breaking news
janmabhumi meeting
-
దళితులపై నోరుపారేసుకున్న ఎమ్మెల్యే
భోగాపురం: విజయనగరం జిల్లా భోగాపురం మండలం సవరవిల్లి గ్రామంలో గురువారం ఉదయం జరిగిన జన్మ భూమి సభలో గ్రామస్తులు సమస్యలు ఏకరువు పెట్టడంతో అధికార పార్టీకి చెందిన ఎమ్మెల్యే నారాయణస్వామి నాయుడు గ్రామస్తులపై విరుచుకుపడ్డారు. దళితులమైన తమకు దీపం పథకం కింద మంజూరైన గ్యాస్ కనెక్షన్లు, పింఛన్లు ఇతర సదుపాయాలను ఇవ్వడంలేదని విన్న వించుకున్నారు. దాంతో ఆగ్రహించిన ఎమ్మెల్యే మీకు ఇచ్చేదేలేదు. ఏమి చేసుకుంటారో చేసుకోండని మైకు వారిపైకి విసిరేసి ఆగ్రహం వ్యక్తం చేశారు. వేదికపై నుంచి వెళ్లిపోతూ తనకు తెలియకుండా వీరికి ఏ పథకం వర్తింపచేయవద్దని, తాను అనుమతిస్తేనే పింఛన్లులు గానీ, గ్యాస్ కనెక్షన్ గానీ ఇవ్వాలని హుకుం జారీచేశారు. ఎమ్మెల్యే తీరు చూసి జన్మభూమి సభకు హాజరైన దళితులు నిరసన వ్యక్తం చేశారు. తాము చేసుకున్న పాపం ఏమిటని, ప్రభుత్వ పథకాలు తమకు ఎందుకు మంజూరు చేయరని ప్రశ్నించారు. -
జన్మభూమి సదస్సులో రసాభాస
సరుబుజ్జిలి: జన్మభూమి సదస్సులో ప్రోటోకాల్ పాటించకపోవడంపై ప్రతిపక్ష నాయకులు ఆందోళనకు దిగారు. దీంతో సమావేశం రసాబాసగా మారింది. ప్రోటోకాల్ విషయంలో అధికార, ప్రతిపక్షాల మధ్య చెలరేగిన వాగ్వాదం దాడులు చేసుకునే వరకు వెళ్లింది. ఇది గుర్తించిన పోలీసులు ఇరు వర్గాలను సర్ది చెప్పడానికి యత్నిస్తున్నారు. శ్రీకాకుళం జిల్లా సరుబుజ్జిలి మండలం మతలపుపేట గ్రామ పంచాయతి కార్యాలయంలో సోమవారం జన్మభూమి సదస్సు ఏర్పాటు చేశారు. ఈ సమావేశానికి ప్రతిపక్ష వైఎస్సార్సీపీకి చెందిన ఎంపీటీసీ, జడ్పీటీసీలను పిలవకపోవడంతో వారు ఆగ్రహం వ్యక్తం చేస్తూ.. సదస్సును అడ్డుకోవడానికి యత్నించారు. దీంతో కోపోద్రిక్తులైన టీడీపీ కార్యకర్తలు వారితో వాగ్వాదానికి దిగి దాడికి యత్నించారు. దీంతో ఉద్రిక్త వాతావరణం నెలకొంది.