
ఫెర్డినాండ్‌తో ప్రధాని మోదీ
ఫిలిప్పీన్స్ అధ్యక్షుడు ఫెర్డినాండ్‌తో ప్రధాని మోదీ భేటీ
తొమ్మిది ఒప్పందాలపై సంతకాలు
న్యూఢిల్లీ: భారత్, ఫిలిప్పీన్స్ దేశాలు ఇష్టపూర్వకంగా మిత్రులుగా, విధిలిఖితం వల్ల భాగస్వాములుగా మారాయని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చెప్పారు. ఆయన మంగళవారం ఢిల్లీలో ఫిలిప్పీన్స్ అధ్యక్షుడు ఫెర్డినాండ్ ఆర్.మార్కోస్ జూనియర్‌తో భేటీ అయ్యారు. భారత్–ఫిలిప్పీన్స్ ద్వైపాక్షిక సంబంధాలపై చర్చించారు. ఇరుదేశాల మధ్య సంబంధాలను వ్యూహాత్మక భాగస్వామ్యం స్థాయికి పెంచుకోవాలని నిర్ణయించారు. రక్షణ రంగంలో పరస్పర సహకారాన్ని మరింత బలోపేతం చేసుకోవాలని తీర్మానించారు.
మోదీ, ఫెర్డినాండ్ సమావేశం సందర్భంగా తొమ్మిది ఒప్పందాలపై భారత్, ఫిలిప్పీన్స్ సంతకాలు చేశాయి. వ్యూహాత్మక భాగస్వామ్యం ప్రకటన, అమలు.. రెండుదేశాల సైన్యాల మధ్య చర్చలకు సంబంధించిన నియమ నిబంధనలు.. అంతరిక్ష రంగంలో సహకారానికి సంబంధించి ఈ ఒప్పందాలు కుదిరాయి. భేటీ అనంతరం ప్రధాని మోదీ, అధ్యక్షుడు ఫెర్డినాండ్ మీడియాతో మాట్లాడారు. హిందూ మహాసముద్రం నుంచి పసిఫిక్ సముద్రం దాకా రెండు దేశాలు ఉమ్మడి విలువలతో ఐక్యంగా పని చేస్తున్నాయని మోదీ ఉద్ఘాటించారు.
యాక్ట్ ఈస్ట్ పాలసీతోపాటు ‘మహాసాగర్’లో ఇండియాకు ఫిలిప్పీన్స్ అత్యంత కీలకమైన భాగస్వామి అని స్పష్టంచేశారు. ఇండో–పసిఫిక్ ప్రాంతంలో శాంతి, భద్రత, సౌభాగ్యానికి రెండు దేశాలు కట్టుబడి ఉన్నాయని తెలిపారు. అంతర్జాతీయ చట్టాలకు అనుగుణంగా ఇండో–పసిఫిక్‌లో నౌకలు స్వేచ్ఛగా రాకపోకలు సాగించాలన్నదే తమ విధానమని పేర్కొన్నారు. భారత్–ఫిలిప్పీన్స్ సంబంధాలను వ్యూహాత్మక భాగస్వామ్యం స్థాయికి చేర్చాలని నిర్ణయించడం పట్ల చాలా గర్విస్తున్నామని వ్యాఖ్యానించారు. కీలక రంగాల్లో పరస్పర సహకారానికి ఒక సమగ్ర కార్యాచరణ ప్రణాళిక రూపొందిస్తున్నట్లు వెల్లడించారు.
ప్రత్యేక స్టాంప్ విడుదల
భారత్–ఫిలిప్పీన్స్ సంబంధాలకు 75 ఏళ్లు పూర్తి కాబోతున్నాయి. ఈ సందర్భాన్ని పురస్కరించుకొని స్మారక తపాలా బిళ్లను మోదీ, ఫెర్డినాండ్ విడుదల చేశారు. పహల్గాం ఉగ్రవాద దాడిని ఖండించినందుకు ఫిలిప్పీన్స్ ప్రభుత్వానికి మోదీ కృతజ్ఞతలు తెలియజేశారు.