'రూ.1231 కోట్లు ఇవ్వకుంటే చంపేస్తాం'
జెరూసలెం: ఇప్పటివరకు బందీల ప్రాణాలు తీసిన వీడియోలను ఆన్లైన్ లో పెట్టిన ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాదులు ఇప్పుడు మరో పంథా ఎంచుకున్నారు. తాము డిమాండ్ చేసిన డబ్బు ఇవ్వకపోతే తమ దగ్గర బందీలుగా ఉన్నవారి ప్రాణాలు తీస్తామంటూ వీడియో ద్వారా బెదిరించారు. ఇద్దరు జపాన్ పౌరులను బందీలుగా పట్టుకున్న ఐఎస్ ఉగ్రవాదులు 200 మిలియన్ డాలర్లు(సుమారు రూ.1231 కోట్లు) డిమాండ్ చేశారు. తాము అడినంత డబ్బు ఇవ్వకపోతే వారిని చంపేస్తామమని బెదిరించారు.
నల్లదస్తులు ధరించిన ఉగ్రవాది చేతిలో కత్తితో నిల్చోగా, ఇద్దరు బందీలను మోకాళ్లపై కూర్చొబెట్టినట్టు వీడియోలో ఉంది. ఉగ్రవాదిలో ఇంగ్లీషులో మాట్లాడాడు. 72 గంటల్లో తాము డిమాండ్ చేసిన మొత్తం ఇవ్వాలని డిమాండ్ చేశాడు. ఇస్లామిక్ రాజ్యానికి వ్యతిరేకంగా సైనిక కార్యక్రమాలు చేపడుతున్న అమెరికా నేతృత్వంలోని కూటమికి జపాన్ మద్దతు ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశాడు.
కాగా, ఉగ్రవాదుల హెచ్చరికలకు బెదిరేదిలేదని జపాన్ ప్రధాని షిజో అబె స్పష్టం చేశారు. బందీలుగా తమ పౌరులను వెంటనే విడిచిపెట్టాలని డిమాండ్ చేశారు. అయితే ఉగ్రవాదులు డిమాండ్ చేసిన 200 మిలియన్ డాలర్ల మొత్తాన్ని ఇస్లామిక్ ఉగ్రవాదులకు వ్యతిరేకంగా పోరాడుతున్న దేశాలకు ఇచ్చేందుకు ఆయన అంగీకరించడం గమనార్హం. అయితే ఇస్లామిక్ ఉగ్రవాదులు ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నందువల్లే డబ్బు డిమాండ్ చేస్తున్నారని విశ్లేషకులు అంటున్నారు.