విడిపోయిన 10 ఏళ్లకు ప్రేమ జంట వివాహం
తిరువొత్తియూరు: ఓ ప్రేమ జంట పదేళ్ల తర్వాత వివాహం చేసుకుంది. తర్వాత తల్లిదండ్రుల నుంచి రక్షణ కల్పించమని పోలీసులను ఆశ్రయించింది. తేని జిల్లా ఉత్తమపాళయం సమీపంలో ఉన్న రాయపట్టికి చెందిన మరిసూసై కుమారుడు జాన్సన్ (34). ఇతను శివగంగై జిల్లా ఇళయాన్గుడిసెకు చెందిన అమల్‌రాజ్ కుమార్తె లీమారోజ్ (26)ను ప్రేమించాడు. వివిధ కారణాల వలన ఇద్దరూ విడిపోయారు. పదేళ్ల తర్వాత మళ్లీ ఒక్కటయ్యూరు.
క్రైస్తవ ఆలయంలో వివాహం చేసుకున్నారు. తరువాత రక్షణ కల్పించమని ఉత్తమ పాళయం మహిళా పోలీసుస్టేషన్‌ను ఆశ్రయించారు. పదేళ్లు విడిపోవడంపై లీమారోజ్ వివరణ ఇచ్చారు. ఆమె కథనం మేరకు.. శివగంగై జిల్లా ఇలయన్కుట్టి గ్రామంలో జాన్సన్ డ్రైవర్‌గా పనిచేస్తుండేవాడు. ఆ సమయంలో నాకు, అతనికి పరిచయమేర్పడింది. జాన్సన్‌కు మదురైలో ఉన్న ఓ సంస్థలో డ్రైవర్ ఉద్యోగం వచ్చింది. అతను అక్కడికి వెళ్లాడు. అప్పటి నుంచి రెండేళ్లుగా అతనితో ఫోన్లో మాట్లాడాను. 2005లో జాన్సన్‌కు ప్రమాదం ఏర్పడింది.
ఆ సమయంలో అతని ఫోన్ ద్వంసం కావడంతో మా ఇద్దరి మధ్య సంబంధం తెగిపోయింది. నా స్నేహితురాలి సహాయంతో జాన్సన్‌కు ప్రమాదం ఏర్పడి మృతి చెందినట్టు సమాచారం అందింది. నేను చలించిపోయూను. అతన్ని తప్ప మరో వ్యక్తిని వివాహమాడకూడదని.. కన్యస్త్రీగా మారేందుకు నిశ్చయించుకున్నాను. అందులో శిక్షణ కూడా తీసుకున్నాను. ఈలోపు అతను తారసపడ్డాడు. దీంతో అతన్ని వివాహమాడాను.