breaking news
jagannatha rathothsavam
-
జగన్నాయకుడి జనయాత్ర
ప్రపంచంలోనే అత్యంత పురాతనమైన, పూజనీయమైన హిందూ పండుగలలో ఒకటి జగన్నాథ రథయాత్ర. ప్రతి సంవత్సరం ఆషాఢ శుద్ధ విదియ నాడు పూరీ క్షేత్రంలో జరిగే జగన్నాథ రథయాత్రకు ఆలయంలో కొలువై ఉన్న మూలమూర్తులు ముగ్గురూ ఆలయం నుంచి బయటకు వచ్చి భక్తులను కలుసుకోవడానికి వెళతారు. ఈ రథయాత్రలో పాల్గొనడం, దానిని వీక్షించడం అనంతమైన పుణ్యఫలాలను చేకూరుస్తుందని ఆ గ్రంథాలు నొక్కి చెబుతున్నాయి.జగన్నాథ రథయాత్ర కేవలం పూరీకే పరిమితం కాదు. నేడు ఇది ఒక ప్రపంచవ్యాప్త వేడుకగా మారింది. పూరీ ప్రధాన కేంద్రం అయినప్పటికీ, ఈ ఉత్సవం ఇప్పుడు భారతదేశంలోని అహ్మదాబాద్, ముంబై, ఢిల్లీ, కోల్‌కతా, బెంగళూరు, హైదరాబాద్, లండన్, న్యూయార్క్, టొరంటో, సిడ్నీ వంటి ప్రపంచవ్యాప్తంగా ఉన్న అనేక ఇతర నగరాలలో కూడా జరుపుకుంటారు.రథయాత్ర రోజు తెల్లవారుజాము నుండి పూరీ నగరం మొత్తం భక్తిజనంతో నిండి΄ోతుంది. భారతదేశం, ప్రపంచవ్యాప్తంగా ఉన్న లక్షలాది మంది భక్తులు ఇక్కడికి వస్తారు. ముందుగా దేవతా విగ్రహాలను పహండి అనే ఆచారంతో గుడి నుండి బయటకు తీసుకువచ్చి రథాలపై అధిష్టింపజేస్తారు. అప్పుడు శంఖారావాలు, మేళాలు, జయజయ ధ్వానాలతో ఆప్రాంతమంతా మారుమోగుతుంది.ప్రతి దేవతకు ఒక ప్రత్యేకమైన రథం ఉంటుంది. జగన్నాథుని రథం పేరు నందిఘోష. ఇది ఎరుపు, పసుపు రంగులలో ఉంటుంది. దీనికి 16 పెద్ద చక్రాలు ఉంటాయి. బలభద్రుని రథం పేరు తాళధ్వజ. ఇది ఆకుపచ్చ, ఎరుపు రంగుల లో ఉంటుంది. దీనికి 14 చక్రాలు ఉంటాయి. సుభద్రాదేవి రథం పేరు దర్పదలన లేదా దేవదలన. ఇది నలుపు, ఎరుపు రంగులో ఉంటుంది. దీనికి 12 చక్రాలు ఉంటాయి. ఈ రథాలు చూడటానికి ఎంతో వైభవంగా ఉంటాయి.జగన్నాథ రథయాత్ర మనకు నేర్పే గొప్ప పాఠం సమానత్వం, కరుణ, భక్తి. జగన్నాథుడు భక్తులను కలుసుకోవడానికి స్వయంగా గుడి నుండి బయటకు వస్తారు. రాజు కూడా బంగారు చీపురుతో సేవ చేస్తారు. అందరూ కలిసి ఒకే తాడు లాగుతారు. ఇక్కడ చిన్న పెద్ద, పేద గొప్ప అనే తేడా ఉండదు. అందరూ ‘జై జగన్నాథ్’ అనే ఒక్క నామంతో ఒక్కటవుతారు. అందుకే ఇది ప్రపంచంలోనే అత్యంత సమ్మిళితమైన హిందూ ఉత్సవం. రథాలను లాగడంప్రారంభించే ముందు ఒక అత్యంత ముఖ్యమైన ఆచారం జరుగుతుంది. దానిపేరు ఛేరా పహారా. జగన్నాథుని ముఖ్యసేవకుడిగా భావించే పూరీ గజపతిరాజు ఈ ఆచారాన్ని నిర్వహిస్తారు. రాజు బంగారు చీపురును చేతిలో పట్టుకుని చం దనం నీటిని చల్లుతూ మూడు రథాల వేదికలను స్వయంగా ఊడుస్తారు. తర్వాత రథాల చుట్టూ ప్రదక్షిణ చేసి దీపం వెలిగిస్తారు. ఛేరా పహారా తర్వాత ప్రధాన పండా ‘జై జగన్నాథ్’ అని గట్టిగా నినాదం ఇస్తారు. వెంటనే వేలాదిమంది భక్తులు తాళ్లను పట్టుకుని రథాలను లాగడం మొదలుపెడతారు. మొదట బలభద్రుని రథం, తర్వాత సుభద్రాదేవి రథం, చివరగా జగన్నాథుని నందిఘోష రథం కదులుతుంది.ఈ రథాలు మూడు కిలోమీటర్ల దూరంలో ఉన్న గుండిచా ఆలయానికి వెళతాయి. ఇది జగన్నాథుని మేనత్తగారి ఇల్లని నమ్ముతారు. అక్కడ తొమ్మిది రోజుల పాటు దేవతలు విడిది చేస్తారు. ఈ తొమ్మిది రోజులు భక్తులు స్వామిని అక్కడే దర్శించుకుంటారు. గుండిచా ఆలయంలో స్వామికి ప్రత్యేక పూజలు, నైవేద్యాలు సమర్పిస్తారు.తొమ్మిది రోజుల తర్వాత దేవతలు తిరిగి తమ ప్రధాన ఆలయానికి వస్తారు. ఈ తిరుగు ప్రయాణాన్ని బహుదా యాత్ర అంటారు. బహుదా యాత్ర తర్వాత 11వ రోజు సునావేశం అనే వేడుక జరుగుతుంది. ఈ రోజు దేవతలను బంగారు ఆభరణాలు, బంగారు కిరీటాలు, బంగారు చేతులు, బంగారు కాళ్ళతో అలంకరిస్తారు. చివరగా 12వ రోజు నీలాద్రి విజయం అనే ఆచారంతో దేవతలు తిరిగి గర్భగుడిలోకి ప్రవేశిస్తారు. దానితో రథయాత్ర ముగుస్తుంది. – కుందా శ్రీ కృష్ణ శాస్త్రి -
వైభవంగా.. జగన్నాథ రథోత్సవం
అనంతపురం కల్చరల్ : ఇస్కాన్ ఆధ్వర్యంలో శనివారం సాయంత్రం జరిగిన జగన్నాథ రథయాత్రలో వివిధ ప్రాంతాల నుంచి విచ్చేసిన ఇస్కాన్ కార్యకర్తలు, భక్తులతో ‘అనంత’ జనసంద్రంగా మారింది. ఇస్కాన్ 9వ వార్షికోత్సవంలో భాగంగా సాగిన రథయాత్రలో వందలాది మంది భక్తులు విష్ణుసహస్రనామ జపం, హరేరామ హరే కృష్ణ అంటూ ఇస్కాన్ కార్యకర్తల నామస్మరణతో నగర పురవీధులు మార్మోగాయి. స్థానిక కేఎస్ఆర్ కళాశాల వద్ద ఏర్పాటు చేసిన బహిtరంగ సభా వేదిక నుంచి 108 పవిత్ర కళశాలతో జగన్నాథుడి రథయాత్ర బయలుదేరి, సప్తగిరి సర్కిల్, సుభాష్ రోడ్, టవర్‌క్లాక్, ఆర్ట్స్ కళాశాల మైదానం, శ్రీకంఠం సర్కిల్, తాడిపత్రి బస్టాండు, పాతూరు వీధుల మీదుగా కళాశాల ప్రాంగణం చేరుకుంది. రథానికి నగరవాసులు అడుగుడుగునా కర్పూర హారతులు ఇచ్చారు. జిల్లాలోని పలు ఆధ్యాత్మిక సంస్థలే కాకుండా అధికార, అనధికారులు రథాన్ని లాగడానికి పోటీ పడ్డారు. రథయాత్రను జిల్లా ఎస్పీ ఎస్వీ రాజశేఖరబాబు ముఖ్యఅతిథిగా హాజరై ప్రారంభించారు. దక్షిణభారత దేశ ఇస్కాన్ మందిరాల అధ్యక్షుడు సత్య గోపీనాథ్ స్వామీజీ ఆధ్యాత్మిక సందేశమిచ్చారు. మూడోసారి అనంత వేదికగా జగన్నాథ రథయాత్ర సాగినట్లు చెప్పారు. దేశవ్యాప్తంగా ఉన్న 108 పవిత్ర నెల్లూరు, తిరుపతి, బెంగళూరు, హైదరాబాదు, రాజమండ్రి తదితర ఇస్కాన్ మందిరాల నుంచి విచ్చేసిన నిర్వాహకులు, ఇస్కాన్ స్థలదాత డా.కేశన్న, స్థానిక టీటీడీ ధార్మిక మండలి జిల్లా అధ్యక్షుడు శ్రీపాద వేణు, ఫ్లెక్స్ రమణ, ఇంటెల్ ప్రతాపరెడ్డి, చాంబర్ ఆఫ్ కామర్స్ ప్రధాన కార్యదర్శి రంగారెడ్డి తదితరులు రథయాత్రలో పాల్గొన్నారు.


