ఇక్కడైతే వంద.. అక్కడ రూ. 8.3 లక్షలు!
చండీగఢ్‌లో అక్కడి ప్రభుత్వం పనికిరాని పాత వస్తువులుగా భావిస్తున్నవన్నీ విదేశాల్లో లక్షలాది రూపాయలకు అమ్ముడుపోతున్నాయి. ఆ నగర రూపశిల్పి లీ కార్బుసియర్ గీసిన మాస్టర్ ప్లాన్ ఉన్న ఇనుప మ్యాన్ హోల్‌ను ప్రభుత్వం తుక్కుగా భావించి కేవలం వంద రూపాయలు అమ్మేస్తే.. అది న్యూయార్క్ నగరంలోని క్రిస్టీ వేలంశాలలో ఏకంగా రూ. 8.3 లక్షలకు అమ్ముడుపోయింది. ఇలా ఒకటి కాదు, రెండు కాదు.. వందలాది 'తుక్కు' వస్తువులు చండీగఢ్‌లో కారు చవకగా అమ్మేస్తుంటే, న్యూయార్క్, లండన్, షికాగో, ప్యారిస్ లాంటి మహానగరాల్లోని అంతర్జాతీయ వేలం శాలల్లో మాత్రం లక్షల రూపాయలకు అమ్ముడవుతున్నాయి.
దీని వెనుక పెద్ద స్కాం ఉందని ఇప్పుడు అంటున్నారు. హెరిటేజ్ వస్తువులను తుక్కు పేరు చెప్పి కారు చవకగా అమ్మేసి.. విదేశాల్లోని వేలం శాలల్లో మాత్రం లక్షలు సంపాదిస్తున్నారన్న ఆరో్పణలు వినవస్తున్నాయి. నగరానికి చెందిన ప్రముఖ న్యాయవాది అజయ్ జగ్గా దీనిపై కేంద్ర సాంస్కృతిక వ్యవహారాల మంత్రిత్వ శాఖకు ఓ లేఖ రాశారు. ఈ మొత్తం స్కాంపై సీబీఐ విచారణ జరిపించాలని ఆయన కోరారు. ఇది 2జీ స్కాం లాంటిదేనని ఆయన అభివర్ణించారు. ఇలా కొంతమంది పెద్దలు కోట్లాది రూపాయలు వెనకేసుకున్నట్లు ఆరోపించారు.