‘నవీ’ ఎయిర్పోర్టు ప్రాజెక్టు టెండర్ల ప్రక్రియ మొదలు
సాక్షి, ముంబై: నవీముంబై అంతర్జాతీయ విమానాశ్రయానికి టెండర్లను ఆహ్వానించే ప్రక్రియ ఎట్టకేలకు ప్రారంభమైంది. ప్రపంచంలోనే అతి పెద్ద విమానాశ్రయం (గ్రీన్ఫీల్డ్)గా ఇది రూపుదిద్దుకోనుంది. ఈ నేపథ్యంలో ఈ ప్రాజెక్టుకు మరింత ప్రాధాన్యం లభించింది. నవీముంబైలో అంతర్జాతీయ విమానాశ్రయ ప్రాజెక్టు నిర్మాణానికి సంబంధించి కేంద్ర ప్రభుత్వం నియమించిన కమిటీ 2000వ సంవత్సరంలో తాత్కాలికంగా అనుమతి ఇచ్చింది.
అప్పటినుంచి ఈ ప్రాజెక్టు చర్చల్లోకి వచ్చింది. ప్రధానమంత్రి కార్యాలయ వర్గాలు చొరవ తీసుకోవడంతో ఈ ప్రాజెక్టు ఎదురైన అడ్డంకులన్నీ తొలగిపోయాయి. వివిధ శాఖల నుంచి దాదాపు అనుమతులన్నీ లభించాయి. దీంతో ఈ విమానాశ్రయ నిర్మాణానికి మార్గం సుగమమైంది. ఇందుకు అవసరమైన స్థలసేకరణ విషయంలో స్థానికుల నుంచి తీవ్ర వ్యతిరేకత వెల్లువెత్తడం, నష్టపరిహారం, పునరావాసం తదితర సమస్యలను ప్రభుత్వం ఎదుర్కోవాల్సి వచ్చింది. ఎట్టకేలకు అక్కడి గ్రామాల రైతులు, ప్రజలు స్థలాన్ని ఇచ్చేందుకు అంగీకరించడంతో ఈ సమస్యకూడా పరిష్కారమైంది.
నష్ట పరిహారం ఎక్కువమొత్తంలో చెల్లించాలనే విషయంలో ఇప్పటికీ ఆరు గ్రామాల ప్రజలు గట్టి పట్టుదలతో ఉన్నారు. త్వరలో స్థానికులతో చర్చలు జరిపి, వారిలో నెలకొన్న అనుమానాలను నివృత్తి చేసేందుకు ప్రయత్నిస్తామని సిటీ ఇండ ్రస్ట్రియల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ (సిడ్కో) అధికారులు స్పష్టం చేశారు. మరోవైపు వివిధ శాఖల నుంచి అనుమతులు లభించడంతో ఇక టెండర్లను ఆహ్వానించాలని ప్రభుత్వం నిర్ణయించింది.