breaking news
krishna rao murder
-
రాజకీయ కక్షలతోనే కృష్ణారావు హత్య : సిఐ
విజయవాడ: కృష్ణా జిల్లా కంచికచర్ల మండలం గొట్టుముక్కలలో వైఎస్ఆర్సిపి నేత కృష్ణారావును ప్రత్యర్థులు రాజకీయకక్షలతోనే హత్య చేశారని రూరల్ సిఐ రామ్‌కుమార్ చెప్పారు. టిడిపికి చెందిన కొందరు కిరాతకులు ఆదివారం అర్ధరాత్రి వేళ కృష్ణారావు ఇంట్లోకి చొరబడి ఆటవికంగా హత్య చేసిన విషయం తెలిసిందే. ఈ హత్యకేసులో నిందితులు ఆరుగురిని రూరల్ సీఐ రామ్‌కుమార్ ఈ రోజు మీడియా ముందు ప్రవేశపెట్టారు. ఇదిలా ఉండగా, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి కృష్ణారావు కుటుంబాన్ని ఈ ఉదయం పరామర్శించారు. తాము అండగా ఉంటామని కుటుంబ సభ్యులకు భోరోసా ఇచ్చారు. వారిని ఓదార్చి మనోధైర్యం నింపారు. -
ఇప్పడు అక్కడంతా శ్మశాన నిశ్శబ్దం!!
అది కృష్ణా జిల్లా గొట్టిముక్కల గ్రామం. ఇప్పుడు అక్కడంతా శ్మశాన నిశ్శబ్దం రాజ్యమేలుతోంది. ఎప్పుడూ పదిమంది నోళ్లలో నాలుకలా మెలుగుతూ పనే దైవంగా భావించే ఆ గ్రామ ఉప సర్పంచి ఎ.కృష్ణారావు దారుణహత్యకు గురికావడం ఆ ఊరు మొత్తాన్ని మూగనోము పట్టేలా చేసింది. అదివారం రాత్రిపూట వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడైన కృష్ణారావు ఇంట్లోకి కొంతమంది దుండగులు కృష్ణారావు ఇంట్లోకి బలవంతంగా చొరబడ్డారు. ఆయనను బయటకు లాక్కొచ్చి, పొడిచి పొడిచి చంపేశారు. తనకు ప్రాణభయం ఉందని, రక్షణ కల్పించాలని అంతకుముందే కృష్ణారావు పోలీసులకు పదే పదే విజ్ఞప్తులు చేసినా వాళ్లు పెడచెవిన పెట్టారు. ఇక దాడి జరుగుతున్న సమయంలో ఆయన భార్య, పిల్లలు చంపొద్దు.. వదిలేయాలని కాళ్లా వేళ్లా పడి బతిమాలినా ఆ దుండగులు ఏమాత్రం కనికరించలేదు. ఇంత దారుణ సంఘటన జరిగిన తర్వాత కూడా పోలీసులు ఏమాత్రం స్పందించలేదు. హత్యకు పాల్పడినట్లు చెబుతున్న నిందితులు తమంతట తాము లొంగిపోయేవరకు పోలీసులు నిష్క్రియాపరత్వంతో వ్యవహరించారని గ్రామస్థులు ఆరోపిస్తున్నారు. పోలీసుల పక్షపాతం స్పష్టంగా తెలుస్తోందని, వాళ్లు కావాలనే ఊరుకుంటున్నారని వైఎస్ఆర్సీపీ కార్యకర్త ఒకరు తెలిపారు. ఆంధ్రప్రదేశ్‌లో బలమైన ప్రతిపక్షం ఉండటంతో ఎలాగైనా వాళ్లను అణగదొక్కాలన్న ఉద్దేశంతో తెలుగుదేశం పార్టీ దారుణమైన హత్యారాజకీయాలకు పాల్పడుతోంది. టీడీపీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఇప్పటివరకు 19 మంది వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు హత్యకు గురయ్యారు. కొన్ని వందల మంది తీవ్రంగా గాయపడ్డారు. బత్తాయి తోటలు, బొప్పాయి తోటలు.. అన్నింటినీ విచ్చలవిడిగా నరికేశారు. ప్రధానంగా టీడీపీ ఓటమి పాలైన ప్రాంతాల్లోనే ఈ తరహా దాడులు ఎక్కువగా జరిగాయి. గ్రామ పంచాయతీల నుంచి జిల్లా పరిషత్తుల వరకు ప్రతిదాన్నీ సొంతం చేసుకోడానికి టీడీపీ సామ దాన భేద దండోపాయాలు అన్నింటినీ ప్రదర్శించింది. గొట్టిముక్కలలో కూడా కృష్ణారావు హత్య తర్వాత సీతయ్య, సెల్వరాజ్ అనే మరో ఇద్దరు కార్యకర్తలపై దాడులు జరిగాయి. ఇప్పుడక్కడ అంతా భయమే రాజ్యమేలుతోంది. దివిసీమ ప్రాంతంలోని అవనిగడ్డలో.. టీడీపీ గూండాలు మందుగుండు సామగ్రి పేలుస్తుంటే, పిల్లలు భయపడతారని చెప్పినందుకు సురేష్ అనే వ్యక్తి తల మీద బాంబు పెట్టి పేల్చి చంపేశారు! అతడు చేసిన పాపమల్లా.. టీడీపీ గూండాల ఆదేశాలు కాదని తనకు నచ్చిన అభ్యర్థికి ఓటు వేయడమే. ఇలాంటి ఘోరాలు ఎన్ని జరుగుతున్నా పోలీసులు మాత్రం మౌన ప్రేక్షక పాత్రనే పోషిస్తున్నారు. పాలకపక్షం ఊదుతున్న బూరాలకు బుట్టలోని పాముల్లా ఆడుతున్నారు.