breaking news
Ferdinand Marcos Jr
-
సంబంధాలు ఉన్నత స్థాయికి
న్యూఢిల్లీ: భారత్, ఫిలిప్పీన్స్ దేశాలు ఇష్టపూర్వకంగా మిత్రులుగా, విధిలిఖితం వల్ల భాగస్వాములుగా మారాయని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చెప్పారు. ఆయన మంగళవారం ఢిల్లీలో ఫిలిప్పీన్స్ అధ్యక్షుడు ఫెర్డినాండ్ ఆర్.మార్కోస్ జూనియర్‌తో భేటీ అయ్యారు. భారత్–ఫిలిప్పీన్స్ ద్వైపాక్షిక సంబంధాలపై చర్చించారు. ఇరుదేశాల మధ్య సంబంధాలను వ్యూహాత్మక భాగస్వామ్యం స్థాయికి పెంచుకోవాలని నిర్ణయించారు. రక్షణ రంగంలో పరస్పర సహకారాన్ని మరింత బలోపేతం చేసుకోవాలని తీర్మానించారు.మోదీ, ఫెర్డినాండ్ సమావేశం సందర్భంగా తొమ్మిది ఒప్పందాలపై భారత్, ఫిలిప్పీన్స్ సంతకాలు చేశాయి. వ్యూహాత్మక భాగస్వామ్యం ప్రకటన, అమలు.. రెండుదేశాల సైన్యాల మధ్య చర్చలకు సంబంధించిన నియమ నిబంధనలు.. అంతరిక్ష రంగంలో సహకారానికి సంబంధించి ఈ ఒప్పందాలు కుదిరాయి. భేటీ అనంతరం ప్రధాని మోదీ, అధ్యక్షుడు ఫెర్డినాండ్ మీడియాతో మాట్లాడారు. హిందూ మహాసముద్రం నుంచి పసిఫిక్ సముద్రం దాకా రెండు దేశాలు ఉమ్మడి విలువలతో ఐక్యంగా పని చేస్తున్నాయని మోదీ ఉద్ఘాటించారు.యాక్ట్ ఈస్ట్ పాలసీతోపాటు ‘మహాసాగర్’లో ఇండియాకు ఫిలిప్పీన్స్ అత్యంత కీలకమైన భాగస్వామి అని స్పష్టంచేశారు. ఇండో–పసిఫిక్ ప్రాంతంలో శాంతి, భద్రత, సౌభాగ్యానికి రెండు దేశాలు కట్టుబడి ఉన్నాయని తెలిపారు. అంతర్జాతీయ చట్టాలకు అనుగుణంగా ఇండో–పసిఫిక్‌లో నౌకలు స్వేచ్ఛగా రాకపోకలు సాగించాలన్నదే తమ విధానమని పేర్కొన్నారు. భారత్–ఫిలిప్పీన్స్ సంబంధాలను వ్యూహాత్మక భాగస్వామ్యం స్థాయికి చేర్చాలని నిర్ణయించడం పట్ల చాలా గర్విస్తున్నామని వ్యాఖ్యానించారు. కీలక రంగాల్లో పరస్పర సహకారానికి ఒక సమగ్ర కార్యాచరణ ప్రణాళిక రూపొందిస్తున్నట్లు వెల్లడించారు. ప్రత్యేక స్టాంప్ విడుదలభారత్–ఫిలిప్పీన్స్ సంబంధాలకు 75 ఏళ్లు పూర్తి కాబోతున్నాయి. ఈ సందర్భాన్ని పురస్కరించుకొని స్మారక తపాలా బిళ్లను మోదీ, ఫెర్డినాండ్ విడుదల చేశారు. పహల్గాం ఉగ్రవాద దాడిని ఖండించినందుకు ఫిలిప్పీన్స్ ప్రభుత్వానికి మోదీ కృతజ్ఞతలు తెలియజేశారు. -
అధ్యక్షుడినే చంపేయిస్తా
మనీలా: ఆగ్నేయాసియా దేశం ఫిలిప్పీన్స్‌లో రెండు శక్తివంత రాజకీయ కుటుంబాల మధ్య మళ్లీ అగ్గిరాజుకుంటోంది. ఈ కుటుంబాల మధ్య పాత వైరం మరోసారి బట్టబయలైంది. తన ప్రాణానికి ముప్పు వాటిల్లితే ఫిలిప్పీన్స్ దేశాధ్యక్షుడు ఫెర్డినాడ్ మార్కోస్ జూనియర్‌ను చంపేస్తానని ఉపాధ్యక్షురాలు సారా డ్యుటెర్టే బహిరంగ ప్రకటన చేసి దేశవ్యాప్తంగా తీవ్ర కలకలం సృష్టించారు. సారా డ్యుటెర్టే తండ్రి రోడ్రిగో డ్యుటెర్టేకు, ఫెర్డినాడ్ తండ్రి మార్కోస్ సీనియర్‌కు మధ్య చాన్నాళ్ల క్రితం బద్దశత్రుత్వం ఉన్న విషయం తెల్సిందే. ఫెర్డినాడ్ జూనియర్ ప్రభుత్వంలో విద్యాశాఖ మంత్రిగా రాజీనామాచేసినప్పటికీ సారా ఇంకా దేశ ఉపాధ్యక్షురాలిగా కొనసాగుతున్నారు. ఇటీవలికాలంలో అధ్యక్ష, ఉపాధ్యక్షులకు అస్సలు పొసగట్లేదు. ఈ నేపథ్యంలో శనివారం తెల్లవారుజామున సారా ఆన్లైన్లో మీడియాసమావేశంలో మాట్లాడారు. ‘‘నా యోగక్షేమాల గురించి ఎవరికీ ఎలాంటి భయాలు అక్కర్లేదు. అయితే మీకో విషయం చెప్తా. ఇటీవల నేను ఒక కాంట్రాక్ట్ కిల్లర్‌తో మాట్లాడా. నా ప్రాణాలను హాని ఉండి, నన్ను ఎవరైనా చంపేస్తే వెంటనే దేశాధ్యక్షుడు ఫెర్డినాడ్, ఆయన భార్య లిజా అరనేటా, పార్లమెంట్లో ప్రతినిధుల సభ స్పీకర్ మారి్టన్ రోమాల్డేజ్ను చంపేసెయ్. ప్రాణాలు పోయాయని నిర్ధారించుకునేదాకా దాడిచెయ్ అని చెప్పా. అందుకే తను సరేనన్నాడు. ఇది సరదాకి చెప్పట్లేను. ఇది జోక్ కానేకాదు’’అని సారా చెప్పారు. అధ్యక్షుడిని అంతం చేయాలని కాంట్రాక్ట్ కిల్లర్‌తో మాట్లాడినట్లు స్వయంగా ఉపాధ్యక్షురాలే ప్రకటన చేయడంతో అధ్యక్షుడి కమ్యూనికేషన్స్ కార్యాలయం అప్రమత్తమైంది. ‘‘అధ్యక్షుని ప్రాణాలకు ఇంతటి హాని పొంచి ఉందని తెలిశాక భద్రతను మరింత కట్టుదిట్టం చేస్తున్నాం. రక్షణ బాధ్యతలను అధ్యక్షుడి రక్షణ దళాలకు అప్పజెప్తున్నాం. సారా వ్యాఖ్యలపై తగు చర్యలకు సిద్ధమవుతున్నాం’’అని కార్యనిర్వాహక కార్యదర్శి లూకాస్ బెర్సామిన్ చెప్పారు. 2022 మేలో జరిగిన ఎన్నికల్లో అధ్యక్షుడిగా మార్కోస్, ఉపాధ్యక్షురాలిగా సారా పోటీచేసి ఘన విజయం సాధించిన విషయం తెల్సిందే. వివాదాస్పద దక్షిణ చైనా సముద్రంలో చైనా ఆధిపత్య ధోరణులు, తదితర అంతర్జాతీయ, దేశీయ అంశాల్లో ఇద్దరు నేతల మధ్య ఇటీవలికాలంలో తీవ్ర బేధాభిప్రాయాలొచ్చాయి. ఈమధ్య ఓసారి అధ్యక్షుడి తలను నరుకుతున్నట్లు ఆలోచనలొస్తున్నాయని సారా వ్యాఖ్యానించారు. ‘‘అధ్యక్షుడు అవినీతిలో కూరుకుపోయారు. పరిపాలించే సత్తా లేదు. అబద్ధాలకోరు. మా కుటుంబాన్ని రాజకీయంగా బలహీనపరచాలని కుట్ర పన్నుతున్నారు’’అని సారా ఆరోపించారు. సారా తండ్రి రోడ్రిగో డ్యుటెర్టో ఫిలిప్పీన్స్‌లో కరడుగట్టిన రాజకీయనేతగా పేరొందారు. దేశంలో మాదకద్రవ్యాల ముఠాలపై ఉక్కుపాదం మోపారు. దావో సిటీ మేయర్‌గా, ఆతర్వాత దేశాధ్యక్షుడిగా తన పరిపాలనాకాలంలో ‘డెత్ స్క్వాడ్’పేరిట వేలాది మంది డ్రగ్స్‌ముఠా సభ్యులను అంతమొందించారు. ఆనాడు దేశాధ్యక్షుడిగా ఉంటూ మానవహక్కుల ఉల్లంఘనకు పాల్పడ్డారన్న ఆరోపణలపై ఆయన అంతర్జాతీయ న్యాయస్థానంలో కేసు విచారణను ఎదుర్కొంటున్నారు. సారా ప్రకటనపై దేశ సైన్యాధ్యక్షుడు జనరల్ రోమియో బ్రేవ్నర్ ఒక ప్రకటన విడుదలచేశారు. ‘‘లక్షన్నరకుపైబడిన దేశ సైనికులు ఎల్లప్పుడూ పక్షపాతరహితంగా పనిచేస్తారు. ప్రజాస్వామ్యయుత రాజ్యాంగబద్ధ సంస్థలు, పౌరవ్యవస్థల ఆదేశాలను శిరసావహిస్తారు’’అని అన్నారు. -
ఫిలిప్పీన్స్ అధ్యక్షుడికి ప్రధాని మోదీ ఫోన్
న్యూఢిల్లీ: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ శుక్రవారం ఫిలిప్పీన్స్ అధ్యక్షుడు ఫెర్డినాండ్ మార్కోస్ జూనియర్‌తో ఫోన్లో మాట్లాడారు. ఫిలిప్పీన్స్ 17వ అధ్యక్షుడిగా జూన్‌లో బాధ్యతలు చేపట్టిన మార్కోస్ జూనియర్‌కు మోదీ అభినందనలు తెలిపారు. రెండు దేశాల మధ్య సన్నిహిత సంబంధాలపై ఇద్దరు నేతలు సంతృప్తి వ్యక్తం చేశారు. ఈ సంబంధాలను బలోపేతం చేసుకునేందుకు కట్టుబడి ఉన్నట్లు తెలిపారు. ఇండో–పసిఫిక్ ప్రాంతంలో ఫిలిప్పీన్స్ పాత్ర కీలకమైందిగా భారత్ భావిస్తోందన్నారు. ఫిలిప్పీన్స్ అభివృద్ధికి భారత్ సంపూర్ణంగా సహకరిస్తుందని ప్రధాని తెలిపారు. రొడ్రిగో డ్యుటెర్టే స్థానంలో ఫిలిప్పీన్స్ అధ్యక్షుడిగా మార్కోస్ జూనియర్ జూన్ 30వ తేదీన బాధ్యతలు చేపట్టారు. -
తండ్రిని గద్దె దింపిన ప్రజలే తనయుడికి పట్టం
మనీలా: ఫిలిప్పీన్స్ అధ్యక్ష ఎన్నికల్లో మార్కోస్ జూనియర్ (64) ఘన విజయం సాధించినట్లు అనధికార ఓట్ల లెక్కింపు గణాంకాలు వెల్లడిస్తున్నాయి. 1986లో తండ్రి , ఫిలిప్పీన్స్ నియంత ఫెర్డినాండ్ మార్కోస్‌ను గద్దె దింపిన ఆ ప్రజలే మళ్లీ తనయుడికి పట్టం కట్టడం విశేషం. మంగళవారం మధ్యాహ్నం నాటికి 97 శాతం ఓట్ల లెక్కింపు పూర్తయిందని మూడు కోట్లకుపైగా ఓట్లు మార్కోస్కే పడినట్లు అనధికార గణాంకాల్లో వెల్లడైంది. కొత్త అధ్యక్షుడు జూన్ 30న బాధ్యతలు చేపడతాడు. పేదరికం, మాదకద్రవ్యాలు, సమాజంలో అసమానతలు ఫిలిప్పీన్స్‌ను పట్టిపీడిస్తున్నాయి. మార్కోస్ గెలుపు వార్త తెల్సి మానవహక్కుల సంస్థ ఆమ్నెస్టీ ఇంటర్నేషనల్ ఆందోళన వ్యక్తంచేసింది.