ఫ్యేక్ల్టీ..
వారే వీరు.. వీరే వారు..!!
ఇంజినీరింగ్ కళాశాలల్లో పొంతన లేని అధ్యాపకుల వివరాలు పాలిటెక్నిక్, డిగ్రీ, జానియర్ కళాశాలల లెక్చరర్లకు చోటు ఇతర రాష్ట్రాల వారిని చూపిన కొన్ని కళాశాలలు ఏకంగా వ్యక్తుల పేర్లనే మార్చిన మరికొన్ని..ఫిర్యాదు చేయవచ్చంటున్న యూనివర్సిటీ
కోదాడటౌన్ : అనుమతుల కోసం ఇంజనీరింగ్ కళాశాలలు అడ్డదారులు తొక్కాయనే ఆరోపణలకు వర్సిటీ వెబ్సైట్లో పెట్టిన ఫ్యాకల్టీ వివరాలను పరిశీలించిన ఎవరికైనా ఇట్టే తెలిసిపోతుందని పలువురు విద్యావేత్తలు అంటున్నారు. తనిఖీ చేసి నిగ్గుతేల్చామని చెపుతున్న వర్సిటీ అధికారులు చూసీచూడనట్టు నివేదికలను తయారు చేసినట్లు అర్థమవుతోంది. అనుమతుల కోసం బోగస్ అధ్యాపకులను చూపినట్లు స్పష్టంగా తేలిపోయింది. నకిలీ అధ్యాపకులనే కాకుండా ఒకే అధ్యాపకుడిని రెండు కళాశాలలో చూపాయి. గుర్తుపట్టకుండా అతని పేరునే ముక్కలుగా చేసి మార్చేసి వాడుకున్నాయి. కొందరి ఫొటోలను గుర్తుపట్టకుండా ఉండేందుకు వారు విద్యార్థి దశ ఫొటోలను వాడారు. మరికొన్ని కళాశాలలు ఆంధ్రప్రదేశ్ నుంచి అద్దెకు తెచ్చుకొని వెబ్సైట్లో పెట్టాయనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.
ఒక ఉదాహరణ చూడండి....
జిల్లాలో అత్యధికంగా 720 ఇంజనీరింగ్ సీట్లకు అనుమతులు పొందిన కోదాడలోని ఓ ఇంజనీరింగ్ కళాశాలలో ఫిజిక్స్ అధ్యాపకుడిగా దేవరం రెడ్డి రామకృష్ణ తమ కళాశాలలో పని చేస్తున్నట్లు(సీరియల్ నెం:253) చూపించుకున్నారు. ఇతడినే కోదాడలోని మరో ఇంజనీరింగ్ కళాశాల తమ కళాశాలలో ఫిజిక్స్ అధ్యాపకుడిగా (సీరియల్నెం:175) చూపారు. గుర్తుపట్టకుండా అతని పేరును రామకృష్ణారెడ్డి దేవరంగా నమోదు చేశారు. బోగస్ అధ్యాపకులను చూపినట్లు గత సంవత్సరమే ఈ కళాశాలపై కేసు నమోదైనా నిర్బయంగా ఈ ఏడాది అదేపని చేయడం గమనించదగ్గ విషయం. వాస్తవంగా అతని పేరు దేవరం రామకృష్ణారెడ్డి. ఇతను కోదాడలోని ఓ జూనియర్ కళాశాలలో అద్యాపకుడిగా పనిచేస్తున్నట్లు సమాచారం. ఇదే విధంగా శ్రీరంగాపురం వద్ద ఉన్న కళాశాలలో పని చేస్తున్న రసాయనశాస్త్ర అధ్యాపకుడిని, శ్రీనివాస థియేటర్ వద్ద జూనియర్ కళాశాలలో పనిచేస్తున్న గణితశాస్త్ర అధ్యాపకుడిని కూడా తమ ఫ్యాకల్టీగా చూపుకున్నారని పలువురు ఆరోపిస్తున్నారు.
అంతా బోగస్సే..
జిల్లా వ్యాప్తంగా పలు ఇంజనీరింగ్ కళాశాలలు ఫ్యాకల్టీ విషయంలో అనేక అడ్డదారులు తొక్కాయి. రసాయనశాస్తం, భౌతికశాస్త్రం, గణితశాస్త్రం, ఇంగ్లీషు సబ్జెక్టుల అధ్యాపకులను స్థానికంగా వివిధ జూనియర్, డిగ్రీ కళాశాలల్లో, వివిధ పాఠశాలల్లో పని చేస్తున్నవారిని తమ ఫ్యాకల్టీగా చూపాయి. ఇక ఇంజనీరింగ్ సబ్జెక్టులకు సంబంధించిన వారిని అద్దె ప్రాతిపదికన, వివిధ పాలిటెక్నిక్ కళాశాలల్లో, కంపెనీలలో పనిచేస్తున్న వారిని చూపాయనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. కోదాడలోని పలు కళాశాలలు ఇంజనీరింగ్ కళాశాలలకు అనుబంధంగా పాలిటెక్నిక్ కళాశాలలున్నాయి. ఈ భవనాలను, ప్రయోగశాలలను, ఫ్యాకల్టీని కూడ ఇంజనీరింగ్ కళాశాలల్లో పని చేస్తున్న వారుగా చూపాయి. బ్యాంకు ఎకౌంట్లను, ఆధార్‌నంబర్‌ను తనిఖీ చేస్తే నూటికి 80 శాతం బోగస్ అధ్యాపకులుగా బయట పడతారని పలువురు విద్యావేత్తలు అంటున్నారు.
ఎలా ఫిర్యాదు చేయాలంటే..
కళాశాలల్లో నెలకొన్న సమస్యలు కానీ, బోగస్ ఫ్యాకల్టీ వివరాలను కానీ వర్సిటీ దృష్టికి తీసుకురావాలనుకున్న వారు వెబ్సైట్లో ఉన్న కింది ఫోన్నంబర్లకు గానీ, మెయిల్‌కు గానీ వెంటనే ఫిర్యాదు చెయ్యవచ్చు. ఇంజనీరింగ్ కళాశాలల్లో పారదర్శకతను తీసుకురావడానికే ఈ విధనాన్ని అవలంభిస్తున్నట్లు వర్సిటీ తెలిపింది.
వింతపేర్లు...
తెలుగులో మనము ఎప్పుడు వినని పేర్లను ఇపుడు ఇంజనీరింగ్ కళాశాలలు మనకు చూపుతున్నాయి. కోదాడలోని ఓ ఇంజనీరింగ్ కళాశాల అధ్యాపకురాలి పేరును ఏ విధంగా ఖూనీ చేశారు చూస్తే మీకే తెలుస్తుంది. అధ్యాపకురాలి అసలు పేరు కుక్కల రమాదేవి. కాగా ఆమె పేరును ఇపుడు కళాశాల వారు రమ కుక్కల దేవిగా మార్చివేశారు. సర్టిఫికెట్లలో ఉన్న పేర్లకు బదులు అన్ని వింత పేర్లు చూపుతున్న వైనం వెనుక భారీ మతలబు దాగిఉన్నట్లు తెలుస్తోంది. మరికొంత మందికి వారి పాఠశాలలో చదివే సమయంలో టై, బెల్టు పెట్టుకున్న ఫొటోలు, చిన్న తనంలో ఆడపిల్లలు రెండు జడలు వేసుకున్న ఫొటోలను కూడ వెబ్సైట్లో పెట్టారు.
ఫిర్యాదు చేయండి : యూనివర్సిటీ
జిల్లాలో ఉన్న ఇంజనీరింగ్, ఫార్మసీ, ఎంబీఏ కళాశాలలో పని చేస్తున్న ఫ్యాకల్టీ వివరాలను వెబ్సైట్లో పెట్టిన యూనివర్సిటీ.. వారిలో నకిలీలు, బోగస్‌లు ఉంటే వెంటనే తమకు ఫిర్యాదు చేయాలని గత శుక్రవారం కోరింది. వర్సిటీ అకడమిక్ అడిట్ సెల్లో ఈ వివరాలు ఉన్నాయని, వాటిని స్థానికులు, తల్లిదండ్రులు పరిశీలించి వెంటనే ఫిర్యాదు చేయాలని పేర్కొంది. అక్రమాలు బయటపడితే సదరు కళాశాలతోపాటు, అధ్యాపకులపై కూడ చర్యలు తీసుకుంటామని వర్సిటీ తెలిపింది.