గుండె ‘గోదారి’!
సిద్దిపేట రూరల్ : ఆశలన్నీ పిల్లలపైనే పెట్టుకుని... చదివించి ప్రయోజకులను చేస్తే... ఆసరా ఉండాల్సిన సమయంలో కాదుపొమ్మన్నారు. వారి బంగరు భవిత కోసం... స్థోమతకు మించి అప్పులు చేసిమరీ ఉన్నతికి తెస్తే... ఉద్ధరించాల్సిందిపోయి చీదరించుకున్నారు. కన్న బిడ్డలకే కానప్పుడు కన్నవారిగా బతికి ఏంలాభమనుకున్నారు వృద్ధ దంపతులు. అనుబంధాలు దూరమై... మమకారాలు మాయమైన చోట జీవచ్ఛవంలా జీవించే కంటే తనువు చాలించడమే మేలనుకున్నారు. గుండె ‘గోదారై’న వేళ... కన్నీరు కట్టలు తెగుతుంటే... పుష్కరాలకు వెళ్లి ‘కన్న పాపాన్ని’ కడిగేసుకుని పునీతులుగా తమనుతాము బలిఇచ్చుకున్నారు. వారి ‘కడుపు కోత’ చూడలేనంటూ బంధువైన మరో వృద్ధురాలూ బలవన్మరణానికి పాల్పడిన ఘటన సిద్దిపేటలో పెనువిషాదాన్ని నింపింది.
సిద్దిపేట గణేష్‌నగర్‌లో నివాసం ఉండే మాదంశెట్టి చంద్రశేఖర్ (65), సరోజన(60) దంపతులకు ముగ్గురు సంతానం... ఇద్దరు కుమారులు, కుమార్తె. చంద్రశేఖర్ పట్టణంలోని ఓ దుకాణంలో పనిచేస్తున్నాడు. పెద్ద కుమారుడు శ్రీనివాస్ సింగపూర్‌లో ఉంటున్నాడు. రెండో కుమారుడు వరంగల్ జిల్లాలో ఉంటున్నట్టు సమాచారం. కుమార్తెకు పెళ్లి చేశారు. ఏ తోడూ లేని ఈ దంపతులతో పాటు చంద్రశేఖర్ సోదరి సిరిపురం కమల(70) కూడా నివాసం ఉంటున్నారు.
ఇదిలావుండగా, ఈ నెల 19న పుష్కరాల కోసం కాళేశ్వరం వెళ్లిన ఈ ముగ్గురూ అక్కడ పుణ్య స్నానాలాచరించి మంగళవారం తెల్లవారుజామున వరంగల్‌కు చేరుకున్నారు. బస్టాండ్‌లో దిగిన వీరు... పక్కనే ఉన్న రైల్వే ట్రాక్ పైకి వెళ్లి నవజీవన్ ఎక్స్‌ప్రెస్ కింద పడి ఆత్మహత్య చేసుకున్నారు. కన్న బిడ్డల ఆదరణకు నోచుకోక గుండె బరువుతో ప్రాణాలు తీసుకుంటున్నట్టు సూసైడ్ నోట్లో పేర్కొన్నారు. సంఘటన స్థలంలో లభించిన సూసైడ్ నోట్‌ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈ విషయం తెలిసి సిద్దిపేటవాసులు కంటతడి పెట్టారు.
కాదు పొమ్మన్నాడు...
పెద్ద కుమారుడు శ్రీనివాస్ చదువు కోసం చంద్రశేఖర్ దంపతులు స్థోమతకు మించి అప్పు చేయాల్సి వచ్చింది. ప్రస్తుతం అతడు సింగపూర్‌లో స్థిరపడ్డాడు. దీంతో పాటు కుటుంబ పోషణకు చేసిన అప్పులు భారమవడంతో... అప్పు తీర్చేందుకు సహకరించాలని శ్రీనివాస్‌ను ఈ దంపతులు అభ్యర్థించారు. దానికి అతడు నిరాకరించాడని, దాంతో వారు తీవ్ర మనస్తాపానికి లోనయ్యారని స్థానికులు చెబుతున్నారు. దాదాపు మూడు లక్షల రూపాయలు అప్పులయ్యాయని, అవి తీర్చలేక, కన్న కొడుకుని ఆశ్రయిస్తే, అతడూ కాదనడం, ఈ వయసులో ఎవరి ఆదరణకూ నోచుకోక కలతచెందివుంటారని అంటున్నారు. కష్టాలు, కన్నీళ్లను దిగమింగి పిల్లలే తమ జీవితంగా సర్వం ధారపోసి ఎవరికీ కాకుండా పోయిన ఈ వృద్ధ దంపతుల ‘విషాదాంతం’ ప్రతిఒక్కరినీ కలచివేసింది.