారం మీద నుంచుని రైలు పట్టాలు రెండు గీతలుగా ఎంతో దూరానికి పోయి కలుసుకునే చోట చిన్న నల్లటి ఆకారంతో పొగ వొదులుకుంటూ ఢిల్లీ ఎక్స్‌ప్రెస్ రావటం చూశాడు. ఆ బండిలో తన చిన్నపాటి స్నేహితుడూ తన ఊరివాడైన సుందర మూర్తి వస్తున్నట్టు తనకు జాబు వచ్చింది. సుమారు ఇరవై ఏళ్ల కిందట సుందరం ఊళ్లో నుండి అకస్మాత్తుగా అదృశ్యుడవటం జ్ఞప్తికొచ్చింది. వాడు మద్రాసు, బొంబాయి, కలకత్తాల్లో తిరుగాడ్తున్నాడని గాలివార్తలు వస్తున్నప్పుడల్లా సాంబయ్య చెవి కోసుకుని వింటూండేవాడు. చిన్నప్పుడే సుందరంగాడికి కనబడ్డ ఖాళీ చోటల్లా బొమ్మలు గీసి ఖరాబు చేసే పిచ్చి ఉండటం సాంబయ్యకు ఇప్పటికీ జ్ఞాపకం ఉంది. ఆ పిచ్చి సుందరం పరారీకి కారణ మైందని ఎందర్తోనో చెప్పాడు కూడా. ఎందుకంటే, సుందరం డ్రాయింగు నేర్చుకుంటానికి పట్నం పోతానని వాడి నాన్న సుబ్బయ్య పంతుల్తో చెప్పటం, ఆయన వాణ్ని ‘‘పుండాకోరు వేషాలేస్తే ఒళ్లు హూనం చేస్తా’’నన్నమీదట ఇంట్లో కొంత రగడ జరగటం సాంబయ్యకు సూదిలో దారం గుచ్చినంత వైనంగా తెలుసు. అయితే సుందరం బొమ్మలు వేయటంలో ప్రవీణుడై ఆ విద్యతోనే వాడు ఇటీవల ఢిల్లీకి చేరి ఘనంగా ధనార్జన చేస్తు న్నట్టు విని నిర్ఘాంతపోయాడు. సుందరం స్థితిమంతుడవుతున్నాడనే దుగ్ధతో కాక పోయినా తమ స్నేహాన్ని జ్ఞాపకం చేస్తూ వాడికి సాంబయ్య ఉత్తరాలు రాసిన మాట మట్టుకు నిజం. భూమిని అదరగొడ్తూ ఎక్స్‌ప్రెస్ బండి ధన్ధనామంటూ వచ్చి ప్లాట్‌ఫార మంతా ఆక్రమించుకునే గడబిడకు గాని తన స్మృతికల్లోలం నుండి తెప్పరిల్లుకో లేదు సాంబయ్య. సుందరాన్ని సులభంగా గుర్తుపట్టగలిగే ధోరణిలో ఉన్న సాంబయ్యకు ఆశాభంగం కలిగింది. అది చిన్న స్టేషను అవడం వల్ల ఎక్కే దిగే ప్రయాణికులు పదిమంది కన్నా లేనప్ప టికీ ఎక్స్‌ప్రెస్ బండి కూత కూసి ప్లాట్ ఫారం వదిలిపోయిన కాసేపటికి గాని ప్లాట్ఫారం చివర్న స్టేషను పేరున్న చెక్క దగ్గిర చేతిలో మధ్య రకం సూట్ కేసూ, చంకలో ఓ అట్టల కట్టా, సంచీ తగిలించు కున్న పొడుగాంటి వ్యక్తిని సాంబయ్య గమనించలేదు. అంగలేసుకుంటూ ఒక క్షణంలో ఆ వ్యక్తి దగ్గరకు చేరుకున్న సాంబయ్య ‘‘నువ్వు సుందరానివి కదూ?’’ అనడిగాడు రొప్పుకుంటూ. నలిగిన లాల్చీ, పైజమా, మంద పాటి ఫ్రేము కళ్లద్దాలు, విశాలంగా ఉండి చిట్లిస్తున్న కళ్లతో ‘‘సాంబయ్యా బాగున్నావా? నువ్వు నాకోసం నాలుగు మైళ్లున్న స్టేషనుకు వస్తావనుకోలేదు!’’ అంటూ సాంబయ్య చేయి పట్టు కున్నాడు సుందరమూర్తి. ‘‘ఇదేంట్రా సుందరం, సకుటుంబ సమేతంగా వస్తావను కుంటే మరీ సాదాగా వస్తే ఎట్ల? సూటూ, బూటూ, హేటూ, బంట్రోతు లగాయతు దర్జా ఒలకబోస్తూ దిగుతావను కుంటే అసలు విషయం, మన ఆంధ్రులు కాస్త అవసరాన్ని గుర్తించయినా నలుగుర్ని ఆకట్టేట్టుగా పటాటోపం కనబరుస్తారేమో నని చూస్తా. అబ్బే మాట వరసకైనా ఆ మెళకువలుంటేగా!’’ అన్నాడు సాంబయ్య, సుందరమూర్తిని ఇంకా పరీక్షిస్తూ. మిత్రులిద్దరూ స్టేషను పక్క పూరి గుడిసె కాఫీ హోటల్లో టిఫిన్ తిని సుందరం కోరిక మీద వాళ్ల పల్లెటూరుకు నడక సాగించారు. ‘‘ఇక్కడ గుర్రబ్బళ్లు ప్రయత్నిస్తే దొరుకుతై గాని, నాకు అసలు నడకంటే మహా సరదా’’ అన్నాడు సాంబయ్య, సుందరం పక్క సూటుకేసు పట్టుకు నడుస్తూ. ‘‘బళ్లంటే నాకు రోత! ఇక్కడి దృశ్యాల్నీ, ఈ మాగాణి భూమి గాలి పీలుస్తూ నడుస్తుంటే హాయిగా ఉంది. ఈ చేలల్లో నారుమళ్లు లెమన్ గ్రీన్ కలర్లో ఎంత అందంగా ఉన్నాయ్! ఆ వెర్మీ లియన్ తంగేడు పూల గుంపు చూశావా. ఆ గ్రీన్‌లో... అద్భుత సృష్టిగా లేదూ? ఈ గాలి తగుల్తూనే నాకో ఇరవయ్యేళ్ల వయస్సు తగ్గినట్టుగా వుంది’’ అన్నాడు సుందరం గుండె నిండా గాలి పీలుస్తూ. ధనరాశులూ, దర్జాలొలికే ఢిల్లీలాంటి పట్నాల్లో ఇరవయ్యేళ్లుండి ఊడిపడిన ఈ సుందరం వాలకమేమిటని తన్ను తాను అమాయకంగా ప్రశ్నించుకున్నాడు సాంబయ్య. ఇంతకుముందా పూరిగుడిసె కాఫీ హోటల్లో పొయి దగ్గర మట్టినేల మీద తెల్లటి పాలరాయి మీద కూచున్నట్టు బాసీపీటా వేసుకుని ఆ ఇడ్లీ పెసరట్లను పంచభక్ష్య పరమన్నాలల్లే ఆవురావుర్న తింటమే కాకుండా, ఆ ఉప్పు చెమటలలో మునిగి తేల్తున్న హోటలు వంటవాడికేసి కన్నార్పకుండా ప్రాణమిత్రుడల్లే ఆప్యాయంగా చూట్టం తలుచుకున్న సాంబయ్యకు ఒక్కసారి పచ్చి ఆముదం తాగిన భావం కలిగింది. ‘‘ఒరే సుందరం, ఇరవయ్యేళ్ల పట్న గాలి తిన్న నీలో ఇంకా మన పల్లెటూరి వేషాలు పట్టుకు వేళ్లాట్టం చూసి నాకు నిజంగా ఆశ్చర్యంగా ఉంది!’’ అన్నాడు సాంబయ్య. సరైన ధోరణికి వస్తూ. ‘‘నాకు మట్టుకు నిన్ను ఇరవయ్యేళ్ల కిందటి సాంబయ్యల్లేనే చూట్టం మహా నందంగా ఉందంటే నమ్ము! దురదృష్ట వశాత్తూ సహజత్వాన్ని అట్టిపెట్టు కుంటున్న పల్లెప్రజల వ్యక్తిత్వాలకు నిజంగా మసి ఏర్పడి మరుగుపడ్తే నాలాంటివాళ్లు ఉరిపోసుకు చావాల్సిందే! పట్నం మొహాలు యంత్రంలో అచ్చయి నట్లుంటాయ్. వాటిలో స్వాభావికత ఉండదని నా నమ్మకం. ఎందువల్లంటే, హెచ్చు తగ్గుల పోటీలో వాస్తవాన్ని మరుగుపర్చుకునేందుకు పట్నం మను షులు ఎన్ని కృత్రిమ సాధనాల్నయినా అనుసరిస్తారు. ఇందాక నువ్వు కాఫీ హోటలు వంటవాణ్ని చూసే వుంటావను కుంటా. అతన్లో నాకు రక్తమాంసాలున్న ట్లనిపించింది! ఆ పొయ్యి సెగకు చమట్లో మునిగి తేల్తున్నా, నేను ఇడ్లీ పచ్చడి బాగుందనేసరికి నవ్వాడు. అలాంటి నిర్వి కార గుణం గల వ్యక్తిత్వం పట్నాల్లో మచ్చుకైనా కనిపించదు!’’ అన్నాడు సుందరం, పెద్ద పెద్ద అడుగులు వేస్తూ. ‘‘నీ ఉద్దేశాల్ని గురించి నేనేమను కుంటున్నా నువ్వు పట్నాలకు చేరి ప్రయో జకుడవై మన ఊరుకు కీర్తినార్జించావని నా నమ్మకం. అయితే నువ్విన్నేళ్లూ పట్న వాసుల్ని అసహ్యించుకుంటూనే ప్రయో జకుడవై ధనార్జన ఎలా చేయగలుగు తున్నావో ఊహించ లేకుండా ఉన్నా!’’ అన్నాడు సాంబయ్య, సుందరాన్నోకంట చూస్తూ. ‘‘నువ్వు ఉపాధ్యాయుడివి గనుక విషయం నేను సూక్ష్మంగా చెప్పినా అర్థం చేసుకోగలవనుకుంటా. నేను కలలుగన్న చిత్రలేఖన సాధన చేయటానికి పట్నాల్లో తప్ప ఆస్కారం లేదు. అక్కడ కళల్ని గౌర వించడం, ఎంతో కొంత ఆర్థికంగా ముట్ట చెప్పటం, బలవంతంగానైనా తెచ్చిపెట్టు కుంటారు. అందుకే నాకిష్టమున్నా లేక పోయినా నేను పట్నాల్లోగాని జీవించ లేను. కాని కళాసృష్టికి కావలసిన వైవిధ్యం అక్కడ లభించదని ఇటీవలే అర్థం చేసు కున్నా. ఇన్నాళ్లూ నేను పెద్ద పెద్ద వ్యాపా రస్తుల అవసరాలకు నా నైపుణ్యం విని యోగించి ధనార్జన చేసిన మాట వాస్తవం. కాని ఆ దౌర్భాగ్య స్థితికీ, కళాభివృద్ధికీ సాపత్యం లేదనే త్రాష్టపు జబ్బు కొన్నేళ్ల నుంచి నాలో ప్రవేశించి తినేస్తున్నది. ఈ జాడ్యం వల్లనే నేనీనాడు అటు ధనా ర్జనకూ, యిటు కళాభివృద్ధికీ చెందని ధైన్యావస్తలో ఉన్నా’’ అన్నాడు సుందరం, అంతరిక్షంలోకి చూస్తూ. ‘‘డబ్బు పుట్టక రోజు గడవటం సమస్యగా ఉన్న నాలాంటి అభాగ్యుడికి నీ తర్కం వింతగా తోచటం సహజం. ధనార్జన శక్తి పొందిన ఏ ప్రాణి జీవిత మైనా తరిస్తూండటం నా కళ్లారా చూస్తున్నా! నువ్వూ అంత అదృష్టవంతుడవనే నేనిన్నాళ్లూ నమ్ముతున్నా’’ అన్నాడు సాంబయ్య. ‘‘సాంబయ్యా, నువ్వు అక్షరాలా ఉపాధ్యాయుడివి! నువ్వు ఇన్నేళ్లుగా వందలకొద్దీ విద్యార్థులకు చేస్తున్న బోధల వల్ల నీకేనాడైనా ఆత్మ సంతృప్తి కలిగినట్టనిపించిందా?’’ అనడిగాడు సుందరం. ‘‘నా విద్యార్థుల్లో ఏ కొద్దిమంది విద్యాధికులైనా నాకాత్మసంతృప్తి కలిగినట్టు రుజువవుతుంది!’’ అన్నాడు సాంబయ్య. ‘‘ఆడవారికి నగలాపేక్ష ఉన్నట్టు సమాజానికి విద్యాధికులు కూడా అంత అలంకారమే. నేను చిత్రకళలో నైపుణ్యం పొందినంత మాత్రాన నేను వేసే చిత్రాలకు విలువ ఉంటుందంటావా సాంబయ్యా?’’ అంటున్న సుందరం మధ్యలోనే బ్రేకు వేసినట్టాగిపోయి వెర్రిచూపులు చూస్తూ నిలబడ్డాడు. సన్నగా సాగిన వానజల్లుతో, పడ మటి దిక్కున ఇంద్రధనుస్సు ప్రత్యక్షమై ఉంటే, ఇరవై గజాల దూరంలో రోడ్డుపక్క గొడ్లపిల్లకాయల పక్కన నారుమడి గట్టు మీద ఎర్రచీర పైకి ఎగ్గట్టి ‘‘వానా వచ్చే వరదా వచ్చే చాకలివాడి బానా వచ్చే’’ అని చేతులూపుతూ ఎగుర్తున్న ఒకమ్మా యిని చూసిన సుందరం, మంత్రించబడిన వాడల్లే ఇంకొంచెం ముందు రోడ్డుపక్క చింతచెట్టు కిందకు చేరి సంచీలోని తెల్ల కాగితాల పుస్తకం తీసి కలంతో బొమ్మలు గీయడం మొదలుపెట్టాడు. సాంబయ్య మెల్లిగా వెళ్లి సుందరం బరబర గీకుతున్న గీతల్ని శ్వాస బిగబట్టి చూడసాగాడు. అతి త్వరగానూ, సునాయాసంగానూ చిక్కిరి బిక్కిరిగా గీస్తున్న గీతలకు ఏర్పడుతున్న చిత్రరూపం చూస్తుంటే ఒక సంగీత పాఠకుడు అతి తిక్కమీద విసురుగా రాగాలాపన చేసి పాటందుకున్నట్టల్లే అనిపించింది సాంబయ్యకు. ‘‘ఆ గొడ్లపిల్లలు మనవేపు అను మానంగా చూస్తున్నార్రా సుందరం. అరుగో ఇద్దరు కొక్కిరాయి వెధవలు మనవేపు రానే వస్తున్నారు. చూడు చూడు చంద్రమ్మ కూడా వస్తున్నది’’ అంటున్న సాంబయ్యను ఒక్కసారి బాకుతో పొడిచి నంత చూపు చూసి, ఆ గీసిన గీతల మీదే ఇంకా బలంగా గీయటం మొదలుపెట్టాడు సుందరం. సుందరం చూపుకు వెలతెలా పోయిన సాంబయ్య అప్పటికే వచ్చి చుట్టు ముట్టిన జనాన్ని ఉరిమి చూస్తూ, ‘‘మీకేం పన్లేదూ జోరీగలు ముసిర్నట్టు ముసుర్తు న్నారూ?’’ అనరిచాడు. ‘‘సాంబయ్యగోరూ! ఏందా మడిసి అదేమయిన మాకేసి చూసి సూసి రాస్తా వుండాడు?’’ అనంటూ ఎర్రచీరా, నల్లగళ్ల రవికా, కొప్పు, తెల్లరాయి ముక్కుపుడకా, చెవులకు కమ్మలూ, నవ్వుతున్న కళ్లతో నల్లగా మెరుస్తున్న ఆ అమ్మాయి, నోట్టో గడ్డిపోచ నముల్తూ ఒయ్యారంగా నడుస్తూ వచ్చి అడిగింది. కన్నార్పకుండా ఆ అమ్మా యిని ఓ దేవకన్యల్లే చూస్తున్న సుందరాన్ని చూస్తున్న సాంబయ్య ‘‘ఇది మన వూరి వెంకయ్యా వీరమ్మల కూతురు చంద్రమ్మ’’ అన్నాడు, ఈ సంఘటన తొందరగా ముగిస్తే బాగుండుననుకుంటూ. ‘‘ఈయన ఢిల్లీపట్నం లెగిసెల్లిన మన చుబ్బయ్యగారి ఎంకట లచ్చుమ్మ గారబ్బాయిగాదూ? యియ్యాల రవిలు బండికి వత్తాడని అంటావుంటే యిన్నాలే’’ అని చంద్రమ్మ అంటున్నదో లేదో ఎవరికీ తెలియకుండా సుందరం వెనుకనే ఉన్న చింతచెట్టు పంగల్లోకెక్కిన ఓ గొడ్ల పిల్ల కాయ సుందరం చేతిలో ఉన్న పుస్తకంలో గీతల్ని చూసి ‘‘ఈయన సెంద్రమ్మ బొమ్మ గీస్తుండాడహో’’ అనరుస్తూనే టపీమని చెట్టుమీద నుంచి దూకి, మరుక్షణంలోనే గొడ్ల మందలోకి దూరి మాయమైనాడు. ఆ మర్నాడు స్కూలు పని ముగించు కుని గాని సుందరాన్ని కలుసుకోలేదు సాంబయ్య. మాటకు ముందే కళ్లనీళ్లు పెట్టుకునే సుందరం తల్లి వెంకట లక్ష్మమ్మ ద్వారా తెలుసుకుని వారి గొడ్లసావిట్లో ఓ మూలవున్న సుందరాన్ని చూశాడు. ‘‘ఏమిరోయి సుందరం? అప్పుడే రంగుల రంగంలోకి దిగినట్టున్నావే? చివరకు ఈ గొడ్ల సావిట్లోనుట్రా నీ కళా సాధనా? ఇంకా నయం? ఈ సావిట్లో పశువులు, దూడరేణువులు లేవు!’’ అంటూ నులక మంచం మీద పక్కచుట్ట ఎత్తుగా పెట్టుకుని దానికి పేపరున్న పీట చక్కనానించి ఏదో తైలవర్ణాల్తో వేస్తున్న సుందరాన్ని పలకరించిన సాంబయ్య, అట్లాగే నిలబడిపోయి సుందరం వేస్తున్న బొమ్మను పరీక్షగా చూసి అప్రయత్నంగా నోరు తెరిచాడు. సుందరం చిత్రిస్తున్న ఆ చిత్రం రంగుల మీద రంగులెక్కి గంద్ర గోళంగా ఉన్నట్టు ముందు చూడంగానే అనిపించినా ఆ బొమ్మలోని చంద్రమ్మను ఆనవాలు పట్టాడు సాంబయ్య. జానెడెత్తు పీట మీద ఒక పక్కగా కాళ్లు ముడుచుకుని, అతి వయ్యారంగా తలవొంచుకుని, కొప్పులో పూలు ముడుచుకుంటున్నదా నల్లటి స్త్రీ చిత్రం. ‘‘సుందరం? నువ్వు వేస్తున్న ఆ బొమ్మ ఎవరిది?’’ అనడిగాడు సాంబయ్య, మొహాన స్వేద బిందువులు పొటకరిస్తుంటే. ‘‘లోకానికి కనపడని ఒక అద్భుత అజ్ఞాత స్త్రీది! నిన్ను కూచోమంటానికి ఇక్కడేం కుర్చీలు లేవు. ఈ బోర్లించిన గాబు మీద కూచో. ఎటా ్లవుంది చిత్రం?’’ అన్నాడు సుందరం. చిత్రాన్ని పూర్తిచేసే దశలో అక్కడక్కడా రంగులు ఒక వెదురు బద్దతో మొత్తుతూ. ‘‘ఆ మనిషి చంద్రమ్మల్లే ఉంది నాకు’’ అన్నాడు సాంబయ్య ఆ స్త్రీమూర్తి అంగాల్ని కన్నార్పకుండా చూస్తూ. ‘‘ఈ స్త్రీ ఎవరయిందీ నాకు నిమిత్తం లేదు. ఏ దుర్వాసనల ప్రభావానికీ గురి కాని వ్యక్తిత్వం ఉన్న స్ఫటికం లాంటి మూర్తి! ఈ అన్వేషణే నా కళాసాధనకు మూలం. ఇదిగో ఈ రెండో చిత్రం కూడా చూసి నీ అభిప్రాయం చెప్పు’’ అంటూ మంచంకోడు బోర్లావేసి ఆనించివున్న అట్టను తీసి సాంబయ్యకు కనపడేట్టు మంచం ఇవతల వేపు ఆనించాడు. ఈ చిత్రం మరీ గంద్రగోళంగా ఉంది సాంబయ్యకు. ఎర్రచీర పైకి ఎగ్గట్టిన ఒక నల్లటి పడుచుపిల్ల. బహుశా చంద్రమ్మ కావచ్చు. ఒక ఆకుపచ్చ రంగు పేలిక మీద వొయ్యారంగా నుంచుని, చెవి దగ్గర చేయి పెట్టుకుని పాడ్తున్న ధోరణిలో ఉంది. ఆ పిల్ల వెనుక ఆకాశంలాగా ఉన్నచోట ఇంద్ర ధనుస్సల్లే రంగుల మీద రంగులెక్కి గజిబిజిగా ఉంది. ఎడంపక్క ఒక గేదపడ్డ ఏటవాలుగా ఆకాశం వేపు ఎగుర్తూ ఉంటే దాని తోక పట్టుకుని ఒక గొడ్ల పిల్లకాయ ఆ పశువుతో పాటే పెకైగుర్తున్నాడు. ఆ చిత్రం సాంతం చూసి ఒక్క గుటక మింగాడు సాంబయ్య. ‘‘ఆ చిత్రం పేరు ప్రకృతి రాగం. మనం నిన్న ఆ వానజల్లులో పశువుల మంద వద్ద చూసిన ఆ జీవుల మనస్తత్వాలీ చిత్రంలో ప్రతిబింబిస్తు న్నాయ్’’ అని చిత్రంలోని లక్ష్యం విష యమై చెపుతున్న సుందరం, సాంబయ్య గొడ్లసావిడి పక్కన సహం పడిన తాటా కుల దడి వేపు చూస్తుంటం గమనించాడు. అక్కడ తమ వంక చూసీ చూడనట్టు నవ్వుతూ ఎర్రచీరతో నుంచునుంది చంద్రమ్మ. చంద్రమ్మ పూరిగుడిసె ఆ దడి వెనుకనే ఉందని సాంబయ్యకు తెలుసు. చంద్రమ్మకేసి కొరకొర చూసి ‘‘నాకు పని ఉంది, మళ్లీ కనిపిస్తా సుందరం’’ అంటూ గిర్రున తిరిగి భూమిని బలంగా తొక్కుకుంటూ గబగబా వెళ్లిపోయాడు సాంబయ్య. ఒక వారం రోజుల తర్వాత అర్ధరాత్రి సమయంలో చంకలో ఒక పక్క సంచీ, ఇంకోపక్క బొమ్మల కట్టా, చేతిలో సూట్ కేసుతో సుందరం, సుందరం తండ్రి సుబ్బయ్య పంతులూ ఆ పల్లెటూరుకు మైలు దూరంగా నిశ్శబ్దంగా వచ్చి రోడ్డు మీద ఎదురెదురుగా నుంచున్నారు. ‘‘భ్రష్టుడా, నా కడుపున చిచ్చు పెట్టావు! నా వంశం నశించింది’’ అన్నాడు సుబ్బయ్య పంతులు బుసకొట్టినట్టు. ‘‘నాన్నా! నువ్వు నన్ను అపార్థం చేసుకుంటున్నావు. నాకూ ఆత్మాభిమానం ఉంది’’ అన్నాడు సుందరం. ‘‘మండింది నీ ఆత్మాభిమానం. ఊరూ నాడూ ఏకమై ఆ చంద్రమ్మనూ నిన్నూ బజారుకు ఈడిస్తే నా తల ఎక్కడ పెట్టుకున్నాను? సహం చచ్చిన మీ అమ్మ రొమ్ములు బాదుకుంది. ఇన్నాళ్లూ పరువుగా బతికి బట్టకట్టిన ఊళ్లో వెలివేయ బడ్డాం. వాళ్లు మమ్మల్ని కాకులు పొడిచి నట్లు పొడుస్తారు. నువ్వు ఎక్కడో ఎప్పుడో వేరే కులం అమ్మాయిని పెళ్లి చేసుకుంటే ఎవరేడ్చారు? ఇన్నేళ్లకు ఇప్పుడు మళ్లీ పని పెట్టుకువచ్చి ప్రత్యక్షంగా మమ్మల్ని సర్వ నాశనం చేశావు. ఆ సాంబయ్య త్రాష్టుడు! వాడికీ చంద్రమ్మకూ సంబంధం ఉంది. నువ్వు దాని గుడిసెలో చేరి దాన్ని నగ్నంగా బొమ్మలు వేస్తున్నావని దాని తండ్రీ అన్నల్తో చెప్పి నిన్ను బజారుకు లాగించాడు. ఇదిట్రా నీ కళాసాధన? బూతుకూ కళకూ ముడివేసి భ్రష్టత్వంలో పండిపోయినావు!’’ అన్నాడు సుబ్బయ్య పంతులు, నిప్పురవ్వలు రాలుస్తూ. ‘‘కళాసాధనకు సత్యం, సౌందర్యం, భావం, ప్రయోజనం బలమైన ఆధారాలు. సాంబయ్య సంబంధాల్తో నాకు ప్రసక్తి లేదు. నా సాధనకు చంద్రమ్మ ఆధార మైంది గనుక బహిరంగంగా నేనా పిల్ల గుడిసెలోకి పోవటంలో తప్పెంత మాత్రం లేదు. ఈ విషయం తెలుసుకోలేనివాళ్లు నన్ను బజారుకీడ్చినందుకు నాకావ గింజంత విచారం కూడా లేదు. ఎందు కంటే రేపు నేనీ చిత్రాల్ని ప్రదర్శించి నప్పుడు నాకు గౌరవం లభిస్తే సాంబయ్య తల నేలకేసి పగులగొట్టుకోడని కూడా నాకు తెలుసు. కానీ జరిగిందానికి మీరు అప్రదిష్టపాలైనందుకు నా హృదయం దహించుకుపోతున్నది. మన్నించండి. మీకు అభ్యంతరం లేకపోతే మీరు ఢిల్లీకి వచ్చి నా భార్యాబిడ్డల్తో ఉంటే మేం ఆనందిస్తాం. వెళ్లి వస్తా నాన్నా’’ అంటూ ముందుకు సాగిపొయ్యాడు సుందరం. అప్పుడే ఉదయిస్తున్న చంద్రకాంతిలోకి అదృశ్యమవుతున్న కొడుకును కన్నార్ప కుండా చూశాడు సుబ్బయ్య పంతులు. -
అది సెట్ అని చెప్పినా నమ్మలేదు
పురాణాల్లో తరచూ వినిపించే పేరు మయబ్రహ్మ. దేవతల ఆర్ట్ డెరైక్టర్ అన్నమాట. ఆయనకు ఏ మాత్రం తీసిపోరు మన సినీ కళాదర్శకులు. ఏ ముహూర్తాన సినిమా జనాల ముందుకొచ్చిందో గానీ.. అప్పట్నుంచి లోకాలన్నింటినీ తెరపైకి తెచ్చేసి గత కొన్నేళ్లుగా ప్రేక్షకులను సంభ్రమకు లోను చేస్తున్నారు. మాధవపెద్ది గోఖలే, టీవీఎస్ శర్మ, తోట తరణి లాంటి లెజెండ్స్ సృష్టించిన అద్భుతాలను మనం చూశాం. ఇప్పుడు తెలుగు తెరపై హాట్ ఫేవరెట్ రవీందర్. మగధీర, మర్యాదరామన్న, ఈగ, అత్తారింటికి దారేది... ఈ సినిమాలు చాలు రవీందర్ ప్రతిభ చెప్పడానికి. కళా దర్శకుడంటే... కేవలం సెట్లు వేయడం కాదు, తన సెట్స్ ద్వారా కథను చెప్పాలి, పాత్రల వ్యక్తిత్వాలను సెట్లు ప్రతిబింబించాలి అంటున్న రవీందర్‌తో కాసేపు. సెట్ కథకు అద్దం పట్టాలి ‘ఐతే’ సినిమా కోసం ఓ కిళ్లీ కొట్టు సెట్ వేశాను. ఆ సినిమా యూనిట్లో పనిచేసే కుర్రాడే ఆ కొట్టు దగ్గరకెళ్లి ‘ఓ సిగరెట్ ఈయమ్మా’ అనడిగాడు. అక్కడున్నవాళ్లందరూ ఒకటే నవ్వులు. తొలి సినిమాకే నాకు అందిన గొప్ప ప్రశంస అది. అలాగే... ‘రాఖీ’ సినిమా కోసం హీరో ఇంటి సెట్ వేశాం. ఛార్మితో షాట్స్ తీస్తున్నారు కృష్ణవంశీ. ఆమె కాస్ట్యూమ్స్ ఛేంజ్ చేయాలి. లొకేషన్‌కి దూరంగా ఓ ఇల్లు చూపించారు కో డెరైక్టర్. ఆమెకు కోపం వచ్చేసింది. ‘ఎదురుగా ఇల్లు పెట్టుకొని అక్కడెక్కడికో వెళ్లమంటారేంటి?’ అంటూ చిరాకు పడిపోయారు. ‘అది సెట్ అమ్మా తల్లీ..’ అన్నా ఆమె నమ్మలేదు. సెట్ అనేది వాస్తవికతకు అద్దం పట్టాలని నమ్ముతాను నేను. కళా దర్శకునికి కథ తెలిసుండాలి కళా దర్శకుడికి కథతో పనేంటి? అనేవారు చాలామంది ఉంటారు. కానీ నేను దానికి వ్యతిరేకిని. కళాదర్శకునిగా ‘ఛత్రపతి’కి సైన్ చేయగానే... ముందు కథ చెప్పమని అడిగాను. దానికి నన్ను కిందనుంచి పైకి చూసినవాళ్లు ఉన్నారు. కానీ తర్వాత నా పనితనం చూసి రాజమౌళీగారే అభినందించారు. సముద్రతీరంలో తల్లీ కొడుకుల సెంటిమెంట్ సాంగ్ తీస్తున్నప్పుడు... కొండరాళ్ల మధ్యలో చూచాయగా పాలిస్తున్న తల్లిలా అనిపించే మరో రాయిని ప్రత్యేకంగా చేయించి అమర్చాను. ఆ రాయి ఆ సన్నివేశానికి శోభను తెచ్చింది. ‘మర్యాదరామన్న’లో విలన్ ఇంటి సెట్, అందులోని పాత్రలకు అద్దం పడుతుంది. ఆ సినిమా పతాక సన్నివేశంలో కష్టాలకోర్చి రెండొందల అడుగుల ఎత్తులో వంతెనను నిర్మించాం. ఆ నిర్మాణం నిజంగా అద్భుతమే. ‘మగధీర’ నాకెంతో సంతృప్తినిచ్చింది ‘మగధీర’లో జలపాతాన్ని ఛేదించుకుంటూ గుర్రంపై ఎంటరవుతాడు రామ్‌చరణ్. అది చాలామంది గ్రాఫిక్స్ అనుకుంటారు. కానీ అది గ్రాఫిక్స్ కాదు. మేం చేసిన మేజిక్. గ్రాఫిక్స్‌తో ఆ సన్నివేశం తీస్తే జనాలకు తేలిగ్గా అర్థమైపోతుంది. దాంతో ఆసక్తి తగ్గుతుంది. లొకేషన్లో ఆ సీన్ తీసేటప్పుడే అందరూ ఆశ్చర్యానికి లోనయ్యారు. ఆ సినిమాలోని ఓ సీన్లో చరణ్ డ్రమ్ము వాయిస్తాడు. ఆ డ్రమ్ము నిజంగా తయారు చేశాం. ‘మరీ ఇంత చాదస్తమా?’ అని నిర్మాత వారిస్తున్నా.. వినకుండా... నాగ్‌పూర్ నుంచి ప్రత్యేకంగా పచ్చిచర్మాన్ని తెప్పించాం. ఆ చర్మం దారుణమైన స్మెల్ వస్తున్నా... భరిస్తూ ఆ డ్రమ్ తయారు చేశాం. చరణ్ ఆ డ్రమ్ వాయిస్తున్నప్పుడు దుమ్ము లేస్తుంటే జనాల్లో వచ్చిన వైబ్రేషన్ తెలిసిందే. ఏ విషయంలోనూ రాజీ పడకుండా నిర్మాత సహకరించడం వల్లే అంత అద్భుతాన్ని తెరపై ఆవిష్కరించగలిగాం. సెట్ అనేది పాత్ర వ్యక్తితాన్ని ప్రతిభింబించాలి కళా దర్శకుడు నిర్మాతలతో ఎక్కువ ఖర్చు చేయిస్తారు అనేవాళ్లు కోకొల్లలు. కానీ అందులో నిజం లేదు. సరైన సమయంలో సెట్ అందుబాటులో ఉంటే నిర్మాతకు ఖర్చు తగ్గుతుంది. అందుకు ‘అత్తారింటికి దారేది’ సినిమానే ఓ నిదర్శనం. ఈ సినిమాకు ముందు అనుకున్న పని దినాలు 120. కానీ సెట్ అందుబాటులో ఉండటంతో 103 రోజుల్లో సినిమా పూర్తయింది. కుటుంబ కథలకు ఆర్ట్ డెరైక్టర్‌తో పనుండదనేది చాలామంది అభిప్రాయం. దాన్ని బ్రేక్ చేసింది ‘అత్తారింటికి దారేది’. నదియా ఇంటి సెట్ నాకు చాలామంచి పేరు తెచ్చింది. ఆ ఇంటి సెట్లో కొన్ని పాతకాలపు వస్తువులను చూపించాం. సెంటిమెంట్లను గౌరవించే నదియా పాత్ర వ్యక్తిత్వాన్ని ప్రతిబింబించడానికే అలా చేశాం. ‘జూలాయి’ చేస్తున్నప్పుడు 40 లక్షలతో బ్యాంక్ సెట్ వేశాను. ‘బ్యాంక్ సెట్‌కి అంత ఖర్చా’ అన్నారు. 15 వేల కోట్లు దాచే బ్యాంక్ అది. దానికి 40 లక్షలు వెచ్చించడం తప్పుకాదే. త్రివిక్రమ్ ఈ విషయంలో నాకెంతో సహకరించారు. సినిమా విజయంలో నా పాత్ర గురించి చెప్పుకోవాలి సినిమా సక్సెస్‌లో పనిచేసిన అందరికీ భాగం ఉంటుంది. కాదని అనను. కానీ.. ఒక ఆర్ట్ డెరైక్టర్‌గా నా ప్రతిభ గురించి ప్రత్యేకంగా అందరూ చెప్పుకోవాలి. నేను కోరుకునేది అదే. చిన్న సినిమాలకూ అందుబాటులో ఉంటున్నాను. ప్రస్తుతం రాజీవ్‌మీనన్ దర్శకత్వం వహిస్తున్న ఓ బాలీవుడ్ సినిమాకు, కరుణాకరన్-నితిన్‌ల సినిమాకు ఆర్ట్ అందిస్తున్నా.