breaking news
junior assistent
-
నిధులు స్వాహా చేసింది జూనియర్ అకౌంటెంటే
తెనాలిరూరల్: తెనాలి సబ్ ట్రెజరీలో నిధుల గోల్మాల్ వ్యవహారానికి సంబంధించి నిందితుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. రూ. 1,10,46,847 నిధులు గోల్మాల్ కాగా, రూ. తొమ్మిది లక్షలను రికవర్ చేయగలిగారు. సబ్‌ట్రెజరీలో నిధులు గోల్మాల్ అయిన సంగతి జూన్ 20వ తేదీన వెలుగులోకి వచ్చింది. సుమారు 12 రోజుల పాటు శాఖాపరంగా విచారించిన ఖజానా శాఖ అధికారులు అనంతరం పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ కేసుకు సంబంధించి గురువారం ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో సీఐ బెల్లంశ్రీనివాసరావు వివరా లు వెల్లడించారు. ఖజానా శాఖ డిప్యూ టీ డైరెక్టర్ కె.సురేంద్రబాబు గత నెల 29వ తేదీన నిధుల గల్లంతుపై తమకు ఫిర్యాదు చేశారని, కేసును దర్యాప్తు చేసి నిందితుడిని సబ్ ట్రెజరీ కార్యాలయ జూనియర్ అకౌంటెంట్ తాడికొండ వరుణ్‌బాబుగా గుర్తించి అరెస్ట్ చేసినట్టు వివరించారు. ఏడాది పాటు 59 ట్రాన్సాక్షన్లలో నిధులను తన ఖాతా, తన తమ్ముడు వరసయ్యే రాజ్‌కుమార్‌దత్ ఖాతాల్లోకి మళ్లించాడని దర్యాప్తులో వెల్లడైనట్టు చెప్పారు. రూ. 90 లక్షలను వరుణ్‌బాబు తన సొంత బ్యాంకు ఖాతాలోకి, రూ. 20.46 లక్షలను రాజ్‌కుమార్‌దత్ ఖాతాల్లోకి మళ్లించాడని తెలిపారు. ఇందు కోసం నకిలీ బిల్లులు, ఆన్లైన్లో ఈ–చెక్‌లను సృష్టించి టోకెన్ నంబర్లు కేటాయించాడని, కార్యాలయ అధికారుల పాస్వర్డ్లు తెలియడంతో నిధుల ను మళ్లించడం సులువయిందని చెప్పా రు. దారిమళ్లించిన నిధులతో నాలుగు లగ్జరీ కార్లు, మూడు ఖరీదైన మోటారుసైకిళ్లు కొనుగోలు చేసి, హెచ్చు శాతం నిధులను స్నేహితులతో కలసి అనేక ప్రదేశాలు తిరిగి రావడం, విమాన ప్రయాణాలు వంటి విలాసాలకు ఖర్చు చేసి, కొద్ది మొత్తాన్ని బంధువులకు ఇచ్చినట్టు చెప్పారు. సబ్ ట్రెజరీకి సంబంధించి కార్పొరేట్ ఇంటర్నెట్ బ్యాంకింగ్ ఖాతాలో నిధులు తగ్గడంతో మూడుసార్లు మున్సిపాలిటీకి సంబంధించిన నకిలీ బిల్లులను సృష్టించి నిధులు జమ అయ్యేలా చేశాడని, అయితే వార్షిక తనిఖీల్లో నిధులు గోల్మాల్ అయినట్టు బయటపడడంతో విచారించిన ఖజానా శాఖ అధికారులు వరుణ్‌బాబు పనే అని నిర్ధారించినట్టు తెలిపారు. ఇప్పటికి రూ. తొమ్మిది లక్షలు రికవర్ చేశామని, కేసు దర్యాప్తు కొనసాగుతుందన్నారు. వరుణ్‌బాబుతో పాటు నిధుల గోల్‌మాల్‌కు సంబంధించి రాజ్‌కుమార్‌దత్, ఇతరుల పాత్రపై విచారణ జరుగుతోందని, వారిపైనా చర్యలుంటాయని సీఐ స్పష్టం చేశారు. సమావేశంలో ఎస్ఐలు జి. అసన్, కె. వెంకటేశ్వరరావు, సిబ్బంది ఉన్నారు. -
ఏసీబీకి పట్టుబడ్డ జూనియర్ అసిస్టెంట్
కష్ణా : ఓ స్వచ్చంధ సంస్థ నుంచి లంచం తీసుకుంటూ జూనియర్ అసిస్టెంట్ ఏసీబీకి చిక్కాడు. వివరాలు కృష్ణాజిల్లా రిజిస్ట్రార్ కార్యాలయంలో ఎ.వాసుదేవరావు అనే వ్యక్తి జూనియర్ అసిస్టెంట్‌గా పని చేస్తున్నాడు. నిత్య జీవం మినిస్ట్రైవ్స్ అనే స్వచ్ఛంద సంస్థ ప్రతినిధి రిజిస్ర్టేషన్ రెన్యూవల్ చేయించడానికి విజయవాడ పటమటలో ఉన్న రిజిస్ట్రేషన్ కార్యాలయానికి వెళ్లాడు. రిజిస్ర్టేషన్ రెన్యూవల్ చేయాలంటే రూ. 21వేలు లంచం ఇవ్వాలని వాసుదేవరావు అడిగాడు. అయితే సంస్థ ప్రతినిధి రూ. 16 వేలు ఇవ్వడానికి ఒప్పందం కుదుర్చుకున్నాడు. అనంతరం ఈ విషయం గురించి బాధితులు ఏసీబీ అధికారులకు తెలియజేశారు. ఏసీబీ డీఎస్పీ గోపాలకష్ణ ఆధ్వర్యంలో వాసుదేవరావును ట్రాప్ చేసి లంచం తీసుకుంటుండగా గురువారం పట్టుకున్నారు. జూనియర్ అసిస్టెంట్ దగ్గర నుంచి రూ.16 వేలు స్వాధీనం చేసుకుని అరెస్టు చేశారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. (విజయవాడ)