breaking news
Hindustan Construction Company
-
చమోలీ సొరంగ ప్రమాదంలో ఏడుగురు మృతి
గోపేశ్వర్: ఉత్తరాఖండ్ రాష్ట్రం చమోలీ జిల్లాలోని నిర్మాణంలో ఉన్న జలవిద్యుత్ ప్రాజెక్ట్ సొరంగ మార్గంలో చోటుచేసుకున్న ప్రమాదంలో ఏడుగురు కార్మికులు ప్రాణాలు కోల్పోయారు. గల్లంతైన మరో ముగ్గురి కోసం గాలింపు చర్యలు ముమ్మరంగా కొనసాగుతున్నాయి. కొండచరియలు విరిగిపడటం, భూమి కుంగిపోవడంతో మాయాపూర్ (పిపల్కోటి) వద్ద హిందుస్తాన్ కన్స్ట్రక్షన్ కంపెనీ (హెచ్‌సీసీ) నిర్మిస్తున్న సొరంగంలోకి గురువారం రాత్రి 7 గంటల సమయంలో అకస్మాత్తుగా భారీగా శిథిలాలు, నీరు ప్రవేశించాయి. సొరంగాన్ని సగం వరకు కప్పేశాయి. ఆ సమయంలో సొరంగంలో 22 మంది కార్మికులున్నారు. తక్షణమే రంగంలోకి దిగిన ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్, ఇండో–టిబెటన్ బోర్డర్ పోలీస్, స్థానిక పోలీసులతోపాటు సాంకేతిక, ప్రత్యేక నిపుణుల బృందాలు సహాయక చర్యల్లో పాల్గొన్నాయి. వీరు గురువారం రాత్రంతా శ్రమించి 19 మందిని బయటకు తీసుకురాగలిగారు. ఇందులో ఏడుగురు చనిపోగా, తీవ్రంగా గాయపడిన 12 మందిని ఆస్పత్రులకు తరలించారు.మిగతా ముగ్గురు సొరంగంలో 1.8 కిలోమీటర్ల లోపల చిక్కుకుపోయినట్లు గుర్తించారు. వీరి కోసం సహాయక బృందాలు యంత్రాలను ఉపయోగించి శిథిలాలను తొలగించి, పంపులతో నీటిని తోడివేస్తున్నారు. విడవకుండా వర్షం కురుస్తున్నప్పటికీ సహాయక చర్యలు కొనసాగుతున్నాయని అధికారులు తెలిపారు. కాగా, బాధితుల్లో ఉత్తరాఖండ్‌తోపాటు ఉత్తరప్రదేశ్, ఛత్తీస్‌గఢ్, పంజాబ్, హిమాచల్ ప్రదేశ్ వాసులున్నారు. బిహార్‌కు చెందిన రోహిత్ పాండే పరిస్థితి విషమంగా ఉండటంతో శ్రీనగర్‌లోని ఆర్మీ బేస్ హాస్పిటల్‌కు తరలించారు. లోపల చిక్కుబడి పోయిన వారిని జార్ఖండ్‌కు చెందిన లుకాస్ టొప్నో, ఛత్తీస్‌గఢ్ రాష్ట్రానికి చెందిన చేతన్ పోయమ్, దేవ్నాథ్లుగా గుర్తించారు. వీరున్న ప్రాంతాన్ని గుర్తించి, అన్ని జాగ్రత్తలు తీసుకుంటూ ఆపరేషన్ కొనసాగిస్తున్నామని గఢ్వాల్ రేంజ్ ఐజీపీ రాజీవ్ స్వరూప్ చెప్పారు. కాగా, విష్ణుగఢ్–పీపల్‌కోటి జలవిద్యుత్ ప్రాజెక్టులో భాగంగా తెహ్రీ హైడ్రో డెవలప్మెంట్ కార్పొరేషన్ ఈ సొరంగ నిర్మాణం చేపట్టింది. 2023లో ఉత్తరకాశీ జిల్లాలో నిర్మాణంలో ఉన్న సిల్‌్కయారా–బార్కోట్ సొరంగంలోని ఒక భాగం కూలిపోవడంతో 41 మంది కార్మికులు చిక్కుకుపోయారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల విభాగాలతోపాటు అంతర్జాతీయ నిపుణుల సాయంతో 17 రోజుల పాటు సహాయక చర్యలు కొనసాగించి, వారందరినీ సురక్షితంగా బయటకు తీసుకురావడం తెల్సిందే. -
మళ్లీ అటకెక్కిన లావాసా ఐపీఓ
ముంబై: హిందుస్తాన్ కన్స్ట్రక్షన్ కంపెనీ(హెచ్‌సీసీ) లావాసా ప్రాజెక్ట్ ఐపీఓ(ఇనీషియల్ పబ్లిక్ ఆఫర్)ను అటకెక్కించింది. ఈ ఐపీఓను ఆపేయడం ఇది మూడోసారి. రియల్టీ రంగంలో మార్కెట్ పరిస్థితులు బాగా లేని కారణంగా లావాసా ప్రాజెక్ట్ ఐపీఓని ప్రస్తుతానికి పక్కన పెట్టామని హెచ్‌సీసీ పేర్కొంది. రియల్టీ రంగంలో పరిస్థితులు చక్కబడినప్పుడు ఐపీఓ ముసాయిదా పత్రాలను సెబికి సమర్పిస్తామని హెచ్‌సీసీ గ్రూప్ చీఫ్ ఫైనాన్షియల్ ఆఫీసర్ ప్రవీణ్ సూద్ తెలిపారు. రూ.2,000 కోట్ల సమీకరణకు గాను మొదటిసారిగా 2010, సెప్టెంబర్‌లో ఐపీఓకు రావడం కోసం సెబికి దరఖాస్తు చేసుకుంది. సెబి ఆమోదం పొంది కూడా మార్కెట్ ప్రతికూలంగా ఉండటంతో ఐపీఓను వాయిదా వేసింది.


