breaking news
Hand Ball Tournament
-
తెలంగాణ జట్లకు టైటిల్స్
మహబూబ్నగర్ : భారత స్కూల్గేమ్స్ సమాఖ్య (ఎస్జీఎఫ్ఐ) జాతీయ హ్యాండ్బాల్ చాంపియన్షిప్లో తెలంగాణ అండర్–17 జట్లు చెలరేగాయి. బాలబాలికల విభాగాల్లో విజేతలుగా నిలిచి టైటిళ్లను కైవసం చేసుకున్నాయి. బుధవారం జరిగిన బాలుర ఫైనల్లో తెలంగాణ 17–13తో ఢిల్లీపై విజయం సాధించింది. బాలికల తుది పోరులోనూ తెలంగాణ 10–4తో ఢిల్లీని చిత్తుగా ఓడించింది. పోటీల అనంతరం జరిగిన బహుమతుల ప్రదానోత్సవంలో ఎమ్మెల్యే శ్రీనివాస్ గౌడ్ ముఖ్య అతిథిగా విచ్చేసి విజేతలకు ట్రోఫీలను అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ క్రీడా టోర్నమెంట్ల నిర్వహణకు నిధుల కొరత ఉందని, భవిష్యత్లో జరిగే పోటీలకు ప్రభుత్వం నుంచి నిధులు వచ్చేలా తనవంతు కృషి చేస్తానని ఆయన చెప్పారు. జాతీయ స్థాయిలో ఆకట్టుకున్న తెలంగాణ జట్లను అభినందించారు. -
హ్యాండ్బాల్ టోర్నీ ప్రారంభం
విజయవాడ స్పోర్ట్స్ : కృష్ణా యూనివర్సిటీ అంతర్ కళాశాలల పురుషుల హ్యాండ్బాల్ టోర్నీ స్థానిక పీబీ సిద్ధార్థ కళాశాలలో ఆదివారం ప్రారంభమైంది. ఈ పోటీలను సిద్ధార్థ అకాడమీ అధ్యక్షుడు నల్లూరి వెంకటేశ్వర్లు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆటగాళ్లు గెలవాలన్న తపనతోపాటు క్రీడా స్ఫూర్తిని అలవర్చుకోవాలన్నారు. లక్ష్యాలను నిర్దేశించుకుని నిత్యం సాధన చేసి రాణించాలన్నారు. పీబీ సిద్ధార్థ కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ ఎం.రమేష్, కళాశాల డైరెక్టర్ వేమూర్తి బాబురావు, ఎస్ఆర్ఆర్ కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ వి.రవి, కృష్ణా యూనివర్సిటీ స్పోర్ట్స్ బోర్డు కార్యదర్శి డాక్టర్ ఎన్.శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. తొలి రోజు ఫలితాలు : నాకౌట్ మ్యాచ్లో సప్తగిరి కళాశాల జట్టుపై 6-24 తేడాతో పీబీ సిద్ధార్థ కళాశాల జట్టు గెలుపొందింది. లీగ్ మ్యాచ్ల్లో శాతవాహన కళాశాల జట్టుపై 18-35 తేడాతో కేబీఎన్ కళాశాల జట్టు విజయం సాధించింది. ఎస్ఆర్ఆర్ కళాశాల–పీబీ సిద్ధార్థ కళాశాల జట్ల మధ్య మ్యాచ్ జరుగుతుండగా, లైట్ ఫెయిల్ కావడంతో రేపటికి వాయిదా వేశారు.