చేపల పెంపకానికి చెరువులు సిద్ధం

310 Lakes Ready To Fish Cultivating In Warangal District - Sakshi

సాక్షి, వరంగల్‌ : ఇటీవల కురిసిన వర్షాలతో జలకళ సంతరించుకున్న చెరువుల్లో చేప పిల్లలను వదిలేందుకు ప్రణాళిక సిద్ధం కాగా.. అమలు చేసేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నా రు. వరంగల్‌ అర్బన్‌ జిల్లాలోని 310 చెరువులు చేపల పెంపకానికి సిద్ధమయ్యాయి. చేప పిల్లల పంపిణీకి కావాల్సిన టెండర్ల ప్రక్రియ గత నెలలోనే పూర్తయినట్లు మత్స్యశాఖ అధికారులు చెబుతున్నారు. ఈ నెల 16వ తేదీన మొదటి దశలో మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు జిల్లాలోని మడికొండ, పెద్ద పెండ్యాల చెరువుల్లో చేప పిల్లలను వదిలి కార్యక్రమాన్ని లాంఛనంగా ప్రారంభించారు.

మూడో వంతు నీరు చేరితేనే..
జిల్లాలోని 561 చెరువుల్లో చేప పిల్లలను వదిలేందుకు అవసరమైన ప్రణాళిక జిల్లా మత్స్యశాఖ పూర్తి చేసింది. కాగా చెరువుల్లో మూడో వంతు నీరు ఉంటేనే చేప పిల్లల పెంపకానికి అనువుగా ఉంటుందని అధికారులు చెబుతున్నారు. అలా ఉంటేనే చిన్న చెరువుల్లో ఒక హెక్టారుకు 3వేల చేప పిల్లలు, పెద్ద చెరువుల్లో ఒక హెక్టార్‌కు 2వేల చేపపిల్లలను పంపిణీ చేస్తారు. ఆ ప్రాతిపదికన జిల్లాలోని 310 చెరువులు ప్రస్తుతం సిద్ధమయ్యాయని పేర్కొన్నారు. 

ఏ చెరువుల్లో ఎన్ని చేపపిల్లలంటే..
జిల్లాలోని 561 చెరువుల్లో 102 చెరువులు మత్స్యశాఖ పరిధిలో ఉండగా, 459 గ్రామపంచాయతీల ఆధీనంలో కొనసాగుతున్నాయి. అందులో వర్షాధారితంగా నీరు చేరే చెరువులే ఎక్కువ. ఇక 365 రోజులు నీరు నిల్వ ఉండే చెరువుల జాబితాలో ధర్మసాగర్‌ రిజర్వాయర్, కమలాపూర్, నాగారం చెరువులు ఉన్నాయి. పెద్ద చెరువులుగా గుర్తింపు కలిగిన ధర్మసాగర్, కమలాపూర్, నాగారం చెరువుల్లో 80 నుంచి 100 ఎంఎం సైజు చేపపిల్లలు, మిగిలిన చెరువుల్లో 35 నుంచి 40 ఎంఎం సైజు పిల్లలు వేయాలని నిర్ణయించారు.
చేపల ఎంపిక
రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలు, మత్స్యశాఖ నిబంధనల ప్రకారం చెరువుల్లో రకాల వారీగా చేప పిల్లలను వదులుతారు. ఈ మేరకు 35శాతం బొచ్చె చేపలు, 35శాతం రోహులు, 30శాతం బంగారు తీగ చేపలను వేయాలని నిర్ణయించినట్లు అధికారులు తెలిపారు. ఇక మూడు పెద్ద చెరువుల్లో 40శాతం బొచ్చె, 50శాతం రోహు చేప, 10శాతం మ్రిగాల జాతి చేపలను వదలనున్నట్లు చేయనున్నట్లు వెల్లడించారు.

సీడ్‌ పంపిణీకి కమిటీ.. ప్రత్యేక కేంద్రాలు
జిల్లా వ్యాప్తంగా ఉన్న చెరువుల్లో చేపపిల్లలను వేసేందుకు కలెక్టర్‌ ఆదేశాలతో కమిటీని నియమించినట్లు అధికారులు తెలిపారు. మత్స్యశాఖ ఆధ్వర్యంలో జరుగుతున్న చేపపిల్లల పంపిణీలో ఎలాంటి అవకతవకలు జరగకుండా ఉండేందకు ఆయా చెరువుల సొసైటీ బాధ్యులు, ఫిషరీస్‌ అభివృద్ధి అధికారి, ప్రజాప్రతినిధులతో కూడిన కమిటీ పర్యవేక్షిస్తుంది. అలాగే, చేప పిల్లల పంపిణీ కోసం కొన్ని పాయింట్లను ఏర్పాటు చేశారు. ధర్మసాగర్‌ రిజర్వాయర్, భీమారం, ఎల్కతుర్తి, కమలాపూర్‌ వద్ద శాస్త్రీయంగా చేప పిల్లలను పంపిణీ చేసేందుకు కావాల్సిన ఏర్పాట్లు చేశామని అధికారులు తెలిపారు.

రూ.47 కోట్ల రూపాయల ఆదాయమే లక్ష్యంగా
జిల్లాలో 91 మత్సపారిశ్రామిక సహకార సంఘాల్లో 10,424 మంది సభ్యులు ఉన్నారు. గత ఏడాది 561 చెరువులకు గాను నీటి కొరత కారణంగా 108 చెరువుల్లో చేప పిల్లలను వదిలారు. మిగిలిన చెరువుల్లో 4,050 టన్నుల చేపల ఉత్పత్తి కాగా అమ్మకాల ద్వారా సుమారు రూ.30 కోట్ల ఆదాయం సమకూరింది. గత ఏడాదితో పోలిస్తే ఈసారి 5,895 టన్నులు ఉత్పత్తితో దాదాపు రూ.47 కోట్ల ఆదాయం సమకూరుతుందని అంచనా వేస్తున్నారు.

చేప పిల్లల పంపిణీకి కేంద్రాలు ఏర్పాటు
మత్స్యకారులు ఆర్థికంగా ఎదగాలన్న లక్ష్యంతో ప్రభుత్వం ఉచితంగా చేపపిల్లలను అందిస్తుంది. అందులో భాగంగా నిబంధనల ప్రకారం జిల్లాలో మూడో వంతు నీరు నిండిన 310 చెరువులను గుర్తించాం. ప్రభుత్వం వంద శాతం రాయితీతో అందిస్తున్న చేప సీడ్‌ ను పంపిణీ చేసేందుకు కొన్ని పాయింట్లను ఏర్పాటు చేశాము. చెరువుల సొసైటీ బాధ్యులు ఆయా పాయింట్ల వద్ద సంప్రదించాలి.                                   – దాహగం సతీష్, ఏడీ, మత్స్యశాఖ, వరంగల్‌ అర్బన్‌  

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top