breaking news
Improvised Explosive Devices
-
అప్పుడే అమర్చి పేల్చాడా?
న్యూఢిల్లీ: యావత్ భారతావని ఉలిక్కిపడేలా చేసిన ఎర్రకోట వద్ద పేలుడు ఘటనలో డాక్టర్ ఉమర్ నబీ ఒక్కడే ఇంతటి మారణహోమం సృష్టించాడా? లేదంటే మరికొందరు ఆరోజు అదే కారులో వచ్చి పరారయ్యారా? అనే అనుమానాలు జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఏ)లో ఎక్కువయ్యాయి. దీంతో కేసు దర్యాప్తును మెరుపువేగంతో ముందుకు తీసుకెళ్తున్నారు. నవంబర్ పదో తేదీ మధ్యాహ్నం నుంచి సాయంత్రందాకా మూడు గంటలపాటు కారులో నబీ ఏంచేశాడు? అతని వెంట ఇంకా ఎంత మంది ఉన్నారు? ఉంటే వాళ్లు ఆ తర్వాత ఏమయ్యారు? అనే ప్రశ్నలకు సమాధానాలకు వెతికేపనిలో అధికారులు తలమునకలయ్యారు. కారు మూడు గంటలపాటు పార్కింగ్‌లోనే ఉండగా చుట్టూ వాహనాలు పార్కింగ్‌లోకి వస్తూ పోతూ ఉన్నట్లు తేలడంతో ఆయా వాహనాల డ్రైవర్లు, యజమానులను అధికారులు ప్రశ్నించడం మొదలెట్టారు. సమీప వాహనాలను స్వా«దీనంచేసుకున్నారు. కారులో ఉమర్ ఏంచేశాడు? ఏదైనా బాంబులాంటిది బిగించడం చూశారా? కారులో ఇద్దరు, అంతకంటే ఎక్కువ మంది ఉన్నారా? అనే ప్రశ్నలను అడిగినట్లు సమాచారం. బాంబుల తయారీలో ఉమర్‌కు నైపుణ్యం పేలుడుపదార్థాలతో ఇంప్రూవైజ్డ్ ఎక్స్‌ప్లోజివ్ డివైజ్(ఐఈడీ) తయారుచేయడంలో డాక్టర్ ఉమర్ నైపుణ్యం సాధించాడని దర్యాప్తు ఉన్నతాధికారి ఒకరు వెల్లడించారు. విదేశీ హ్యాండ్లర్ నుంచి అందుకున్న బాంబుతయారీ విధాన పీడీఎఫ్ ఫైళ్లు, ఓపెన్ ఇంటర్నెట్లో అందుబాటులో ఉన్న అక్రమ సమాచారంతో బాంబుల తయారీలో ఉమర్ నిపుణుడిగా మారాడని తెలుస్తోంది. అమ్మోనియం నైట్రేట్, పెట్రోలియం, డిటోనేట్ ఉపకరణాలతో వీటిని తయారుచేసి ఉండొచ్చని చెబుతున్నారు. వీటి సాయంతో ఐఈడీని కేవలం 5–10 నిమిషాల్లో తయారుచేయొచ్చు. ఎర్రకోట పార్కింగ్ స్థలంలోనే ముడిపదార్థాలతో అప్పటికప్పుడు బాంబు తయారుచేసి ఉంటాడని అనుమానిస్తున్నారు. పేలుడు తీవ్రతను బట్టి ఆరోజు రెండు కేజీల అమ్మోనియం నైట్రేట్, పెట్రోలియం ఉపయోగించి ఉంటారని ఫోరెన్సిక్ నిపుణులు అంచనావేస్తున్నారు. ఆదివారం తోటి డాక్టర్లు అరెస్ట్ కావడంతో హడావిడిగా ముందస్తు ప్లాన్‌లేకుండా ఉమర్ సోమవారం ఎర్రకోటకు వచ్చి ఉంటాడని పోలీసులు భావిస్తున్నారు. సాధారణంగా ఎర్రకోట సందర్శనలకు సోమవారం సెలవు. ఆరోజు పర్యాటకులు రద్దీ ఉండదు. రద్దీ లేనప్పుడు బాంబు పేల్చినా తీవ్రత పెద్దగా ఉండదని ఉమర్ భావించి ఉండొచ్చు. సాయంత్రం వేళ అయినా కనీసం ఛాందినిచౌక్ ప్రాంత కొనుగోలుదారులు, స్థానికులతో ఆ ప్రాంతం కిటకిటలాడితే అప్పుడు బాంబు పేలుద్దామనే ఆ 3 గంటలు ఉమర్ పార్కింగ్ ఏరియాలోనే వేచిచూశాడని పోలీసులు ఓ అంచనాకొచ్చారు. -
10 మంది తాలిబన్ తీవ్రవాదులు హతం
ఆఫ్ఘానిస్థాన్‌లోని హెల్మండ్ ప్రావెన్స్లో భద్రత దళాలు తీవ్రవాదుల ఏరివేత కార్యక్రమాన్ని చేపట్టాయి. అందులోభాగంగా 10 మంది తీవ్రవాదులు హతమైయ్యారు. మరో 20 మంది తీవ్రవాదులు గాయపడ్డారని భద్రత దళ ఉన్నతాధికారులు శుక్రవారం ఇక్కడ వెల్లడించారు. అనంతరం భద్రత దళాలు స్థానికంగా చేపట్టిన తనిఖీలలో 71 శక్తిమంతమైన పేలుడు పదార్థాలతోపాటు మోటర్ సైకల్ బాంబును స్వాధీనం చేసుకున్నామని చెప్పారు. స్వాధీనం చేసుకున్న బాంబులను నిర్వీర్యం చేసినట్లు తెలిపారు. హెల్మండ్ ప్రావెన్స్లోని సంగిన్ జిల్లాలోని ఫత్తే మహ్మద్ పించ్ పరిసర ప్రాంతాలలో తీవ్రవాదులు ఏరివేత కార్యక్రమాన్ని చేపట్టినట్లు వివరించారు. పోలీసులతో కలసి తీవ్రవాదులను మట్టుబెట్టినట్లు తెలిపారు. హెల్మండ్ ప్రావెన్స్ తాలిబన్లకు అత్యంత అనుకూలమైన ప్రాంతమని భద్రత దళ ఉన్నతాధికారి తెలిపారు. అయితే తీవ్రవాదులపై భద్రత దళాల దాడిపై తాలిబన్లు ఇప్పటి వరకు ఎటువంటి ప్రకటన చేయలేదు. -
చత్తీస్‌గఢ్ ఎన్నికల్లో పేలుళ్లకు మావోయిస్టుల వ్యూహం
చత్తీస్‌గఢ్‌లో అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో మావోయిస్టులు పంజా విసిరేందుకు ప్రయత్నిస్తున్నారు. మావోయిస్టుల ప్రాబల్యం ఎక్కువగా ఉండే బస్తార్ డివిజన్లో పోలింగ్ బూతులకు సమీపంలో అత్యంత శక్తివంతమైన పేలుడు పదార్థాలను అమర్చినట్టు పోలీసులకు సమాచారం అందింది. చత్తీస్‌గఢ్ దక్షిణాది జిల్లాలు నారాయణపూర్, కొండగాన్లో మందుపాతరలను గుర్తించి, వాటిని నిర్వీర్యం చేసేందుకు భద్రత దళాలు ఆపరేషన్ చేపట్టాయి. అలాగే ఎన్నికల సందర్భంగా పోలింగ్ సిబ్బంది, పోలీసులపై మావోయిస్టులు దాడి చేసే అవకాశం ఉన్న నేపత్యంలో భారీ భద్రత కల్పించనున్నారు. పోలింగ్ సెంటర్లను కలిపే మార్గాల్లో గస్తీని ముమ్మరం చేస్తున్నారు. వర్షాకాలంలో మందుపాతర్లు అమర్చడం తేలిక. దీంతో పోలీసులు అప్రమత్తమయ్యారు.


