breaking news
Justice J.S. Khehar
-
సీజేఐగా బాధ్యతలు స్వీకరించిన ఖేహర్
న్యూఢిల్లీ : సుప్రీంకోర్టు నూతన ప్రధాన న్యాయమూర్తి (సీజేఐ)గా జస్టిస్ జగదీష్‌సింగ్ ఖేహర్ బుధవారం బాధ్యతలు స్వీకరించారు. రాష్ట్రపతి భవన్లో ప్రణబ్ ముఖర్జీ ఈ రోజు ఉదయం ఖేహర్‌తో ప్రమాణ స్వీకారం చేయించారు. దీంతో జస్టిస్ ఖేహర్ 44వ సీజేఐగా బాధ్యతలు స్వీకరించారు. దాదాపు 8 నెలలపాటు.. ఆగస్టు 27 వరకు ఆయన ఈ పదవిలో కొనసాగుతారు. ఈ కార్యక్రమానికి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, పలువురు మంత్రులు హాజరయ్యారు. దేశ చరిత్రలో సిక్కువర్గానికి చెందిన వ్యక్తి సీజేఐగా బాధ్యతలు చేపట్టనుండటం ఇదే తొలిసారి. టీఎస్ ఠాకూర్ పదవీకాలం ఈ నెల 3వ తేదీ (మంగళవారం)తో ముగిసిన విషయం తెలిసిందే. కాగా జస్టిస్ ఖేహర్ సుప్రీంకోర్టులో పలు ధర్మాసనాలకు నేతృత్వం వహించారు. పలు కీలక తీర్పుల్లో భాగస్వామ్యం పంచుకున్నారు. ఎన్‌జేఏసీ కేసును విచారించిన ధర్మాసనానికి నేతృత్వం వహించడంతోపాటు గత జనవరిలో అరుణాచల్‌ప్రదేశ్‌లో రాష్ట్రపతి పాలనను రద్దుచేసిన ధర్మాసనానికి కూడా ఆయనే నేతృత్వం వహించడం గమనార్హం. అలాగే సహారా చీఫ్ సుబ్రతారాయ్‌ను జైలుకు పంపిన కేసును విచారించిన ధర్మాసనంలోనూ ఆయన పాలుపంచుకున్నారు. ఇటీవల ఒకేరకమైన పనికి ఒకే వేతనం ఉండాలంటూ కాంట్రాక్టు ఉద్యోగుల కేసులో కీలక తీర్పిచ్చిన ధర్మాసనానికీ ఆయన నేతృత్వం వ్యవహరించారు. -
న్యాయమూర్తుల రాజ్యాంగ హక్కును ఎన్‌జేఏసీ లాగేసుకుంది
సుప్రీం కోర్టులో నారీమన్ వాదన న్యూఢిల్లీ: న్యాయమూర్తుల నియామకానికి పట్టుబట్టే న్యాయవ్యవస్థ హక్కు.. ఆ వ్యవస్థ స్వతంత్రతలో, రాజ్యాంగ మౌలిక నిర్మాణంలో కీలకమైన భాగమని.. ఈ హక్కును జాతీయ న్యాయ నియామకాల కమిషన్ (ఎన్‌జేఏసీ) లాగేసుకుందని.. సీనియర్ న్యాయవాది ఫాలి ఎస్. నారీమన్ పేర్కొన్నారు. ఎన్‌జేఏసీ చట్టం చెల్లుబాటును సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్లను విచారిస్తున్న జస్టిస్ జె.ఎస్.ఖేహర్ సారథ్యంలోని ఐదుగురు సభ్యుల ధర్మాసనం ఎదుట.. సుప్రీంకోర్ట్ అడ్వొకేట్స్ ఆన్ రికార్డ్ అసోసియషన్ (ఎస్సీఏఓఆర్ఏ) తరఫున ఆయన గురువారం వాదనలు వినిపించారు. అంతకుముందు వాదనలు వినిపించిన అటార్నీ జనరల్ ముకుల్ రోహ్తగి.. ఆరుగురు సభ్యుల ఎన్‌జేఏసీలో న్యాయమూర్తులు ప్రధానంగా ఉంటారని, వారికి ప్రాధాన్యం ఉంటుందని.. ఏదైనా చెడు నియామకం జరిగేట్లయితే వారు దానిని అడ్డుకోవచ్చునని పేర్కొన్నారు. నియామకాలపై పట్టుబట్టే హక్కును మాత్రమే న్యాయమూర్తుల నుంచి ఎన్‌జేఏసీ తీసుకుందని చెప్పారు. దీనికి నారీమన్ పైవిధంగా ప్రతివాదనలు వినిపించారు. రాజ్యాంగ నిర్మాణంపై ఎన్‌జేఏసీ ప్రభావం చూపుతోందని, కాబట్టి ఆ చట్టాన్ని రద్దుచేయాలని పేర్కొన్నారు. ఎన్‌జేఏసీలో ఇద్దరు ప్రముఖ వ్యక్తులను సభ్యులుగా నియమించే అంశంపై నారీమన్ వాదిస్తూ.. అటువంటి సభ్యులకు ఓటు హక్కు ఇవ్వకూడదని పేర్కొన్నారు. వివిధ దేశాల్లో సామాన్య వ్యక్తులను న్యాయమూర్తుల నియామక కమిటీల్లో నియమిస్తున్నారని, అటువంటి పద్ధతిని ఇక్కడ కూడా ఎందుకు అమలు చేయరాదని ప్రభుత్వం చేస్తున్న వాదనకు సమాధానం ఇవ్వాలని ధర్మాసనం నారీమన్‌కు సూచించింది. ఆయన శుక్రవారం తన వాదనలు కొనసాగిస్తారు.