షట్‌డౌన్‌తో 1.20 లక్షల అమెరికన్ ఉద్యోగాలు ఫట్
వాషింగ్టన్: బడ్జెట్ ఆమోదం పొందక ప్రభుత్వ కార్యాలయాలు ఇటీవల కొన్నాళ్లు మూతబడటం (షట్‌డౌన్), రుణ సంక్షోభ పరిస్థితులు అమెరికా ఆర్థిక వ్యవస్థపై తీవ్ర ప్రతికూల ప్రభావాలు చూపాయి. 1,20,000 ఉద్యోగాల్లో కోత పడగా, నాలుగో త్రైమాసికంలో ఆర్థిక వృద్ధి రేటు పావు శాతం మేర తగ్గిపోయిందని వైట్‌హౌస్ కౌన్సిల్ చైర్మన్ జేసన్ ఫర్మన్ తెలిపారు.
ఈ గణాంకాల లెక్కింపులో ప్రాతిపదికగా తీసుకున్న అంశాలను త్వరలోనే వెల్లడిస్తామని ఆయన చెప్పారు. దివాలా పరిస్థితులు, షట్‌డౌన్ భయాల కారణంగా అమ్మకాలు, ఉక్కు ఉత్పత్తి మొదలైనవి తగ్గిపోయాయని వివరించారు. బడ్జెట్ ఆమోదంపై అధికార, విపక్షాల మధ్య వివాదం కారణంగా 16 రోజుల పాటు మూతబడిన ప్రభుత్వ కార్యాలయాలు అక్టోబర్ 17న తిరిగి కార్యకలాపాలు ప్రారంభించిన సంగతి తెలిసిందే. దీనివల్ల అమెరికా ఆర్థిక వ్యవస్థ సుమారు 24 బిలియన్ డాలర్లు నష్టపోయి ఉంటుందనేది రేటింగ్ ఏజెన్సీ స్టాండర్డ్ అండ్ పూర్స్ అంచనా.