maa president Rajendra Prasad
-
కేటీఆర్‌తో మా అధ్యక్షుడు రాజేంద్రప్రసాద్ భేటీ
హైదరాబాద్ : 'మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ (మా) అధ్యక్షుడు రాజేంద్రప్రసాద్ శుక్రవారం ఐటీ, పంచాయతీరాజ్ శాఖ మంత్రి కేటీఆర్‌ను కలిశారు. భేటీ అనంతరం రాజేంద్ర ప్రసాద్ మాట్లాడుతూ 'మా' సమస్యలపైనే కేటీఆర్‌ను కలిసినట్లు చెప్పారు. తమ భేటీకి రాజకీయ ప్రాధాన్యత లేదన్నారు. తాము రాజకీయాల జోలికి పోవడం లేదని రాజేంద్రప్రసాద్ ఈ సందర్భంగా స్పష్టం చేశారు. కాగా ఇందుకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. -
చిరునవ్వులతో బతకాలి...
♦ మద్యం తాగి వాహనాలు నడపొద్దు ♦ అంబులెన్స్‌లకు దారి ఇవ్వండి ♦ ‘మా’ అధ్యక్షుడు రాజేంద్రప్రసాద్ సాక్షి, సిటీబ్యూరో : ‘బతికినప్పుడు నలుగురికీ మనం ఎంత మంచి చేశామన్నదే ముఖ్యం. మద్యం తాగి.. బండి నడుపుతూ చచ్చాడురా అనే మాటల కంటే... ఉన్నన్ని రోజులు మంచి కోసం ఆరాట పడ్డాడురా అనే ఒక చిన్న మాట కనీసం ఒక్కరి నుంచి వచ్చినా ఆ జన్మ ధన్యమైనట్టే. ట్రాఫిక్ నిబంధనలు పాటిస్తే మీతో పాటు ఎదుటి వారి ప్రాణాలనూ నిలబెట్టిన వారవుతారు’ ...అంటున్నారు ప్రముఖ నటుడు, మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ (మా) అధ్యక్షుడు రాజేంద్రప్రసాద్. సోమవారం గోషా మహల్‌లోని ట్రాఫిక్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్లో ట్రాఫిక్ నిబం ధనల ఉల్లంఘనులకు ఆయన అవగాహన కల్పిం చే ప్రయత్నం చేశారు. ఈ కార్యక్రమంలో ట్రాఫిక్ ఏసీపీ ఏవీ రంగనాథ్, ఇన్స్పెక్టర్లు శ్రీనివాస్, రాంబాబు తదితరులు పాల్గొన్నారు. రాజేంద్రప్రసాద్ సూచనలు...ఆయనమాటల్లోనే... తేడా 5 నిమిషాలే... వేగంగా వెళ్లే వారిని తిట్టని వారు ఉండరు. సిగ్నళ్ల వద్ద పసుపు రంగు లైట్ పడినా... ఎర్ర రంగు లైట్ వస్తుందని తెలిసినా... కొందరు వేగంగా ముందుకెళతారు. ఇలా వేగంగా వెళ్లిన వారికీ... ట్రాఫిక్ నిబంధనలు పాటించిన వారికీ మధ్య గమ్యస్థానాలకు చేరుకోవడానికి తేడా ఐదు నిమిషాలే. అవి నిజం కాదు... స్పీడ్ యమ థ్రిల్‌గా అనిపిస్తుంది. అదే ప్రాణాలనూ తీస్తుంది. హాలీవుడ్ సినిమాల్లో జాకీచాన్ చేసిన స్టంట్లు చూసి మనం అలా చేద్దామనుకోవడం అజ్ఞానంతో కూడిన అమాయకత్వమే. సినిమా దృశ్యాలు నిజమనుకోవద్దు. వాటిని అనుకరించొద్దు. అంబులెన్స్‌లకు దారి ఇవ్వండి... ‘ప్రాణాన్ని రక్షించడానికి వెళుతున్నాం. తోవ ఇవ్వండి’ అంటూ.... సౌండ్ చేస్తూ అంబులెన్స్‌లు రోడ్లపై వెళుతుంటాయి. చాలామంది వాటికి దారి ఇవ్వరు. అదే అంబులెన్స్‌లో మన అమ్మానాన్న ఉంటే... అమ్మో నాయినా... మా నాన్న ప్రాణం...తప్పుకోండి’ అంటూ అరుస్తాం. అందులో ఉన్నది ఎవరైనా మన బంధువులతో సమానం. అంబులెన్స్‌కు దారి ఇవ్వడం ద్వారా మనమూ ఆ ప్రాణాలను కాపాడినవారమవుతాం. అది ‘హెల్’ఫోన్ వాహనం నడుపుతూ అనవసర విషయాలను ‘సెల్’లో మాట్లాడుతూ ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్నారు. గాయాల పాలవుతున్నారు. కుటుంబ సభ్యులకు శోకం మిగులుస్తున్నారు. ఏకాగ్రతతో డ్రైవింగ్ చేస్తే గమ్యస్థానానికి చేరుకుంటాం. కసితో ఉన్నత స్థాయికి.. నాకు 24 ఏళ్లు ఉన్నప్పుడు ‘లేడీస్ టైలర్’ సినిమా చేశా. హిట్టయితే కెరీర్ ఉంటుంది. లేదంటే ఢమాల్. ఆ కసితోనే సినిమా చేశాను. ఇట్లా కసితో జీవితంలో మంచి కోసం ఏదో ఒకటి చేయాలి. అప్పుడే ఉన్నత స్థాయికి చేరుకోగలం. పోలీసులంటే ఎంతో గౌరవం మిలటరీ కంటే పోలీసులంటే నాకు గౌరవం ఎక్కువ. పోలీసు..సైనికుడి కన్నా గొప్పవాడు. దేశ సరిహద్దుల్లో ఆయుధాలతో సంసిద్ధంగా ఉండే సైనికులు శత్రువులు వచ్చారని తెలియగానే కాల్పులు జరుపుతారు. పోలీసులు అలా కాదు. చుట్టూ ఉన్న సమాజంలో ఎవరు ఏంటో తెలియదు. ఎవరు ఎటు నుంచి ఏం చేస్తారో తెలియదు. మంచికి మంచి, చెడుకు చెడుగా చూసేవాడే పోలీసు. అమెరికాలో ట్రాఫిక్ ఉల్లంఘనుల వివరాలు నిక్షిప్తమై ఉంటాయి. ఇదే తరహాలో సిటీ పోలీసులు కూడా నూతన టెక్నాలజీ వాడుతుండటం శుభపరిణామం. ప్రాణం నిలిపిన తీరు అద్భుతం హ్యట్సాఫ్ టూ హైదరాబాద్ ట్రాఫిక్ పోలీస్. ఇటీవల బ్రెయిన్‌డెడ్ అయిన వ్యక్తి అవయవాలను హైదరాబాద్‌లోని ఓ ఆస్పత్రి నుంచి ఎయిర్‌పోర్టుకు... అక్కడి నుంచి చెన్నై తీసుకెళ్లి ఓ అమ్మాయికి అమర్చి ప్రాణాలు పోసిన తీరు చూస్తే ఇప్పటికీ నా కళ్లలో నీళ్లు తిరుగుతుంటాయి. అంబులెన్స్ ఎక్కడాఆగకుండా ఆ అవయవాలను బాధితులకు సకాలంలో చేరేలా చేయడంలో ట్రాఫిక్ పోలీసులు సఫలీకృతులయ్యారు. వారు చెబుతున్న నిబంధనలు పాటించి మీ ప్రాణాలతో పాటు ఎదుటివారి ప్రాణాలను కాపాడుకోవాలి. మీరుదేశానికి అవసరం. అబ్దుల్ కలాం అవుతారో... రాజేంద్రప్రసాద్ అవుతారో...మీ చేతుల్లోనే ఉంది. ప్రాణాలు తీసే ‘మందు’ మన డబ్బులు పెట్టుకుని... మద్యం తాగి... ఆరోగ్యాన్ని చెడగొట్టుకుంటున్నాం. అది పేరుకే ‘మందు’. కానీ ప్రాణాలను హరిస్తుంది. మద్యం తాగి బండి నడుపుతూ చచ్చిపోయాడన్న అపవాదు తెచ్చుకోవద్దు. సినిమాల్లో మద్యం తాగుతూ మేం నటించే సీన్లన్నీ ప్రేక్షకులను రంజింపజేసేందుకే. వాటిని అనుసరించడం కరెక్ట్ కాదు. శ్రీమంతులవుదామని... ‘శ్రీమంతుడు’లో హీరో మహేశ్‌బాబు ‘గ్రామాన్ని దత్తత తీసుకుంటాను’ అన్న డైలాగ్ నాలో ఎనర్జీని తెచ్చిపెట్టింది. రెండు తెలుగు రాష్ట్రాల్లో ఏఏ గ్రామాలు వెనకబడి ఉన్నాయో తెలుసుకునేందుకు సర్వే చేపట్టాం. తోటి హీరోలను ఒప్పించి... ఆ గ్రామాలను అప్పగించేలా ప్లాన్ చేస్తున్నాం. ఉన్నన్ని రోజులు ఎంత డబ్బు సంపాదించినా వెంట తీసుకెళ్లలేం. మనం పోయినా మంచి పేరు ఉండేలా నలుగురికీపనికొచ్చే పని చేయడం మేలు. మంచి పేరు రావాలన్న స్వార్థం అందరిలో ఉండాలి. -
పేద కళాకారులకు ‘మా’ సాయం
‘‘పేద కళాకారులకు సహాయం అందించేలా చర్యలు తీసుకుంటున్నాం. అందులో భాగంగా ‘మా’ అసోసియేషన్ పక్షాన వెల్ఫేర్, విజిలెన్స్ అనే రెండు కమిటీలు ఏర్పాటు చేశాం’’ అని మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్(మా) అధ్యక్షుడు రాజేంద్రప్రసాద్ తెలిపారు. అందులో భాగంగా ‘వేదం’, ‘అయ్యారే’ చిత్రాల్లో నటించిన నటుడు నాగయ్య ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నాడని తెలిసి, ‘మా’ సభ్యుడు కాకపోయినా నాగయ్యకూ, ఒకప్పటి ‘లవకుశ’ చిత్రంలో కుశుడి పాత్రను పోషించిన నాగసుబ్రహ్మణ్యానికీ ఒక్కొక్కరికీ పాతిక వేలు చొప్పున శుక్రవారం నాడు ‘మా’ పక్షాన అందజేశారు. ఈ సందర్భంగా హైద రాబాద్‌లో ఓ సమావేశం జరిగింది. ‘‘విజిలెన్స్ కమిటీ చైర్మన్‌గా కాదంబరి కిరణ్‌ను, వెల్ఫేర్ కమిటీ అధ్యక్షునిగా సీనియర్ నరేశ్లనుఎంపిక చేశాం. వీలైనంత మందిని ‘మా’లో చేర్పించే బాధ్యత కిరణ్ చూసుకుంటారు’’ అని నటుడు రాజేంద్రప్రసాద్ చెప్పారు. సెక్రటరీ శివాజీ రాజా మాట్లాడుతూ,‘‘రెండు నెలలుగా సేవా కార్యక్రమాలు చేస్తున్నాం’’ అని చెప్పారు. ఈ కార్యక్రమంలో సీనియర్ నటుడు నరేశ్, తదితర ‘మా’ సభ్యులు పాల్గొన్నారు.