breaking news
Expansion road
-
అర్ధరాత్రి వచ్చి పొమ్మంటే ఎలా..?
టెక్కలి: రోడ్డు విస్తరణ పేరుతో అర్ధరాత్రి వచ్చి తెల్లవారింటికి ఇళ్లు ఖాళీ చేయాలని చెబితే ఎక్కడికి పోతాం అంటూ.. అంబ్కేడర్ జంక్షన్ సమీపంలో ని వాసం ఉంటున్న వారంతా సోమవారం రాత్రి తహసీల్దార్ కార్యాలయంలో అధికారులను నిలదీశారు. అంబేడ్కర్ జంక్షన్ నుంచి చెట్లతాండ్ర మార్గంలో రోడ్డు విస్తరణకు చర్యలు చేపట్టిన క్రమంలో ఇటీవల మంత్రి అచ్చెన్నాయుడు శంకుస్థాపన పనులు చేపట్టారు. అయితే సోమవారం రాత్రి పంచాయతీ అధికారులు ఆ ప్రాంతానికి వెళ్లి ఉదయాన్నే ఇళ్లు ఖాళీ చేయాలని ఆదేశాలు జారీ చేయడంతో, అక్కడ నివసిస్తున్న వారంతా తహసీల్దార్ కార్యాలయానికి చేరుకుని ఇన్చార్జి తహసీల్దార్ రవికుమార్ వద్ద సమస్యలు ఏకరువు పెట్టారు. అయితే ముందుగా దుకాణాలు తొలగిస్తామని, ఆ తర్వాత ఇళ్లు ఖాళీ చేయిస్తామని ఆయన సర్దిచెప్పారు. ఇల్లు కోల్పోయిన వారందరికీ ఇల్లు ఇస్తామని మంత్రి చెప్పారని ఇప్పుడు ఉన్నఫలంగా ఇల్లు ఖాళీ చెయ్యమంటే, పిల్లలతో ఎక్కడకు వెళ్లాలని వారంతా నిలదీశారు. గతంలో ఇంటి స్థలం మంజూరు కాకపోయిన వారందరికీ ఇంటి స్థలాలు ఇస్తామని తహసీల్దార్ చెప్పడంతో అంతా వెనుదిరిగారు. ముందుగా ఇంటి స్థలాలు ఇచ్చిన తర్వాత విస్తరణ పను లు చేయాలి తప్ప ఇలా అర్ధరాత్రిళ్లు వచ్చి తెల్లవారింటికి ఇళ్లు ఖాళీ చేయాలని అధికారులు చెప్పడం సమంజసం కాదంటూ బాధితులు మండిపడ్డారు. -
కొత్త చట్టం కింద పరిహారం ఇవ్వండి
రెవెన్యూ అధికారులకు హైకోర్టు ఆదేశం సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్‌లోని విశ్వేశ్వరయ్య విగ్రహం వద్ద నుంచి ద్వారకా హోటల్ వరకు రహదారి విస్తరణ కోసం చేపట్టిన భూ సేకరణకు పరిహారం చెల్లింపు ఉత్తర్వులు జారీ చేసి, ఆ మొత్తాన్ని సకాలంలో జమ చేయకుంటే బాధితులకు 2013 కొత్త భూసేకరణ చట్టం కింద పరిహారం చెల్లించాల్సిందేనని హైకోర్టు స్పష్టం చేసింది. పరిహారం జమ చేయని పక్షంలో పాత భూ సేకరణ చట్టం కింద జారీ చేసిన ప్రొసీడింగ్స్ రద్దైనట్లేనని తేల్చి చెప్పింది. ఇప్పటికే భూమిని సేకరించి అందులో రహదారిని ఏర్పాటు చేసినందున పిటిషనర్‌కు కొత్త భూసేకరణ చట్టం కింద పరిహారాన్ని మూడు నెలల్లో చెల్లించాలని రెవెన్యూ అధికారులను ఆదేశించింది. ఈ మేరకు న్యాయమూర్తి జస్టిస్ ఎం.ఎస్.రామచంద్రరావు ఇటీవల తీర్పు వెలువరించారు. ఖైరతాబాద్ విశ్వేశ్వరయ్య విగ్రహం నుంచి లక్డీకాపూల్ ద్వారకా హోటల్ వరకు రోడ్డు విస్తరణ నిమిత్తం అధికారులు చర్యలు చేపట్టారు. ఇందులో భాగంగా రాంప్రకాశ్ అగర్వాల్ అనే వ్యక్తికి చెందిన స్థలాన్ని, భవనాన్ని కూడా సేకరించాలని నిర్ణయించారు. పరిహారం చెల్లింపునకు 1999లో ఉత్తర్వులు కూడా జారీ చేశారు. తరువాత ఈ వ్యవహారం పలు వివాదాల నేపథ్యంలో సివిల్ కోర్టుకు చేరింది. అయితే అధికారులు మాత్రం చెల్లించాలని నిర్ణయించిన పరిహార మొత్తాన్ని కోర్టులో డిపాజిట్ చేయలేదు. వివాదం సమసిన తరువాత అధికారులు పాత చట్టం ప్రకారం పరిహారం చెల్లించేందుకు సిద్ధం కాగా, అందుకు అగర్వాల్ నిరాకరిస్తూ తనకు 2013 కొత్త భూ సేకరణ చట్టం కింద పరిహారం చెల్లించేలా అధికారులను ఆదేశించాలంటూ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ వ్యాజ్యాన్ని ఇటీవల జస్టిస్ ఎం.ఎస్.రామచంద్రరావు విచారించారు.