breaking news
Fish Childrens storage
-
చేపల పెంపకానికి చెరువులు సిద్ధం
సాక్షి, వరంగల్ : ఇటీవల కురిసిన వర్షాలతో జలకళ సంతరించుకున్న చెరువుల్లో చేప పిల్లలను వదిలేందుకు ప్రణాళిక సిద్ధం కాగా.. అమలు చేసేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నా రు. వరంగల్ అర్బన్ జిల్లాలోని 310 చెరువులు చేపల పెంపకానికి సిద్ధమయ్యాయి. చేప పిల్లల పంపిణీకి కావాల్సిన టెండర్ల ప్రక్రియ గత నెలలోనే పూర్తయినట్లు మత్స్యశాఖ అధికారులు చెబుతున్నారు. ఈ నెల 16వ తేదీన మొదటి దశలో మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు జిల్లాలోని మడికొండ, పెద్ద పెండ్యాల చెరువుల్లో చేప పిల్లలను వదిలి కార్యక్రమాన్ని లాంఛనంగా ప్రారంభించారు. మూడో వంతు నీరు చేరితేనే.. జిల్లాలోని 561 చెరువుల్లో చేప పిల్లలను వదిలేందుకు అవసరమైన ప్రణాళిక జిల్లా మత్స్యశాఖ పూర్తి చేసింది. కాగా చెరువుల్లో మూడో వంతు నీరు ఉంటేనే చేప పిల్లల పెంపకానికి అనువుగా ఉంటుందని అధికారులు చెబుతున్నారు. అలా ఉంటేనే చిన్న చెరువుల్లో ఒక హెక్టారుకు 3వేల చేప పిల్లలు, పెద్ద చెరువుల్లో ఒక హెక్టార్‌కు 2వేల చేపపిల్లలను పంపిణీ చేస్తారు. ఆ ప్రాతిపదికన జిల్లాలోని 310 చెరువులు ప్రస్తుతం సిద్ధమయ్యాయని పేర్కొన్నారు. ఏ చెరువుల్లో ఎన్ని చేపపిల్లలంటే.. జిల్లాలోని 561 చెరువుల్లో 102 చెరువులు మత్స్యశాఖ పరిధిలో ఉండగా, 459 గ్రామపంచాయతీల ఆధీనంలో కొనసాగుతున్నాయి. అందులో వర్షాధారితంగా నీరు చేరే చెరువులే ఎక్కువ. ఇక 365 రోజులు నీరు నిల్వ ఉండే చెరువుల జాబితాలో ధర్మసాగర్ రిజర్వాయర్, కమలాపూర్, నాగారం చెరువులు ఉన్నాయి. పెద్ద చెరువులుగా గుర్తింపు కలిగిన ధర్మసాగర్, కమలాపూర్, నాగారం చెరువుల్లో 80 నుంచి 100 ఎంఎం సైజు చేపపిల్లలు, మిగిలిన చెరువుల్లో 35 నుంచి 40 ఎంఎం సైజు పిల్లలు వేయాలని నిర్ణయించారు. చేపల ఎంపిక రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలు, మత్స్యశాఖ నిబంధనల ప్రకారం చెరువుల్లో రకాల వారీగా చేప పిల్లలను వదులుతారు. ఈ మేరకు 35శాతం బొచ్చె చేపలు, 35శాతం రోహులు, 30శాతం బంగారు తీగ చేపలను వేయాలని నిర్ణయించినట్లు అధికారులు తెలిపారు. ఇక మూడు పెద్ద చెరువుల్లో 40శాతం బొచ్చె, 50శాతం రోహు చేప, 10శాతం మ్రిగాల జాతి చేపలను వదలనున్నట్లు చేయనున్నట్లు వెల్లడించారు. సీడ్ పంపిణీకి కమిటీ.. ప్రత్యేక కేంద్రాలు జిల్లా వ్యాప్తంగా ఉన్న చెరువుల్లో చేపపిల్లలను వేసేందుకు కలెక్టర్ ఆదేశాలతో కమిటీని నియమించినట్లు అధికారులు తెలిపారు. మత్స్యశాఖ ఆధ్వర్యంలో జరుగుతున్న చేపపిల్లల పంపిణీలో ఎలాంటి అవకతవకలు జరగకుండా ఉండేందకు ఆయా చెరువుల సొసైటీ బాధ్యులు, ఫిషరీస్ అభివృద్ధి అధికారి, ప్రజాప్రతినిధులతో కూడిన కమిటీ పర్యవేక్షిస్తుంది. అలాగే, చేప పిల్లల పంపిణీ కోసం కొన్ని పాయింట్లను ఏర్పాటు చేశారు. ధర్మసాగర్ రిజర్వాయర్, భీమారం, ఎల్కతుర్తి, కమలాపూర్ వద్ద శాస్త్రీయంగా చేప పిల్లలను పంపిణీ చేసేందుకు కావాల్సిన ఏర్పాట్లు చేశామని అధికారులు తెలిపారు. రూ.47 కోట్ల రూపాయల ఆదాయమే లక్ష్యంగా జిల్లాలో 91 మత్సపారిశ్రామిక సహకార సంఘాల్లో 10,424 మంది సభ్యులు ఉన్నారు. గత ఏడాది 561 చెరువులకు గాను నీటి కొరత కారణంగా 108 చెరువుల్లో చేప పిల్లలను వదిలారు. మిగిలిన చెరువుల్లో 4,050 టన్నుల చేపల ఉత్పత్తి కాగా అమ్మకాల ద్వారా సుమారు రూ.30 కోట్ల ఆదాయం సమకూరింది. గత ఏడాదితో పోలిస్తే ఈసారి 5,895 టన్నులు ఉత్పత్తితో దాదాపు రూ.47 కోట్ల ఆదాయం సమకూరుతుందని అంచనా వేస్తున్నారు. చేప పిల్లల పంపిణీకి కేంద్రాలు ఏర్పాటు మత్స్యకారులు ఆర్థికంగా ఎదగాలన్న లక్ష్యంతో ప్రభుత్వం ఉచితంగా చేపపిల్లలను అందిస్తుంది. అందులో భాగంగా నిబంధనల ప్రకారం జిల్లాలో మూడో వంతు నీరు నిండిన 310 చెరువులను గుర్తించాం. ప్రభుత్వం వంద శాతం రాయితీతో అందిస్తున్న చేప సీడ్ ను పంపిణీ చేసేందుకు కొన్ని పాయింట్లను ఏర్పాటు చేశాము. చెరువుల సొసైటీ బాధ్యులు ఆయా పాయింట్ల వద్ద సంప్రదించాలి. – దాహగం సతీష్, ఏడీ, మత్స్యశాఖ, వరంగల్ అర్బన్ -
చేప ప్రసాదం పంపిణీ నేడే
* నగరంలోని ఎగ్జిబిషన్ గ్రౌండ్లో పూర్తై ఏర్పాట్లు * పలు రాష్ట్రాల నుంచి తరలివచ్చిన రోగులు * 1500 మంది పోలీసులతో భారీ బందోబస్తు హైదరాబాద్: ఆస్తమా రోగులకు చేప ప్రసాదం పంపిణీ చేసే కార్యక్రమం సోమవారం రాత్రి 11 గంటల నుంచి హైదరాబాద్ నాంపల్లిలోని ఎగ్జిబిషన్ గ్రౌండ్స్‌లో ప్రారంభంకానుంది. మరుసటి రోజు (9వ తేదీ) రాత్రి వరకు ఈ కార్యక్రమం కొనసాగుతోంది. ప్రతి సంవత్సరం మృగశిరకార్తె నాడు బత్తిని సోదరులు ఆస్తమా రోగులకు ఉచితంగా చేప ప్రసాదాన్ని పంపిణీ చేస్తోన్న విషయం తెలిసిందే. దీనికి సంబంధించి నాలుగైదు రోజుల ముందు నుంచే హైదరాబాద్ జిల్లా కలెక్టర్, పోలీస్ శాఖ, జీహెచ్ఎంసీ, ఆర్అండ్బీ, వాటర్బోర్డ్, ఇతర శాఖల అధికారులు ఎగ్జిబిషన్ గ్రౌండ్లో అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. వివిధ రాష్ట్రాలకు చెందిన ఆస్తమా రోగులు రెండురోజుల ముందుగానే ఎగ్జిబిషన్ గ్రౌండ్‌కు తరలివచ్చారు. ఉత్తర్‌ప్రదేశ్, రాజస్థాన్, బీహార్, కర్ణాటక, తమిళనాడు తదితర రాష్ట్రాల నుంచి ఆస్తమా రోగులు, వారి సహాయకులు చేప ప్రసాదం కోసం ఎదురుచూస్తున్నారు. దీంతో ఆదివారం ఎగ్జిబిషన్ గ్రౌండ్ సందడిగా కనిపించింది. కాగా, చేప ప్రసాదం కోసం తరలివచ్చిన రోగులు, వారి సహాయకులకు పలు స్వచ్ఛంద సంస్థలు ఉచితంగా అల్పాహారాన్ని అందించాయి. చేప ప్రసాదం పంపిణీకి సంబంధించి సోమవారం మధ్యాహ్నం లోపు చేప పిల్లలను అందుబాటులోకి తెస్తామని మత్స్యశాఖ ఉన్నతాధికారి ఒకరు మీడియాకు తెలిపారు. దాదాపు 50 వేల చేపలు ముందుగా అందుబాటులో ఉంచుతామన్నారు. అవి అయిపోయే సమయంలో తిరిగి తెప్పిస్తామని పేర్కొన్నారు. అలాగే, చేప ప్రసాద పంపిణీలో ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ప్రభుత్వం 1,500 మంది పోలీసులతో భారీ బందోబస్తు ఏర్పాటు చేసింది. సెంట్రల్‌జోన్‌తో పాటు నగరంలోని పలు జోన్లు, ఇతర ప్రాంతాల నుంచి వచ్చిన పోలీసులను ఇక్కడ బందోబస్తు విధులకు కేటాయించారు. ఎగ్జిబిషన్ గ్రౌండ్ నలుమూలలా సీసీ కెమెరాలతో నిఘా ఏర్పాటు చేశారు. రోగులకు సహకరించేందుకు ప్రత్యేక హెల్ప్‌లైన్ ఏర్పాటు చేశారు. -
8, 9 తేదీల్లో చేప ప్రసాదం పంపిణీ
సాక్షి, హైదరాబాద్: బత్తిని సోదరులు అందించే చేప ప్రసాదం పంపిణీకి రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక ఏర్పాట్లు చేస్తోంది. ఈనెల 8, 9 తేదీల్లో ఎగ్జిబిషన్ గ్రౌండ్స్‌లో జరగనున్న ఈ కార్యక్రమం సవ్యంగా జరిగేందుకు పకడ్బందీ ఏర్పాట్లు చేయాలని ప్రభుత్వం నిర్ణయిచింది. ఈ మేరకు నిర్వహణ కమిటీతో పాటు సంబంధిత అధికారులతో రాష్ర్ట ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాజీవ్‌శర్మ సచివాలయంలో బుధవారం సమీక్ష నిర్వహించారు. చేప పిల్లల నిల్వకు సరిపడే వాటర్ ట్యాంకులను అందుబాటులో ఉంచటంతో పాటు ప్రసాదం పంపిణీకి సరిపడే కౌంటర్లు ఏర్పాట్లు చేయాలని ఆయన సూచించారు. సమావేశంలో ప్రభుత్వ కార్యదర్శి వికాస్‌రాజ్, హైదరాబాద్ జిల్లా కలెక్టర్ నిర్మల, పోలీస్ అడిషనల్ కమిషనర్ అంజనీ కుమార్, ఫిషరీస్ డెరైక్టర్ ఎం.జగదీశ్వర్ పాల్గొన్నారు.