breaking news
happiness moments
-
ఆత్మగ్లాని
ముసలావిడా కూతురూ వరండాలో విశ్రాంతి తీసుకుంటున్నప్పుడు, దూరంగా రోడ్డుమీద మొదటిసారిగా షిప్ట్లెట్ కనిపించాడు.అతనికి పనీపాటా ఉన్నట్లు లేదు. ఊళ్లు తిరుగుతూ కాలక్షేపం చేస్తుంటాడు. దేశదిమ్మరి. ఎడమ చేతి కోటు చెయ్యి సగం వేలాడుతోంది! ఎప్పుడు తెగిపోయిందో? అతను ఇంటి ఆవరణలోకి వచ్చిందాకా ముసలావిడ కదల్లేదు. లావుగా, బొద్దుగా ఉన్న కూతురు సడెన్‌గా కొత్త మనిషినిచూసి ఆనందం పట్టలేక ఎగురుతూ... మాట్లాడలేని నోటితో అరిచింది.పనిముట్ల డబ్బా కిందపెట్టి, టోపీ తీసి పట్టుకుని, అభివాదం చేశాడు షిప్ట్లెట్. నల్లటి జుత్తు నిగనిగలాడుతోంది. యువకుడే కానీ లోపల ఏదో అసంతృప్తి. జీవితాన్ని అర్థం చేసుకున్నతనం.షిప్ట్లెట్ వెనక్కు తిరిగి అస్తమిస్తున్న సూర్యుడ్ని చూశాడు. ముసలావిడ యువకుడ్ని పరిశీలనగా చూసింది. ‘‘మేడం, ఇంతటి అద్భుతమైన సూర్యాస్తమయాన్ని చూడగలగటమే నా అదృష్టం. ఎన్ని కష్టాలొచ్చినా సరే ఇలాంటిచోటు వదిలి వెళ్లాలనిపించటం లేదు’’ అన్నాడు యువకుడు కింది మెట్టు మీద కూర్చుని. ‘‘దానికేం రోజు ఇలాగే చూస్తూ కూర్చో’’ అంది ముసలావిడ కుర్చీలో వెనక్కు వాలి. షిప్ట్లెట్ చూపులు పరిసరాల్ని నిశితంగా పరిశీలించాయి. ఓ మూలన బోరుబావి, అత్తి చెట్టు, నాలుగు కోళ్లు, షెడ్డులో కారు.‘‘డ్రైవ్ చేస్తారా?’’‘‘పదిహేనేళ్ల నుంచీ అదక్కడే ఉంది. నా భర్త మరణించాక దాన్ని ముట్టుకోలేదు.’’‘‘పాతతరం కార్లే వేరు. ఇప్పుడెక్కడ చూసినా టోపీ వేసే వ్యాపారమే. లోకం పాడైపోయింది.’’‘‘అవును. సరే కానీ, నువ్వెక్కడి నుంచి వస్తున్నావు?’’‘‘నా పేరు టాం షిప్ట్లెట్’’ అంటూ గొణిగాడు.‘‘సంతోషం. నా పేరూ, నా కూతురి పేరూ ఒకటే. లూసీ నెల్. సరే.. ఏ ఊరు మీది?’’షిప్ట్లెట్ మాట్లాడలేదు. జేబులోంచి పొగాకూ, కాగితాలూ తీసి తాపీగా సిగరెట్ రోల్ చేశాడు. అగ్గిపుల్ల వెలిగించి మంట చివరకి వచ్చిందాకా ఆగి (కాలుతుందనే భయంతో ముసలావిడ కూతురు శబ్దాలూ సైగలూ చేసింది) వెలిగించాడు.‘‘ఈ రోజుల్లో ఎవర్నీ నమ్మటానికి లేదు. నా పేరు షిప్ట్లెట్ అని ముందే చెప్పాను. నా ఊరు టార్వాటర్. కానీ నేనెవరో మీకు తెలియదు. మరో పేరూ, మరో ఊరూ కావచ్చు కదా’’‘‘నీ గురించి మాకేమీ తెలియదు’’ అంటూ విసుక్కుంది ముసలావిడ.‘‘ఈ లోకంలో అబద్ధాలాడేవాళ్లకు తక్కువేమీ లేదు. ఇవన్నీ ఎందుకు? నేను మనిషిని. మగాడ్ని. ఇంతకూ మనిషంటే ఎవరు?’‘‘సరే.. సరే.. ఆ డబ్బాలో ఏముంది?’’ అడిగింది ముసలావిడ. ‘‘పనిముట్లు. నేను వడ్రంగిని.’’‘‘ఓహో.. పని చేతవునన్నమాట. తిండిపెడతాను. ఉండటానికో చోటు చూపిస్తాను. జీతం మాత్రం ఇవ్వలేను. ముందరే చెప్పేస్తున్నా’’ అంది ముసలావిడ. ‘‘అమ్మా, మనిషన్నాక డబ్బే సర్వస్వం కాదు’’ అన్నాడు నెమ్మదిగా. ముసలావిడ మాట్లాడలేదు. కూతురు అతడ్నే దీక్షగా చూసింది.‘‘లోకంలో అందరికీ కావలసింది డబ్బే. అసలు మనిషంటే ఎవరు? డబ్బు కోసమే మనిషి పుట్టాడా ఏమిటి?’’ ఇన్నేళ్లొచ్చిన ఆవిడ కూడా అలాగే అనుకుంటుందా అనుకుంటూ ప్రశ్నించాడు. ఇలాగే మరెన్నో ప్రశ్నలు. ముసలావిడ దగ్గర సమాధానాలు లేవు.ఈ ఒంటి చెయ్యి మనిషి ఇంటీ మీద కప్పు సరిచెయ్యగలడా?యువకుడి వయసు ఇరవై ఎనిమిది. ఎన్నెన్నో ఉద్యోగాలు చేశాడు. దేశదేశాలు తిరిగొచ్చాడు. ‘‘పెళ్లైందా?’’చాలాసేపు నిశ్శబ్దం.‘‘తెల్లకాగితంలాంటి మనసున్న ఆడవాళ్లు కావాలి. అలాంటి అమాయకమైన ఆడపిల్లలు ఈ లోకంలో ఎక్కడున్నారండీ? తెలివిమీరిన నెరజాణలు నాకక్కర్లేదు.’’కూతురు ముందరికి వంగి మోకాళ్లమీద తల పెట్టుకుని కూర్చుంది. ఉన్నట్టుండి కింద పడి కాళ్లూ చేతులూ కొట్టుకుంది. షిప్ట్లెట్ ఆమెను లేపి, కూర్చీలో వెనక్కు వాల్చి కూర్చోబెట్టి.... ‘‘మీ అమ్మాయా?’’ అనడిగాడు ముసలావిడని.‘‘ఒక్కగానొక్క కూతురు. నా బంగారు కొండ. దాన్ని విడిచి ఒక్క క్షణమైనా ఉండలేను. అదెంత తెలివైందనుకున్నావ్? ఇంటిపనులన్నీ చెయ్యగలదు. ఇల్లూడుస్తుంది. భలే చలాకీ పిల్ల. దానెత్తు బంగారం ఇస్తానన్నా దాన్నెవరికీ ఇవ్వను.’’‘‘బాగా చెప్పారు. పెళ్లి పేరుతో అమ్మాయిని దూరం చేసుకోకండి.’’‘‘ఇక్కడ ఉండటానికి ఇష్టపడ్డవాడే దీన్ని చేసుకోవాలి.’’చీకట్లో మెరుస్తున్న కారు బంపర్ వైపు చూశాడు షిప్ట్లెట్. ‘‘ఇక్కడున్న అన్ని వస్తువులనూ రిపేర్ చెయ్యగలను. తుంటిచెయ్యివాడని తీసిపారెయ్యకండి. పనిలో నేనెవరికి తీసిపోను’ అంటూనే మరి కాస్సేపు ఆలోచించి అన్నాడు. ‘‘మనిషన్న తర్వాత నీతి ఉండాలి. జ్ఞానం ఉండాలి’’ అని. షిప్ట్లెట్ మాటలు వాళ్లని ఇంప్రెస్ చెయ్యలేదు. ‘‘పని చేస్తే తిండి పెడతాను. రాత్రికి కార్లో పడుకో’’ అంది ముసలావిడ.‘‘అదేం కష్టం! పూర్వకాలంలో సన్నాసులు శవపేటికల్లోనే రోజూ పడుకునేవారట’’ అన్నాడు షిప్ట్లెట్.‘‘ఆ కాలం వేరు’’ తెల్లారే కప్పు వెయ్యటం ప్రారంభించాడతను. ముసలావిడ కూతురు అతడ్నే చూస్తూ కూర్చుంది. వారం రోజుల్లో పని పూర్తయింది. విరిగిన మెట్లు సరిచేశాడు. చుట్టూ కంచె పూర్తి చేశాడు. పశువుల కొట్టం కట్టాడు. బ్రహ్మచెముడున్న లూసీనెల్కి ‘బర్డ్’ అనే మాట పలకడం నేర్పించాడు. ఆ పిల్ల రోజంతా చప్పట్లు కొడుతూ ‘బర్ర్ర్ర్ర్ట్’’ అంటూ అల్లరి చేసింది.దూరంనించి అన్నీ చూస్తూ తృప్తిగా నిట్టూర్చింది తల్లి. ‘అర్జెంట్‌గా అల్లుడు కావాలి. ఇక ఆలస్యం కాకూడదు’.కారు కిటికీలోంచి కాళ్లు బయటికి పెట్టి. వెనక సీట్లో పడుకున్నాడు షిప్ట్లెట్. వెంట బ్లేడూ, నీళ్ల గ్లాసూ, అద్దం ముక్కా తెచ్చుకున్నాడేమో... షేవ్ చేసుకుని నీటుగా తయారయ్యాడు. కోటును హాంగర్‌కు తగిలించి ఓ మూలన వేలాడదీశాడు.సాయంత్రాలు ఆడవాళ్లిద్దరూ వాలుకుర్చీలో ఊగినప్పుడు, మెట్లమీద కూర్చుని కబుర్లు చెప్పాడు. ఇల్లూ. చిన్న పొలం బాగుపడ్డాయి.‘‘ఒళ్లొంచి శ్రద్ధగా పనిచేస్తే ఏమైనా సాధించవచ్చు. సొంత ఇంటిలా చూసుకున్నాను. అందుకే ఇంత చేశాను’’ అన్నాడు. ‘మూలపడిన కారు బాగుచెయ్యాలి’ అనుకుంటూ బాయ్నెట్ తెరిచి చూశాడు. ‘‘కారంటే ఇలా ఉండాలి. ఇప్పటి కార్లా? ధరలెక్కువా, క్వాలిటీ తక్కువా! ఆ రోజుల్లో ఒక్క మనిషి మొత్తం కారు అసెంబుల్ చేసేవాడు. ఇప్పుడు ఒక్కొక్క బోల్టుని ఒక్కొక్కడు బిగిస్తాడు’’ అన్నాడు. ‘‘అవును’’ అంది ముసలావిడ.‘‘అసలు ఈ రోజుల్లో ఎవరికీ పనిమీద శ్రద్ధ లేదే! సొంత మనుషులనుకోవటం వల్లనే కదా, మాటలు రాని లూసీనెల్కు ఒక్క మాటైనా నేర్పించాను’’‘‘దానికింకేమైనా నేర్పించు’’ అంది ముసలావిడ.‘‘ఏం నేర్పించాలో చెప్పండి?’’‘‘ప్రియుడా..! అనమను’’ షిప్ట్లెట్కు ముసలావిడ మనసులోని మాట బాగానే అర్థమైంది. తెల్లారి అతను కారు రిపేర్ ప్రారంభించాడు. కొత్త ఫాన్ బెల్ట్ వేస్తే కారు నడుస్తుందన్నాడు. డబ్బులిస్తానంది ముసలావిడ.‘‘దానికి పెళ్లిచేసి పంపించే ఉద్దేశం ఎంత మాత్రం లేదు. కానీ యోగ్యుడైన కుర్రాడు వచ్చి ‘మీతోపాటే ఉంటాను’ అంటే ఆలోచించవచ్చు. ఉండటానికో మంచి ఇల్లు, ఓ అందాలరాశి కూడా దొరుకుతుంది. తెలివైనవాళ్లెవరూ ఇంత మంచి అవకాశాన్ని వదులుకోరు.’’ ‘‘ఆమె కెన్నేళ్లు?’’ ఆసక్తి లేనట్లుగా అడిగాడు షిప్ట్లెట్.‘‘ఆ.. ఎంతా? పదిహేనో పదహారో..’’ అంది ముసలావిడ. ముప్ఫై దాకా ఉంటాయా పిల్లకు. కానీ మాటలు రాని అమాయకత్వంతో ఆమెకి అంత వయసుందని అనిపించదు. ‘‘కారుకు పెయింట్ వెయ్యకపోతే తుప్పు పట్టి పాడవుతుంది’’ అన్నాడు షిప్ట్లెట్.‘‘చూద్దాంలే’’ అంది ముసలావిడ.మర్నాడు పక్క ఊరికెళ్లి స్పేర్ పార్ట్స్, పెట్రోలు తీసుకొచ్చాడు. మధ్యాహ్నం వరకూ షెడ్లోంచి రకరకాల శబ్దాలు వెలువడ్డాయి. కూతురికి మళ్లీ మూర్ఛ వచ్చిందేమోనని పరిగెత్తుకుని వచ్చింది ముసలావిడ. ఓ మూలన కూర్చుని ‘‘బర్ర్ర్ట్’’ అంటూ కాళ్లు నేల మీద కొడుతూ అరుస్తోంది పిల్ల. భయంకరమైన రోదతో కారు, షెడ్ దాటి బయటికొచ్చింది. ‘చచ్చిన మనిషిని బతికించినట్లు’గా డ్రైవర్ సీట్లోంచి వినయంగా చూశాడు షిప్ట్లెట్. ఆ రాత్రి ముసలావిడ వ్యవహారంమాట్లాడింది. ‘‘నీకు అమాయకురాలు కావాలి. నెరజాణలు వద్దు.’’‘‘అవును’’‘‘నీ మాటకు ఎదురు చెప్పని మనిషి, నోట్లో నాలుకలేని మనిషి కావాలి. ఆ పిల్ల ఇక్కడే నీ కళ్లముందే ఉంది.’’కాళ్లు ముడిచి, పాదాలను చేతులతో పట్టుకుని కూర్చీలో కూర్చుంది లూసీనెల్. ‘‘ఆమె నిన్ను ఇబ్బందిపెట్టని మనిషి. శనివారం ముగ్గురం కలిసి వెడదాం. పక్క ఊరిలో పెళ్లి చేసుకోండి.’’మెట్లమీద కూర్చున్న షిప్ట్లెట్ ‘‘పెళ్లి వీలుపడదండీ. డబ్బులేవీ?’’ అన్నాడు ఇబ్బందిగా.‘‘దేనికి?’’‘నేను అందరిలాంటివాడ్ని కాను. భార్యకున్న చిన్నచిన్న సరదాలు తీర్చాలంటే డబ్బు కావాలి. పెళ్లి తర్వాత ఏదైనా హోటలుకు తీసికెళ్లాలా? మంచి భోజనం పెట్టించాలా? ‘పెళ్లాన్ని పువ్వుల్లో పెట్టిచూసుకోవాలిరా’ అని చెప్పింది మా అమ్మ’’‘‘లూసీ నెల్కు హోటల్ అంటే ఏమిటో కూడా తెలియదు. ఇదిగో, నా మాట వినబ్బాయ్. పర్మినెంట్ ఇల్లు, మంచినీళ్ల బావి, నోట్లో వేలుపెడితే కొరకలేని అమాయకురాలు! ఇంకా డబ్బెందుకు? అసలే ఒక చెయ్యలేని అవిటివాడివి నువ్వు. నా అన్నవాళ్లంటూ లేని బికారివి. ఇంతకన్నా మంచి సంబంధం నీకీ జన్మకు దొరకదు.’’ఆమె మాటల పరుషత్వం అతడ్ని దిమ్మెరపరచి ఉండవచ్చు.తల తిరిగింది. మాట్లాడకుండా మరో సిగరెట్ రోల్ చేసుకుని వెలిగించాడు. ‘‘మేడం, మనిషిలో రెండు భాగాలుంటాయి’’ అన్నాడు కాసేపాగి నెమ్మదిగా.‘‘ఒకటి శరీరం. మరొకటి ఆత్మ. శరీరమంటే ఇల్లు లాంటిది. ఎక్కడికీ కదలదు. ఆత్మంటే కారులాంటిది. ఒక్క దగ్గరా నిలకడగా ఉండదు’’ అంటూ వివరించాడు షిప్ట్లెట్. ‘‘చూడబ్బాయ్, మా దొడ్లో ఉన్న బావి ఎప్పుడూ ఎండిపోదు. నా ఇల్లు చలికాలంలో కూడా వెచ్చగా ఉంటుంది. ఇంటిమీద అప్పులు లేవు. కావాలంటే కోర్లుకెళ్లి దస్తావేజులు పరీక్షించుకో. కారు చూశావుగా. బంగారం లాంటి కారు’’ అంటూ మరొక్క గాలం విసిరిందా ముసలామె. ‘‘ఈ శనివారం దానికి పెయింట్ వేయించుకో. పెయింట్ డబ్బులు నేనిస్తాలే’’చీకట్లో నవ్విన షిప్ట్లెట్ పెదాలు. పడగ విప్పిన పాముల్లా మెలికలు తిరిగాయి. కాసేపాగి ‘‘మనస్సాక్షిని నమ్ముకున్నవాడ్ని. నాకేది బాగనితోస్తే అది చేస్తాను. ఎంత ఖర్చయినా సరే, పెళ్లి తర్వాత నా భార్యకు రెండు మూడు ఊళ్లు చూపించి తిప్పుకొస్తాను’’ అన్నాడు.‘‘సరే. మీ ప్రయాణానికి పదిహేను డాలర్లిస్తాను. నేనివ్వగలిగిందంతే.’’‘‘పెట్రోలు ఖర్చుకూ, హోటల్ అద్దెకూ ఆ మాత్రం సరిపోతుంది. మరి తిండికి?’’‘‘చివరి మాట.. పదేహేడు డాలర్ల యాభైసెంట్లు. ఇంక నువ్వెంత పిండినా లాభం లేదు. కావాలంటే లంచ్ కట్టిస్తాను.’’‘పిండినా’ అనే మాట అతడ్ని బాధించింది. ముసల్దాని దగ్గర బాగానే డబ్బుండకపోదు. కానీ తను డబ్బు మనిషిని కాదని ప్రకటించాడే! ‘‘ఉన్న దాంతో సర్దుకుంటాలెండి’’ అంటూ లేచాడు.శనివారంనాడు. కారుకేసిన కొత్త పెయింట్ ఇంకా ఆరనైనా లేదు. ముగ్గురూ వెళ్లి గవర్నమెంటాఫీసులో పెళ్లయిందనిపించారు. షిప్ట్లెట్కేదో ఇబ్బందిగా, ఇరకాటంగా ఉంది. ఎవరో అవమానించినట్లుగా అన్నాడు ‘‘పెళ్లి జరగాల్సిన పద్ధతి ఇది కాదు. కాగితాలమీద సంతకాలు పెడితే పెళ్లైనట్లా? నాకైతే నచ్చలేదు’’‘‘చట్టప్రకారమే జరిగిందిలే’’ అంది ముసలావిడ కాస్త కఠినంగా.‘‘చట్టం కోసం నేనా? నా కోసం చట్టమా?’’ అన్నాడు షిప్ట్లెట్ కోపాన్ని అణచుకుంటూ.ఆకుపచ్చ – పసుపురంగు కార్లో కూర్చున్నారు ముగ్గురూ. ‘‘లూసీ నెల్ అందాల భరిణ. ఎంత ముద్దొస్తోందో’’ అంది ముసలావిడ. మురిపెంగా పాలనురగలాంటి డ్రెస్‌లో, చెర్రీపళ్ల డిజైన్ ఉన్న హ్యాట్ పెట్టుకుని ఉంది పెళ్లికూతురు.‘‘నువ్వు అదృష్టవంతుడివి’’ అంది ముసలావిడ. కారింటికి చేరగానే ముసలావిడ దిగింది. లంచ్ బాక్సు కూతురికందించింది. కారు కదిలింది. కిటికీలోంచి చూస్తూ ఉబికివస్తున్న కన్నీటిని తుడుచుకుంది ముసలావిడ. ‘ఇంత వరకూ దాన్ని విడిచి ఒక్కరోజూ ఉండలేదు’ అనుకుంటూ గొణుక్కుంది.‘‘త్వరగా వస్తాంగా. నీ కూతురు నీ దగ్గర తప్ప మరెక్కడా క్షేమంగా ఉండలేదు’’ అంటూ క్లచ్ నొక్కాడు షిప్ట్లెట్. వీడ్కోలు చెప్పింది ముసలావిడ.వాతావరణం ప్రశాంతంగా ఉంది. దూరంగా కొండలు. మబ్బులు లేని ఆకాశం నులివెచ్చగా ఉంది.షిప్ట్లెట్కు కోపం తగ్గింది. కారుమీద తనకెప్పటి నుండో కోరికగా ఉంది. స్పీడు పెంచాడు. రాత్రికల్లా మోబిల్(ఊరు) చేరుకోవాలి.ఆగి, అప్పుడప్పుడూ లూసీ నెల్ వైపు చూశాడు. డబ్బాలో ఉన్న లంచ్‌ని ఎప్పుడో తినేసింది ఆ పిల్ల. కారు తనదేనన్న ఉత్సాహంలో కూడా కాస్తంత నీరసంగా ఉంది. వందమైళ్లువచ్చారు. ‘ఆమెకు మళ్లీ ఆకలేస్తోందేమో’ అనుకుంటూ, దారిపక్కన చిన్న ఊర్లో ఒక హోటల్ వద్ద ఆపి భోజనం ఆర్డరిచ్చాడు. బడలిక వల్ల లూసీ నెల్కు నిద్ర ముంచుకువస్తోంది. భోజనం వచ్చేలోగా ఆమె టేబుల్ మీద తలపెట్టి నిద్రపోయింది.‘‘లేచాక తింటుందిలే. నేను బిల్ పేచేస్తాను’’ అన్నాడు షిప్ట్లెట్. సప్లయర్ కుర్రాడు వంగి ఆమె జుత్తు సరిచేస్తూ ‘‘ఎంత అందమైన పిల్లో’’ అన్నాడు.‘‘అవును. ఎవరో హిచ్‌హైకర్. లిప్ట్ అడిగితే ఇచ్చాను. నాకు ఆలస్యమవుతోంది అర్జెంట్‌గా టస్కా లూసా (ఊరు) వెళ్లాలి’’ అంటూ బయల్దేరాడు షిప్ట్లెట్. విరక్తిగా ఉంది. వేడి పెరిగింది. కనుచూపు మేరలో ఎక్కడా చెట్టూ చేమా లేవు. అంతటా విశాలమైన మైదానాలు. తుఫాను వచ్చే సూచనలు కనిపిస్తున్నాయి. పిడుగులూ మెరుపులూ వడగళ్ల వర్షం వచ్చే సూచనలు. ఈలోగా తేమనంతా పీల్చేసుకుంటోంది గాలి.కారున్న మనిషికి బాధ్యతలు కూడా ఉంటాయని షిప్ట్లెట్ నమ్మకం. ఎవరైనా హిచ్‌హైకర్ కనిపిస్తే లిఫ్ట్ ఇవ్వాలి. రోడ్డుపక్కన సైనుబోర్డులు. ‘డ్రైవ్ కేర్ఫుల్లీ’.. ‘ది లైఫ్ యూ సేవ్.. మే బీ యువర్ ఓన్’రోడ్డు ఇరుకైంది. రెండు వైపులా దుబ్బులు. దారిలో రేకుల షెడ్డు, పెట్రోలు బంకు. ఎండ కళ్లకు కొడుతోంది. ఎరుపెక్కిన సూర్యబింబం. రోడ్డుపక్కనో కుర్రాడు కనిపించాడు. వేగం తగ్గించి వాడ్ని చూశాడు.కుడిచేతి బొటనవేలు చూపుతున్నా లిఫ్ట్ అడగటం లేదు కుర్రాడు! చెంత ఒక అట్టసూట్కేస్ ఉంది.కారాపి ‘‘లిఫ్ట్ కావాలా బ్రదర్?’’ అన్నాడు షిప్ట్లెట్.కుర్రాడు మాట్లాడకుండా డోర్ తెరిచి వచ్చి కూర్చున్నాడు. గొడవపడి ఇల్లు విడిచి వచ్చినట్టుగా ఉంది. లిఫ్ట్ ఇచ్చిన మనిషిని చూడటం ఇష్టం లేనట్టుంది. కారు విండోలోంచి మరెటో దృష్టి సారించాడు.‘‘బ్రదర్. ప్రపంచంలోకెల్లా మా అమ్మ బెస్ట్. మీ అమ్మ నెక్ట్స్ బెస్ట్’’ అన్నాడు షిప్ట్లెట్.వినిపించుకోనట్లుగా కుర్రాడు బైటిలోకాన్ని చూస్తున్నాడు.‘‘తొమ్మిది నెలలు మోసి కనిపెంచిన అమ్మ. ఊహ తెలియని మనకు మంచి చెడులు బోధించిన అమ్మ. ఈ లోకంలో ప్రేమ అనేది ఉందని మొదటిసారిగా మనకు తెలిసింది అమ్మ ద్వారా కాదూ! అమ్మ లేకపోతే అందరంఅనాథలమే కదూ..’’ అన్నాడు షిప్ట్లెట్.కుర్రాడు సీట్లో ఇబ్బందిగా కదిలాడు. చేత్తో కారు డోర్హాండిల్ పట్టుకున్నాడు.‘‘మా అమ్మ దేవత. స్వర్గంలో ఉన్న దేవదూత మా అమ్మగా వచ్చిందనుకుంటాను.’’కుర్రాడు కోపం పట్టలేక ‘‘గో టు హెల్. మా అమ్మ దెయ్యం. మీ అమ్మ రాక్షసి’’ అంటూ డోర్ తెరచుకుని, కదులుతున్న కార్లోంచి దూకాడు సూట్ కేస్‌తో సహా.ఈ పరిణామాన్ని ఊహించని షిప్ట్లెట్ మరో వంద అడుగుల తర్వాత కారాపాడు.సూర్యుడు మేఘాల చాటున దాక్కున్నాడు. కారు వెనకవైపున మరో మేఘం. ప్రపంచంలోని కల్మషమంతా తనను కబళించివేయబోతోంది. ఇంతమురికిని కడిగేయ్యటం ఎవరి తరం? ఆ పని దేవుడు చెయ్యాల్సిందే.పిడుగులు పడ్డాయి.రాళ్లవాన కురిసింది. కారు మోబిల్ వైపు పరుగుతీసింది. ఆంగ్ల మూలం : ఫ్లానెరీ ఓకానర్ అనువాదం: ముక్తవరం పార్థసారథి -
ఎన్నాళ్లో వేచిన ఉదయం
సాక్షి, ఆరిలోవ (విశాఖ తూర్పు) : సత్ప్రవర్తన కలిగిన జీవిత ఖైదీలు విశాఖ కేంద్ర కారాగారం నుంచి బాహ్య ప్రపంచంలోకి అడుగుపెట్టారు. సంవత్సరాలు తరబడి నాలుగు గోడల మధ్య గడుపుతూ కుటుంబీకులకు దూరంగా ఉన్న వారు ఎట్టకేలకు ఆదివారం విముక్తి పొందారు. రిపబ్లిక్ డే సందర్భంగా వచ్చిన క్షమాబిక్ష జీవోకి ఇప్పుడు మోక్షం కలిగింది. ఈ ఏడాది జనవరి 24న క్షమాభిక్ష జీవో విడుదలైంది. దీంతో ఆ జీవో ప్రకారం ఇక్కడి జైలు అధికారులు అర్హులైన జీవిత ఖైదీల జాబితా తయారుచేసి జైల్ శాఖ ఉన్నతాధికారులకు పంపించారు. అప్పటి నుంచి వీరంతా ఎప్పుడు విడుదలవుతామా అంటూ ఎదురు చూశారు. రిపబ్లిక్ డే, ఉగాదికి విడదులవుతామని ఆశించారు. ఆ రెండు గడువులు దాటిపోయాయి. ఎట్టకేలకు ఆ ఖైదీలకు ఆదివారం మోక్షం కలిగింది. కానీ జైలు అధికారులు పంపించిన జాబితాలోని నలుగురిని ఉన్నతాధికారులు అనర్హులుగా గుర్తించి విడదులైన జాబితా నుంచి వారి పేర్లు తొలగించారు. ప్రభుత్వం క్షమాభిక్షపై రాష్ట్రంలో విడుదల చేసిన 49 మంది జీవిత ఖైదీలలో ఇక్కడి నుంచి 13 మందికి విముక్తి కలిగింది. దీంతో మధ్యాహ్నం 1 గంటకు వారంతా ఆనందోత్సాహాలతో జైలు నుంచి బయట ప్రపంచంలో అడుగుపెట్టారు. వీరిలో ఓ మహిళా ఖైదీ తన రెండేళ్ల కుమార్తెతో విడుదల కావడం విశేషం. విడుదలైన వారిలో విశాఖపట్నంతో పాటు విజయనగరం, శ్రీకాకుళం, కడప జిల్లాలకు చెందిన వారున్నారు. విశాఖపట్నం జిల్లాకు చెందిన వారు 9 మంది, విజయనగరం జిల్లాకు చెందిన వారు ఇద్దరు, శ్రీకాకుళం, కడప జిల్లాలకు చెందిన వారు చెరో ఒక్కరు చొప్పున ఉన్నారు. క్షమాబిక్ష జీవో నిబంధనల ప్రకారం వీరందరూ రూ.50వేలు బ్యాండు పూచీకత్తుపై విడుదలయ్యారు. ప్రతి మూడు నెలలకు ఓసారి వీరంతా సంబంధిత పోలీస్ స్టేషన్‌కు వెళ్లి సంతకం చేయాల్సి ఉంది. కొబ్బరికాయలు కొట్టిన ఖైదీలు విడుదలైన ఆనందంలో ఖైదీలు జైలు ద్వారం వద్ద కొబ్బరికాయలు కొట్టారు. చెప్పులు పక్కన విడిచి కొబ్బరికాయ కొట్టి ప్రతి ఒక్కరూ జైలుకు దండం పెట్టారు. ఇది ఒక దేవాలయం లాంటిదని, మాకు జీవిత పాఠం నేర్పిందని, బాహ్యప్రపంచంలో నీతిగా బతుకుతామంటూ దండం పెట్టుకొన్నారు. విడుదలైన జీవిత ఖైదీలు వీరే విశాఖపట్నం జిల్లా నుంచి జి.శ్రీనివాస్(నాతవరం), ఎం.అప్పారావు (జి.మాడుగుల), ఎస్.సుబ్బారావు(పెదబయిలు), ఎన్.అప్పన్న (నాతవరం), ఎన్.శ్రీను(నాతవరం), ఆర్.అప్పనాయుడు(అచ్చుతాపురం), ఎ.నాయుడు(మునగపాక), బి.గోవిందరాజు(గోపాలపట్నం), ఆర్.శ్యామల(గాజువాక) విడుదలయ్యారు. విజయనగరం జిల్లా వి.టి.అగ్రహారం రెడ్డి వీధికి చెందిన జి.కృష్ణ, పెదసాము ప్రాంతానికి చెందిన ఆర్.సీతారాం, శ్రీకాకుళం జిల్లా గట్లభద్రకు చెందిన ఎం.బాబూరావు, కడప జిల్లాకు చెందిన ఎస్.రవికుమార్ విడుదలయ్యారు. మళ్లీ నేరం చేస్తే జీవితాంతం జైలులోనే జైలు నుంచి విడుదలైన జీవిత ఖైదీలకు డిప్యూటీ సూపరింటెండెంట్ వేంకటేశ్వర్లు నిబంధనలు వివరించారు. క్షమాభిక్ష జీవో ప్రకారం ఇప్పుడు విడుదలైన ఖైదీలు మళ్లీ నేరాలకు పాల్పడకూడదన్నారు. అలాంటి వారికి క్షమాభిక్ష రద్దయి జీవితాంతం జైలులోనే గడపాల్సి వస్తుందన్నారు. బయట ప్రపంచంలో గౌరవంగా జీవించాలని సూచించారు. విడుదలైన వారంతా సంబంధిత పోలీస్ స్టేషన్‌కు ప్రతి మూడు నెలలకు ఓసారి వెళ్లి సంతకం చేయాలన్నారు. ఇప్పుడు ఇక్కడ మిగిలిన శిక్ష ముగిసినంతవరకు పోలీస్ స్టేషన్లో మూడు నెలలకు ఓసారి సంప్రదించాల్సిందేనని సూచించారు. -
‘బాల’కృష్ణం వందే జగద్గురుం..