breaking news
Gel
-
మందు తాగినా లివర్ సేఫ్.. సరికొత్త జెల్ కనిపెట్టిన సైంటిస్టులు
బీరు, విస్కీ, బ్రాందీ, రమ్ము ఏ రూపంలోనైనా మందు(ఆల్కహాల్) హానికరమని అందరికీ తెలుసు. ఇందుకే ఆరోగ్యం పట్ల శ్రద్ధ ఉన్న చాలా మంది మందు మానేయాలనుకుంటుంటారు..కానీ అంత ఈజీగా మానలేరు. పార్టీలు, ఫంక్షన్లు, స్నేహితులు, బంధువులతో కలిసినపుడు తప్పక తాగాల్సిన పరిస్థితి ఏర్పడుతుంటుంది. దీంతో ఎక్కడో ఒక మూల భయపడుతూనే తరచూ మందు తాగేస్తుంటారు.ఇలాంటి వారి కోసమే సైంటిస్టులు ఒక సరికొత్త పరిశోధన మొదలు పెట్టారు. మందు తాగినా అది శరీరంపై పెద్దగా చెడు ప్రభావం చూపకుండా ఉండేలా ఒక జెల్‌ను కనిపెట్టారు. ఈ పరిశోధన ప్రస్తుతం ఎలుకల మీద ప్రయోగ దశలో ఉంది. అన్నీ కలిసొస్తే త్వరలో మనుషులకూ జెల్‌ను అందుబాటులోకి తెస్తారు. ఈ విషయాన్ని నేచర్ నానోటెక్నాలజీ జర్నల్ తాజాగా ప్రచురించింది. అసలు మందు(ఆల్కహాల్) బాడీలోకి వెళ్లి ఏం చేస్తుంది..మందు తాగిన వెంటనే కడుపులోని పేగుల్లోని పైపొర మ్యూకస్ మెంబ్రేన్ నుంచి రక్తంలో కలుస్తుంది. తర్వాత కాలేయంలోకి వెళుతుంది. అక్కడ హార్మోన్లు జరిపే రసాయన చర్యల వల్ల ఆల్కహాల్ తొలుత హానికరమైన ఎసిటాల్డిహైడ్గా మారుతుంది. అనంతరం కొద్ది సేపటికే ఎసిటిక్ యాసిడ్‌గా మారుతుంది. ఎసిటిక్ యాసిడ్ మాత్రం శరీరానికి పెద్దగా హానికారకం కాదు. ఈ కెమికల్ రియాక్షన్ మొత్తం వేగంగా జరుగుతుంది. ఈ రియాక్షన్లో శరీరానికి హాని చేసే ఎసిటాల్డిహైడ్ ఎక్కువసేపు ఉనికిలో ఉండకుండా హాని చేయని ఎసిటిక్ యాసిడ్‌గా మారతుంది. అయినా ఆ తక్కువ సమయంలోనే ఎసిటాల్డిహైడ్ లివర్‌కు చాలా నష్టం చేస్తుంది. ఇక తక్కువ సమయంలో ఎక్కువ మొత్తంలో ఆల్కహాల్ తీసుకున్నప్పుడు కాలేయంలో ఈ రియాక్షన్ కాస్త నెమ్మదిగా జరుగుతుంది. దీంతో ఎసిటాల్డిహైడ్ ప్రభావంతో తాగేవారికి కిక్కెక్కుతుంది. అదే సమయంలో శరీరంలోని లివర్‌తో పాటు మిగతా ముఖ్యమైన అవయవాలు ఆల్కహాల్ ప్రభావానికి గురవుతాయి. ఇప్పుడు పిక్చర్లోకి నానోజెల్..జెల్ తీసుకున్న తర్వాత పేగుల లోపల ఒకపొరలాగా ఏర్పడుతుంది. నానో ప్రోటీన్లతో తయారైన ఈ జెల్ జీర్ణం కావడానికి కొంత సమయం పడుతుంది. ఆల్కహాల్ పేగుల్లోకి వచ్చి రక్తంలోకి కలిసే ప్రక్రియను ఈ జెల్ ఆలస్యం చేస్తుంది. దీంతో పాటు జెల్ హైడ్రోజన్ పెరాక్సైడ్‌ను విడుదల చేస్తుంది. ఆల్కహాల్ రక్తంలోకి వెళ్లి లివర్‌కు చేరి ప్రమాదకర ఎసిటాల్డిహైడ్ ఏర్పడకముందే పేగుల్లో ఉండగానే హైడ్రోజన్ పెరాక్సైడ్ ఆల్కహాల్‌ను హానికరం కాని ఎసిటిక్ ఆసిడ్‌గా మార్చేస్తుంది.దీంతో మందు రక్తంలో కలిసినా లివర్‌పై పెద్దగా ప్రభావం పడదు. ఈ రియాక్షన్లో ఎక్కడకా ప్రమాదకర ఎసిటాల్డిహైడ్ లేకపోవడం వల్ల తాగే వారికి పెద్దగా కిక్కు కూడా తెలియదు. దీనికి తోడు లివర్‌తో పాటు శరీరంలోని ముఖ్యమైన అవయవాలు ఆల్కహాల్ బారిన పడి డ్యామేజ్ అయ్యే ఛాన్స్ తక్కువగా ఉంటుంది. జెల్ ఎలా తయారు చేశారు..స్విట్జర్లాండ్‌లోని జురిచ్ యూనివర్సిటీ సైంటిస్టులు తయారుచేసిన ఈ యాంటీ ఇన్‌టాక్సికెంట్ జెల్లో గ్లూకోజ్, గోల్డ్ నానో పార్టికల్స్‌తో పాటు వే ప్రోటిన్ నుంచి ఉత్పత్తైన నానో ఫైబర్లుంటాయి. ఈ నానో ఫైబర్లు ఐరన్ అణువులతో కప్పి ఉంటాయి. గ్లూకోజ్, గోల్డ్ కణాలతో జరిగే రియాక్షన్‌కు ఐరన్ అణువులు ఉత్ప్రేరకంగా పనిచేసి హైడ్రోజన్ పెరాక్సైడ్‌ను ఉత్పత్తి చేస్తాయి. ఎలుకలపై ప్రయోగం సక్సెస్..ప్రస్తుతానికి యాంటీ ఇన్‌టాక్సికెంట్ జెల్‌ను ఎలుకల మీద ప్రయోగించి చూశారు. ఎలుకలకు ఒక డోస్ ముందు పోశారు. కొన్నింటికి నానో జెల్ ఇచ్చారు. మరికొన్నింటికి ఇవ్వలేదు. జెల్ తీసుకున్న ఎలుకల రక్తంలో జెల్ తీసుకోని ఎలుకల రక్తంతో పోలిస్తే 16 శాతం తక్కువ ఆల్కహాల్ ఉండటాన్ని సైంటిస్టులు గుర్తించారు. జెల్ తీసుకున్న ఎలుకల శరీరంలో ప్రమాదకర ఎసిటాల్డిహైడ్ కూడా కనిపించలేదు. ఆల్కహాల్ కారణంగా ఈ ఎలుకల లివర్ మీద కూడా పెద్దగా ప్రభావం పడకపోవడాన్ని గమనించారు. త్వరలో జెల్‌ను మనుషుల మీద ప్రయోగించడానికి ఏర్పాట్లు చేస్తున్నారు. అసలు మందు తాగకపోవడమే మేలు‘అసలు ఆల్కహాల్ తీసుకోకపోవడమే శరీరానికి మంచిది. కానీ తీసుకోకుండా ఉండటం కుదరదనే వారి శరీరాలపై ఆల్కహాల్ పెద్దగా ప్రభావం చూపకుండా యాంటీ ఇన్‌టాక్సికెంట్ జెల్ ఉపయోగపడుతుంది’అని జెల్ కనుగొన్న సైంటిస్టుల బృందం హెడ్ రఫ్ఫేల్ మెజ్జెంగా చెప్పారు. -
గుండె కండరాలను బలపరిచే జెల్!
లబ్డబ్మని కొట్టుకునే మన గుండెకో ప్రత్యేకత ఉంది. దాని కణాలు ఒకసారి దెబ్బతింటే మళ్లీ ఉత్పత్తి కావు. అందుకే గుండెపోటు వచ్చినప్పుడు దాని కండరాల్లో కొంతభాగం దెబ్బతిని బలహీనపడుతుంది. ఫలితంగా శరీరానికి తక్కువ రక్తం అందుతుంది. అయితే ఈ పరిస్థితి త్వరలో మారిపోనుంది. పెన్సెల్వేనియా విశ్వవిద్యాలయ శాస్త్రవేత్తలు దెబ్బతిన్న గుండె కణాలను పునరుత్పత్తి చేయగల సరికొత్త పద్ధతిని అ¯భివృద్ధి చేశారు. రైబో న్యూక్లియక్ యాసిడ్ల (ఆర్ఎన్ఏ) అని పిలిచే సూక్ష్మ జన్యుక్రమ భాగాలను చిక్కటి ద్రవం (జెల్) రూపంలో గుండెకు నేరుగా అందించడం ద్వారా గుండె కణాలను పునరుత్పత్తి చేయగలమని వీరు ఎలుకలపై జరిపిన ప్రయోగాల ద్వారా నిరూపించారు. ఈ ఆర్ఎన్ఏ పోగులు గుండె కండరాల్లో మిగిలిన ఉన్న కార్డియోమయోసైట్ కణాల్లో పునరుత్పత్తి సంకేతాలను నిలిపివేసే యంత్రాంగంపై ప్రభావం చూపడం వల్ల ఇది సాధ్యమవుతోందని ఈ పరిశోధనల్లో పాల్గొన్న శాస్త్రవేత్తలు అంచనా వేస్తున్నారు. మైక్రో ఆర్ఎఎన్ఏల ద్వారా కొన్ని రకాల జబ్బులకు చికిత్స అందించేందుకు గతంలోనూ ప్రయత్నం జరిగినప్పటికీ ఎంత మోతాదులో వీటిని వాడాలో స్పష్టం కాకపోవడం వల్ల అవి పెద్దగా ఫలితం చూపించలేదు. అయితే పెన్సెల్వేయా విశ్వవిద్యాలయ శాస్త్రవేత్తలు ఆర్ఎన్ఏలను గుండెకు చేర్చగల జెల్‌కు కొన్ని ప్రత్యేక లక్షణాలు ఉంటే ఈ సమస్యను అధిగమించవచ్చునని పరిశోధనలు మొదలుపెట్టారు. ఎలుకలపై జరిపిన పరిశీలనల్లో కార్డియో మయోసైట్స్ సంఖ్య పెరిగినట్లు తేలడం వీరికి ఉత్సాహాన్నిచ్చింది. -
కోమలం మృదుత్వం
బ్యూటిప్స్ నిస్తేజంగా కనిపించే పెదవులకు గ్లిజరిన్, నిమ్మరసం కలిపిన మిశ్రమాన్ని ప్యాక్‌లా వేయాలి. ఆరిన తర్వాత శుభ్రపరిచి, పెట్రోలియం జెల్లీ రాసుకోవాలి.రాత్రి పడుకునేముందు గులాబీల పేస్ట్‌లో కొద్దిగా తేనె కలిపి పెదవులకు రాసుకోవాలి. తరచూ ఈ విధంగా చే స్తే పెదవులకు గులాబీల అందం వస్తుంది.పొడిబారి మృదుత్వాన్ని కోల్పోయిన పెదవులకు కొద్దిగా అలొవెరా జెల్ రాసి, మృదువుగా రాయాలి. లేదా రోజ్‌వాటర్ లో గ్లిజరిన్ కలిపి, పడుకునేముందు పెదవులకు రాసుకోవాలి. గోరువెచ్చని నీటిలో టీ బ్యాగ్‌ను ముంచి, పిండి, ఆ బ్యాగ్‌ను పెదవులపై మూడు, నాలుగు నిమిషాల సేపు ఉంచాలి. ఇలా చేయడం వల్ల పెదవుల చర్మం పై తేమ స్థాయి పెరుగుతుంది. దీని వల్ల పెదవులు పొడిబారకుండా ఉంటాయి. -
అవ్వాతాతల కోసం ‘జెల్’ ఆహారం!
పళ్లూడిపోయి బోసినోటితో ఆహారాన్ని నమిలి మింగలేని బామ్మలు, తాతయ్యల కోసం జెల్ మాదిరిగా స్మూత్‌గా ఉండే ఆహార పదార్థాలను 3డీ ప్రింటింగ్ పద్ధతిలో తయారు చేసేందుకు శాస్త్రవేత్తలు ప్రయత్నిస్తున్నారు. ఈ పద్ధతిలో తయారుచేసే చికెన్, క్యారెట్లు, పండ్లు వంటివాటిని నమలాల్సిన అవసరమే ఉండ దు. చూడటానికి మామూలు ఆహార పదార్థాల మాదిరిగానే కనిపించినా.. ఇవి స్మూత్‌గా, సుతిమెత్తని జెల్లా ఉంటాయి. ఉదాహరణకు ఓ తాతయ్యకు క్యారట్ తినాలనిపించిందనుకోండి.. తొలుత దానిని ఉడికించి, ముద్దలాచేసి దానికి రంగు, ఇతర పదార్థాలు కలుపుతారు. తర్వాత దానిని 3డీ ప్రింటర్లో పోసి, క్యారట్ ముక్కల మాదిరిగా పొరలుపొరలుగా ముద్రిస్తారు. దీంతో రుచి మారకుండానే, సుతిమెత్తటి క్యారెట్ ముక్కలు రెడీ అన్నమాట. అలాగే చికెన్‌ను కూడా ముద్దలా చేసి చికెన్ ముక్కలు తయారు చేస్తారు. ఇంకేం.. వీటిని నోట్లో వేసుకుంటే గులాబ్జాముల్లా కరిగిపోతాయన్నమాట. ఈ సరికొత్త 3డీ ప్రింటింగ్ పద్ధతి అభివృద్ధికి యూరోపియన్ యూనియన్ నిధులు అందిస్తోంది. వృద్ధుల్లో పౌష్టికాహారలోపం నివారణకు ఈ టెక్నిక్ బాగా ఉపయోగపడుతుందని పరిశోధకులు చెబుతున్నారు.