breaking news
International vegan Day
-
వేగనిజం అంటే ఏంట్రా అబ్బాయ్?
‘నా ఫ్రెండ్ వేగన్ నాన్నా’ అంటాడు కొడుకు. ‘అంటే ఏంటిరా?’ అంటాడు తండ్రి. ‘పాలు, పెరుగు కూడా ముట్టడు నాన్నా’ ‘అదేంటి.. వాడూ శాకాహారేగా?’ ‘శాకాహారమే నాన్నా.. కానీ అందులో నెక్ట్స్ లెవల్!’ ఇలాంటి కాన్వర్సేషన్స్ ఈ మధ్య మన ఇళ్లలో చాలా కామన్ గా వినిపిస్తున్నాయి. జెన్జి ‘వేగనిజం’ వైపు అడుగులు వేస్తోంది. ‘వరల్డ్ వేగన్ డే’ సందర్భంగా అసలు ఈ కథేంటో ఓసారి చూద్దాం.‘ఒరేయ్... అసలు పాలు కూడా తాగని శాకాహారం ఎప్పుడు స్టార్ట్ అయిందిరా? నిన్న మొన్న మీ జనరేషన్ తెచ్చిందేనా?’ అని అడిగాడు తండ్రి టీ కప్పు చేతిలోకి తీసుకుంటూ. కొడుకు నవ్వి ‘లేదు నాన్నా. దీని వెనుక పెద్ద హిస్టరీనే ఉంది. జంతువుల నుంచి వచ్చే ఏ వస్తువూ వాడకూడదనే థాట్ ఎప్పటి నుంచో ఉన్నా దీనికి ‘వేగన్’ అనే పేరు పెట్టింది మాత్రం 1944లో డోనాల్డ్ వాట్సన్ అనే బ్రిటిష్ టీచర్. ‘వెజిటేరియన్’ అనే వర్డ్ లోంచి మొదటి మూడు, చివరి రెండు అక్షరాలు కట్ చేసి ఈ పేరు పెట్టాడు. అతను మరో ఐదుగురితో కలిసి ఆ సంవత్సరం నవంబర్ 1న ‘వేగన్ సొసైటీ’ స్థాపించాడు. 1994లో దానికి యాభై ఏళ్లు నిండిన సందర్భంగా నవంబర్ 1ని ‘వరల్డ్ వేగన్ డే’గా డిక్లేర్ చేశారు’ అని హిస్టరీ క్లాస్ పీకాడు కొడుకు.ఎందుకు ఈ పట్టుదల?‘అంతా బాగానే ఉంది కానీ కమ్మటి పాలు, పెరుగు, నెయ్యి తింటే ఏమొచ్చిందిరా? వాటిని కూడా ఎందుకు వదిలేయడం?’ అని అడిగాడు తండ్రి కాస్త ఆశ్చర్యంగా. ‘అక్కడే ఉంది లాజిక్ నాన్నా. దీనికి మెయిన్ రీజన్ మూగజీవులపై కరుణ. డెయిరీ ఇండస్ట్రీస్‌లో పాలు పితకడం కోసం పశువులను ఎంత హింసిస్తారో మనకు తెలుసు. పైగా దూడలకు పాలు దక్కకుండా చేస్తారు. జంతువులను ఆహారయంత్రాల్లా చూడొద్దనేది వేగన్స్ వాదన. అంతేకాదు, పర్యావరణ రక్షణ కూడా ఇందులో ఉంది. పాల కోసం, మాంసం కోసం అధిక సంఖ్య లో పశువుల పెంపకం వల్ల గ్లోబల్ వార్మింగ్ పెరిగిపోతోందని సైంటిస్టులు చెబుతున్నారు. అందుకే కోహ్లీ, సమంత లాంటి సెలబ్రిటీలు ఈ లైఫ్‌స్టైల్‌కి షిఫ్ట్ అయిపోయారు’ అని వివరించాడు కొడుకు.మంచి చెడ్డలేంటి?‘సరే.. సెలబ్రిటీలు ఓకే.. మనలాంటి వాళ్లకు దీనివల్ల లాభమా నష్టమా?’ తండ్రి అసలు పాయింట్‌కి వచ్చాడు. ప్లాంట్ బేస్డ్ ఫుడ్ తీసుకోవడం వల్ల మంచి ప్రయోజనాలు ఉన్నాయి నాన్నా. కొలెస్ట్రాల్ తగ్గుతుంది, వెయిట్ కంట్రోల్లో ఉంటుంది. గుండె జబ్బులు, డయాబెటిస్ వచ్చే ఛాన్స్ తక్కువ. కానీ.. నాణేనికి ఇంకోవైపు ఇందులో కొన్ని తిప్పలు కూడా ఉన్నాయి. పాలు, గుడ్లు పూర్తిగా మానేయడం వల్ల విటమిన్ బి12, ఐరన్, కాల్షియం లోపించే ప్రమాదం ఉంది. ముఖ్యంగా బి12 కేవలం జంతువుల ద్వారా వచ్చే ఫుడ్‌లోనే ఎక్కువగా ఉంటుంది. కాబట్టి వేగన్స్ కచ్చితంగా సప్లిమెంట్లు టాబ్లెట్స్ రూపంలో వాడాలి. లేదంటే నీరసం, అలసట వచ్చేస్తాయి’ అని ప్రాక్టికల్ ప్రాబ్లమ్స్ చెప్పాడు.‘అమ్మో! పాలు, పెరుగు లేని సండేని మనం ఊహించుకోలేం గానీ పర్యావరణం కోసం ఆ కఠినమైన డైట్ ఫాలో అవుతున్న వాళ్ల ఓపికను మెచ్చుకోవాల్సిందేరా’ అన్నాడు తండ్రి పేపర్ మడత పెడుతూ. నిజమే, వేగన్‌గా మారాలా వద్దా అనేది ఎవరి పర్సనల్ ఇష్టం వాళ్లది. కానీ మూగజీవులను ప్రేమించడం, పర్యావరణాన్ని కాపాడుకోవడం మాత్రం మనందరి బాధ్యత. చిన్న డౌటు‘ఇందులో నిజాయితీ ఎంతరా? ఏదో ఫ్యాషన్ గా, స్టైల్‌గా చెప్పుకోవడానికి ఇలా చేస్తుండొచ్చు’ అన్నాడు తండ్రి అనుమానంగా.‘నువ్వు చెప్పింది కొంతవరకు కరెక్టే నాన్నా. ఈ మధ్య సోషల్ మీడియాలో రీల్స్ కోసం, తాము చాలా ‘అప్డేటెడ్’ అని చూపించుకోవడానికి వేగనిజం బోర్డు తగిలించుకునే వాళ్లు ఉన్నారు. దాన్ని ‘ఫ్యాడ్ వేగనిజం’ అంటారు. కానీ అందరూ అలా లేరు నాన్నా. నిజాయితీగా తమ లైఫ్‌స్టైల్ మార్చుకుని జీవిస్తున్నారు. ఇప్పుడు కార్పొరేట్ కంపెనీలు కూడా ప్లాంట్ బేస్డ్ మీట్, వేగన్ కాస్మెటిక్స్ మార్కెట్లోకి తెస్తున్నాయంటే దీని వెనక ఫ్యాషన్ మాత్రమే లేదు స్ట్రాంగ్ బిజినెస్... నమ్మకం కూడా ఉన్నాయి’ అని క్లారిటీ ఇచ్చాడు కొడుకు. -
వెగానిజం..
సిటీలో వెగానిజం ఈ మధ్య బాగా పుంజుకుంటోంది. పాలు, మాంసం, గుడ్లు, తేనెలకు బదులు వృక్షాధారిత ఉత్పత్తులను వాడటం అనే వెగానిజంను విశ్వసించే వారి సంఖ్య క్రమక్రమంగా పెరుగుతోంది. ఈ రోజు ఇంటర్నేషనల్ వెగాన్స్ డే సందర్భంగా వెగాన్స్ ఆధ్వర్యంలో నెక్లెస్‌రోడ్‌లో ప్రదర్శన సైతం నిర్వహిస్తున్నారు. బానిసత్వం, రేసిజం, లింగవివక్ష స్థాయిలో జరపవలసిన ఉద్యమం వెగానిజం అనే భావన వెగనిస్టులది. జంతువులను కష్టపెట్టకుండా, మొక్కల నుంచి వచ్చే వాటిని మాత్రమే ఆహారంగా తీసుకుంటే మొక్కలకు బాధ కలగదా అంటే.. నరాల వ్యవస్థ లేని మొక్కలు బాధను గ్రహించే అవకాశం లేదంటారు. అలాగే ఒక ఆకుని తెంపితే మరో ఆకు పుట్టుకొస్తుంది. కానీ జంతువును చంపటం ద్వారా అవి మరలా వచ్చే అవకాశం ఉండదని వీరు గుర్తు చేస్తారు. పాలూ మాంసాహారమే... ప్రతి ప్రాంతంలో పాలు, పెరుగు సహా జంతు సంబంధిత ఆహారం ఆహారంలో భాగమైపోయింది. అలాంటప్పుడు వెగాన్గా మారటం అంత సులువైన విషయం కాదు. స్వీట్లు, చాక్లెట్స్, కేక్స్, ఐస్‌క్రీం, పెరుగు, పనీర్, చీజ్, పిజ్జా, టీ, కాఫీ ఇలా రోజులో తినే చాలా పదార్థాలను త్యజించాల్సి ఉంటుంది. అయితే అలవాటయిన ఈ రుచులను పూర్తిగా తినటం మానెయ్యాల్సిన పనిలేదని సిటీకి చెందిన వెగాన్స్ అంటున్నారు. మొక్కల నుంచి లభించే వాటి ద్వారా ఆయా పదార్థాలను తయారుచేసుకుంటే సరిపోతుందంటున్నారు. ఇది సరికాదు.. భూమి మీద ప్రతి జీవి వాటికి సంబంధించిన ప్రత్యేక కారణంతో మనుగడ సాగిస్తోంది. అవి మనుషుల కోసం భూమి మీదకు రాలేదు. ఇంట్లో ఒక జంతువును పెట్గా ప్రేమిస్తూ, ఆహారంగా మరో జంతువును బలిచేయడం సరైనదేనా? అని ప్రశ్నిస్తున్న వెగాన్స్... పాలు, పాల సంబంధిత ఆహారాన్ని మానేస్తే శరీరానికి కావలసిన క్యాల్షియం అందదు అనడం అపోహేనని, మొక్కల నుంచి మానవ శరీరానికి కావలసిన అన్ని పోషకాలు సమృద్ధిగా లభిస్తాయని సోదాహరణంగా వివరిస్తున్నారు. పాలు, పాలసంబంధిత పదార్థాలు లేకుండా నోరూరించే చాక్లెట్ కప్స్, కుకీస్, ఐస్‌క్రీం, పనీర్ లాంటివి సైతం తయారు చేసుకోవచ్చునంటున్నారు. వంటలున్నాయి.... - పాలతో కాకుండా పల్లీలతో చేసిన పెరుగు, పెరుగన్నం.. - సోయాబీన్స్‌తో తయారైన పనీర్ మ్యాంగో ఐస్‌క్రీం - కాజూ కట్లి - జీడిపప్పు, చక్కెరతో చేసినది - వీగన్ చాక్లెట్ బాల్స్ - కర్జూరం, కొకోవా పొడి, నట్స్ కలిపి తయారు చేసింది. - బాదం పాలు, చాక్లెట్ చిప్స్, మొక్కజొన్న ఫ్లాక్స్ తో చేసే చాక్లెట్ కప్. పాలు తాగడం అంటే పాపం చేయడమే.. మనిషి తప్ప భూమి మీద ఏ జీవి కూడా మరో జీవి పాలు తాగదు. ఆవులు, గేదెలు తమ సంతానానికి ఇవ్వవలిసిన పాలను మనుష్యులు తాగేస్తున్నారు. అంతేకాకుండా పాల ఉత్పత్తి పెరగడానికి ఆ జంతువులను నానారకాల యాతనలకు గురిచేస్తున్నారు. జీవితాంతం ఆడ గేదెలు సంతానోత్పత్తి జరిపేందుకు రకరకాల ఇంజెక్షన్లు ఇస్తున్నారు. ఇక నేరుగా చంపి, వంటకు సిద్ధం చేసే జంతువుల గురించి చెప్పేదేముంది. ఇలా జంతువులను అనేక రకాలుగా కష్టపెట్టకుండా ఆహారాన్ని సమకూర్చుకోవటం వీలవుతుందని, ఈ ఆలోచనను విస్తృతంగా ప్రచారం చేయాలనుకుంటున్నారు వెగాన్స్. దేశవ్యాప్తంగా వివిధ నగరాల్లో వెగాన్స్ కమ్యూనిటీ క్లబ్బులు కూడా ఏర్పాటు చేసి మొక్కలకు సంబంధించిన ఆహారం గురించి అవగాహన పెంపొందిస్తున్నారు. - ఓ మధు


