breaking news
Jayshi Mohammed
-
మసూద్‌ను అంతర్జాతీయ ఉగ్రవాదిగా ప్రకటించాలి
ఐక్యరాజ్యసమితి: జైషే మహ్మద్ ఉగ్రసంస్థ అధినేత మసూద్ అజర్‌ను అంతర్జాతీయ ఉగ్రవాదిగా ప్రకటించాలంటూ ఐక్యరాజ్యసమితి భద్రతా మండలిలో అమెరికా, బ్రిటన్, ఫ్రాన్స్ ప్రతిపాదించాయి. 15 సభ్య దేశాలున్న భద్రతా మండలిలో వీటో అధికారమున్న ఈ మూడు దేశాలు బుధవారం ఈ ప్రతిపాదన చేశాయి. ప్రతిపాదనను భద్రతా మండలి పరిగణనలోకి తీసుకునే అవకాశముంది. పాకి స్తాన్‌ను కేంద్రంగా చేసుకుని భారత్‌లో పలు ఉగ్రదాడులకు సూత్రధారిగా వ్యవహరించిన మసూద్‌ను అంతర్జాతీయ ఉగ్రవాదిగా గుర్తించాలంటూ భారత్ చాన్నాళ్లుగా అభ్యర్థిస్తోంది. ప్రస్తుత పరిణామాల నేపథ్యంలో ఈ విషయంలో భారత్‌కు వివిధ దేశాల మద్దతు లభించింది. మసూద్‌ను అంతర్జాతీయ ఉగ్రవాదిగా గుర్తించాలంటూ మండలిలో ప్రతిపాదించడం ఇది నాల్గోసారి. పాక్‌తో సన్నిహిత సంబంధాలున్న చైనా తన వీటో అధికారంతో ప్రతిసారీ అడ్డుతగులుతోంది. పుల్వామాలో భారత భద్రతా దళంపై జరిగిన దాడిని ఖండించిన చైనా ఈసారి ఎలా వ్యవహరిస్తుందో చూడాల్సి ఉంది. అజార్‌ను అంతర్జాతీయ ఉగ్రవాదిగా ప్రకటిస్తే మసూద్, సంస్థ చరాస్తుల లావాదేవీలు స్తంభించిపోతాయి. ఆర్థిక వనరులు మూసుకుపోతాయి. ప్రతిపాదనకు ప్రపంచ దేశాలు మద్దతు ఇవ్వాలంటూ భారత్ విజ్ఞప్తి చేసింది. పాక్ స్థావరంగా పనిచేస్తున్న అన్ని ఉగ్రసంస్థలను నిషేధించాలని కోరింది. భారత్, పాకిస్తాన్ల మధ్య ఉద్రిక్త తలు పెరగడం ఆందోళన కలిగిస్తోంది. రెండు దేశాలు వెంటనే సమావేశమై తగిన చర్యలు తీసుకోవాలి. పరిస్థితి మరింత దిగజారిపోకుండా సంయమనం పాటించాలి. ఇరు దేశాలు బాధ్యతగా వ్యవహరించి శాంతిని నెలకొల్పాలి. ఐక్యరాజ్య సమితి అందరికీ అందుబాటులో ఉంటుంది. రెండు దేశాల అధికారులతో ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నాం. – ఐరాస సెక్రటరీ జనరల్ ఆంటోనియో గ్యుటెరెస్ -
కశ్మీర్లో జైషే టాప్ కమాండర్ హతం
శ్రీనగర్: జమ్మూకశ్మీర్‌లోని పుల్వామా జిల్లాలో భద్రతాబలగాలు, ఉగ్రవాదులకు మధ్య ఆదివారం ఎన్కౌంటర్ జరిగింది. ఈ ఘటనలో భద్రతాబలగాలు ఉగ్రసంస్థ జైషే మహమ్మద్‌కు చెందిన టాప్ కమాండర్ అద్నాన్‌ను మట్టుబెట్టాయి. ఉగ్రవాదుల కదలికలపై నిఘా వర్గాల పక్కా సమాచారంతో త్రాల్ ప్రాంతంలో ఉన్న దార్గనీ గుండ్ గ్రామాన్ని చుట్టుముట్టిన భద్రతా బలగాలు.. ఉగ్రవాదుల కోసం గాలింపు ప్రారంభించాయి. బలగాల కదలికల్ని పసిగట్టిన ఉగ్రవాదులు కాల్పులు జరుపుతూ పరారయ్యేందుకు యత్నించారు. దీంతో భద్రతాబలగాలు ఎదురుకాల్పులు ప్రారంభించాయి. ఈ కాల్పుల్లో పాకిస్తాన్‌కు చెందిన ఉగ్రవాది, జైషే టాప్ కమాండర్ అద్నాన్ హతమయ్యాడని పోలీస్‌శాఖ అధికార ప్రతినిధి తెలిపారు. ఘటనాస్థలం నుంచి భారీగా ఆయుధాలు, మందుగుండు, నిషేధిత సాహిత్యాన్ని స్వాధీనం చేసుకున్నామన్నారు. ఉగ్రవాదుల కాల్పుల్లో ఓ జవాన్‌తో పాటు పౌరుడు గాయపడ్డాడని వెల్లడించారు. -
ముగ్గురు జైషే ఉగ్రవాదులు హతం
జమ్మూ: జమ్మూకశ్మీర్‌లోని రియాసీ జిల్లాలో గురువారం భద్రతాబలగాలు, ఉగ్రవాదులకు మధ్య భారీ ఎన్కౌంటర్ జరిగింది. ఈ ఘటనలో ముగ్గురు జైషే మహమ్మద్ ఉగ్రవాదుల్ని భద్రతాబలగాలు హతమార్చాయి. ఉగ్రవాదులు జరిపిన కాల్పుల్లో 12 మంది భద్రతా సిబ్బంది గాయపడ్డారు. ఉగ్రవాదులు కఠువా జిల్లా నుంచి అంతర్జాతీయ సరిహద్దు గుండా దేశంలోకి ప్రవేశించి.. జమ్మూ నుంచి శ్రీనగర్ వెళుతున్న ఓ ట్రక్కులోకి ఎక్కారని జమ్మూ ఐజీ ఎస్డీ సింగ్ జమ్వాల్ తెలిపారు. డొమైల్ అనే గ్రామ సమీపంలో సీఆర్పీఎఫ్ బలగాలు తనిఖీలు చేపట్టడం చూసి వారిపై కాల్పులు జరుపుతూ పరారయ్యారని వెల్లడించారు. సమీపంలోని అటవీప్రాంతంలో దాక్కున్న వీరిని పట్టుకునేందుకు ఆపరేషన్ మొదలుపెట్టామన్నారు. ఉగ్రవాదులను చూసినట్లు ఓ స్థానికుడు ఇచ్చిన సమాచారంతో ఆర్మీ, సీఆర్పీఎఫ్, పోలీసుల సంయుక్త బృందాలు ఈ ప్రాంతాన్ని చుట్టుముట్టి గాలింపు చేపట్టాయి. ఉగ్రవాదులు కాల్పులు ప్రారంభించడంతో భద్రతాబలగాలు ఎదురుకాల్పులు ప్రారంభించాయి. గాయపడ్డ 12 మంది భద్రతా సిబ్బందిని ఆసుపత్రికి తరలించారు. -
దేశంలోకి జైషే ఉగ్రవాదులు
శ్రీనగర్: కశ్మీర్లోకి 20 మందికిపైగా ఉగ్రవాదులు చొరబడినట్లు నిఘావర్గాలు తెలిపాయి. వీరు కశ్మీర్‌లోయతో పాటు ఢిల్లీలో పెద్దఎత్తున విధ్వంసానికి పాల్పడే అవకాశముందని హెచ్చరించాయి. దీంతో అప్రమత్తమైన అధికారులు కశ్మీర్, ఢిల్లీలో హైఅలర్ట్ ప్రకటించారు. ఉగ్రవాదులు పాక్ నుంచి పీర్‌పంజాల్ పర్వతశ్రేణి ద్వారా కశ్మీర్లోకి చొరబడ్డారని పోలీస్ ఉన్నతాధికారి ఒకరు చెప్పారు. జైషే మహమ్మద్ ఉగ్రసంస్థకు చెందిన వీరందరూ చిన్నచిన్న గ్రూపులుగా విడిపోయి వచ్చారని వెల్లడించారు. ఉగ్రవాదుల వద్ద భారీఎత్తున పేలుడుపదార్థాలు, ఆయుధాలు ఉన్నాయన్నారు. ఇంత భారీస్థాయిలో ఉగ్రవాదులు చొరబడటం చాలా అరుదని వ్యాఖ్యానించారు. ఇస్లాం విస్తరణకు కీలకంగా నిలిచిన బద్ర్ యుద్ధం ఇస్లామిక్ క్యాలండర్ ప్రకారం శనివారం (రంజాన్ నెల 17వ రోజు) జరిగింది. అందుకే ఈరోజు వారు విధ్వంసం సృష్టించే అవకాశముంది. కీలకమైన సైనిక స్థావరాలతో పాటు ఇతర ప్రాంతాల వద్ద భద్రతను కట్టుదిట్టం చేశారు. కశ్మీర్లో గ్రెనేడ్ దాడి నిఘావర్గాలు హెచ్చరించిన కొన్నిగంటల్లోనే కశ్మీర్‌లోని పుల్వామా జిల్లాలో ఉగ్రవాదులు రెచ్చిపోయారు. పుల్వామాలో అధికార పీడీపీ నేత, త్రాల్ ఎమ్మెల్యే ముస్తాక్ షా ఇంటిపై గ్రెనేడ్ దాడికి పాల్పడ్డారు. గ్రెనేడ్ ఇంట్లోని పచ్చిక ప్రాంతంలో పేలడంతో ఎవ్వరికీ గాయాలుకాలేదు. -
ఉగ్రదాడిలో పెరిగిన మృతుల సంఖ్య
సాక్షి, సంజువాన్ : జమ్మూ కశ్మీర్‌లోని సంజువాన్‌లో భారత సైనికులకు, జైషే మహమ్మద్ ఉగ్రవాదుల మధ్య ఎదురుకాల్పులు కొనసాగుతున్నాయి. శనివారం తెల్లవారుజామున నుంచి జరుగుతున్న ఈకాల్పుల్లో మృతుల సంఖ్య ఆరుకు చేరింది. ఈ దాడుల్లో ఐదుగురు సైనికులు, ఒక పౌరుడు మరణించారు. మరో పదిహేను మందికి పైగా గాయపడ్డారు. సైనిక దుస్తుల్లో వచ్చిన ఉగ్రవాదులు గ్రనేడ్లు విసురుతూ, ఆర్మీ వసతి గృహ సముదాయంపై దాడికి యత్నించిన సంగతి తెలిసిందే. అయితే ఉగ్రదాడులను భారత బలగాలు తిప్పికొడుతున్నాయి. బలగాలు జరిపిన కాల్పులో శనివారం ముగ్గురు తీవ్రవాదులు హతమవ్వగా, ఆదివారం మరో ఉగ్రవాదిని కాల్చిచంపారు. అర్ధరాత్రి నుంచి ఆర్మీ క్యాంపులో చొరబడ్డ ఉగ్రవాదుల కోసం ప్రత్యేక ఆపరేషన్ కొనసాతోంది. ప్రస్తుతం సంజువాన్‌లో పరిస్థతి ఆందోళనకరంగా ఉందని అధికారులు తెలిపారు. ప్రస్తుతం గాయపడిన వారిలో ఇద్దరి పరిస్థితి ఆందోళనకరంగా ఉంది. గాయపడ్డవారిలో హవిల్దార్ అబ్దుల్ హమీద్, లాన్స్ నాయక్ బహదూర్ సింగ్‌తో పాటు స్కూలు సెలవుల్లో తండ్రిని చూసేందుకు వచ్చిన సుబేదార్ మదన్‌లాల్ కుమార్తె కూడా ఉన్నారు. జమ్మూకు చెందిన ఆర్మీ పీఆర్వో లెఫ్టినెంట్ కల్నల్ దేవేందర్ దాడి వివరాల్ని వెల్లడించారు. -
జమ్మూలో సైనిక శిబిరంపై ఉగ్రదాడి
సంజువాన్: జమ్మూ కశ్మీర్లో జైషే మహమ్మద్ ఉగ్రవాదులు రెచ్చిపోయారు. జమ్మూ నగరం శివారు ప్రాంతం సంజువాన్‌లో ఉన్న ఆర్మీ శిబిరంపై శనివారం తెల్లవారుజామున దాడికి తెగబడడంతో ఇద్దరు ఆర్మీ సిబ్బంది మరణించగా.. 9 మంది గాయపడ్డారు. సైనిక దుస్తుల్లో వచ్చిన ఉగ్రవాదులు గ్రనేడ్లు విసరడంతో పాటు విచక్షణా రహితంగా కాల్పులు జరుపుతూ ఆర్మీ కుటుంబాలు నివసిస్తున్న వసతి గృహ సముదాయంపై దాడికి యత్నించారు. వెంటనే తేరుకున్న ఆర్మీ సిబ్బంది ఉగ్రదాడిని దీటుగా తిప్పికొట్టారు. ఉగ్రవాదుల్ని ఎటూ కదలకుండా నిరోధించిన భద్రతా బలగాలు.. శిబిరం నుంచి అందరినీ సురక్షిత ప్రాంతాలకు తరలించిన అనంతరం సాయంత్రం సమయంలో ముగ్గురు ఉగ్రవాదుల్ని హతమార్చాయి. ఆర్మీ ఆపరేషన్ అర్ధరాత్రి దాటాక కూడా కొనసాగడంతో దాడికి పాల్పడ్డ ఉగ్రవాదులంతా హతమయ్యారా? లేదా? అన్న విషయం తెలియాల్సి ఉంది. ఉగ్రదాడిలో జమ్మూ కశ్మీర్‌కు చెందిన సుబేదార్ మదన్‌లాల్ చౌదరి, హవిల్దార్ హబీముల్లా ఖురేషీ ప్రాణాలు కోల్పోయారని ఆర్మీ అధికారి వెల్లడించారు. ఐదుగురు మహిళలు, చిన్నారులు సహా తొమ్మిది మంది గాయపడగా, వారిలో ఇద్దరి పరిస్థితి ఆందోళనకరంగా ఉంద న్నారు. గాయపడ్డవారిలో హవిల్దార్ అబ్దుల్ హమీద్, లాన్స్ నాయక్ బహదూర్ సింగ్‌తో పాటు స్కూలు సెలవుల్లో తండ్రిని చూసేందుకు వచ్చిన సుబేదార్ మదన్‌లాల్ కుమార్తె కూడా ఉన్నారు. జమ్మూకు చెందిన ఆర్మీ పీఆర్వో లెఫ్టినెంట్ కల్నల్ దేవేందర్ దాడి వివరాల్ని వెల్లడిస్తూ ‘శనివారం తెల్లవారుజామున శిబిరానికి వెనుకవైపు కాపలాగా ఉన్న సెంట్రీ బంకర్‌పై కాల్పులు జరిపిన ఉగ్రవాదులు.. అనంతరం ఆర్మీ కుటుంబాలు నివసిస్తున్న వసతి గృహ సముదాయంలోకి చొరబడ్డారు. ఎదురుకాల్పుల్లో ముగ్గు రు ఉగ్రవాదుల్ని ఆర్మీ హతమార్చింది. ఉగ్రవాదుల వద్ద దొరికిన వస్తువుల మేరకు వారిని జైషే మహమ్మద్ ఉగ్ర సంస్థకు చెందిన వారుగా గుర్తించాం’ అని తెలిపారు. ఉగ్రదాడి జరిగిన వెంటనే మెరుపు బృందాలు రంగ ప్రవేశం చేసి ఇళ్లలో దాక్కున్న ఉగ్రవాదుల్ని ఎటూ కదలకుండా నిరోధించాయని, సైనిక కుటుంబాల్ని సురక్షిత ప్రాంతాలకు తరలించే క్రమంలో ఇద్దరు ఆర్మీ సిబ్బంది మృతి చెందారని ఆయన వెల్లడించారు. గతంలో 2016 నవంబర్‌లో నగ్రోటాలోని ఆర్మీ శిబిరంపై ఆత్మాహుతి బృందం దాడి చేయడంతో ఏడుగురు భద్రతా సిబ్బంది ప్రాణాలు కోల్పోయారు. ఆచితూచి ఆపరేషన్ గృహ సముదాయంలో మహిళలు, చిన్నారులు ఉండడంతో ఉగ్రవాదుల్ని మట్టుబెట్టే ఆపరేషన్‌ను ఆర్మీ జాగ్రత్తగా కొనసాగించింది. ఉగ్రవాదులు ఎక్కడ నక్కారో తెలుసుకునేందుకు ఆర్మీ హెలికాప్టర్లు, డ్రోన్లను వాడింది. బుల్లెట్ ప్రూఫ్ వెహికల్స్‌లో ప్రత్యేక బలగాలు వెనుకవైపు నుంచి శిబిరంలోకి చేరుకుని ఆపరేషన్‌లో పాల్గొన్నాయి. శిబిరం సరిహద్దు గోడ వెలుపల సీఆర్పీఎఫ్, పోలీసుల్ని మోహరించారు. అలాగే ఐదు కిలోమీటర్ల పరిధిలోని స్కూళ్లను అధికారులు మూసివేశారు. జమ్మూలో హై అలర్ట్ ప్రకటించడంతో పాటు భదత్రను కట్టుదిట్టం చేశారు. జమ్మూ ఐజీ ఎస్డీ సింగ్ ఉగ్రదాడిపై మాట్లాడుతూ.. ‘దాడి గురించి తెలియగానే ఆర్మీ ప్రత్యేక బలగాలు, స్పెషల్ ఆపరేషన్స్ గ్రూప్(ఎస్ఓజీ) సిబ్బంది చేరుకుని.. శిబిరాన్ని చుట్టుముట్టాయి’ అని తెలిపారు. ఉగ్రదాడిలో తీవ్రంగా గాయపడ్డ మేజర్‌ను హెలికాప్టర్లో ఉధమ్‌పూర్ ఆస్పత్రికి తరలించారు. ఆయన పరిస్థితి ఆందోళనకరంగా ఉంది. మృతి చెందిన ఆర్మీ సిబ్బంది: సుబేదార్ మదన్‌లాల్ చౌదరి, హవిల్దార్ హబీముల్లా ఖురేషీ -
పక్కలో ఉగ్ర బల్లెం
‘ఉగ్ర’బల్లెం మన పక్కలోనే పొంచి ఉంది. ఆదమరచిన క్షణాల్లో అదను చూసి వెన్నుపోట్లు పొడుస్తోంది. మన దేశమ్మీద ‘ఉగ్ర’దాడులకు తెగబడుతున్నది ముష్కర మూకల ముఠాలే కాదు, పొరుగు సైన్యమే సరి‘హద్దు’మీరి మరీ మన గడ్డ మీదకు చొరబడుతోంది. మన సైనికులను అతి కిరాతకంగా హింసించి, తలలను తెగనరికి పొట్టన పెట్టుకుంటోంది. కాల్పుల విరమణ ఒప్పందాన్ని పదే పదే ఉల్లంఘిస్తోంది. నియంత్రణ రేఖ వద్ద సరిహద్దుల పొడవునా అడపా దడపా తూటాల వర్షం కురిపిస్తూ నెత్తుటి కళ్లాపు చల్లుతోంది. శాంతి కోరుకునే మన దేశం సహనం, సంయమనం ప్రదర్శిస్తున్న కొద్దీ పొరుగు దేశం మరింతగా రెచ్చిపోతోంది. పొరుగు దేశం ఇదే పంథాను కొనసాగిస్తే ఏదో ఒకరోజు మన దేశానికీ సహనం నశించక తప్పదు. అదే జరిగితే యుద్ధం అనివార్యమవక తప్పదు. ధూర్త దేశం... ‘ఉగ్ర’ సైన్యం స్వాతంత్య్రం వచ్చిన తర్వాత అవిభక్త భారత భూభాగం నుంచి విడివడినప్పటి నుంచి పాకిస్థాన్ ధూర్త దేశంగానే మనుగడ సాగిస్తోంది. భారత్‌తో జరిగిన యుద్ధాలతో చావుదెబ్బలు తిన్న తర్వాత పాకిస్థాన్ సైన్యం ఉగ్రవాద సంస్థలకు తీసిపోని రీతిలో ఘాతుకాలకు తెగబడుతోంది. భారత్‌తో నేరుగా యుద్ధానికి తలపడితే ఓటమి తప్పదన్న ఎరుకతోనే దొంగచాటు దాడులకు పాల్పడుతోంది. పాక్ గూఢచర్య సంస్థ ఇంటర్ సర్వీస్ ఇంటెలిజెన్స్ (ఐఎస్ఐ) కూడా ఉగ్రవాద సంస్థలకు సర్వం సమకూరుస్తూ, వాటిని భారత్‌పై దాడులకు ప్రేరేపిస్తోంది. లష్కరే తోయిబా, లష్కరే ఒమర్, అల్ కాయిదా, జైషే మహమ్మద్, జమాత్ ఉద్ దావా వంటి ఉగ్రవాద సంస్థలకు ఆర్థికసాయం, ఆయుధ సాయం కల్పిస్తున్న పాక్ సైన్యం, ఐఎస్ఐ సంస్థలేనన్నది బహిరంగ రహస్యం. ఉగ్రవాద సంస్థలకు పాకిస్థాన్ సురక్షిత స్థావరంగా ఉంటోంది. పాక్‌లో తలదాచుకుంటూ దాదాపు 43 ఉగ్రవాద సంస్థలు క్రియాశీలంగా పనిచేస్తున్నట్లు ఒక అంచనా. అంతర్జాతీయ వేదికలపై ఉగ్రవాదానికి తాను వ్యతిరేకమని చెప్పుకొనే పాకిస్థాన్, ఆచరణలో మాత్రం ఎప్పటికప్పుడు ఉగ్రవాద సంస్థలకు అన్ని విధాలా అండదండలు అందిస్తూ వస్తోంది. ‘ఉగ్ర’ మూకలను భారత్ మీదకు మాత్రమే కాదు, అఫ్ఘానిస్థాన్, బంగ్లాదేశ్ వంటి దేశాల మీదకూ ఎగదోస్తోంది. ప్రపంచవ్యాప్త పరిస్థితి ఉగ్రవాదం ఏ ఒకటి రెండు దేశాలకు మాత్రమో పరిమితమైన సమస్య కాదు. ఇది ప్రపంచమంతటికీ ఆందోళన కలిగిస్తున్న బెడద. ఉగ్రవాదుల దాడుల కారణంగా అత్యధిక మరణాలు సంభవించిన మొదటి పది దేశాల్లో భారత్ కూడా ఉండటం ఆందోళనకరం. గ్లోబల్ టెర్రరిజం ఇండెక్స్ (జీటీఐ) గత ఏడాది 2015 నాటి గణాంకాలను వెల్లడించింది. వాటి ఆధారంగా ఉగ్రవాదుల దాడుల కారణంగా అత్యధిక మరణాలు సంభవించిన మొదటి పది దేశాల వివరాలు... పాక్ సైన్యం పాపాల చిట్టా భారత సైన్యంపై దారుణాలకు తెగబడటం పాకిస్థాన్ సైన్యానికీ, ఉగ్రవాద సంస్థలకు కొత్త కాదు. కార్గిల్ యుద్ధంలో పట్టుబడిన కెప్టెన్ సౌరభ్ కాలియాను పాక్ సైన్యం చిత్రహింసలు పెట్టి దారుణంగా చంపింది. ఛిద్రమైన అతడి మృతదేహాన్ని భారత్‌కు పంపింది. కార్గిల్ యుద్ధం ముగిసిన మరుసటి ఏడాదే... 2000 ఫిబ్రవరిలో పాక్ ఉగ్రవాది ఇల్యాస్ కశ్మీరీ నేతృత్వంలోని ‘ఉగ్ర’మూక సరిహద్దులు దాటి వచ్చి నౌషేరా సెక్టార్లో భారత సైన్యంపై దాడికి తెగబడింది. ఆ దాడిలో ఉగ్రవాదులు ఏడుగురు సైనికులను చంపేయడమే కాక, మృతులలో ఒకరైన భావుసాహెబ్ మారుతి తలను నరికి పాకిస్థాన్‌కు తీసుకుపోయారు. సరిహద్దుల వద్ద గస్తీ తిరుగుతున్న గూర్ఖా రైఫిల్స్ సిపాయి ఒకరు 2008లో దారి తప్పి కేల్ సెక్టార్ వద్ద పాకిస్థానీ బోర్డర్ యాక్షన్ టీమ్ (బీఏటీ) దళాల చేతికి చిక్కాడు. బీఏటీ దళాలు అతడిని తలనరికి దారుణంగా చంపాయి. కొద్దిరోజుల తర్వాత భారత భూభాగంలో ఆ సిపాయి తలలేని మొండెం మాత్రమే దొరికింది. పాక్ బీఏటీ బలగాలు 2013 జనవరిలో భారత భూభాగంలోకి చొరబడి దాడికి తెగబడ్డాయి. ఆ దాడిలో బీఏటీ ముష్కరులు లాన్స్ నాయక్ హేమ్‌రాజ్‌ను చిత్రవధ చేయగా, మరో లాన్స్ నాయక్ సుధాకర్ సింగ్ తలను తెగనరికారు. గత ఏడాది అక్టోబర్ 28న మచిల్ సెక్టార్ వద్ద నియంత్రణ రేఖకు చేరువలో పాక్ మీదుగా చొరబడ్డ ఉగ్రవాదులు భారత జవాను ఒకరిని దారుణంగా చంపి, అతడి మృతదేహాన్ని ఛిద్రం చేశారు. అంతులేని అకృత్యాలు పాకిస్థాన్ సైన్యం, గూఢచర్య సంస్థ ఐఎస్ఐ, వాటి కనుసన్నల్లో పనిచేసే ఉగ్రవాద మూకలు భారత భూభాగంలో అంతులేని అకృత్యాలను కొనసాగిస్తున్నాయి. నియంత్రణ రేఖ (ఎల్ఓసీ) వద్ద, అంతర్జాతీయ సరిహద్దుల వద్ద పాక్ సైన్యం మరీ బరితెగింపు చర్యలకు పాల్పడుతోంది. అదను చిక్కినప్పుడల్లా సరిహద్దులు దాటి చొరబాట్లకు తెగబడుతోంది. ఎలాంటి కవ్వింపు చర్యలు లేకపోయినా గత ఏడాది 228 సార్లు కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘించింది. ఇటీవల మరింత బరితెగించి, సరిహద్దులు దాటి మరీ భారత భూభాగంలోకి చొరబడి జమ్మూ కశ్మీర్‌లోని పూంచ్ జిల్లా కృష్ణాఘాటి సెక్టార్ వద్ద గస్తీ తిరుగుతున్న ఇద్దరు జవాన్లను తలలు నరికి అత్యంత కిరాతకంగా చంపింది. పాక్ ఘాతుకానికి బీఎస్ఎఫ్ హెడ్ కానిస్టేబుల్ ప్రేమ్ సాగర్, ఆర్మీ నాయబ్ సుబేదార్ పరమ్‌జీత్ సింగ్ బలైపోయారు. ఈ సంఘటనపై యావత్ భారతదేశం ఆగ్రహంతో రగిలిపోయింది. దేశం కోసం తన తండ్రి చేసిన త్యాగానికి బదులుగా యాభై మంది పాక్ సైనికుల తలలు తెగనరికి తేవాలని బీఎస్ఎఫ్ హెడ్‌కానిస్టేబుల్ ప్రేమ్‌సాగర్ కూతురు సరోజ్ ఆక్రోశంతో చేసిన వ్యాఖ్యలు దేశప్రజల మనసులను కలచివేశాయి. ఈ సంఘటన మరువక ముందే దక్షిణ కశ్మీర్ జిల్లాలో సెలవులో ఉన్న ఆర్మీ అధికారి లెఫ్టినెంట్ ఉమర్ ఫయాజ్ను పాక్ ఉగ్రవాదులు కిడ్నాప్ చేసి, దారుణంగా చంపారు. మన దేశంలో ‘ఉగ్ర’ ఘాతుకాలు ఉగ్రవాద దాడులు మనదేశంలో మూడు దశాబ్దాలకు పైగా జరుగుతూనే ఉన్నాయి. రక్షణ బలగాలు, ఇంటెలిజెన్స్ వర్గాలు ఎన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నా ఉగ్రవాదులు అదను చూసి పంజా విసురుతూనే ఉన్నారు. మొట్టమొదటి సారిగా మనదేశంలో 1984 ఆగస్టు 2న చెన్నైలోని మీనంబాకం విమానాశ్రయంలో ‘ఉగ్ర’దాడి జరిగింది. తమిళ ఈలం ఆర్మీ (టీఈఏ) పాల్పడిన ఆ దాడిలో 33 మంది బలయ్యారు. పాక్ ప్రోద్బలం వల్ల 1993 మార్చి 12న ముంబైలో దేశంలోనే అత్యంత విధ్వంసకరమైన పేలుళ్లు జరిగాయి. ఒకేరోజులో ముంబై నగరంలో జరిగిన ఆ వరుస పేలుళ్లలో 257 మంది మరణించగా, 717 మంది తీవ్రంగా గాయపడ్డారు. ఆ సంఘటనపై ఇరవయ్యేళ్ల సుదీర్ఘ న్యాయ విచారణ తర్వాత 2013లో సుప్రీంకోర్టు తీర్పునిచ్చింది. మాఫియా డాన్ దావూద్ ఇబ్రహీం, అతడి అనుచరులు టైగర్ మెమన్, యాకూబ్ మెమన్ సహా పదిమంది నిందితులకు శిక్ష విధించింది. యాకూబ్ మెమన్‌కు ఉరిశిక్ష విధించగా, మిగిలిన పదిమందికి యావజ్జీవ శిక్ష విధిస్తూ తీర్పునిచ్చింది. అయితే, దావూద్ ఇబ్రహీం, టైగర్ మెమన్లు ఇప్పటికీ పట్టుబడలేదు. వారిద్దరికీ పాకిస్థాన్ ఆశ్రయం కల్పిస్తోందనేది బహిరంగ రహస్యం. అదను దొరికనప్పుడల్లా అడపా దడపా దాడులకు తెగబడుతూ వస్తున్న ఉగ్రవాదులు 2008 నవంబర్ 26న మరోసారి ముంబైలో వరుస దాడులకు తెగబడ్డారు. పాకిస్థానీ ఉగ్రవాద సంస్థ లష్కరే తోయిబాకు చెందిన పదిమంది ఉగ్రవాదులు జలమార్గంలో ముంబైలోకి చొరబడి ఛత్రపతి శివాజీ టెర్మినస్, తాజ్ హోటల్, ఓబెరాయ్ ట్రైడెంట్ హోటల్, నారిమన్ హౌస్ వంటి కీలక ప్రదేశాలపై దాడులు జరిపారు. ఆ దాడుల్లో పలువురు విదేశీయులు సహా 166 మంది మరణించగా, 308 మంది తీవ్రంగా గాయపడ్డారు. మృతులలో ఏడుగురు పోలీసులు కూడా ఉన్నారు. పోలీసుల ఎదురుదాడిలో తొమ్మిది మంది ఉగ్రవాదులు మరణించగా, అజ్మల్ కసబ్ అనే ఉగ్రవాది ఒక్కడే ప్రాణాలతో పట్టుబడ్డాడు. కోర్టు అతడికి ఉరిశిక్ష విధించింది. మనదేశంలో ‘ఉగ్ర’సంస్థలు గడచిన రెండు దశాబ్దాల కాలంలో భారత్‌లోను, దక్షిణాసియాలోని ఇరుగు పొరుగు దేశాల్లోను దాదాపు 180 ఉగ్రవాద సంస్థలు క్రియాశీలంగా ఉన్నాయి. వీటిలో కొన్ని సంస్థలు అంతర్జాతీయ స్థాయిలో తమ కార్యకలాపాలు సాగిస్తున్నాయి. భారత ప్రభుత్వం 38 ఉగ్రవాద సంస్థలపై నిషేధం విధించింది. వీటిలో కొన్ని సంస్థలపై అమెరికా, యూరోపియన్ యూనియన్ కూడా నిషేధం విధించాయి. ఈ సంస్థలు ఎక్కువగా పాకిస్థాన్, బంగ్లాదేశ్, భారత్, నేపాల్ వంటి దేశాలలో తలదాచుకుంటూ ధ్వంసరచన సాగిస్తున్నాయి. ఎన్ని అంతర్జాతీయ నిషేధాలు, ఆంక్షలు అమలులో ఉన్నా, ఉగ్రవాద సంస్థలు రకరకాల పేర్లతో ఎప్పటికప్పుడు భీభత్సకాండను సృష్టిస్తూనే ఉన్నాయి. అమాయకుల ఉసురు పోసుకుంటూనే ఉన్నాయి. దక్షిణాదిలోనూ దాడులు పొరుగుదేశం ప్రోద్బలంతో చెలరేగుతున్న ఉగ్రవాదులు దక్షిణాదిలోనూ అడపా తడపా దాడులు సాగిస్తూనే ఉన్నారు. హైదరాబాద్‌లోని మక్కా మసీదులో 2007 మే 18న ఉగ్రవాదులు అమర్చిన బాంబులు పేలడంతో నలుగురు పోలీసులు సహా 13 మంది మరణించారు. అదే ఏడాది ఆగస్టు 25న హైదరాబాద్‌లోని లుంబినీ పార్కులోను, గోకుల్ చాట్ సెంటర్లోను ఉగ్రవాదులు బాంబు పేలుళ్లకు పాల్పడ్డారు. ఆ పేలుళ్లలో 44 మంది మరణించగా, మరో 52 మంది తీవ్రంగా గాయపడ్డారు. బెంగళూరులో 2008 జూలై 25న జరిగిన బాంబు పేలుళ్లలో ఇద్దరు మరణించారు. హైదరాబాద్‌లోని దిల్సుఖ్నగర్ ప్రాంతంలో 2013 ఫిబ్రవరి 21న జరిగిన బాంబు పేలుళ్లలో 18 మంది మరణించగా, 131 మంది గాయపడ్డారు. ఈ సంఘటనకు సంబంధించి ఇండియన్ ముజాహిదీన్ సహ వ్యవస్థాపకుడు యాసీన్ భత్కల్, పాక్ జాతీయుడు జియా ఉర్ రెహమాన్, అసదుల్లా అక్తర్, తహసీన్ అక్తర్‌లకు ఉరిశిక్ష పడింది. చెన్నై సెంట్రల్ రైల్వే స్టేషన్లో 2014 మే 1న ఉగ్రవాదులు అమర్చిన బాంబు పేలడంతో ఒక మహిళ మరణించగా, 14 మంది గాయపడ్డారు. దేశవ్యాప్తంగా 2005 నుంచి చూసుకుంటే, ఇప్పటి వరకు జరిగిన ఉగ్రవాద దాడుల్లో 700 మందికి పైగా ప్రాణాలు కోల్పోగా, మూడువేల మందికి పైగా ప్రజలు గాయాలపాలయ్యారు. గాయపడిన వారిలో కొందరు శాశ్వత వికలాంగులుగా మిగిలారు. కీలక స్థావరాలపైనా ‘ఉగ్ర’నేత్రం మనదేశంలోని కట్టుదిట్టమైన భద్రత గల కీలక స్థావరాలపైనా ఉగ్రవాదులు కన్నేశారు. ఢిల్లీలోని ఎర్రకోటపై 2000 డిసెంబర్ 22న ఆరుగురు లష్కరే తోయిబా ఉగ్రవాదులు దాడికి తెగబడ్డారు. ఆ దాడిలో ఇద్దరు సిపాయిలు, ఒక పౌరుడు మరణించగా, మరో 14 మంది గాయపడ్డారు. ఈ సంఘటనకు సంబంధించి ప్రధాన నిందితుడు మహ్మద్ ఆరిఫ్‌కు ఢిల్లీ హైకోర్టు ఉరిశిక్ష విధించింది. మిగిలిన ఆరుగురు నిందితులకు ఏడేళ్ల చొప్పున జైలు శిక్ష విధించింది. ఎర్రకోటపై దాడి చేసిన ఏడాదిలోగానే... పాక్ ఉగ్రవాదులు 2001 అక్టోబర్ 1న జమ్మూ కశ్మీర్ అసెంబ్లీపై దాడి చేశారు. అదే ఏడాది డిసెంబర్ 13న ఉభయ సభలు కొలువు తీరిన వేళ ఏకంగా పార్లమెంటు భవనంపైన దాడికి పాల్పడి దేశ సార్వభౌమత్వానికే సవాలు విసిరారు. జమ్మూ కశ్మీర్ అసెంబ్లీపై జరిగిన దాడిలో 38 మంది మరణించగా, పార్లమెంటుపై జరిగిన దాడిలో ఆరుగురు పోలీసులు, ఐదుగురు ఉగ్రవాదులు మరణించారు. మరో ముగ్గురు పౌరులు మరణించారు. పార్లమెంటుపై దాడికి సంబంధించి జైషే మహ్మద్ ఉగ్రవాది అఫ్జల్ గురుకు ఉరిశిక్ష పడింది. ప్రపంచవ్యాప్త పరిస్థితి ఉగ్రవాదం ఏ ఒకటి రెండు దేశాలకు మాత్రమో పరిమితమైన సమస్య కాదు. ఇది ప్రపంచమంతటికీ ఆందోళన కలిగిస్తున్న బెడద. ఉగ్రవాదుల దాడుల కారణంగా అత్యధిక మరణాలు సంభవించిన మొదటి పది దేశాల్లో భారత్ కూడా ఉండటం ఆందోళనకరం. గ్లోబల్ టెర్రరిజం ఇండెక్స్ (జీటీఐ) గత ఏడాది 2015 నాటి గణాంకాలను వెల్లడించింది. వాటి ఆధారంగా ఉగ్రవాదుల దాడుల కారణంగా అత్యధిక మరణాలు సంభవించిన మొదటి పది దేశాల వివరాలు... అత్యంత ప్రమాదకర ‘ఉగ్ర’సంస్థలు అత్యంత ప్రమాదకరమైన ఉగ్రవాద సంస్థల్లో ఐసిస్ మొదటి స్థానంలో నిలుస్తోంది. జీటీఐ లెక్కల ప్రకారం 2015లో ఐసిస్ ఉగ్రవాదులు 6,141 మందిని పొట్టన పెట్టుకున్నారు. బోకోహరామ్ ఉగ్రవాదుల చేతిలో 5,478 మంది, అఫ్ఘాన్ తాలిబన్ల చేతిలో 4,502 మంది, ‘అల్‌కాయిదా’ చేతిలో 1,620 మంది ప్రాణాలు పోగొట్టుకున్నారు.