breaking news
International TV Series
-
హలో హాలీవుడ్
గతంలో కొంతకాలం సినిమాలకు విరామం ఇచ్చి పర్సనల్ లైఫ్‌ను ఎంజాయ్ చేశారు శ్రుతీహాసన్. లండన్‌లో కొన్ని మ్యూజిక్ షోలు నిర్వహించారు. యాక్టింగ్‌కు ఇచ్చిన విరామానికి ఫుల్స్టాప్ పెట్టి మళ్లీ యాక్టింగ్‌పై ఫుల్ ఫోకస్ పెట్టారు. తమిళంలో విజయ్ సేతుపతితో ఓ సినిమా, తెలుగులో రవితేజతో ఓ సినిమా అంగీకరించారు శ్రుతీహాసన్. తాజాగా ఓ ఇంటర్నేషనల్ టీవీ సిరీస్‌లోనూ నటిస్తున్నారని తెలిసింది. హాలీవుడ్లో ‘బోర్న్’ సిరీస్‌లో 5 చిత్రాలు వచ్చాయి. ఇప్పుడు ఈ చిత్రాల తరహాలోనే ‘ట్రెడ్ స్టోన్’ అనే సిరీస్‌ను రూపొందిస్తున్నారు. మైఖేల్ ఫోర్బ్స్, మైఖేల్ గ్యాస్టన్, బ్రైన్ జె. స్మిత్ ముఖ్య పాత్రల్లో నటించనున్నారు. ఇటీవలే బుడాపెస్ట్‌లో ఈ సిరీస్ ప్రీ ప్రొడక్షన్ స్టార్ట్ అయింది. ఇంటర్నేషనల్ స్పై మిషన్ కథాంశంగా రూపొందనున్న ఈ సిరీస్‌లో శ్రుతీహాసన్ ఢిల్లీకి చెందిన నీరా పటేల్ పాత్రలో కనిపిస్తారు. పగలంతా హోటల్లో వెయిట్రెస్‌గా కనిపించి రాత్రి హత్యలు చేసే కిల్లర్‌గా మారతారట. త్వరలోనే ఈ సిరీస్ షూటింగ్లో శ్రుతీహాసన్ పాల్గొననున్నారు. యూఎస్ టీవీ సిరీస్‌లో నటించనున్న తొలి సౌతిండియన్ హీరోయిన్ కూడా శ్రుతీహాసనే కావడం విశేషం. ఇంతకుముందు ‘క్వాంటికో’ అనే టీవీ సిరీస్‌లో ఉత్తరాది భామ ప్రియాంకా చోప్రా కనిపించిన సంగతి గుర్తుండే ఉంటుంది. -
త్వరలో... టాక్ షోలో ప్రియాంక
ప్రియాంకా చోప్రా పేరు ఇప్పుడు అంతర్జాతీయంగా మారుమోగిపోతోంది. అమెరికాలోని టెలివిజన్ నెట్వర్క్ ‘ఏ.బి.సి’లో ఇటీవలే మొదలైన ఇంటర్నేషనల్ టీవీ సిరీస్ ‘క్వాంటికో’లో ఆమె పోషిస్తున్న పాత్ర ఒక్కసారిగా విదేశాల్లోనూ విపరీతమైన పాపులారిటీ తెచ్చిపెట్టింది. ‘కలిసొచ్చే కాలానికి నడిచొచ్చిన కొడుకు’ అన్నట్లుగా తాజా ‘క్వాంటికో’ ఎఫెక్ట్‌తో ఈ మాజీ ప్రపంచ సుందరికి మరో ఇంటర్నేషనల్ ఆఫర్ తాజాగా వచ్చింది. ‘క్వాంటికో’ను నిర్మిస్తున్న ‘ఏ.బి.సి’ నిర్మాణ సంస్థే ఆమెతో ఒక కొత్త ప్రాజెక్ట్‌కు ఒప్పందం కుదుర్చుకుంది. విశ్వసనీయ సమాచారం ప్రకారం ‘ఏ.బి.సి’ చేసే ఒక సెలబ్రిటీ టాక్‌షోకు ప్రియాంకా చోప్రా వ్యాఖ్యాతగా వ్యవహరించనున్నారు. త్వరలోనే ఆ టాక్ షో పనులు మొదలు కానున్నాయి. ఒకపక్క ‘బాజీరావ్ మస్తానీ’ లాంటి హిందీ చిత్రాల్లో పాత్రలతో బిజీగా ఉన్న ప్రియాంక ఈ సరికొత్త ఆఫర్‌ను ఆనందంగా ఒప్పుకున్నట్లు సమాచారం. అమెరికన్ టీవీ సిరీస్ ‘క్వాంటికో’లో అమెరికన్ గూఢచారి సంస్థ ‘ఎఫ్.బి.ఐ’ ఏజెంట్‌గా నటిస్తున్న ప్రియాంక తనకు విదేశాల్లో లభిస్తున్న ఆదరణ చూసి, ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. ముందుగా ఈ టీవీ సిరీస్‌లో ‘ఒకటో సీజన్’ను 13 భాగాలతో ముగించాలని అనుకున్నారు. తీరా, వీక్షకుల నుంచి వస్తున్న భారీ స్పందన చూసి, మరో ఆరు భాగాలు పొడిగించాలని తీర్మానించారు. అంటే, మొత్తం 19 భాగాలుగా ‘క్వాంటికో’ అలరిస్తుందన్న మాట. ప్రతి ఆదివారం అమెరికాలోని టీవీలో ప్రసారమవుతున్న ‘క్వాంటికో’ సిరీస్ కోసం ఆమె దాదాపు 6 నెలల టైమ్ కేటాయించారు. ప్రియాంకా చోప్రా ప్రస్తుతం న్యూయార్క్, మాంట్రియల్ లాంటి ప్రాంతాల్లో షూటింగ్లో పాల్గొంటున్నారు. డిసెంబర్ కల్లా మన దేశానికి తిరిగి రానున్న 33 ఏళ్ళ ఈ వెండితెర బాక్సింగ్ రాణి ఆ వెంటనే ‘బాజీరావ్ మస్తానీ’ సినిమా ప్రచారంలో, ‘జై గంగాజల్’ సినిమా చిత్రీకరణ, ప్రమోషన్లో బిజీ కానున్నారు. ‘‘ఎంత బిజీగా ఉన్నా, ఎలాగోలా డేట్స్ సర్దుబాటు చేసుకొని, ఈ కొత్త సెలబ్రిటీ టాక్ షో కూడా చేయాలని ప్రియాంకా చోప్రా భావిస్తున్నారు’’ అని ఆమె సన్నిహిత వర్గాలు వెల్లడిం చాయి. ఇంకేం మరో లక్కీఛాన్స్ అన్నమాట.