breaking news
kesavareddy schools
-
చైతన్య విద్యాసంస్థలకు 'కేశవరెడ్డి స్కూల్స్'
విజయవాడ: కేశవరెడ్డి స్కూల్స్ నిర్వహణను రాష్ట్రప్రభుత్వం చైతన్య విద్యాసంస్థలకు అప్పగించింది. విద్యాశాఖ మంత్రి గంటా శ్రీనివాసరావు కార్యాలయం సోమవారం ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటించింది. విద్యార్థుల అకడమిక్ నిర్వహణ మాత్రమే చైతన్య విద్యాసంస్థలకు అప్పగించామని, అయితే కేశవరెడ్డి ఆస్తులతో చైతన్య విద్యాసంస్థలకు సంబంధం ఉండదని స్పష్టం చేసింది. కాగా డిపాజిట్ల పేరుతో విద్యార్థుల తల్లిదండ్రుల నుంచి భారీ మొత్తంలో డబ్బు వసూలు చేసి మోసం చేశారనే ఆరోపణలపై ప్రముఖ విద్యాసంస్థల యజమాని నాగిరెడ్డి కేశవరెడ్డిని పోలీసులు అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో కేశవరెడ్డి యాజమాన్యం విద్యాసంస్థలను కొనసాగించే పరిస్థితి లేకపోవటంతో ప్రభుత్వం ఈ మేరకు నిర్ణయం తీసుకుంది. -
కేశవరెడ్డి స్కూళ్లపై సీఐడీ దాడులు
కేశవరెడ్డి గ్రూప్ నకు చెందిన స్కూళ్లపై సీఐడీ అధికారులు దాడులు నిర్వహించారు. శ్రీకాకుళం జిల్లాలోని ఎచ్చర్ల, అంపోలు, అరసవల్లిలోని స్కూళ్లపై ఏకకాలంలో దాడులు చేసిన అధికారులు స్కూళ్లలోని రికార్డులతో పాటు.. బ్యాంక్ లావాదేవీలను తనిఖీ చేశారు. స్కూళ్ల నుంచి లభించిన హార్డ్ డిస్క్ లను స్వాధీనం చేసుకున్నారు. ఈ విద్యా సంవత్సరం వరకూ విద్యార్ధులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా బోధన కొనసాగాలని సిబ్బందికి సూచించారు. కాగా.. ఇక్కడి స్కూళ్లలో 2010 నుంచి విద్యార్థులకు సంబంధించిన డిపాజిట్లు ఇవ్వలేదని తేలింది. -
'మోసం చేయాలనుకుంటే ఐపీ పెట్టేవాడ్ని'
కర్నూలు: మంచి ఉద్దేశంతోనే డిపాజిట్లు సేకరించానని, మోసం చేసే ఉద్దేశం తనకు లేదని కేశవరెడ్డి విద్యాసంస్థల అధినేత కేశవరెడ్డి తెలిపారు. మోసం చేయాలనే ఉద్దేశం ఉంటే ఐపీ పెట్టేవాడినని, ఏడాది ఆగితే అందరికీ చెల్లిస్తానని ఆయన తెలిపారు. లేదంటే ప్రభుత్వం తన ఆస్తులను జప్తు చేసుకోవచ్చని కేశవరెడ్డి గురువారమిక్కడ అన్నారు. కాగా కేశవరెడ్డి విద్యాసంస్థల అధినేత కేశవరెడ్డిని కర్నూలు సిసిఎస్ పోలీసులు గతరాత్రి అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. తెలుగు రాష్ట్రాల్లో కేశవరెడ్డి పేరుతో విద్యాసంస్థలు నడుపుతున్న ఆయనపై అనేక ఫిర్యాదులు అందాయి. తమ సంస్థల స్కూళ్లు, కాలేజీల్లో జాయినింగ్ సమయంలో విద్యార్థుల నుంచి లక్ష రూపాయల నుంచి రెండున్నర లక్షల రూపాయల వరకూ కేశవరెడ్డి డిపాజిట్లు సేకరించారు. ఆ డిపాజిట్ల సొమ్ము దాదాపు 8వందల కోట్ల రూపాయలు విద్యార్థుల తల్లిదండ్రులకు బాకీ పడ్డట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో వారి ఫిర్యాదుతో కేశవరెడ్డిని పోలీసులు అరెస్ట్ చేశారు.ఆర్బీఐ నిబంధనలకు విరుద్ధంగా డిపాజిట్లు సేకరించటంతో ఆయనపై అయిదు కేసులు నమోదు చేశారు. అయితే కేశవరెడ్డి బాధితులు.. భారీగానే వున్నారు. ఒక్కోజిల్లాలో కోట్లాది రూపాయలు వసూల్ చేసినట్లు తెలుస్తోంది. చిత్తూరు జిల్లాలో మూడు సెంటర్లలో కేశవరెడ్డి విద్యాసంస్థలు నెలకొల్పారు. మదనపల్లిలో విద్యార్థుల తల్లిదండ్రులకు రూ.12 కోట్లు, చిత్తూరులో రూ.4 కోట్లు బకాయిపడ్డట్లు తెలుస్తోంది. తిరుపతి బ్రాంచ్లో కూడా పెద్దఎత్తున చెల్లించాల్సి ఉందని సమాచారం. ఈ బకాయిలుతో గత యాజమాన్యానికి సంబంధం లేదని, కొత్త యాజమాన్యం జూలైలో ఇస్తామని విద్యార్థుల తల్లిదండ్రులకు నచ్చచెప్పినట్లు తెలుస్తోంది. అయితే ఆ తర్వాత స్కూల్ మేనేజ్మెంట్ మారిపోయింది. ఆ మేనేజ్మెంట్ కూడా చేతులెత్తేయడంతో బాధితులు పోలీసులను ఆశ్రయించారు. దీంతో కేశవరెడ్డిని అరెస్ట్ చేసిన కర్నూలు సీసీఎస్ పోలీసులు కోర్టులో హాజరు పరిచి రిమాండ్కు తరలించారు.