breaking news
home minister nayani narasimha reddy
-
టెర్రరిజం, నక్సలిజం అరికడుతున్నాం: హోంమంత్రి
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో టెర్రరిజం, నక్సలిజాన్ని అరికడుతున్నామని రాష్ట్ర హోం మంత్రి నాయిని నర్సింహ్మారెడ్డి పేర్కొన్నారు. శుక్రవారం మారేడుపల్లి నెహ్రూపార్కులో 45 లక్షల రూపాయల వ్యయంతో 60 సీసీ కెమెరాల ప్రాజెక్టును మల్కాజిగిరి ఎంపీ సిహెచ్ మల్లారెడ్డి, ఎమ్మెల్యే సాయన్న, ఎమ్మెల్సీలతో కలిసి ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా హోం మంత్రి మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన అనంతరం రాష్ట్రంలో ఎన్నో మార్పులు వచ్చాయని, టెర్రరిజం, నక్సలిజం, రౌడీయిజం, గూండాయిజంలను అరికట్టగలిగామని నాయిని నర్సింహ్మారెడ్డి అన్నారు. సీసీ కెమెరాల ఏర్పాటుతో రాష్ట్రంలో క్రైమ్ రేటు పూర్తిగా తగ్గిపోయిందన్నారు. ప్రశాంత వాతావరణంలో హైదరాబాద్ నగరవాసులు గడుపుతున్నారని తెలిపారు. పోలీసు శాఖ మహిళలకు అధిక ప్రాదాన్యతనిస్తూ వారికి అండగా నిలుస్తుందన్నారు. సీసీ కెమెరాల్లో లభించిన ఆధారాలతో ఇప్పటివరకు 100 మందికి పైగా చైన్స్నాచర్లను, పీడీ యాక్టుపై జైలుకు పంపామని ఆయన పేర్కొన్నారు. ఎన్నో కేసుల్లో సీసీ కెమెరాలు కీలకంగా మారి నిందితులను పట్టించగలిగాయన్నారు. మరికొద్ది రోజుల్లో కమాండ్ కంట్రోల్ నిర్మాణం పూర్తవుతుందని, రాష్ట్రంలో ఎటువంటి సంఘటనలు జరిగినా నిమిషాల్లో నిందితులను పట్టుకోగలుగుతామన్నారు. బంగారు తెలంగాణ దిశగా రాష్ట్రం ముందుకు సాగుతుందని, ప్రజలందరు సహాయ సహకారాలు అందించాలని ఈ సందర్బంగా ఆయన కోరారు. సంఘవిద్రోహులను ప్రోత్సహించవద్దని ఆయన హితవుపలికారు. ప్రజాప్రతినిధులు సైతం సీసీ కెమెరాల ఏర్పాటుకు సహాయ సహకారాలు అందిస్తూ ముందుకు సాగడం హర్షించదగిన విషయమన్నారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీలు స్టీఫెన్సన్, ప్రభాకర్, నార్త్‌జోన్ డీసీపీ బి.సుమతి, ఏసీపీ శ్రీనివాసరావు, సీఐ ఉమామహేశ్వరరావు, పలువురు పాల్గొన్నారు. -
'ఎమ్మెల్యేగా పోటీ చేసిన హోంగార్డే కారణం'
హైదరాబాద్: వలంటరీగా సేవలందిస్తున్న హోంగార్డులను పర్మినెంట్ చేసే విషయమై సీఎం కేసీఆర్ సానుకూలంగానే ఉన్నారని రాష్ట్ర హోంమంత్రి నాయిని నర్సింహా రెడ్డి అన్నారు. హైదరాబాద్‌లోని పీపుల్స్‌ప్లాజాలో మంగళవారం జరిగిన ఓ కార్యక్రమంలో ఆయన మీడియా ప్రతినిథులు అడిగిన ప్రశ్నకు పైవిధంగా బదులిచ్చారు. హోంగార్డుల వేతనాన్ని రూ. తొమ్మిది వేల నుంచి 12 వేలకు పెంచడంతో పాటు వారికి డ్రెస్సులు, బస్సుపాస్‌లను కూడా ప్రభుత్వమే అందించేలా చర్యలు తీసుకుంటామన్నారు. హోంగార్డులకు ప్రమాదం సంభవిస్తే రూ. 5 లక్షల పరిహారమే అందేలా ఇన్సూరెన్స్ కవరేజీ వర్తింపచేశామని తెలిపారు. గతంలో హోంగార్డుగా పనిచేసి డిస్మిస్ అయి ఇండిపెండెంట్ ఎమ్మెల్యేగా పోటీచేసిన ఓ హోంగార్డు ఆందోళనకు దిగి అనవసర రాద్దాంతం చేసి పత్రికల్లో వార్తల్లో వ్యక్తిగా నిలవాలనుకుంటున్నాడని అన్నారు. అందరూ హోంగార్డులు సంతోషంగానే ఉన్నారని, ఎవరి విధులు వారు సక్రమంగానే నిర్వర్తిస్తున్నారని హోంమంత్రి వివరించారు. సరైన సమయం వచ్చినప్పుడు హోంగార్డులను పర్మినెంట్ చేసేందుకు సీఎం కేసీఆర్ సానుకూలత వ్యక్తం చేశారని తెలిపారు. -
నియోజకవర్గానికో అగ్నిమాపక కేంద్రం
హైదరాబాద్: ప్రతి నియోజకవర్గానికి ఒక అగ్నిమాపక కేంద్రం ఉండేలా చర్యలు తీసుకుంటామని రాష్ట్ర హోంమంత్రి నాయిని నర్సింహ్మరెడ్డి అన్నారు. కాటన్, జిన్నింగ్ మిల్లులు ఎక్కువగా ఉండే ప్రాంతాల్లో అవసరాన్ని బట్టి.. పత్తి రైతులు, మిల్లు యజమానులకు ఎటువంటి నష్టం జరగకుండా ఉండేందుకు రెండు నుంచి మూడు అగ్నిమాపక కేంద్రాలు ఏర్పాటుచేస్తామన్నారు. హైదరాబాద్‌లోని పీపుల్స్ ప్లాజా వద్ద తెలంగాణ రాష్ట్ర విపత్తుల అగ్నిమాపక శాఖ ఆధ్వర్యంలో రాష్ట్రవ్యాప్తంగా 100 మినీ వాటర్ టెండర్(మిస్ట్) వెహికల్స్‌ను ఆయన ప్రారంభించారు. అగ్నిమాపక శాఖను మరింత బలోపేతం చేసేందుకు సీఎం ఆలోచన చేస్తున్నారు. అందుకే భారీగా నిధులు ఇచ్చి ఆధునాతన పరికరాలు ఇస్తున్నారు. పెద్ద పెద్ద అగ్నిమాపక ప్రమాదాలు జరిగినప్పుడు ఆయా అపార్ట్‌మెంట్లోలకి వెళ్లేందుకు భారీ నిచ్చెనలు కూడా కొనుగోలు చేశారని తెలిపారు. 119 అగ్నిమాపక కేంద్రాలు అవసరముండగా 100 వరకు మంజూరు అయ్యాయి. గతంలో 94 ఉన్న ఈ కేంద్రాలను మరో ఆరింటికి పెంచారు. ఈ బైక్‌లను నడిపేందుకు ప్రొఫెషనల్ డ్రైవర్లు అవసరం లేదని, అందుబాటులో ఉన్న సిబ్బంది అగ్ని ప్రమాదం జరిగిందని సమాచారం రాగానే మినీ వాటర్ టెండర్ వెహికల్స్‌పై వెళ్లి అగ్ని కీలలను అదుపులోకి తీసుకరావచ్చని హోం కార్యదర్శి అనితా రాజేందర్ అన్నారు. గతేడాది హైదరాబాద్‌లో పరిచయం చేసిన 19 మినీ ఫైర్ టెండర్ వెహికల్స్ వల్ల మంచి ఫలితాలు రావడంతో ఈ విధానాన్ని రాష్ట్రమంతటికీ అమలుచేస్తున్నామని తెలంగాణ స్టేట్ డిజాస్టర్ రెస్పాన్స్ అండ్ ఫైర్ సర్వీసెస్ డెరైక్టర్ జనరల్ రాజీవ్ రతన్ అన్నారు. -
గ్యాంగ్ రేప్ ఘటనపై హోంమంత్రి సీరియస్
హైదరాబాద్ : చల్లూరు గ్యాంగ్ రేప్ ఘటనపై హోంమంత్రి నాయిని నరసింహా రెడ్డి సీరియస్ అయ్యారు. మంగళవారం ఆయన మాట్లాడుతూ.. గ్యాంగ్ రేప్ నిందితులను కఠినంగా శిక్షిస్తామని, కేసును వేగంగా దర్యాప్తు చేయాలని ఆదేశాలిచ్చినట్లు స్పష్టం చేశారు. ఈ ఘటనలో సకాలంలో స్పందించని ఎస్సైని సస్పెండ్ చేస్తున్నట్లు తెలిపారు. అలాగే జీవనోపాధి నిమిత్తం విదేశాలకు వెళుతున్న కార్మికుల కోసం తెలంగాణ ఓవర్సీస్ మ్యాన్ పవర్ లిమిటెడ్ వెబ్ సైట్‌ను నాయిని ఆవిష్కరించారు. ప్రైవేట్ ఏజెన్సీల ద్వారా విదేశాలకు వెళ్లి ఇబ్బందులు పడొద్దని ఈ సందర్భంగా మంత్రి కార్మికులకు విజ్ఞప్తి చేశారు. విదేశాలకు వెళ్లాలనుకునేవారు ఆన్ లైన్లో అప్లై చేసుకోవచ్చన్నారు. వచ్చే ఏడాది ఐదు వేల మందిని విదేశాలకు పంపుతామని మంత్రి తెలిపారు. -
సెంచరీ కొడతాం
* గ్రేటర్ ఎన్నికల్లో గెలుపుపై మంత్రుల ధీమా * టీఆర్ఎస్ బహిరంగ సభలో ఉత్సాహభరిత ప్రసంగాలు * 100 స్థానాల్లో విజయం ఖాయమని వెల్లడి సాక్షి, సిటీబ్యూరో: జీహెచ్ఎంసీ ఎన్నికల్లో కారు గుర్తు వంద సీట్లు గెలవబోతోందని హోంమంత్రి నాయిని నర్సింహారెడ్డి అన్నారు. శనివారం పరేడ్‌గ్రౌండ్స్ మైదానంలో టీఆర్ఎస్ ఆధ్వర్యంలో జరిగిన భారీ బహిరంగ సభ వేదిక మీద నుంచి ఆయన మాట్లాడారు. దేశంలో ఏరాష్ట్రంలో లేని అభివృద్ధి, సంక్షేమ పథకాలు కేసీఆర్ అమలు చేస్తున్నారన్నారు. గ్రేటర్ నగరాన్ని విశ్వనగరంగా తీర్చిదిద్దేందుకు, మురికి వాడలు లేని నగరంగా తీర్చిదిద్దేందుకు అహ ర్నిషలు కృషిచేస్తున్నారని చెప్పారు. గ్రేటర్లో 1.08 లక్షలమంది పేదలకు పట్టాలిచ్చిన ఘనత కేసీఆర్‌దేనన్నారు. పట్టుదల, సంకల్పబలం ఉన్న గొప్ప నాయకుడు కేసీఆర్ అని కొనియాడారు. నగరంలో ఉన్న ఎస్సీ,ఎస్టీ, బీసీల జీవితాల్లో వెలుగులు నింపేందుకు పలు సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తున్నారన్నారు. నగరానికి కృష్ణా, గోదావరి జలాల తరలింపు, 24 గంటల కరెంటు సరఫరా ఇచ్చారని గుర్తుచేశారు. ఇవేవీ గతంలో ఏ ముఖ్యమంత్రీ చేయలేదన్నారు. టీఆర్ఎస్తోనే నగరాభివృద్ధి: డిప్యూటీ సీఎం మహమూద్ అలీ బల్దియా పీఠంపై టీఆర్ఎస్ పార్టీ జెండా ఎగిరితేనే నగరం సర్వతోముఖాభివృద్ధి చెందుతుందని ఉప ముఖ్యమంత్రి మహమూద్ అలీ అన్నారు. ప్రస్తుతం నిధులు, విధులు, అధికారాలున్న పార్టీ టీఆర్ఎస్ మాత్రమేనన్నారు. మైనార్టీల సంక్షేమానికి ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. పేదలకు రూపాయికి కిలోబియ్యం, ఆసరా పింఛన్లు అమలు చేసిన ఘనత కేసీఆర్‌దేనన్నారు. తెలంగాణా మహాత్మ కేసీఆర్ ఆధ్వర్యంలోనే నగరం దేశంలో నెంబర్ వన్‌గా నిలుస్తుందన్నారు. విశ్వనగరం ఒక్క టీఆర్ఎస్కే సాధ్యమన్నారు. తప్పకుండా మెజార్టీ స్థానాలు సాధిస్తామని ఆయన ధీమా వ్యక్తం చేశారు. గులాబీ జెండా దూసుకుపోతోంది: మంత్రి తలసాని గ్రేటర్ ఎన్నికల్లో గులాబీ జెండా విజయం వైపు దూసుకుపోతోందని వాణిజ్య పన్నుల శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. కేసీఆర్ సంకల్పబలంతో చేపట్టిన అనేక కార్యక్రమాలు, పథకాలు నగరాన్ని విశ్వనగరంగా తీర్చిదిద్దుతాయన్నారు. చంద్రబాబు, కాంగ్రెస్ పార్టీలు అధికారంలో ఉన్నప్పుడు చేయనటువంటి అభివృద్ధి కార్యక్రమాలను నేడు విజన్ ఉన్న సీఎం కేసీఆర్ చేసి చూపుతున్నారని తెలిపారు. స్వచ్ఛ హైదరాబాద్ కార్యక్రమాన్ని చేపట్టి నగరంలో సమస్యల పరిష్కారానికి కృషిచేశారన్నారు. హుస్సేన్‌సాగర్, మూసీ నదులను కాలుష్య కాసారంగా మార్చిన ఘనత విపక్షాలదేనని విమర్శించారు. డబుల్ బెడ్రూమ్ ఇళ్ల పథకానికి కేంద్రం సహకారం అందిస్తోందని చెప్పిన బీజేపీ నేతలు...బీజేపీ పాలిత రాష్ట్రాల్లో ఈ పథకాన్ని ఎందుకు అమలు చేయడం లేదని ప్రశ్నించారు. జైళ్లకు వెళ్లొచ్చిన కొందరు ఛోటా నేతలు కేసీఆర్‌ను విమర్శిస్తున్నారన్నారు. గత పాలకుల ప్రశ్నలకు సమాధానం ఇచ్చేందుకు ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ ఒక్కరు చాలన్నారు. ఇతర ప్రాంతాల వారిని కడుపులో పెట్టుకుంటాం: మైనంపల్లి హన్మంతరావు తెలంగాణా రాష్ట్రం సాధించగానే ఇతర ప్రాంతాల వారిని ఇక్కడ నుంచి పంపిస్తారని విపక్షాలు దుష్ర్పచారం చేశాయని గ్రేటర్ టీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు మైనంపల్లి హన్మంతరావు అన్నారు. కానీ ముఖ్యమంత్రి కేసీఆర్ ఇతర ప్రాంతాల వారిని కడుపులో పెట్టుకుని చూసుకుంటామని హామీ ఇచ్చారని గుర్తు చేశారు. హైదరాబాద్‌లో ఉంటున్న వారంతా హైదరాబాదీయులే. రెండు రాష్ట్రాలు ఏర్పడడంతోనే ఏపీ, తెలంగాణా రాష్ట్రాలు అభివృద్ధి చెందుతున్నాయి. ఈవిషయాన్ని ప్రతి ఒక్కరూ గమనించాలని మైనంపల్లి విజ్ఞప్తి చేశారు. సైడ్‌లైట్స్ ⇒ సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్లో మూడు వేదికలు ఏర్పాటు చేశారు. ప్రధాన వేదికపై సీఎం సహా మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు ఇతర ప్రజాప్రతినిధులు ఆశీనులు కాగా, మధ్యలో ఏర్పాటు చేసిన రెండో వేదికపై గ్రేటర్ టీఆర్ఎస్ పార్టీ కార్పొరేటర్ అభ్యర్థులకు కేటాయించారు. మూడో వేదిక కళాకారులకు కేటాయించారు. ⇒ సాయంత్రం 4 గంటలకు ప్రారంభం కావాల్సిన టీఆర్ఎస్ సభ సాయంత్రం 5.30 గంటలకు సాంస్కృతిక కార్యక్రమాలతో ప్రారంభమైంది. ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ నేతృత్వంలోని కళాకారుల బృందం సుమారు గంటన్నర పాటు తమ ఆటాపాటలతో సభికులను ఉర్రూతలూగించారు. ⇒ ‘దేఖో హైదరాబాద్... అందమైన సికింద్రాబాద్’ అంటూ హైదరాబాద్ గొప్పతనాన్ని వివరిస్తూ పాడిన పాట అందరినీ ఉత్సాహ పరిచింది. బోనాల జాతర గొప్పతనాన్ని వివరిస్తూ ‘రామా రామా ఎల్లమ్మలో...’ అంటూ పాడిన పాటకు సభకు హాజరైన మహిళలు, చిన్నారులు ఉత్సాహంతో చిందేశారు. కొంతమంది పూనకంతో శివసత్తులు ఆడారు. ‘వీర తెలంగాణమా.. తిరుగబడ్డ గానమా...,ఉస్మానియా క్యాంపస్‌లో ఉదయించిన కిరణమా...’వంటి పాటలు కార్యకర్తల్లో ఉత్సాహాన్ని నింపాయి. ⇒ సభా ప్రాంగణానికి నాలుగు వైపులా కారు బెలూన్లను గాల్లో ఎగరేశారు. అవి సభికులను ఆకర్షించాయి. ⇒ ఎంపీ బాల్కా సుమన్ సభకు సమన్వయకర్తగా వ్యవహరించారు. పరేడ్‌గ్రౌండ్ బయట ఉన్న కార్యకర్తలను లోనికి రావాల్సిందిగా ఆహ్వానిస్తూ ఆయన పదేపదే విజ్ఞప్తి చేయడం కన్పించింది. కార్యకర్తలను అడ్డుకోవద్దని పదేపదే పోలీసులకు విజ్ఞప్తి చేశారు. ⇒ పాతబస్తీ నుంచి వచ్చిన ఓ అభిమాని టీఆర్ఎస్ పార్టీ, కారు గుర్తు, కేసీఆర్ ఫొటోతో తయారు చేసిన హెల్మెట్‌ను తలకు ధరించి అందరి దృష్టిని ఆకర్షించాడు. రాత్రి 7.55 నిమిషాలకు పార్టీ కార్యకర్తలకు అభివాదం చేసుకుంటూ సీఎం కేసీఆర్ సభా వేదికపైకి వస్తున్న సమయంలో మరో అభిమాని శంఖం పూరించి ఎన్నికల సమరానికి సిద్ధం అంటూ ప్రకటించాడు. ⇒ సీఎం కేసీఆర్ మాట్లాడుతూ ‘ఏపీ సీఎం చంద్రబాబు దగ్గర ఏమున్నది? నెత్తున్నదా...? కత్తిన్నదా..? ఆయనకు ఓటేస్తే హైదరాబాద్‌కు ఏమీ చేయలేడు’ అని చెప్పడంతో వేదికపై ఆశీనులైన సభికులతో పాటు అభిమానులు, కార్యకర్తలు ఘొల్లున నవ్వుకున్నారు. -
ప్రజలు కోరితే చీప్ లిక్కర్ బంద్ : హోంమంత్రి నాయిని
న్యూశాయంపేట (వరంగల్ జిల్లా) : ప్రజలు కోరితే చీప్ లిక్కర్ ప్రవేశ పెట్టే ప్రయత్నాన్ని విరమిస్తామని హోంశాఖ మంత్రి నాయిని నర్సింహారెడ్డి అన్నారు. శనివారం వరంగల్ నగరానికి వచ్చిన సందర్భంగా సర్క్యూట్ గెస్ట్‌హౌస్‌లో ఆయన విలేకరులతో మాట్లాడారు. గుడుంబా మహమ్మారితో గ్రామాల్లో అనేక మంది చనిపోతున్నారన్నారు. గుడుంబాతో ప్రతి గ్రామంలో 10 నుంచి 20 మంది దాకా మహిళలు చిన్న వయస్సులోనే వితంతువులు అవుతున్నారని మంత్రి ఆవేదన వ్యక్తం చేశారు. గుడుంబాను అరికట్టేందుకే చీప్ లిక్కర్‌ను ప్రవేశపెట్టేందుకు ప్రయత్నిస్తున్నామని తెలిపారు. వరంగల్ జిల్లాలో 265 గ్రామాల్లో అధికారయంత్రాంగం, ప్రజాప్రతినిధులు, ప్రజాసంఘాల కృషితో గుడుంబాకు వ్యతిరేకంగా పోరాటం చేసి నాటు సారా ముట్టకుండా చేశారని తెలిపారు. అదే స్ఫూర్తితో రాష్ట్రంలో ప్రజలు చైతన్యవంతులైతే సారా రక్కసిని పారద్రోలొచ్చన్నారు. గుడుంబాకు ప్రత్యామ్నాయమే చీప్ లిక్కర్ అని, ప్రజలు కోరితే కేబినెట్లో చర్చ జరిపి చీప్ లిక్కర్‌పై పునరాలోచిస్తామని చెప్పారు. మేడే రోజున కేసీఆర్ లారీ, ఆటో, టాక్సీ డ్రైవర్లు, హోంగార్డులు, జర్నలిస్టులకు రూ.5 లక్షల వరకు ఉచిత ప్రమాద బీమా ప్రకటించారని తెలిపారు. నయా పైసా ఖర్చులేకుండా సామాజిక భద్రత కోసం ముఖ్యమంత్రి కేసీఆర్ దేశంలోనే మొట్టమొదటిసారిగా అనేక వినూత్న సంక్షేమ కార్యక్రమాలు చేపట్టి సామాజిక తత్వవేత్తగా మారారని కితాబునిచ్చారు. అవినీతి నిర్మూలన పోలీసు స్టేషన్ నుంచే ప్రారంభమన్నారు. ఎవరికీ చేయి చాపకుండా ప్రాధాన్య క్రమంలో ప్రతి పోలీసుస్టేషన్‌కు నిధులు మంజూరు చేశామన్నారు. రాష్ట్రంలో ఫ్రెండ్లీ పోలీసింగ్‌తో పోలీసులు కూడా సామాజిక సంక్షేమ కార్యక్రమాల్లో భాగస్వాములు అవుతున్నారన్నారు. కింది స్థాయి అధికారి నుంచి పై స్థాయి అధికారుల వరకు స్వచ్ఛ తెలంగాణ, మిషన్ కార్యక్రమాల్లో ఉత్సాహంగా పాల్గొని విజయవంతం చేశారన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ చేస్తున్న మంచిపనులతో ప్రతిపక్షాల కాలి కింద భూమి కదులుతుందని, ప్రభుత్వంపై అనవసర విమర్శలు మాని వాస్తవాలు తెలుసుకోవాలని సూచించారు. సమావేశంలో జడ్పీ చైర్పర్సన్ గద్దల పద్మ, ఎమ్మెల్యే శంకర్ నాయక్, నాయకులు పెద్దిసుదర్శన్‌రెడ్డి, ముద్దసాని సహోదర్‌రెడ్డి, మర్రి యాదవరెడ్డి, ఇండ్ల నాగేశ్వర్రావు, నన్నపనేని నరేందర్, నయీముద్దీన్, గుడిమల్ల రవికుమార్‌లు పాల్గొన్నారు. -
ధూం.. ధాంలో కదం తొక్కిన నాయిని!
-
పోలీసులపై తుపాకీ
మృతుల కుటుంబాలను ఆదుకుంటాం: హోంమంత్రి నాయిని నర్సింహారెడ్డి సూర్యాపేట : సూర్యాపేట హై టెక్ బస్టాండ్‌లో దుండగుల కాల్పులకు మృతిచెందిన కానిస్టేబుల్ లింగయ్య, హోంగార్డు మహేష్ కుటుంబాలను ప్రభుత్వం తరఫున ఆదుకుంటామని హోంమంత్రి నాయిని నర్సింహారెడ్డి అన్నారు. బుధవారం అర్ధరాత్రి పట్టణంలోని హైటెక్ బస్టాండ్‌లో జరిగిన సంఘటన స్థలాన్ని గురువారం ఆయన రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీష్‌రెడ్డితో కలిసి పరిశీలించారు. అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడారు. విధినిర్వహణలో ఉన్న పోలీసు సిబ్బందిని కాల్చి చంపిన నిందితులను వెంటనే పట్టుకుని కఠినంగా శిక్షించేలా చర్యలు తీసుకుంటామన్నారు. ఉత్తరప్రదేశ్‌కు చెందిన ఇద్దరు నిందితులను అనుమానితులుగా గుర్తించామన్నారు. నిందితులను పట్టుకోవడానికి ఎస్పీ ఆధ్వర్యంలో జిల్లాలో ఎక్కడికక్కడ టీంలను ఏర్పాటు చేసి గాలిస్తున్నట్టు పేర్కొన్నారు. అంతర్రాష్ట్ర దొంగలు సూర్యాపేట పట్టణాన్ని సెంటర్‌గా మార్చుకొని దొంగతనాలకు పాల్పడుతున్నారన్నారు. సీఐ మొగలయ్య ఆధ్వర్యంలో దొంగలను ధైర్యంగా పట్టుకునే ప్రయత్నం చేశారని చెప్పారు. విధి నిర్వహణలో చనిపోయిన కానిస్టేబుల్ కుటుంబానికి రూ.40లక్షలు, హోంగార్డు కుటుంబానికి రూ.10లక్షలు ఆర్థిక సాయం ఇచ్చే విధంగా సీఎంతో మాట్లాడి ప్రకటిస్తామన్నారు. అలాగే కుటుంబంలో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం ఇచ్చి ఆదుకుంటామన్నారు. ప్రభుత్వం పూర్తిగా ఆ కుటుంబాలకు అండగా ఉంటుందన్నారు. ఇలాంటి సంఘటన జరగడం చాలా దురదృష్టకమరమని ఆవేదన వ్యక్తం చేశారు. భవిష్యత్‌లో ఇలాంటి సంఘటనలు జరుగకుండా కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటామని చెప్పారు. ఆయన వెంట పార్లమెంటరీ కార్యదర్శి గాదరి కిశోర్, నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం తదితరులు ఉన్నారు. సూర్యాపేట/సూర్యాపేట మున్సిపాలిటీ అర్ధరాత్రి వేళ ప్రయాణికులతో కిటకిటలాడే సమయంలో జరిగిన ఈ ఘటనలో ఇద్దరు పోలీసులు చనిపోవడం ఇటు జిల్లాలోనూ, అటు రాష్ట్రంలోనూ సంచలనమైంది. సాధార ణ తనిఖీల్లో భాగంగా విధులు నిర్వహిస్తున్న పోలీసులపై కాల్పులకు తెగబడ్డవారు ఉత్తరప్రదేశ్‌కు చెందిన అంతర్రాష్ట్ర దొంగల ముఠా అని పోలీసులు భావిస్తుండగా, ఘటనాస్థలంలో లభించిన ఆధారాలు, దుండగులు వ్యవహరించిన తీరును బట్టి అనేక వాదనలు వినిపిస్తున్నాయి. మొత్తంమీద దుండగులు జరిపిన కాల్పుల్లో పేద కుటుంబాలకు చెందిన కానిస్టేబుల్, హోంగార్డులు చనిపోవడం పోలీసు శాఖను కలవరపరిచింది. అసలేం జరిగింది? వాస్తవానికి కొంతకాలంగా జిల్లాలో అంతర్రాష్ట్ర దొంగలు విచ్చలవిడిగా సంచరిస్తున్నారు. వీరిపై డేగకన్ను పెట్టిన జిల్లా పోలీసు యంత్రాంగం వారిని నిలువరించేందుకు అన్ని రకాల ప్రయత్నాలు చేస్తోంది. అందులో భాగంగానే విస్తృతంగా తనిఖీలు నిర్వహిస్తోంది. విశ్వసనీయ సమాచారం ప్రకారం... ఆ తనిఖీల్లో భాగంగానే సూర్యాపేట టౌన్ సీఐ మొగిలయ్య తన సిబ్బందితో కలిసి బుధవారం అర్ధరాత్రి హైటెక్ బస్టాండ్‌కు చేరుకున్నారు. సీసీటీవీ ఫుటేజ్‌లో లభించిన సమాచారం ప్రకారం సరిగ్గా 12:18 నిమిషాలకు సీఐ తన బృందంతో కలిసి బస్టాండ్‌లోకి ప్రవేశించారు. ఎప్పటిలాగే తనిఖీలు చేసేందుకు ఉద్యుక్తులయ్యారు. సిబ్బందిని బృందాలుగా విడగొట్టి తనిఖీలు చేపట్టారు. సీఐ మొగిలయ్య, మరో హోంగార్డుతో కలిసి హైదరాబాద్ బస్సులు ఆగే ఫ్లాట్‌ఫారంపై ఉన్న ఓ బస్సులోకి ఎక్కారు. బస్సు చివరిసీట్లలో కూర్చుని ఇద్దరిని అనుమానించారు. వారిద్దరిని బస్సు దింపి పక్కకు తీసుకెళ్లి విచారిస్తున్నారు. సీఐ మొగిలయ్యతో పాటు హోంగార్డు మహేశ్, గన్‌మెన్ లింగయ్య (కానిస్టేబుల్)లు ఒక వ్యక్తిని ఫ్లాట్ఫారంకు ఎదురుగా ఉన్న సులభ్‌కాంప్లెక్స్ సమీపంలో ప్రశ్నిస్తున్నారు. అదే సమయంలో మరో హోంగార్డు కిశోర్ బస్సుకు అవతల మరో వ్యక్తిని విచారిస్తున్నాడు. రెండు బృందాల మధ్య బస్సుగా ఉన్నట్టు సమాచారం. అయితే, విచారణ జరుగుతున్న సమయంలోనే ఓ దుండగుడు ముందుగా సీఐ మొగిలయ్యపై తుపాకీ ఎక్కుపెట్టాడు. హిందీలో మాట్లాడుతూనే మొగిలయ్య పొట్టపై తుపాకీ పెట్టి బెదిరించాడు. దీంతో మొగిలయ్య, మహేశ్, లింగయ్యలు హతాశులయ్యారు. తమపైనే తుపాకీ ఎక్కుపెట్టిన దుండగుడిని నిరోధించేందుకు మహేశ్, లింగయ్యలు సిద్ధమవుతున్న సమయంలోనే అతను మొగిలయ్య పొట్టలో కాల్చాడు. పెనుగులాట జరిగిన తీరులో దుండగుడి నుంచి తప్పించుకునేందుకు మొగిలయ్య ప్రయత్నించే లోపే మరోసారి ఛాతీ భాగంలో కాల్పులు జరిపాడు. వెంటనే పక్కనే ఉన్న మహేశ్, లింగయ్యలను కూడా పాయింట్‌బ్లాంక్‌లో పెట్టి కాల్చిచంపేశాడు. మహేశ్‌కు నుదుటిమీద కాల్పులు జరిపాడు. ఈ సమయంలోనే బస్సుకు మరోవైపు ఉన్న కిశోర్ విచారణ జరుపుతున్న దుండగుడు కూడా కాల్పులు ప్రారంభించి కిశోర్‌ను కాల్చాడు. ఘటనలో మహేశ్, లింగయ్యలు రక్తపుమడుగులో అక్కడికక్కడే చనిపోగా, మొగిలయ్య, కిశోర్‌లు గాయపడ్డారు. దీంతో ఇద్దరు దుండగులు అప్రమత్తమై పరారయ్యారు. పరారవుతూనే బస్టాండ్ బయటకు వచ్చిన దుండగులు అంజనాపురి కాలనీ సమీపంలో ఓ కుటుంబం వెళుతున్న కారును ఆపారు. రాత్రి సమయంలో తుపాకులు చూపించి కారును ఆపడంతో పోలీసులుగా భావించిన కారు డ్రైవర్, పశ్చిమగోదావరి జిల్లా తాడేపల్లిగూడెం మండలం జగన్నాథపురం ఎంపీటీసీ సభ్యుడు దొరబాబు తొలుత కారును ఆపేందుకు ప్రయత్నించారు. అయితే, అతని భార్య అప్రమత్తమై పోలీసులు కాదని చెప్పడంతో మళ్లీ కారు వేగం పెంచేందుకు దొరబాబు ప్రయత్నించాడు. ఆ సమయంలో డ్రైవర్ వైపు ఉన్న అద్దాన్ని కాల్చిన దుండగులు మరోరౌండ్ కాల్చడంతో దొరబాబు భుజంపై గాయమయింది. అక్కడి నుంచి దుండగులు మళ్లీ పరారయ్యారు. యూపీ ముఠా పనేనా? ఈ ఘటనకు పాల్పడింది ఉత్తర ప్రదేశ్‌కు చెందిన దొంగల ముఠా సభ్యులేనని పోలీసులు ప్రాథమిక నిర్ధారణకు వచ్చారు. గత కొంతకాలంగా జిల్లాలో సంచరిస్తున్న ఈ ముఠా సభ్యులు మళ్లీ పోలీసులకు పట్టుబడతామనే భయంతోనే నిర్దాక్షిణ్యంగా కాల్పులకు తెగబడ్డారని పోలీసు వర్గాలంటున్నాయి. అయితే ఘటనా స్థలంలో దొరికిన ఓ చిన్న ఆధారాాన్ని బట్టి కాల్పులకు పాల్పడింది ఒరిస్సాకు చెందిన వారని అనుమానం కలుగుతోంది. సంఘటన జరిగిన ప్రదేశంలో ఓ వ్యక్తి ఓటరుకార్డు పోలీసులకు లభించింది. ఇది ఒరిస్సా రాష్ట్రానికి చెందినదిగా పోలీసులు గుర్తించారు. దీంతో వారు ఒరిస్సా రాష్ట్రానికి చెందిన వారని కొందరంటుంటే, కాదని, కేవలం పోలీసులను తప్పుదోవ పట్టించేందుకు ఆ కార్డును అక్కడ వదిలి వెళ్లారని కొందరంటున్నారు. మరోవైపు, ఇది దొంగల పని కాదని కూడా విశ్లేషణలు జరుగుతున్నాయి. కేవలం దొంగలే అయితే ఇంత క్రూరంగా దాడికి పాల్పడి, ఆయుధాన్ని తీసుకెళ్లరనే వాదన కూడా వస్తోంది. సుపారీ తీసుకుని హత్యలకు పాల్పడే ముఠాలోని సభ్యులే ఈ ఘాతుకానికి ఒడిగట్టి ఉంటారనే కోణం కూడా వినిపిస్తోంది. సుపారీ తీసుకుని హత్య చేసేందుకు వెళుతున్న సమయంలో పోలీసులు పట్టుకుంటారనే ఆలోచనతోనే వారు కాల్పులు జరిపి పరారయ్యారనే అనుమానం కూడా కలుగుతోంది. మరోవైపు బుధవారం మధ్యాహ్నం సమయంలో హైదరాబాద్‌లోని సరూర్‌నగర్ పీఎస్ పరిధిలో పశ్చిమగోదావరి జిల్లాకు చెందిన నాగరాజు అనే ఓ వ్యక్తిని మనస్పర్థల కారణంగా కొందరు హత్య చేసేందుకు ప్రయత్నించారు. అక్కడ కూడా దుండగులు జరిపింది కాల్పులే. వారి ముఠాకు చెందిన వారే అయి ఉంటారా లేక మరేదైనా హత్యకు వెళుతున్నారా అనే చర్చ కూడా జరుగుతోంది. కాగా, ఈ ఘటనలో మావోయిస్టుల ప్రమేయం ఉందా అనే వాదన ఉన్నా... దాన్ని పోలీసులు కూడా కొట్టిపారేస్తున్నారు. ఘటన జరిగిన తీరు, అక్కడ చనిపోయిన పోలీసు సిబ్బందిని పరిశీలిస్తే ఇది మావోల పని కాదని స్పష్టమవుతోంది. ఈ నేపథ్యంలో అయితే, ఉత్తర ప్రదేశ్‌కు చెందిన దొంగల ముఠా, లేదంటే ఒరిస్సా దొంగలు, లేదంటే కిరాయి హంతకులు ఈ ఘటనకు పాల్పడ్డారని తెలుస్తోంది. అన్నీ అనుమానాలే... ప్రశ్నలే ఇంత అమానుషంగా విచారణ జరుపుతున్న పోలీసులపై కాల్పులు జరిపింది ఎవరనేది మిస్టరీగా మారింది. ఘటన జరిగిన తీరును ఎన్ని కోణాల్లో విశ్లేషించినా అసలేం జరిగిందనేది పోలీసులకు కూడా అంతుపట్టడం లేదు. అసలు ముందుగా సీఐ మొగిలయ్యపై కాల్పులు జరిపారా? మొగిలయ్య దగ్గర ఎవరున్నారు? రెండో వ్యక్తిని కిషోర్ ఒక్కడే విచారిస్తున్నాడా? ఎవరు ముందు కాల్చారు? పోలీసులను భయభ్రాంతులకు గురిచేసి వారిని మోకాళ్లపై నిలబెట్టి కాల్చారా? చాలా ఎత్తు, బలంగా ఉండే హోంగార్డు మహేశ్ నుదుటి మీద ఎలా కాల్చగలిగారు? కాల్పులు జరుగుతున్న సమయంలో ప్రయాణీకులెవరూ చూడలేదా? పోలీసులు ప్రతిఘటన ప్రయత్నాలు ఎందుకు సరిగ్గా చేయలేకపోయారు? మొత్తంమీద ఆరుగురు డిపార్ట్మెంట్ మనుషులుండి ఇద్దరు దుండగుల చేతిలో బలవుతారా? అనుమానితులను విచారించే ముందు తీసుకోవాల్సిన జాగ్రత్తలను పోలీసులు తీసుకోలేదా? అసలు వీరిని ఏ బస్సులోంచి తీసుకువచ్చారు? బస్సు హైదరాబాద్ వెళ్తోందా? హైదరాబాద్ నుంచి వస్తోందా? ఘటనా స్థలంలో సీఐ గన్‌మెన్ కార్బైన్ ఏమైంది? ఘటన జరుగుతున్నప్పుడు సీఐ బృందంలో ఉన్న ఐడీ పార్టీ కానిస్టేబుల్ అరవింద్, డ్రైవర్ ఉపేందర్‌లు ఏం చేస్తున్నారు? వారు ఘటనకు ప్రత్యక్షసాక్షులా కాదా?... ఇలా ఎన్నో ప్రశ్నలు, అనుమానాలు, సందేహాలను మిగిల్చింది ఈ ఘటన. పోలీసులు జరిపే దర్యాప్తులో ఈ ప్రశ్నలన్నింటికీ ఎలాంటి సమాధానాలు వస్తాయో వేచి చూడాల్సిందే. అయితే, తీవ్రంగా గాయపడి చికిత్స పొందుతున్న సీఐ మొగిలయ్య కోలుకుని ఏం జరిగిందో చెపితే మరిన్ని వాస్తవాలు వెలుగులోకి వచ్చే అవకాశముంది. ఇర్ఫాన్ ముఠా సభ్యులా? సూర్యాపేట పోలీసులపై దాడికి తెగబడింది ఇటీవల సూర్యాపేటలో పోలీసులకు పట్టుబడ్డ అంతర్రాష్ట్ర దొంగల ముఠా నాయకుడు ఇర్ఫాన్ నేతృత్వంలో పనిచేస్తున్న సభ్యులేనా అనే అనుమానాలు పోలీసు వర్గాల్లో వ్యక్తమవుతున్నాయి. ఇటీవల ఇర్ఫాన్‌తో పాటు మరో ఇద్దరిని సీఐ మొగిలయ్య బస్టాండ్ సమీపంలోనే అరెస్టు చేసి రిమాండ్‌కు పంపారు. ఇప్పుడు వారంతా జైల్లోనే ఉన్నట్టు తెలుస్తోంది. ఇర్ఫాన్ ఉత్తర ప్రదేశ్‌లోని మీరట్‌కు చెందిన వాడు. ఇర్ఫాన్‌ను విచారించిన సమయంలో అతను చెప్పిన సమాచారంతో మరిన్ని ఆధారాలు రాబట్టేందుకు సీఐ మొగిలయ్య ఇటీవల మీరట్ కూడా వెళ్లివచ్చాడు. ఈ నేపథ్యంలో సీఐ మొగిలయ్యను టార్గెట్‌గా చేసుకుని కాల్పులు జరిపారనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. అయితే, గత నెలలో చిత్తూరు జిల్లాకు చెందిన మదన్‌కుమార్ అనే వ్యక్తి పోలీసులకు పట్టుబడ్డాడు. ఇతని వద్ద నాటుతుపాకీ కూడా దొరికింది. ఇతనితో పాటు ఉన్న ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని బిజునూర్ ప్రాంతానికి చెందిన షకీల్ మాత్రం పరారయ్యాడు. మళ్లీ అదే షకీల్ లేదంటే అతని ముఠా సభ్యులేమైనా ఈ ఘటనకు పాల్పడి ఉండవచ్చని పోలీసు వర్గాలు అనుమానిస్తున్నాయి. ఇంత నిర్లక్ష్యమా? అంతర్రాష్ట్ర దొంగల ముఠా సభ్యులుగా అనుమానించి విచారణ జరుపుతున్న సమయంలో పోలీసులు నిర్లక్ష్యంగా వ్యవహరించిన కారణంగానే ఇద్దరు ప్రాణాలు కోల్పోవాల్సి వచ్చిందని ఆరోపణలు వస్తున్నాయి. ముఖ్యంగా నేరస్తుల పట్ల దూకుడుగా వ్యవహరించే సీఐ మొగిలయ్య కనీసం తన రక్షణ కోసం ప్రభుత్వం ఇచ్చిన తుపాకీని కూడా తన వద్ద ఉంచుకోకుండా వారిని ఎలా విచారించారన్నది అంతుపట్టడం లేదు. మరోవైపు ఓఎస్డీ రాధాకిషన్‌రావు పదవీవిరమణ కార్యక్రమానికి నల్లగొండ వెళ్లివచ్చిన పోలీసులు వెంటనే తనిఖీలకు వెళ్లడం, ఎలాంటి పొజిషన్ తీసుకోకుండానే కార్యరంగంలోకి దూకడం కూడా ఘటనకు కారణమైంది. మరోవైపు సీఐ బృందంలో ఉన్న ఐడీ పార్టీ కానిస్టేబుల్ అరవింద్, డ్రైవర్ ఉపేందర్‌లు ఘటన సమయంలో ఎక్కడున్నారన్నది తేలాల్సి ఉంది. వీరిలో అరవింద్ సుమో తీసుకువచ్చేందుకు వెళ్లగా, ఉపేందర్ ఛాయ్ తాగేందుకు వెళ్లాడని పోలీసులు చెబుతున్నారు. ఈ నేపథ్యంలో మొత్తంమీద పోలీసుల నిర్లక్ష్య వైఖరే వారి ప్రాణాలను బలిగొందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. నాటు తుపాకీ ఉపయోగించారా? దాడులకు పాల్పడిన సమయంలో దుండగులు ఉపయోగించింది నాటుతుపాకీ అని పోలీసులంటున్నారు. ఘటనా స్థలంలో మొత్తం ఆరు బుల్లెట్లు లభ్యమయ్యాయని పోలీసులంటున్నారు. మరో బుల్లెట్‌ను బస్టాండ్ బయట గోదావరి జిల్లాకు చెందిన వ్యక్తిపై ప్రయోగించారని తెలుస్తోంది. ఇందులో సీఐపై రెండు రౌండ్లు, ముగ్గురు పోలీసులపై మూడు రౌండ్లు కాల్పులు జరిపారని పోలీసులు ప్రాథమికంగా అంచనా వేస్తుండగా, మరో రౌండ్ బుల్లెట్ ఎవరిపై ప్రయోగించారన్నది తేలాల్సి ఉంది. నాటు తుపాకీలో అయితేనే ఏడు బుల్లెట్లుంటాయని, దుండగులు ఉపయోగించింది అదేనని పోలీసు వర్గాలంటున్నాయి. బస్సెక్కడిది? కాగా, దుండగులు అసలు ఎక్కడి నుంచి వస్తున్నారు, ఎక్కడకు వెళుతున్నారు అన్నది కూడా స్పష్టం కాలేదు. బస్టాండ్ సీసీ టీవీ కెమెరాల్లో లభించిన ఫుటేజ్ ప్రకారం హైదరాబాద్ వైపు వెళుతున్న బస్సులు ఆగే ఫ్లాట్‌ఫారంలోని బస్సుల నుంచే వారిని దింపారు. అయితే అది తిరువూరుకు చెందిన బస్సా, లేకా మణుగూరు డిపోదా? లేక ఛత్తీస్‌గఢ్ సరిహద్దు అయిన ఖమ్మం జిల్లా చర్ల నుంచి వచ్చే బస్సా అన్నది ఎవరూ చెప్పలేకపోతున్నారు. ఆ సమయంలో బస్టాండ్‌లోని రిజిస్టర్లో కూడా కేవలం మూడు బస్సుల వివరాలే నమోదయ్యాయి. సంఘటన జరిగిందని భావిస్తున్న 12:30 గంటల నుంచి 1:45 నిమిషాల సమయంలో విజయవాడ నుంచి మియాపూర్ వెళుతున్న బస్సు, హైదరాబాద్ నుంచి మణుగూరు, హైదరాబాద్ నుంచి రాజమండ్రి వెళుతున్న మరో బస్సుల వివరాలు మాత్రమే నమోదు చేశారు. అందులో కూడా ఒక్క బస్సుకు చెందిన డ్రైవర్ ఐడెంటిటీ నంబర్ ఉంది. ఈ నేపథ్యంలో బస్సు ఏదో స్పష్టత లేకపోవడం, సీసీటీవీ ఫుటేజ్‌లో కూడా తేలకపోవడంతో దర్యాప్తు కోసం పోలీసులు పెద్ద ఎత్తున శ్రమించాల్సిన పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఉలికిపాటు దోపిడీ దొంగల కాల్పుల్లో పోలీసు కానిస్టేబుల్‌తోపాటు హోంగార్డు మృతి చెందడం, సీఐతోపాటు మరో ఇరువురికి తీవ్ర గాయాలు కావడంతో జిల్లా పోలీసు యంత్రాంగం ఉలిక్కిపడింది. మొట్టమొదటి సారిగా దొంగల చేతుల్లో పోలీసులు హతం కావడం పెద్ద ఎత్తున చర్చనీయాంశమైంది. కొన్నేళ్ల క్రితం సూర్యాపేట డివిజన్లోని తిరుమలగిరి పోలీసు స్టేషన్‌పై నక్సలైట్లు దాడి చేసి ఇద్దరు కానిస్టేబుళ్లను కాల్చి చంపిన సంఘటన మినహా ఈ ప్రాంతంలో ఇలాంటి సంఘటన ఎప్పుడు జరగలేదు. అంతర్రాష్ట్ర దొంగల ముఠా దొంగతనాలు సులువుగా జరిగితే సజావుగా వెళ్లిపోవడం, ఎవరైన అడ్డు తిరిగితే ప్రాణాలు తీసేందుకు కూడా వెనుకాడటం లేదని ఈ సంఘటనతో తేటతెల్లమైంది. ఏదీ ఏమైనప్పటికీ పోలీసు వర్గాలు ఇలాంటి ముఠాల పట్ల కఠినంగా వ్యవహరించి ప్రజలకు భరోసా కల్పించాల్సిన అవసరం ఉందని భావిస్తున్నారు. భయాందోళనకు గురికావొద్దు సూర్యాపేట : సూర్యాపేట పట్టణంలో బుధవారం అర్ధరాత్రి పోలీసులపై జరిపిన కాల్పులతో ప్రజలు ఎలాంటి భయాందోళనకు గురికావాల్సిన అవసరం లేదని, సాధ్యమైనంత త్వరలో దుండగులను పట్టుకుంటామని డీజీపీ అనురాగ్‌శర్మ అన్నారు. గురువారం సూర్యాపేట పట్టణంలోని హైటెక్ బస్టాండ్‌లో ఘటనా స్థలాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన విలేకరులతో మాట్లాడారు. కాల్పుల ఘటనలో మావోల పాత్ర ఏమిలేదని.. ఇది కేవలం అంతర్రాష్ట్ర దొంగల ముఠా పనేనని పేర్కొన్నారు. మృతుల కుటుంబాల్లో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం కల్పించేందుకు కృషిచేస్తామని హామీ ఇచ్చారు. మృతి చెందిన కానిస్టేబుల్ మెట్టు లింగయ్య కుటుంబానికి రూ.25 లక్షలు, హోంగార్డు కుమ్మరి మహేష్ కుటుంబానికి రూ.10 లక్షలు, క్షతగాత్రులకు రూ.5 లక్షల చొప్పున ఎక్స్‌గ్రేషియా చెల్లించనున్నట్లు పేర్కొన్నారు. అదే విధంగా బస్టాండ్ ఆవరణ ను సందర్శించిన ఘటనకు సంబంధించిన మరిన్ని వివరాలను ఐజీ నవీన్‌చంద్‌ను అడిగితెలుసుకున్నారు. బస్టాండ్‌లో ఏర్పాటుచేసిన సీసీ కెమెరా ఫుటేజీలను పరిశీలించారు. అనంతరం ఏరియాస్పత్రిలోని పోలీసుల మృతదేహాలను సందర్శించి నివాళులర్పించారు. అర్ధరాత్రే ‘పేట’కు చేరుకున్న ఎస్పీ సూర్యాపేట : కాల్పుల విషయం అర్ధరాత్రి తెలుసుకున్న ఎస్పీ టి.ప్రభాకర్‌రావు హుటాహుటినా ఘటనా స్థలానికి చేరుకొని సూర్యాపేట పట్టణంతోపాటు జిల్లా అంతటా పోలీసు బందోబస్తును పటిష్టం చేశారు. బస్టాండ్ ఆవరణతోపాటు అంజనాపురి కాలనీ వరకు కాలినడకన తిరుగుతూ కార్బైన్ కోసం వెతకసాగారు. ఎక్కడ వెతికినా ఫలితం లేకుండా పోయింది. బుధవారం అర్ధరాత్రే జాగిలాలను రప్పించి బస్టాండ్ ఆవరణ మొత్తం గాలించారు. అన్ని పోలీస్స్టేషన్లకు సమాచారమందించి దొంగల ఆచూకీ కోసం అడుగడుగునా గాలింపు చర్యలు చేపట్టారు. పోలీసు ఉన్నతాధికారులకు సమాచారం అందించడంతో ఐజీ నవీన్‌చంద్, డీఐజీ గంగాధర్‌లు గురువారం తెల్లవారుజామున సూర్యాపేట హైటెక్ బస్టాండ్‌కు చేరుకొని ఎప్పటికప్పుడు ఘటనపై ఆరా తీశారు. ఫోరెన్సిక్ డెరైక్టర్ శారదా అవధాని ఘటనా స్థలాన్ని పరిశీలించి.. ఘటనా స్థలంలోని ఆధారాలను సేకరించి ఏరియాస్పత్రిలో పోలీసుల మృతదేహాన్ని పరిశీలించారు. కాల్పుల ఘటన నేపథ్యంలో జిల్లా అంతటా హై అలర్ట్ ప్రకటించారు. ప్రముఖుల సందర్శన... జిల్లా కలెక్టర్ సత్యనారాయణరెడ్డితో పాటు సీసీఎస్ డీఎస్పీ సునీతామోహన్, స్థానిక డీఎస్పీ మహ్మద్ అబ్దుల్ రషీద్‌తో పాటు జిల్లాలోని డీఎస్పీలంతా సూర్యాపేటకు చేరుకొని ఘటనా స్థలాన్ని పరిశీలించారు. జిల్లాలోని అన్ని డివిజన్ల పోలీస్స్టేషన్లను అప్రమత్తం చేశారు. అనంతరం ఏరియాస్పత్రిలోని పోలీసుల మృతదేహాలను సందర్శించి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఇంకా పార్లమెంటరీ కార్యదర్శి గ్యాదరి కిశోర్, ఎమ్మెల్యే వేముల వీరేశం, మాజీ మంత్రి దామోదర్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్యే నోముల నర్సింహయ్య, మున్సిపల్ చైర్పర్సన్ గండూరి ప్రవళ్లిక, ప్రజాప్రతినిధులు పెద్ద ఎత్తున తరలివచ్చి ఘటనా స్థలాన్ని పరిశీలించి అనంతరం ఏరియాస్పత్రిలోని మృతదేహాలను సందర్శించారు. నల్లగొండ జిల్లాలో కాల్పులకు గురై... సూర్యాపేట : నల్లగొండ జిల్లా సూర్యాపేట పట్టణంలో బుధవారం అర్ధరాత్రి దుండగుల చేతుల్లో కాల్పులకు గురైన పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెం మండలం జగన్నాథపురం ఎంపీటీసీ సభ్యుడు గన్నమణి దొరబాబు ప్రాణాపాయం నుంచి బయటపడ్డాడు. అర్ధరాత్రి దాటిన తర్వాత సూర్యాపేట హైటెక్ బస్టాండ్‌లో బస్సులను తనిఖీ చేస్తున్న సీఐ, ఇరువురు కానిస్టేబుళ్లు, ఇరువురు హోంగార్డులపై ఉత్తరప్రదేశ్ మీరట్‌కు చెందిన ముఠాగా భావిస్తున్న ఇరువురు వ్యక్తులు ఒక్కసారిగా కాల్పులు జరిపారు. ఈ సంఘటనలో హోంగార్డు మహేష్, కానిస్టేబుల్ లింగయ్యలు అక్కడికక్కడే చనిపోగా సీఐతోపాటు మరో ఇరువురికి తీవ్ర గాయాలయ్యాయి. అక్కడినుంచి పరారైన దుండగులు పట్టణ సమీపంలోని అంజనాపురి కాలనీ వద్ద హైవేపై హైదరాబాద్ వైపు వెళ్తున్న దొరబాబు కారును ఆపేందుకు ప్రయత్నించారు. మొదట దొరబాబు కారు అపేందుకు వేగం తగ్గించి అంతలోనే తేరుకుని ముందుకెళ్లేందుకు ప్రయత్నించారు. దీంతో దుండగులు ఆయన కారుపై కాల్పులు జరపడంతో కారు అద్దం నుంచి దొరబాబు భుజంలోకి బుల్లెట్ దూసుకెళ్లింది. వెంటనే దొరబాబు కారు ఆపకుండా తిరిగి సూర్యాపేట బస్టాండ్ వైపు రావడంతో అప్పటికే హైటెక్ బస్టాండ్‌లో జరిగిన సంఘటనతో పెద్ద ఎత్తున జనం గుమిగూడారు. దొరబాబు జరిగిన విషయాన్ని చెప్పడంతో వెంటనే ప్రైవేట్ ఆసుపత్రిలో చేర్పించి చికిత్స చేయించారు. గురువారం ఉదయం ఆయన కుటుంబ సభ్యులతో పాటు హైదరాబాద్ వెళ్లి కేపీహెచ్‌బీలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స చేయించుకుంటున్నట్టు తెలిసింది. జిల్లాలో అంతర్రాష్ట్ర దొంగల ముఠా హల్చల్ సూర్యాపేట మున్సిపాలిటీ : మూడు నెలలుగా జిల్లాలోని సూర్యాపేట, కోదాడ, మిర్యాలగూడ తదితర పోలీస్స్టేషన్ల పరిధిలో అంతర్రాష్ర్ట దొంగలు పోలీసులకు చిక్కి కటకటాల పాలయ్యారు. వీరిలో సూర్యాపేటలో పట్టుబడ్డవారు ఉత్తరప్రదేశ్ రాష్ట్రానికి చెందిన మీరట్ ముఠాగా పోలీసులు గుర్తించారు. వీరు అత్యంత ప్రమాదకరమైన ఆయుధాలతో తిరుగుతూ గరుడ బస్సుల్లో ప్రయాణిస్తూ.. సంపన్న మహిళలే లక్ష్యంగా చేసుకొని వారి వెనుక సీట్లలో రిజర్వు చేసుకొని అర్ధరాత్రి ఆదమరిచి నిద్ర పోతున్న సమయంలో బ్యాగులు, సూట్‌కేసుల్లో ఉన్న విలువైన ఆభరణాలు, నగదు అపహరించుకుపోతున్నారు. వారిని గుర్తించేలోగానే తప్పించుకొని పారిపోతున్నారు. గత మూడు నెలల్లో జిల్లాలో పట్టుబడ్డ అంతర్రాష్ట్ర ముఠా సభ్యుల వివరాలు.. గుంటూరు జిల్లా తాడేపల్లిగూడెం మండలం ఎన్టీఆర్నగర్కు చెందిన బొమ్మారెడ్డి శివారెడ్డి అంతర్రాష్ట్రాల్లో చైన్‌స్నాచింగ్‌కు పాల్పడుతూ జనవరి 30వ తేదీన కోదాడ పట్టణంలో పోలీసులు వాహన తనిఖీలు నిర్వహిస్తుండగా పట్టుబడ్డారు. ప్రకాశం జిల్లా దర్శికి చెందిన తాతపూడి తెల్లరాజు అలియాస్ ప్రసాద్ కారు డ్రైవర్‌గా పనిచేస్తూ ఉండేవాడు. ఒక కారుకు యాక్టింగ్ డ్రైవర్‌గా వచ్చి.. జనవరి 31వ తేదీన సూర్యాపేటలోని ఓ హోటల్ సమీపంలో కారు, లాప్టాప్తో పాటు రూ.6 లక్షల నగదు దొంగిలించి పోలీసుల తనిఖీలో పట్టుబడ్డారు. ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని అమృహ జిల్లా మిర్జాపూర్ మండలం బిజునూర్ గ్రామానికి చెందిన మహ్మద్ సాహిద్, చిబోలా మండలం మండిదనోరా గ్రామానికి చెందిన నన్నెకుమార్లు ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణికుల నుంచి బంగారు ఆభరణాలు, నగదు చోరీలకు పాల్పడుతూ.. ఫిబ్రవరి 19న సూర్యాపేట హైటెక్ బస్టాండ్ సమీపంలో పోలీసులకు పట్టుబడ్డారు. ఉత్తరప్రదేశ్‌కు చెందిన ఐదుగురు దొంగల ముఠా సభ్యులు ఫిబవ్రరి 23వ తేదీన హైటెక్‌బస్టాండ్‌లో దొంగతనం చేసేందుకు ప్రయత్నిస్తుండగా ప్రయాణికులు పట్టుకోబోగా తప్పించుకుపోయారు. ఫిబ్రవరి 26వ తేదీన సూర్యాపేట పట్టణంలో పోలీసులు వాహనాల తనిఖీ నిర్వహిస్తుండగా.. చిత్తూరు జిల్లా యాదమర్రి మండలం బండివాండ్ల గ్రామానికి చెందిన అవిలినేని మదన్‌రావు ఉత్తరప్రదేశ్‌కు చెందిన షకీల్ అనే నేరస్తుని సహకారంతో తుఫాకీ కొనుగోలు చేసి దొంగతనాలకు పాల్పడుతుండగా పట్టుబడ్డారు. ఈ ఘటనలో షకీల్ పరారయ్యాడు. ఫిబ్రవరి 28న ఉత్తరప్రదేశ్‌లోని మీరట్‌కు చెందిన ఎండీ ఇర్ఫాన్, ఎండీ మక్సూద్అహ్మద్, అహ్మద్ హసన్‌లు సూర్యాపేట హైటెక్ బస్టాండ్‌లో పోలీసుల తనిఖీల్లో పట్టుబడ్డారు. పోలీసులు వీరి నుంచి 13 గ్రాముల బంగారు గొలుసు, 3 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకుని అరెస్టు చేశారు.ఉత్తరప్రదేశ్‌కు చెందిన ఎండి ఇర్ఫాన్ అలియాస్ బాయ్, హనీస్లు సూర్యాపేటలోని హైటెక్ బస్టాండ్‌లో అనుస్పదంగా తిరుగుతుండగా వీరిని సూర్యాపేట పోలీసులు మార్చి 11న పట్టుకుని వీరి నుంచి 20 తులాల బంగారం స్వాధీనం చేసుకున్నారు. పశ్చిమగోదావరి జిల్లా తాడేపల్లిగూడెంకు చెందిన మార్నిడి చక్రధరరావు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో చోరీలకు పాల్పడుతు.. మార్చి 22 వ తేదీన మిర్యాలగూడ పోలీసులకుచిక్కాడు. -
'ప్రజలే పోలీసులకు యజమానులు'
మెదక్: ప్రజలే పోలీసులకు యజమానులని తెలంగాణ హోం మంత్రి నాయిని నర్సింహారెడ్డి మంగళవారం అన్నారు. మెదక్ జిల్లాలో రామాయంపేటలో పోలీసుస్టేషన్ భవనాన్ని ఆయన ప్రారంభించారు. అనంతరం నాయిని నర్సింహారెడ్డి విలేకరులతో మాట్లాడుతూ... ఫ్రెండ్లీ పోలీసింగే తెలంగాణ ప్రభుత్వ లక్ష్యమని నాయిని నర్సింహారెడ్డి చెప్పారు. తెలంగాణ మహిళలకు స్వేచ్ఛ, రక్షణ కల్పించడం మా బాధ్యత అని హోంమంత్రి నాయిని నర్సింహారెడ్డి పేర్కొన్నారు.