breaking news
Graduate constituency
-
రాయలసీమలో ఎమ్మెల్సీ ఎన్నికల కోలాహలం
సాక్షిప్రతినిధి కర్నూలు: రాయలసీమలో ఎమ్మెల్సీ ఎన్నికల కోలాహలం మొదలైంది. రాయలసీమ పశ్చిమ నియోజకవర్గం నుంచి పట్టభద్రుల కోటా ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులను ప్రధాన పార్టీలైన వైఎస్సార్సీపీ, టీడీపీ ప్రకటించాయి. వైఎస్సార్‌కాంగ్రెస్ పార్టీ తరఫున ప్రస్తుత ఎమ్మెల్సీ వెన్నపూస గోపాల్‌రెడ్డి తనయుడు వెన్నపూస రవీంద్రారెడ్డి, టీడీపీ తరఫున భూమిరెడ్డి రామగోపాల్‌రెడ్డి బరిలో నిలవనున్నారు. వామపక్షపార్టీలు శనివారం తమ అభ్యర్థిని ప్రకటించనున్నాయి. వీరితో పాటు స్వతంత్ర అభ్యర్థులుగా మరికొందరు పోటీ చేయనున్నారు. వీరంతా ఇప్పటికే మూడు జిల్లాలలోని ఎమ్మెల్యేలు, కీలక నేతలను కలిసి మద్దతు కోరుతున్నారు. ప్రత్యేక సమావేశాలు రాయలసీమ పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్సీగా ఎన్జీవో సంఘం మాజీ అధ్యక్షుడు వెన్నపూస గోపాల్‌రెడ్డి కొనసాగుతున్నారు. 2023 మార్చికి ఈయన పదవీకాలం ముగుస్తుంది. ఈ క్రమంలో ఈ స్థానం భర్తీ చేసేందుకు ఎన్నికల కమిషన్ సెప్టెంబర్‌లో నోటిఫికేషన్ జారీ చేయనుంది. నోటిఫికేషన్ తర్వాత ఓటరు నమోదు ప్రక్రియ వేగవంతం అవుతుంది. ఆపై ఫిబ్రవరిలో ఎన్నికలు జరగనున్నాయి. ఈ క్రమంలో ప్రధాన రాజకీయపార్టీల్లో ఎన్నికల వేడి మొదలైంది. ఇప్పటికే అభ్యర్థులు ఖరారైన వారితో పాటు బరిలో నిలవాలనుకుంటున్న స్వతంత్రులు కర్నూలుతో పాటు అనంతపురం, వైఎస్సార్ జిల్లాలలో జోరుగా తిరుగుతున్నారు. ఉపాధ్యాయులతో ప్రత్యేకంగా సమావేశాలు నిర్వహిస్తున్నారు. ఇతర ఉద్యోగులతో కూడా యూనియన్ల వారీగా, శాఖల వారీగా కలిసి మద్దతు కోరుతున్నారు. నామమాత్రపు పోటీ టీడీపీ తరఫున బరిలో దిగుతున్న రామగోపాల్‌రెడ్డి పులివెందుల నియోజకవర్గవాసి. ద్వితీయశ్రేణి నాయకుడు కావడంతో మూడు జిల్లాల్లో ఎవ్వరికీ పరిచయం లేదు. పైగా మూడు జిల్లాలలోని 38 అసెంబ్లీ నియోజకవర్గాల్లో 36 స్థానాల్లో వైఎస్సార్సీపీ ఎమ్మెల్యేలు విజయం సాధించారు. వైఎస్సార్ జిల్లాతో పాటు కర్నూలులోనూ టీడీపీ ఎమ్మెల్యేలు, ఎంపీలు లేరు. కేవలం హిందూపురం, ఉరవకొండలో మాత్రమే టీడీపీ ఎమ్మెల్యేలు ఉన్నారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఎమ్మెల్యేల పాత్ర కీలకంగా ఉంటుంది. టీడీపీ తరఫున బరిలో ఉన్నా పెద్ద ప్రభావం ఉండకపోవచ్చని, వైఎస్సార్సీపీ అభ్యర్థికే విజయావకాశాలు మెండుగా ఉన్నాయని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. పోటీలో సీపీఐ, సీపీఎం అభ్యర్థులు సీపీఐ తరఫున వైఎస్సార్ జిల్లా నుంచి ఈశ్వరయ్య బరిలోకి దిగే అవకాశం ఉంది. గత ఎన్నికల్లో కూడా ఈయన పోటీ చేసి ఓడిపోయారు. ఈ దఫా కూడా బరిలోకి దిగే ఆలోచనలో ఉన్నారు. అలాగే సీపీఎం తరఫున అనంతపురం నుంచి రాంభూపాల్‌రెడ్డి పోటీ చేసే అవకాశం ఉంది. ఈ నెల 23న సీపీఎం దీనిపై సమావేశం నిర్వహించి నిర్ణయం తీసుకోనుంది. గత ఎన్నికల్లో సీపీఎం తరఫున గేయానంద్ పోటీ చేశారు. అనారోగ్య కారణాలతో ఈయన ఈ దఫా బరిలో ఉండటం లేదు. ఈ క్రమంలోనే రాంభూపాల్‌ను బరిలోకి దింపేయోచనలో ఆపార్టీ ఉంది. ముఖ్య నేతలతో మంతనాలు రవీంద్రారెడ్డితో పాటు రామగోపాల్‌రెడ్డి ఇప్పటికే రాయలసీమలోని ముఖ్య నేతలను కలిశారు. మూడు జిల్లాల్లోని ఎమ్మెల్యేలు, ఎంపీలను రవీంద్రారెడ్డి స్వయంగా కలిసి మద్దతు కోరారు. ఉపాధ్యాయులు, ఎన్జీవో సంఘాలతో కూడా రవి కలిశారు. వీరంతా రవికి సానుకూలంగా స్పందించారు. అలాగే రామగోపాల్‌రెడ్డి టీడీపీ ఇన్‌చార్జ్‌లను కలిశారు. ప్రస్తుతం పార్టీ పరిస్థితి బాగోలేదని, పోటీ వద్దన్నా పార్టీ వినలేదని, పోటీ చేసి ఓడిపోవడం కంటే పోటీకి దూరంగా ఉంటే గౌరవంగా ఉంటుందని వైఎస్సార్ జిల్లాలోని ఇద్దరు టీడీపీ ముఖ్య నేతలు రామగోపాల్రెడ్డితోనే అన్నారు. దీన్నిబట్టే టీడీపీ నేతలు ఈ ఎన్నికల్లో ఏమేరకు పనిచేస్తారు? ఎలాంటి ప్రభావం ఉండబోతోందనేది ఇట్టే తెలుస్తోంది. గెలుపు నల్లేరుమీద నడకే! వెన్నపూస రవీంద్రారెడ్డి, రామగోపాల్‌రెడ్డి వైఎస్సార్సీపీ, టీడీపీ తరఫున బరిలో నిలవనున్నారు. అలాగే అనంతపురం జిల్లా నుంచి పోతుల నాగరాజు, బోరంపల్లి ఆంజనేయులు, వైఎస్సార్ జిల్లా నుంచి బ్లడ్ టూ లివ్ వ్యవస్థాపకుడు పట్టుపోగుల పవన్‌కుమార్ స్వతంత్ర అభ్యర్థులుగా పోటీ చేసేందుకు సిద్ధమయ్యారు. వెన్నపూస రవీంద్రారెడ్డి అనంతపురం జిల్లా వాసి కాగా, భూమిరెడ్డి వైఎస్సార్ జిల్లాకు చెందిన వారు. వైఎస్సార్సీపీ అభ్యర్థి కావడం వెన్నపూస రవీంద్రారెడ్డి ప్రధాన బలంగా ఉంది. 2019 సార్వత్రిక ఎన్నికలతో పాటు ఆపై జరిగిన స్థానిక, పుర పోరులో వైఎస్సార్సీపీ ప్రభంజనం సృష్టించింది. ప్రజల్లో ఆపార్టీకి ఉన్న ఆదరణతో అలాంటి ఫలితాలు వచ్చాయి. పైగా వైఎస్సార్సీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత గ్రామ, వార్డు సచివాలయాలు ఏర్పాటు చేసి చరిత్రలో ఎన్నడూ లేనవిధంగా రాష్ట్రవ్యాప్తంగా 1.35 లక్షల ఉద్యోగాలు కల్పించింది. వేలాదిమంది పట్టభద్రులు ప్రభుత్వ కొలువులు సాధించి, జీవితాల్లో స్థిరపడ్డారు. ప్రొబిషన్ పూర్తయిన ఉద్యోగులను రెగ్యులర్ చేశారు. మూడు జిల్లాలలో 30 వేలమంది సచివాలయ ఉద్యోగులు ఉన్నారు. వీరంతా ప్రభుత్వానికి సానుకూలంగా ఉండే అవకాశం ఉంది. వెన్నపూస రవీంద్రారెడ్డి తండ్రి, ప్రస్తుత ఎమ్మెల్సీ గోపాల్‌రెడ్డి ఉమ్మడి రాష్ట్రంలో ఎన్జీవో రాష్ట్ర అధ్యక్షుడిగా పనిచేశారు. ఉద్యోగుల కోసం సుదీర్ఘంగా పోరాడిన వ్యక్తి. రాయలసీమలో విస్తృత పరిచయాలు ఉన్నాయి. టీడీపీ అధికారంలో ఉన్న సమయంలో 2017 ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఘన విజయం సాధించారు. ఆ ఎన్నికల్లో రవీంద్రారెడ్డి క్రియాశీలకంగా వ్యవహరించారు. ప్రస్తుత ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఆయన విజయం నల్లేరుమీద నడకే అని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. పెరగనున్న ఓటర్ల సంఖ్య గత ఎన్నికల్లో పట్టభద్రుల కోటాలో 2.53 లక్షలమంది ఓటు హక్కు నమోదు చేసుకున్నారు. ప్రస్తుత ఎన్నికల్లో ఈ సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంది. గతంతో పోలిస్తే ఓటు హక్కు, నమోదుపై పట్టభద్రుల్లో మరింత చైతన్యం పెరగడమే ఇందుకు కారణం. మూడు జిల్లాల్లో 90 వేలకు తక్కువ లేకుండా కొత్త ఓట్లు నమోదయ్యే అవకాశం ఉంది. -
ఎమ్మెల్సీ ఎన్నికలకు నగారా
తెలంగాణలోని రెండు పట్టభద్రుల స్థానాల ఎన్నికకు సీఈసీ షెడ్యూల్ ఈ నెల 19న నోటిఫికేషన్.. 26 వరకు నామినేషన్లు.. మార్చి 16న ఎన్నికలు.. 19న ఫలితాలు ఆంధ్రప్రదేశ్‌లోని రెండు ఉపాధ్యాయ ఎమ్మెల్సీ స్థానాలకూ ఎన్నికలు సాక్షి, హైదరాబాద్: శాసనమండలిలో రెండు స్థానాలకు ఎన్నికల నగారా మోగింది. మహబూబ్‌నగర్-రంగారెడ్డి-హైదరాబాద్, వరంగల్-ఖమ్మం-నల్లగొండ పట్టభద్రుల నియోజకవర్గాలకు మార్చి 16న ఎన్నికలు జరుగనున్నాయి. ఆంధ్రప్రదేశ్‌లోనూ ‘తూర్పు-పశ్చిమగోదావరి’, ‘కృష్ణా-గుంటూరు’ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ నియోజకవర్గాలకు కూడా ఎన్నికలు జరుగనున్నాయి. ఈ మేరకు కేంద్ర ఎన్నికల సంఘం బుధవారం షెడ్యూల్ విడుదల చేసింది. ఈ నెల 19న నోటిఫికేషన్ విడుదల చేస్తారు. నామినేషన్ల దాఖలుకు 26 తుదిగడువు. 27న నామినేషన్ల పరిశీలన.. మార్చి 2 వరకు ఉపసంహరణకు గడువు. అదే నెల 16న ఎన్నికలు నిర్వహించి.. 19న ఓట్లు లెక్కించి, ఫలితాలను విడుదల చేస్తారు. పట్టభద్రుల నియోజకవర్గాల నుంచి ఎమ్మెల్సీలుగా ఉన్న కె.నాగేశ్వర్ (మహబూబ్‌నగర్-రంగారెడ్డి-హైదరాబాద్), కపిలవాయి దిలీప్ కుమార్ (వరంగల్-ఖమ్మం-నల్లగొండ)ల పదవీ కాలం మార్చి 29వ తేదీతో ముగుస్తోంది. దీంతో ఎన్నికలు జరుగుతున్నాయి. వాస్తవానికి మార్చి 29వ తేదీన ఎమ్మెల్యే కోటాలో ఎన్నికైన ఏడుగురు ఎమ్మెల్సీల పదవీకాలం కూడా ముగుస్తోంది. కానీ ముందుగా కేవలం రెండు పట్టభద్రుల నియోజకవర్గాల ఎన్నికకే షెడ్యూలు వచ్చింది. -
పట్టభద్రుల నమోదు ఇలా..
వైరా : పట్టభద్రుల నియోజకవర్గంలో ఓటర్ల జాబితాలో సవరణకు అధికారులు షెడ్యూల్ ఖరారు చేశారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో గ్రాడ్యుయేట్ నియోజకవర్గం నుంచి అభ్యర్థిని ఎన్నుకునేందుకు వీరికి అవకాశం ఉంటుంది. ఓటర్లుగా పేరు నమోదు చేసుకోవడానికి, తప్పులు సరిచేసుకునేందుకు, మార్పులు, చేర్పులతో పాటు పేర్లు తొలగించడానికి అవకాశం కల్పించారు. ఈ నెల 25 నుంచి డిసెంబర్ 16 వరకు మార్పులు చేసేందుకు అవకాశం ఉంది. మరి ఏయే దరఖాస్తుకు ఎలాంటి ఫారం కావాలి... అవి ఎక్కడ దొరుకుతాయి... ఎక్కడ దరఖాస్తు చేయాలి..? తదితర వివరాలు ఇలా... దరఖాస్తు విధానం దరఖాస్తును ఇంటర్నెట్ ద్వారా http://ec-.in/ecimain1/formsvoters.aspx లింక్‌ను క్లిక్ చేసి డౌన్లోడ్ చేసుకోవచ్చు. దరఖాస్తులో పూర్తి వివరాలు కరెక్ట్‌గా నమోదు చేయాలి. ఫారంలో చూపిన చోట ఈ-మెయిల్, ఫోన్ నంబరు ఇస్తే నమోదు వివరాల సమాచారం సులభంగా తెలుసుకోవచ్చు. దరఖాస్తుకు జత చేయాల్సినవి... పట్టభద్ర (డిగ్రీ) ధ్రువీకరణ పత్రం ఓటరు గుర్తింపు కార్డు అర్హతలు ఇవీ... నియోజకవర్గంలో స్థానికంగా నివాసం ఉండాలి. 2014 జనవరి 1వ తేదీకి మూడేళ్లకు ముందు భారతదేశంలో ఏదైనా విశ్వవిద్యాలయంలో పట్టభద్రులై ఉండాలి. (డిగ్రీ పూర్తి చేసి మూడేళ్లు పూర్తి కావాలి) దేనికి ఏ ఫారం..? కొత్త ఓటరుగా దరఖాస్తు చేసుకునే వారు ఫారం 18 పేరును తొలగించేందుకు ఫారం 7 ఓటు హక్కులో ఏమైనా మార్పులు చేయాలంటే ఫారం 8ఏ ఓటు హక్కులో కొత్తగా చేర్పులు చేయాలంటే ఫారం 8 పట్టభద్రుల నియోజకవర్గంలో ఓటు హక్కు కలిగి ఉన్న ఓటర్లు ఏమైనా మార్పులు, చేర్పులు చేసుకునేందుకు పాస్‌పోర్ట్ సైజ్ ఫొటోను జత చేయాలి. కొత్తగా పేరు నమోదు చేసుకునే వారు, పేరును తొలగించుకోవాలని అనుకునేవారు ఫొటో జత చేయాల్సిన అవసరం లేదు. దరఖాస్తు ఎవరికి సమర్పించాలి..? పూర్తి చేసిన దరఖాస్తులను సంబంధిత నియోజకవర్గంలోని అసిస్టెంట్ ఎలక్ట్రోలర్ రిజిస్ట్రేషన్ అధికారికి ఇవ్వాలి. ఈనెల 25 నుంచి డిసెంబర్ 16లోగా దరఖాస్తులు అందించాలి. చేయకూడనివి... దరఖాస్తులో తప్పులు దిద్దినా (కొట్టివేతలు), దరఖాస్తు ఫారం చిరిగినా దానిని తిరస్కరిస్తారు. అదేవిధంగా ఏమైనా తప్పుడు సమాచారం పేర్కొంటే రిప్రజెంటేషన్ ఆఫ్ పీపుల్ యాక్ట్ 1950, సెక్షన్ 31 ప్రకారం చర్యలు తీసుకుంటారు. మరిన్ని వివరాలకు http:// ceo telangana.nic.in వెబ్ సైట్లో చూడొచ్చు.