breaking news
Krishnaveni death
-
ప్రముఖ నిర్మాత–నటి–గాయని కృష్ణవేణి కన్నుమూత
తెలుగు సినిమా స్వర్ణయుగం నుండి ప్రపంచ స్థాయికి ఎదగడం వరకూ చూసిన నాటి తరం ప్రముఖ నిర్మాత–నటి–గాయని చిత్తజల్లు కృష్ణవేణి(Krishnaveni) (101) ఇక లేరు. పదిహేను రోజులుగా ఆమె హైదరాబాద్‌లోని సిటీన్యూరో ఆస్పత్రిలో చికిత్స పొందారు. ఆదివారం తెల్లవారుజామున 4 గంటలకు తుది శ్వాస విడిచారు.ఆంధ్రప్రదేశ్‌లోని పశ్చిమగోదావరి జిల్లా పంగిడి గ్రామంలో 1924 డిసెంబరు 24న కృష్ణవేణి జన్మించారు. చిన్నతనంలోనే నాటకాల్లో ప్రహ్లాదుడు, ధ్రువుడు వంటి వేషాలు వేసి, బహుమతులు అందుకున్నారామె. కాగా ప్రముఖ దర్శక–నిర్మాత సి. పుల్లయ్య బాలనటీనటులతో ‘సతీ అనసూయ’ చిత్రానికి శ్రీకారం చుట్టిన సమయంలో రాజమండ్రిలో ‘తులాభారం’ నాటకం చూశారు. ఆ నాటకంలో కృష్ణవేణి నటన నచ్చి, ‘సతీ అనసూయ’కు అవకాశం ఇచ్చారు.అలా ‘సతీ అనసూయ’ (1936) సినిమాతో కృష్ణవేణి తొలిసారి వెండితెరపై కనిపించారు. బాల నటిగా కొన్ని చిత్రాల్లో నటించారు. సినిమాల్లో నటించడానికి మద్రాసు వెళ్లారామె. కృష్ణవేణి హీరోయిన్గా నటించిన తొలి చిత్రం ‘కచదేవయాని’ (1938) విజయం సాధించడంతో ఆమెకు మంచి గుర్తింపు, పేరు దక్కాయి. కాగా ప్రముఖ నిర్మాత మీర్జాపురం రాజు (మేకా రంగయ్య) బేనర్లో ఆమె ‘జీవన జ్యోతి’ సినిమాలో మెయిన్ హీరోయిన్గా చేశారు.నటిగా కృష్ణవేణిని బాగా ఎస్టాబ్లిష్ చేసిన సినిమా అది. ఆ చిత్రం తర్వాత మీర్జాపురం రాజుతో ఆమె పెళ్లయింది. వారిది ప్రేమ వివాహం. ఆ తర్వాత జయా పిక్చర్స్‌పై తన భర్త తీసిన సినిమాలకు నిర్వహణ బాధ్యతలు చూసుకునేవారు. అలా నిర్మాణరంగంవైపు వచ్చారామె. ఇక వివాహం తర్వాత జయా పిక్చర్స్‌ని శోభనాచల స్టూడియోస్‌గా మార్చారు. ఈ బేనర్ నిర్మించిన ‘దక్షయజ్ఞం (1941), గొల్లభామ (1947), లక్ష్మమ్మ (1950)’ వంటి చిత్రాల్లో మాత్రమే నటించారు కృష్ణవేణి.ఒకవైపు నటిస్తూనే ‘బాల మిత్రుల కథ, కీలు గుర్రం’ వంటి సినిమాల్లో పాటలు కూడా పాడారు. కాగా ‘తిరుగుబాటు’ సినిమాలో కృష్ణవేణి చేసిన వ్యాంప్ క్యారెక్టర్ అప్పట్లో చర్చనీయాంశమైంది. ఇక 1942లో మీర్జాపురం రాజా–కృష్ణవేణి దంపతులకు కుమార్తె రాజ్యలక్ష్మి అనురాధ జన్మించారు. ఒకవైపు అనురాధ ఆలనా పాలనా, మరోవైపు సినిమాల నిర్మాణ పనులు చూసుకోవాల్సి రావడం... వంటి కారణాల చేత కృష్ణవేణి నటించడం తగ్గించారు.ఆమె హీరోయిన్గా నటించిన ఆఖరి చిత్రం ‘సాహసం’ (1952). అప్పట్లో అత్యధిక పారితోషికం అందుకున్న హీరోయిన్గా కృష్ణవేణికి పేరుంది. ‘ధర్మాంగద’ చిత్రానికి గాను ఆమె రూ. 45 వేలు పారితోషికం అందుకున్నారట. ఎన్టీఆర్‌ని పరిచయం చేసిన నిర్మాతగా... ‘మన దేశం’ చిత్రం ద్వారా ఎన్టీఆర్‌ని పరిచయం చేసిన నిర్మాతగా కృష్ణవేణి బాగా పాపులర్ అయ్యారు. పూర్తి స్థాయి నిర్మాతగా ఎల్వీ ప్రసాద్ దర్శకత్వంలో కృష్ణవేణి నిర్మించిన ‘మన దేశం’ ఘనవిజయం సాధించింది. ఈ సినిమాలో ఆమె హీరోయిన్‌గానూ చేశారు. ఇదే చిత్రంతో గాయనిగా పి. లీలను పరిచయం చేశారు. అలాగే ‘వరూధిని’ చిత్రం తర్వాత, ఊరికి వెళ్లిపోయిన ఎస్వీ రంగారావును పిలిపించి, ‘మన దేశం’కు అవకాశం కల్పించారామె. అలాగే ఘంటసాల వెంకటేశ్వరరావుకు పూర్తి స్థాయి సంగీతదర్శకునిగా తొలి అవకాశం కల్పించింది కూడా కృష్ణవేణియే కావడం మరో విశేషం. ‘దాంపత్యం’ (1957) నిర్మాతగా కృష్ణవేణికి ఆఖరి చిత్రం. నటిగా, నిర్మాతగా, గాయనిగా తనకంటూ ప్రత్యేక ప్రతిభను చాటుకున్నారామె. కృష్ణవేణి 2004లో ప్రతిష్ఠాత్మక రఘుపతి వెంకయ్య అవార్డు అందుకున్నారు. 2022లో ‘సాక్షి ఎక్స్‌లెన్స్’ అవార్డుల్లో భాగంగా ‘జీవిత సాఫల్య పురస్కారం’ అందుకున్నారు. ఇక ఆమె కుమార్తె అనురాధ తెలుగు, తమిళ, కన్నడ భాషల్లో 17 సినిమాలు నిర్మించారు. కన్నడంలో ‘భక్త కుంభార’ (1974) నిర్మాతగా ఆమె తొలి చిత్రం.అదే సినిమాని తెలుగులో నాగేశ్వరరావు హీరోగా ‘చక్రధారి’గా రీమేక్ చేశారు. ‘రాముడే రావణుడైతే, శ్రీవారి ముచ్చట్లు, రాముడు కాదు కృష్ణుడు, అనుబంధం, ఆలయ దీపం, ఇల్లాలే దేవత’ వంటి తెలుగు చిత్రాలతో పాటు తమిళ , కన్నడ భాషల్లోనూ సినిమాలు నిర్మించారామె. తెలుగులో తీసిన ‘మా పెళ్లికి రండి’ నిర్మాతగా ఆమె చివరి చిత్రం. ప్రపంచంలో అత్యధిక చిత్రాలు నిర్మించిన మహిళా నిర్మాతగా లిమ్కా బుక్ రికార్డ్‌ని సొంతం చేసుకున్నారామె.కృష్ణవేణి మృతి పట్ల పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు విచారం వ్యక్తం చేశారు. ఫిల్మ్‌నగర్‌లోని ఆమె భౌతికకాయాన్ని సందర్శించిన సినీ ప్రముఖులు సినీ పరిశ్రమకు ఆమె అందించిన సేవలను కొనియాడారు. ఆదివారం సాయంత్రం మహాప్రస్థానంలో ఆమె అంత్యక్రియలు ముగిశాయి. కృష్ణవేణికి కూతురు అను రాధా దేవి, మనుమలు, మనవరాళ్లు ఉన్నారు. ఆమె చిన్న మనమరాలు అర్చన అంత్యక్రియలకు సంబంధించిన కార్యక్రమాలను నిర్వహించారు.కృష్ణవేణి కాశీ మజిలీ కథలతో పాటు చాలా పుస్తకాలు చదివేవారు. వాటిలో సినిమా తీయడానికి పనికొస్తాయనిపించే పాయింట్స్ తీసుకుని, కథ తయారు చేయించేవారు. స్టోరీ సిట్టింగ్స్, మ్యూజిక్ సిట్టింగ్స్ నుంచి షూటింగ్ షెడ్యూల్స్ ΄్లాన్ చేసి, షూటింగ్ స్పాట్లో ఉండటంవరకూ అన్నీ దగ్గరుండి చూసుకునేవారు కృష్ణవేణి.సినీ నిర్మాత, నటి, గాయని, రఘుపతి వెంకయ్య అవార్డుగ్రహీత కృష్ణవేణి మృతిపై మాజీ సీఎం, వైఎస్సార్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి సంతాపం వ్యక్తం చేశారు. అనేక భాషల్లో నటించి, బహుముఖ ప్రజ్ఞాశాలిగా పేరొంది, నటిగా తనదైన ముద్ర వేసిన కృష్ణవేణి మృతి సినీ రంగానికి తీరని లోటు అని పేర్కొన్నారు. పలు గొప్ప చిత్రాలు తీసి, నిండు నూరేళ్లు సంపూర్ణంగా జీవించి, పరమపదించిన ఆమె పవిత్ర ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుడినిప్రార్థిస్తున్నానని అన్నారు. ఆమె కుటుంబ సభ్యులకు వైఎస్ జగన్ తన ప్రగాఢ సానుభూతిని తెలిపారు.‘‘అలనాటి నటీమణి, సినీ నిర్మాత కృష్ణవేణి మృతి నన్ను బాధించింది. పరిపూర్ణ జీవితం గడిపిన కృష్ణవేణిగారి ఆత్మకు శాంతి చేకూర్చాలని ఆ భగవంతుడినిప్రార్ధిస్తున్నాను’’ అని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. ‘‘మన దేశం’ చిత్రంతో ఎన్టీఆర్‌ను చిత్ర రంగానికి పరిచయం చేసి, కళారంగానికి వారు చేసిన సేవ మరువలేనిది. వారి కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నాను’’ అన్నారు. -
కృష్ణవేణి మృతిపై వీడని మిస్టరీ
హత్యా ? ఆత్మహత్యా ? ఎటూ తేల్చని పోలీసులు ఇప్పటికి ఆరుగురు నిందితుల అరెస్టు కొనసాగుతున్న విచారణ సూత్రధారి తప్పించుకున్నట్లు ప్రచారం ? పరకాల : తల్లి లేని బిడ్డను బలి తీసుకున్న దుర్మార్గులు ఎవరనేది నేటికి స్పష్టం కావడం లేదు. పొట్టకూటి కోసం వచ్చి కామాంధుల చేతిలో బలైన బాలిక కృష్ణవేణి మరణం వెనుక ఉన్న మిస్టరీ వీడడం లేదు. సంచలనం కలిగించిన కృష్ణవేణిది హత్యానా లేక ఆత్మహత్యానా అనేది నిర్ధారణ కావడం లేదు. నల్లగొండ జిల్లా సంస్థాన్ నారాయణపూర్ కోతులాపురం గ్రామానికి చెందిన ఇరుగుదిండ్ల వెంకటేష్, అతడి కుమార్తె కృష్ణవేణి(17) 13 నెలల క్రితం మండలంలోని నర్సక్కపల్లి గ్రామానికి జీవనోపాధి కోసం వలస వచ్చారు. గ్రామంలో క్రేన్‌సాయంతో బావుల్లో పూడికతీత పనులు చేస్తున్నారు. ఈ క్రమంలోనే కృష్ణవేణి జనవరి 27న డీజిల్ మంటల్లో కాలిపోయింది. ఈ ఘటన జరిగి పక్షం రోజులు దాటినా ఎలా జరిగిందనే విషయం మిస్టరీగానే మిగిలిపోయింది. ఈ కేసులో ప్రధాన నిందితుడు వేముల రాజును జనవరి 29న, పంప్ ఆపరేటర్ బాషబోయిన కుమారస్వామి, బండి మహేందర్‌ను ఈ నెల 1న, కందికొండ కార్తీక్, బండి శ్రావణ్, గట్టు సాయిలును 4న అరెస్టు చేశారు. కీలకవ్యక్తి తప్పించుకున్నట్లు ప్రచారం ? ఈ కేసులో ఇప్పటికే ఆరుగురిని పోలీసులు అరెస్ట్ చేశారు. ప్రధాన నిందితులు వేముల రాజు, కుమారస్వామితోపాటు వారితోపాటు ఉన్న నలుగురిని జైలుకు తరలించారు. అయితే వీరు మాత్రమేగాక కృష్ణవేణి మరణం వెనుక ఓ వ్యక్తి కీలకంగా వ్యవహరించినట్లు ప్రచారం జరుగుతోంది. అరెస్టయిన ఆరుగురిలో కీలకవ్యక్తి తప్పించుకుని తిరుగుతున్నట్లు సమాచారం. ప్రధాన నిందితుడు వేముల రాజుకు అదే గ్రామానికి చెందిన ఓ వ్యక్తికి కొంతకాలంగా గొడవలు జరుగుతున్నాయి. ఎలాగైనా రాజును దెబ్బతీయాలని ఎదురు చూస్తున్న ఆ వ్యక్తి కృష్ణవేణి అంశాన్ని అనుకూలంగా మార్చుకుని కుట్ర చేశాడనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఈ క్రమంలోనే రాజు కృష్ణవేణి కలిసి ఉన్న విషయాన్ని మద్యం మత్తులో ఉన్న పంప్ ఆపరేటర్ భాషబోయిన కుమారస్వామి సదరు వ్యక్తికి ఫోన్ చేసి చెప్పడంతో ఆ వ్యక్తి అక్కడికి వచ్చినట్లు తెలుస్తోంది. కుమారస్వామి, తన స్నేహితుడు మహేందర్‌తోపాటు ఫోన్‌కాల్‌తో వచ్చిన వ్యక్తి కలిసి కృష్ణవేణిని మానసికంగా వేధించి శారీరకంగా లొంగదీసుకునేందుకు ప్రయత్నించారని భావిస్తున్నారు. తాము వ్యవహరించిన తీరు బయటి ప్రపంచానికి తెలియకుండా ఉండడం కోసం పాశవికంగా హత్య చేసి ఉంటారనే అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి. తాము ఏం చేసినా ఆమె ప్రియుడు రాజుపైనే పోతుందని దురాలోచనకు వచ్చినట్లు చెబుతున్నారు. ముందు కృష్ణవేణి కేసులో సాక్షులుగా ఉన్న పంప్ ఆపరేటర్ కుమారస్వామి, మహేందర్ కేసును పక్కదారి పట్టించబోయి చివరికి నిందితులుగా మారి అరెస్టయ్యారు. జరిగింది హత్యానా లేక ఆత్మహత్యానా అనే అంశం ఇప్పుడు పోస్టుమార్టం నివేదికపై ఆధారపడి ఉండడంతో దాని కోసం పోలీసులు ఎదురు చూస్తున్నారు.