భారత్.. విశ్వగురువు పాత్ర పోషిస్తుంది: మోదీ
భారత దేశం విశ్వగురువు పాత్ర పోషిస్తుందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. ఫిజీ పర్యటనలో ఉన్న ఆయన.. అక్కడి ఫిజీ టెక్నికల్ యూనివర్సిటీలో పౌర సమాజ ప్రతినిధులతో భేటీ అయ్యారు. భారత్ తన ప్రజాస్వామ్య, యువజనాభా శక్తిని ఉపయోగించుకుని మానవాళికి మేలు చేస్తుందన్నారు. రాబోయే తరం అంతా టెక్నాలజీదేనని, దాంతో సమానంగా పరుగులు పెడితే కొత్త ఆవిష్కరణలు సాధ్యమవుతాయని అన్నారు.
భారతదేశంలోని పాతకాలం నాటి రుషులు, మునులు కూడా అంతర్జాతీయ బాధ్యత గురించి చెప్పారన్నారు. రాబోయే జ్ఞానయుగంలో భారత్ విశ్వగురువు పాత్ర పోషిస్తుందని మోదీ చెప్పారు. ప్రపంచం మొత్తానికి మేలు చేసేందుకు భారతదేశం నైపుణ్యాల అభివృద్ధికి ప్రాధాన్యం ఇస్తోందన్నారు. వివిధ దేశాల మధ్య ఉన్న డిజిటల్ అంతరాలకు ముగింపు పలకాల్సి ఉందని తెలిపారు. ఫిజిలో ఉన్న మొత్తం 9 లక్షల జనాభాలో దాదాపు 37 శాతం వరకు భారత సంతతివాళ్లే. వీళ్లలో చాలామందిని బ్రిటిష్ పాలకులు 1879 నుంచి 1916 మధ్య చెరుకుతోటల్లో పని చేయించడానికి తీసుకొచ్చారు.