breaking news
Khurshid Hussain
-
నైనా జైస్వాల్‌కు సన్మానం
జింఖానా, న్యూస్‌లైన్: అంతర్జాతీయ స్థాయిలో సత్తా చాటుకుంటున్న టేబుల్ టెన్నిస్ క్రీడాకారిణి నైనా జైస్వాల్‌ను సోమవారం హైదరాబాద్ జిల్లా టేబుల్ టెన్నిస్ అసోసియేషన్ ఘనంగా సన్మానించింది. 13 ఏళ్ల నైనా ఇటీవల ఇరాన్లో జరిగిన అంతర్జాతీయ క్యాడెట్ అండ్ జూనియర్ టీటీ టోర్నీలో రెండు స్వర్ణాలతో పాటు ఓ కాంస్యం దక్కించుకున్న సంగతి తెలిసిందే. ఈసందర్భంగా నైనా మాట్లాడుతూ తన విజయాల వెనుక తల్లిదండ్రుల కృషి ఉందని తెలిపింది. ‘ఆడపిల్లలను నేటి సమాజం భారంగా పరిగణిస్తున్న సమయంలో నన్ను అన్ని రంగాల్లో ముందుకెళ్లేలా నా తల్లిదండ్రులు ప్రోత్సహించారు. ఓ మహిళగా సమున్నత స్థాయికి ఎదిగిన మాజీ పోలీస్ అధికారిణి కిరణ్ బేడిని నేను ఆదర్శంగా తీసుకుంటాను’ అని నైనా తెలిపింది. ఇప్పటి వరకు జాతీయ, అంతర్జాతీయ స్థాయిల్లో తమ కుమార్తె 15 స్వర్ణ పతకాలు సాధించినట్లు నైనా తండ్రి, హైదరాబాద్ టేబుల్ టెన్నిస్ కార్యదర్శి అశ్విన్‌కుమార్ తెలిపారు. సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో జరిగిన ఈ కార్యక్రమానికి బ్యాడ్మింటన్ కోచ్, ద్రోణాచార్య అవార్డీ ఎస్ఎం. ఆరిఫ్, అర్జున అవార్డు గ్రహీత మీర్ ఖాసిం అలీ, ఆంధ్రప్రదేశ్ టేబుల్ టెన్నిస్ సెలక్షన్ కమిటీ చైర్మన్ నరసింహారావు, ప్రముఖ బాడీ బిల్డర్ మోతేశ్యామ్ అలీ, టైపింగ్‌లో ప్రపంచ రికార్డు సాధించిన ఖుర్షీద్ హుస్సేన్, హైదరాబాద్ టేబుల్ టెన్నిస్ అకాడమీ అధ్యక్షుడు సాయిప్రసాద్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
ముక్కుతో చకచకా టైపింగ్!
గిన్నిస్ కోసం నగరవాసి వినూత్న యత్నం హైదరాబాద్, న్యూస్‌లైన్: నగరంలోని పాతబస్తీ తలాబ్‌కట్ట ప్రాంతానికి చెందిన ఖుర్షీద్హుస్సేన్ గిన్నిస్ రికార్డు కోసం వినూత్న ప్రయత్నం చేశారు. కంప్యూటర్ కీబోర్డుపై ముక్కుతో ఏ నుంచి జెడ్ వరకూ 53 సెకన్లలోనే టైప్ చేశారు. మంగళవారం బంజారాహిల్స్ రోడ్ నంబర్ 13లో నిర్వహించిన కార్యక్రమంలో పలువురు సాక్షుల మధ్య ఈ ప్రక్రియను రికార్డును చేశారు. ముక్కుతో అత్యధిక వేగంగా టైప్ చేసిన రికార్డు ప్రస్తుతం దుబాయికి చెందిన ఓ అమ్మాయి పేరు మీద ఉందని, అయితే ఆమె 1.33 నిమిషాల్లో టైప్ చేయగా.. తాను 53 సెకన్లలోనే పూర్తిచేసినందున రికార్డును అధిగమించానని ఖుర్షీద్ తెలిపారు. దీనికి సంబంధించి సాక్షులు ధ్రువీకరించిన పత్రాలు, వీడియో పుటేజీలు, ఫొటోలను గిన్నిస్‌బుక్ వారికి అందజేసి రికార్డు ధ్రువపత్రం పొందనున్నట్లు చెప్పారు.