east delhi
-
గౌతం గంభీర్ కీలక ప్రకటన.. త్వరలోనే కొత్త లీగ్‌తో ముందుకు..!
Gautam Gambhir announces East Delhi Cricket League: బీజేపీ ఎంపీ, టీమిండియా మాజీ క్రికెటర్ గౌతం గంభీర్ కీలక ప్రకటన చేశారు. త్వరలోనే తూర్పు ఢిల్లీ క్రికెట్ లీగ్‌ను ఆరంభించనున్నట్లు వెల్లడించారు. సకల సౌకర్యాలతో తీర్చిదిద్దిన యమునా స్పోర్ట్స్ కాంప్లెక్స్‌లో ఈ టోర్నీ నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. ఈ విషయాన్ని ట్విటర్ వేదికగా శుక్రవారం ప్రకటించారు. కాగా టీమిండియా స్టార్ క్రికెటర్‌గా, ఇండియన్ ప్రీమియర్ లీగ్‌లో విజయవంతమైన ఆటగాడిగా(కోల్‌కతా నైట్ రైడర్స్, ఢిల్లీ జట్ల మాజీ కెప్టెన్) పేరొందిన గౌతం గంభీర్ ప్రస్తుతం తూర్పు ఢిల్లీ ఎంపీగా కొనసాగుతున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో తన నియోజకవర్గంలోని యమున స్పోర్ట్స్ కాంప్లెక్స్‌ను అభివృద్ది చేసిన గంభీర్.. దీనిని ప్రపంచస్థాయి మైదానంగా తీర్చిదిద్దామని హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా తూర్పు ఢిల్లీ పరిధిలోని 10 అసెంబ్లీ స్థానాల నుంచి జట్లను ఎంపిక చేసి.. ఈస్ట్ ఢిల్లీ ప్రీమియర్ లీగ్‌ను ప్రారంభించనున్నట్లు తెలిపారు. కాగా నవంబరు రెండో వారంలో ఈ టోర్నీని ప్రారంభించనున్నట్లు సమాచారం. 17- 36 ఏళ్ల మధ్య వయస్కులైన క్రికెటర్లు ఇందులో పాల్గొనే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. చదవండి: Gautam Gambhir: మెంటర్‌గా ధోని చేసేదేం ఉండదు.. గంభీర్ సంచలన వ్యాఖ్యలు అత్యాధునికంగా యమున స్పోర్ట్స్ కాంప్లెక్స్ రంజీ ట్రోఫీ నిర్వహణ స్థాయికి తగ్గట్లు యమున స్పోర్ట్స్ కాంప్లెక్స్‌ను తీర్చిదిద్దారు. రెండు డ్రెస్సింగ్‌రూంలు, హైమాస్ట్ లైట్స్, ఆరు పిచ్‌లు, ప్రాక్టీసు పిచ్‌లు, డిజిటల్ స్కోరు బోర్డు డిస్ప్లే, కానపీ, జాగింగ్ ట్రాక్ ఉన్నాయి. ఈ ప్రాజెక్టుకు సుమారు 9 కోట్ల 25 లక్షలు ఖర్చు అయినట్లు సమాచారం. క్రికెట్‌తో పాటు ఆర్చరీ కోసం కూడా దీనిని వినియోగించుకునే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. చదవండి: T20 World Cup: అతడు తోలుబొమ్మ.. జట్టులో మార్పులు తథ్యం.. వీళ్లను తీసుకోవాలి! I PROMISE TO DELIVER! 🇮🇳 World Class Stadium ready at Yamuna Sports Complex! East Delhi Cricket League to start very soon! #DelhiNeedsHonesty pic.twitter.com/DpYJ1xUET2 — Gautam Gambhir (@GautamGambhir) September 10, 2021 -
ఐపీఎల్ తరహాలో టీ20 లీగ్‌ను ప్లాన్ చేసిన గంభీర్
న్యూఢిల్లీ: టీమిండియా మాజీ ఓపెనర్, బీజేపీ ఎంపీ గౌతం గంభీర్ ఐపీఎల్ తరహాలో ఓ లోకల్ టీ20 టోర్నీని నిర్వహించేందుకు ప్రణాళికలు రచించాడు. తూర్పు ఢిల్లీలోని 10 నియోజకవర్గాల మధ్య ఈ క్రికెట్ టోర్నీని నిర్వహించేందుకు సర్వం సిద్ధమైనట్లు తెలుస్తోంది. ఇప్పటికే దీనికి సంబంధించి పనులు కూడా ప్రారంభమైపోయాయి. ఇక టోర్నీ వివరాల్లోకి వెళితే.. ఇందులో అంతర్జాతీయ స్థాయిలో క్రికెట్ ఆడిన ముగ్గురు సెలెక్టర్లు ఉంటారు. వీరి ఆధ్వర్యంలో ట్రయల్స్ అనంతరం సెలెక్షన్ల ప్రక్రియ మొదలవుతోంది. ఈ పోటీల్లో పాల్గొనాలనుకునే అభ్యర్థులు 17 సంవత్సారాలు నిండినవారై ఉండాలి. అలాగే 36 ఏళ్లకు మించి ఉండకూడదు. ప్రతి జట్టు బేస్ ధర నిర్ణయించిన తరువాత ఆటగాళ్ల వేలం జరుగనుంది. అంతేకాకుండా ఆటగాళ్ల కోసం ప్రత్యేకంగా శిక్షకులను ఏర్పాటు చేయడం, క్రికెట్ కిట్లు అందించడం, ఇతర సౌకర్యాలకు ఏ లోటూ రాకుండా చూడడం జరుగుతుందని గంభీర్ వెల్లడించారు. ఈ టోర్నీ అక్టోబర్ చివరి వారంలో మొదలై.. నవంబర్ వరకు కొనసాగుతుందని ఆయన పేర్కొన్నాడు. -
రూపాయికే భోజనం అందిస్తున్న టీమిండియా మాజీ ఓపెనర్
న్యూఢిల్లీ: టీమిండియా మాజీ క్రికెటర్, ప్రస్తుత తూర్పు ఢిల్లీ ఎంపీ గౌతం గంభీర్ తన నియోజకవర్గ పేదల ఆకలి తీర్చేందుకు కేవలం రూపాయికే భోజనం అందించే కార్యక్రమానికి శ్రీకారం చుట్టాడు. ఈ కార్యక్రమాన్ని ఓ ఉద్యమంలా ముందుకు తీసుకెళతానని ఆయన హామీ ఇచ్చారు. గతేడాది డిసెంబర్లో తొలి జన్ రసోయిని(ప్రజా భోజనశాల) తూర్పు ఢిల్లీలోని గాంధీ నగర్ మార్కెట్లో ప్రారంభిన ఆయన.. తాజాగా రెండవ జన్ రసోయిని న్యూ అశోక్ నగర్ ప్రాంతంలో ప్రారంభించారు. రూపాయికే భోజనం కార్యక్రమం ద్వారా ఇప్పటివరకు 50,000 మందికి భోజనం సమకూర్చామని ఆయన వెల్లడించారు. తాజాగా ప్రారంభించిన క్యాంటిన్లో ఒకే సమయానికి యాభై మందికి పైగా భోజనం వడ్డించవచ్చని గంభీర్ తెలిపారు. గతంలో క్రికెట్ మైదానంలో, ప్రస్తుతం రాజకీయాల్లో దూకుడుగా ఉండే గంభీర్, ఇలాంటి మహత్తరమైన కార్యక్రమానికి శ్రీకారం చుట్టడం ప్రశంసనీయమని ఢిల్లీ బీజేపీ ఇంఛార్జ్ పాండా పేర్కొన్నారు. ఈ సందర్భంగా గంభీర్ మాట్లాడుతూ.. డ్రామాలు, ధర్నాలు చేయడానికి తాను రాజకీయాల్లోకి రాలేదని, పేదలకు చేతనైనంత సాయం చేసేందుకే రాజకీయాల్లోకి అడుగుపెట్టానని వెల్లడించారు. ఆహారం ప్రజల కనీస అవసరమని, దేశ రాజధానిలో రెండు పూటలా కడుపు నిండా ఆహారాన్ని కేవలం రూపాయికే అందించడం తనకు చాలా సంతృప్తిని కలిగిస్తోందని పేర్కొన్నారు. -
గంభీర్ పోటీ చేసే స్థానం ఇదే..
న్యూఢిల్లీ: ఇటీవల బీజేపీలో చేరిన మాజీ క్రికెటర్ గౌతమ్ గంభీర్ తూర్పు ఢిల్లీ పార్లమెంట్ నియోజకవర్గం నుంచి ఆ పార్టీ తరఫున బరిలో నిలువనున్నారు. ఈ మేరకు ఆ పార్టీ అధిష్టానం సోమవారం ప్రకటన విడుదల చేసింది. న్యూఢిల్లీ పార్లమెంట్ నియోజకవర్గం ఎంపీగా కొనసాగుతున్న మీనాక్షి లేఖి తిరిగి అదే స్థానం నుంచి ఎంపీగా నిలుపనున్నట్టు తెలిపింది. కాంగ్రెస్, ఆప్‌లు మధ్య పొత్తు ప్రతిపాదన కార్యరూపం దాల్చకపోవడంతో ఢిల్లీ ఇరు పార్టీలు ఒంటరి పోరుకు సిద్దమయ్యాయి. కాగా, తూర్పు ఢిల్లీ స్థానం నుంచి కాంగ్రెస్ తరఫున అరవిందర్ లవ్లీ బరిలో ఉన్నారు. ఢిల్లీలోని మొత్తం ఏడు లోక్‌సభ స్థానాలకు మే 12న ఎన్నికలు జరగనున్న సంగతి తెలిసిందే. -
బాలికల మిస్సింగ్ : అధికారులపై వేటు
సాక్షి, న్యూఢిల్లీ : తూర్పు ఢిల్లీలోని సంస్కార్ ఆశ్రమ్ వసతి గృహం నుంచి తొమ్మిది మంది మైనర్ బాలికలు అదృశ్యమైన ఘటనలో ఇద్దరు మహిళా శిశుసంక్షేమ శాఖ అధికారులను ఢిల్లీ ప్రభుత్వం సోమవారం సస్పెండ్ చేసింది. ఈ ఘటన దురదృష్టకరమని, దీనికి బాధ్యులైన ఇద్దరు సీనియర్ అధికారులపై వేటు వేసినట్టు ఢిల్లీ ఉపముఖ్యమంత్రి మనీష్ సిసోడియా ఉత్తర్వులు జారీ చేశారు. బాలికల అదృశ్యంపై దర్యాప్తును తక్షణమే ఢిల్లీ పోలీస్ నేర విభాగానికి తక్షణమే బదలాయించాలని ఢిల్లీ మహిళా కమిషన్ (డీసీడబ్ల్యూ) డిమాండ్ చేసింది. దేశ రాజధానిలో కలకలం రేపిన ఈ ఘటనకు సంబంధించి ఢిల్లీ పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. కాగా ఢిల్లీలో మహిళలు, బాలికలకు సురక్షిత వాతావరణం కల్పించడంతో మహిళా శిశుసంక్షేమ శాఖ విఫలమైందని ఉప ముఖ్యమంత్రి మనీష్ సిసోడియా సస్పెన్షన్ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.నిర్లక్ష్యంగా వ్యవహరించిన ఉన్నతాధికారుల తీరుతో శాఖపైనే సందేహాలు వెల్లడయ్యే పరిస్థితి ఎదురైందని అన్నారు. -
కుటుంబం సజీవ దహనం
న్యూఢిల్లీ: తూర్పు ఢిల్లీ ప్రాంతం డిల్షాద్ కాలనీలోని ఓ రెసిడెన్షియల్ బిల్డింగ్‌లో శుక్రవారం అగ్ని ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో ఇద్దరు చిన్నారులతో సహా నలుగురు సజీవ దహనమయ్యారు. మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులను గురుతేజ్ బహదూర్ ఆసుపత్రికి తరలించారు. షార్ట్ సర్క్యూట్ కారణంగా ప్రమాదం జరిగినట్లు పోలీసులు భావిస్తున్నారు. ఫోరెన్సిక్ సిబ్బంది విచారణలో భాగంగా సంఘటనాస్థలం నుంచి సాంపిళ్లను సేకరించారు. నిర్లక్ష్యం కారణంగానే ప్రమాదం జరిగుండొచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
తాగి కారును ఢీకొట్టి కాల్చి చంపాడు
న్యూఢిల్లీ: తన కారును ఎందుకు ఢీకొట్టావని ప్రశ్నించినందుకు ఓ వ్యక్తి యువ వ్యాపార వేత్తను కాల్చి చంపాడు. ఫుల్లుగా తాగిన మైకంలో ట్రాఫిక్ వద్దకు ఎస్యూవీ వాహనంలో అతడు దూసుకురావడమే కాకుండా బాధితుడి కారును ఢీకొట్టి గొడవకు దిగి ఈ దారుణానికి పాల్పడ్డాడు. ఈ ఘటన తూర్పు ఢిల్లీలోని అశోక్ నగర్ ప్రాంతంలో చోటుచేసుకుంది. పూర్తి వివరాల్లోకి వెళితే.. ఫరదాబాద్కు చెందిన దీపక్ భదాన(25) అనే ఓ యువ వ్యాపార వేత్త తన బంధువుల ఇంట్లో వివాహానికి కుటుంబ సభ్యులతో వెళ్లి హాజరై తిరిగొస్తున్నాడు. దాల్లుపురా-కోండ్లి రోడ్డులోని ట్రాఫిక్ జామ్ కారణంగా వారు వెళుతున్న కారు ఇరుక్కుపోయింది. అదే సమయంలో ఉత్తరాఖండ్ రిజిస్ట్రేషన్‌తో ఉండి అది కూడా వీఐపీ నెంబర్‌తో ఉన్న ఎస్యూవీ వాహనం వేగంగా వచ్చి కారును పక్క నుంచి ఢీకొడుతూ ముందుకెళ్లింది. ఈ క్రమంలో ఆ కారు పక్కన ఉండే అద్దం పగిలిపోయింది. దీంతో దీపక్ కిందికి అతడిని ప్రశ్నించాడు. మద్యం మత్తులో ఉన్న అతడు వాగ్వాదానికి దిగాడు. అనంతరం దీపక్ అక్కడి నుంచి తిరిగి తన కారులో వెళుతుండగా మద్యం తాగిన వ్యక్తి తన తుపాకీతో కాల్పులు జరపడంతో అతడు అక్కడికక్కడే చనిపోయాడు. దీపక్ ఒక్కడే వాళ్ల కుటుంబానికి పెద్ద దిక్కు. అతడి సోదరులు ఇంకా చదువుతున్నారు. కాల్పులు జరిపిన వ్యక్తిని యశ్ పాల్ అనే ఓ డీలర్‌గా గుర్తించారు. -
ఢిల్లీ బేకరీలో పేలుడు
న్యూఢిల్లీ: ఢిల్లీలోని ఓ బేకరీలో పేలుడు చోటుచేసుకుంది. ఈ ఘటనలో ముగ్గురు ప్రాణాలుకోల్పోయారు. ఒకరు తీవ్రంగా గాయపడ్డారు. తూర్పు ఢిల్లీలోని కురేజి ప్రాంతంలో గురువారం ఉదయం 5.30గంటల ప్రాంతంలో ఈ ఘటన చోటుచేసుకుంది. అయితే పేలుడుకు కారణాలేమిటనే విషయం ఇంకా తెలియరాలేదు. అగ్నిమాపక సిబ్బంది, బాంబు నిర్వీర్య దళం, పోలీసులు సంఘటన ప్రాంతానికి చేరుకున్నారు. ఆ చుట్టుపక్కల నిషేధం విధించి తనిఖీలు నిర్వహిస్తున్నారు. బేకరిలోని ఓ ఓవెన్ పేలడంవల్లే ఈ ప్రమాదం సంభవించినట్లు ప్రాథమిక సమాచారం ద్వారా తెలుస్తోంది. -
తూర్పుఢిల్లీలో అండర్‌పాస్
* పనులను చేపట్టనున్న ప్రజాపనుల శాఖ * ఐదు నెలల్లో పూర్తి చేయాలని లక్ష్యం న్యూఢిల్లీ: తూర్పుఢిల్లీవాసులకు శుభవార్త. మదర్‌డెయిరీ నుంచి లక్ష్మీనగర్ మీదుగా షకర్పూర్ వెళ్లేవారికి త్వరలో ట్రాఫిక్ కష్టాల నుంచి విముక్తి లభించనుంది. ఈ మార్గంలోగల రైల్వే ఓవర్బ్రిడ్జిల కింద రెండు అండర్‌పాస్‌లను త్వరలో నిర్మించనున్నారు.వచ్చే నెలలో రాష్ట్ర ప్రజాపనుల శాఖ ఇందుకు సంబంధించిన పనులను చేపట్టనుంది. దీని అంచనా వ్యయం రూ. 1.5 కోట్లు. ఏప్రిల్నాటికల్లా పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. అండర్‌పాస్ నిర్మాణ పనులు పూర్తయితే ఇరువైపుల నుంచి రాకపోకలు సాగించేవారికి ట్రాఫిక్ కష్టాలు తీరతాయి. వాస్తవానికి ఈ ప్రాజెక్టుకు యూపీఏ ప్రభుత్వం 2013లోనే ఆమోదముద్ర వేసింది. అయితే అప్పటినుంచి అనేక కారణాల వల్ల ఇది వాయిదాపడుతూనే ఉంది. ఈ నేపథ్యంలో వచ్చే నెలలో ఈ ప్రాజెక్టు పనులను ప్రారంభించాలని రాష్ట్ర ప్రజాపనుల శాఖ నిర్ణయించింది. ఈ విషయమై సంబంధిత అధికారి ఒకరు మాట్లాడుతూ ‘మదర్ డెయిరీ ప్రాంతం వద్దనుంచి ఈ ప్రాజెక్టు పనులు మొదలవుతాయి. పిల్లర్లను ఆధారంగా చేసుకుని అండర్‌పాస్ నిర్మించడం అంత కష్టమైన పనేమీ కాదు. రైల్వే మార్గాన్ని గట్టుగా చేసుకుని ఈ పనులను చేపట్టాల్సి ఉంటుంది. అందుకోసం బాక్స్ పుషింగ్ సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించాల్సి వస్తుంది. చెట్ల నరికివేత పనులను అనుమతి పొందేందుకు దరఖాస్తు చేయడంవల్ల తొలుత ఈ ప్రాజెక్టు పనులు ఆలస్యమయ్యాయి. ఇందుకు సంబంధించిన పనులను వచ్చే నెలలో మొదలుపెడతామని సంబంధిత అధికారి ఒకరు తెలియజేశారు. ఒకసారి ఈ ప్రాజెక్టు పనులు పూర్తయితే పాండవ్‌నగర్ నుంచి గణేశ్‌నగర్‌కు దీన్ని వినియోగించుకోవచ్చన్నారు. -
ఎమ్మెల్యేపై దుండగులు కాల్పులు
-
బీజేపీ ఎమ్మెల్యేపై దుండగులు కాల్పులు
న్యూఢిల్లీ: దుండగుల కాల్పుల నుంచి బీజేపీ ఎమ్మెల్యే జిత్రేంద్ర సింగ్ షంటీ తృటిలో తప్పించుకున్నారని పోలీసుల వెల్లడించారు. బుధవారం తూర్పు ఢిల్లీలోని వివేక్ విహార్ ప్రాంతంలో ఆయన నివాసం వెలుపల నిల్చున్నారని... ఆ సమయంలో మోటర్ సైకిల్‌పై వచ్చిన ఇద్దరు దుండగులు జితేంద్రపై విచక్షణ రహితంగా రెండు రౌండ్ల కాల్పులు జరిపారని చెప్పారు. ఎమ్మెల్యే వెంటనే అప్రమత్తమై దుండగుల కాల్పుల నుంచి తప్పించుకున్నారని తెలిపారు. దుండగులు అక్కడి నుంచి పరారైయ్యారని పోలీసులు తెలిపారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు చెప్పారు. నిందితుల కోసం గాలింపు చర్యలు ముమ్మరం చేసినట్లు పోలీసులు వివరించారు. -
ఇక ఫోన్ చేస్తే ఆటో..!
న్యూఢిల్లీ: తూర్పు ఢిల్లీలో ఆన్లైన్ ఆటో రిక్షా సర్వీస్ ప్రారంభమైంది. అహ్మదాబాద్‌కు చెందిన కంపెనీ శనివారం ఈ సేవలను అందుబాటులోకి తెచ్చింది. గుజరాత్‌లోని పలు నగరాల్లో ఈ సేవలు విజయవంతంగా అందుతున్నాయని, తూర్పు ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్, నిర్మల్ ఫౌండేషన్ సంయుక్త భాగస్వామ్యంలో ఈ ‘జీ-ఆటో’ సేవలను ప్రారంభించామని ఈడీఎంసీ అధికారులు తెలిపారు. సేవలను మేయర్ రామ్ నారాయణ్ దుబే పట్పర్గంజ్లో ఉన్న పరిపాలనా విభాగం ప్రధాన కార్యాలయంలో ప్రారంభించారు. మొదటి విడతగా 50 ఆటోలను అందుబాటులోకి తెచ్చారు. తూర్పు ఢిల్లీవాసులు ఉదయం 6 గంటలనుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు 011-6444-4441 నంబర్‌కు ఫోన్ చేసి వీటి సేవలను కోరవచ్చని, అలాగే ఆన్లైన్లో డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూ.జి-ఏయూటీవో. ఓఆర్జీ ద్వారా సేవలను పొందవచ్చునని ఈడీఎంసీ ప్రజా సంబంధాల అధికారి యోగేంద్ర సింగ్ మాన్ తెలిపారు. భవిష్యత్తులో ఈ సేవలు నిరంతరం అందుబాటులో ఉండేలా కృషిచేస్తామని ఆయన వివరించారు. వీటికి ప్రభుత్వ రేట్ల ప్రకారమే చార్జీలు ఉంటాయని, అయితే ఈ-సేవల నిమిత్తం మరో రూ.15 అదనంగా చెల్లించాల్సి ఉంటుందని మాన్ చెప్పారు. ప్రస్తుతం వీటి కోసం దిల్షాన్ గార్డెన్లో కంట్రోల్ రూంను ఏర్పాటుచేస్తున్నామన్నారు. కాగా, ముఖ్యంగా తూర్పు ఢిల్లీవాసుల కోసమే ఈ సేవలు ప్రారంభించామని, వారికే మొదటి ప్రాధాన్యమిస్తామని చెప్పారు. అయితే దూరప్రయాణాలకు ఈ ఆటోలను వినియోగించడం నిషిద్ధమన్నారు. బుకింగ్ చేసిన కొన్ని నిమిషాల తర్వాత ప్రయాణికులకు ఆటో నంబర్, డ్రైవర్ పేరు, అతడి మొబైల్ నంబర్ వివరాలు అందుతాయి. ఈ పైలట్ ప్రాజెక్టు విజయవంతమైన తర్వాత ప్రకటనల రూపంలో ఈడీఎంసీకి ఆదాయం వచ్చే అవకాశముందని మాన్ వివరించారు. నగరంలోని మిగిలిన పాలనా విభాగాల భాగస్వామ్యంతో ఈ ఫౌండేషన్ త్వరలోనే ఢిల్లీ అంతటా తన సేవలను విస్తరించనుందని మాన్ తెలిపారు. స్థాయీ కమిటీ చైర్మన్ సంజయ్ సుర్జన్ మాట్లాడుతూ ఈ సేవల్లో కార్పొరేషన్ సిబ్బందికి, కౌన్సిలర్లకు, మీడియా సిబ్బందికి రూ.15 ల రాయితీ లభిస్తుందని వివరించారు. కాగా, ఐఐఎం-ఏ పూర్వవిద్యార్థి ఆలోచనతో ఏర్పాటైన ఈ ‘జీ-ఆటో’ వ్యవస్థలో అహ్మదాబాద్, గాంధీనగర్, వడోదరా తదితర ప్రాంతాల్లో సుమారు 1,000కి పైగా ఆటోలు నడుస్తున్నాయి. -
తుపాకితో కాల్చి.. పీక పిసికి మేనత్తను చంపిన అల్లుడు
కుటుంబ వివాదాల నేపథ్యంలో ఓ కుర్రాడు తన మేనత్తను పిస్టల్‌తో కాల్చి, పీక పిసికి మరీ చంపేశాడు! ఈ దారుణ సంఘటన తూర్పు ఢిల్లీలోని త్రిలోక్‌పూర్ ప్రాంతంలో జరిగింది. నిందితుడికి మేనత్త భర్తతో కొన్నాళ్ల క్రితం తీవ్ర వాగ్వాదం జరిగిందని, అదే ఈ హత్యకు కారణమై ఉంటుందని పోలీసులు అంటున్నారు. హతురాలు కవిత తన ఇంట్లో ఒంటరిగా ఉన్న సమయంలో ఆమె మేనల్లుడు రాజా (21) ఆవేశంగా వచ్చి ఆమెతో గొడవపడ్డాడు. ఆ సమయంలో ఆమె పిల్లలు బంధువుల ఇంట్లో ఉండగా, భర్త ఉద్యోగం పనిమీద బయటకు వెళ్లారు. ప్రత్యక్ష సాక్షుల కథనం ప్రకారం, రాజా ఇంట్లోకి దూసుకెళ్లి, ఆమెతో గొడవ పడ్డాడు. ఆ సమయంలోనే పిస్టల్ తీసి ఆమెను కాల్చాడు. అయితే, కవిత చేయి అడ్డం పెట్టగా ఆమె ముంజేతిలోకి బుల్లెట్ దూసుకెళ్లింది. ఆ వెంటనే అతడు ఆమె పీక పిసికి చంపేశాడు. తుపాకి కాల్పుల శబ్దం విన్న ఇరుగుపొరుగులు అక్కడు చేరుకుని, అతడిని పట్టుకోడానికి ప్రయత్నించారు. కానీ, అతడు వాళ్లను కూడా కాల్చేస్తానంటూ తుపాకితో బెదిరించి అక్కడినుంచి పారిపోయాడు. కవితకు భర్త రవి, ఇద్దరు పిల్లు ఉన్నారు. రవి ఢిల్లీ మునిసిపల్ కార్పొరేషన్లో నాలుగో తరగతి ఉద్యోగిగా పనిచేస్తున్నారు. రాజా చెడు తిరుగుళ్లు తిరుగుతూ, ఇంట్లో పెద్దలతో తరచు వాగ్వాదానికి దిగుతున్నట్లు తెలియడంతో రవి కొంతకాలం క్రితం రాజాను తిట్టి, కొట్టారు కూడా. తన ఇంటికి మళ్లీ రావద్దని కూడా హెచ్చరించారని, అందువల్లే అతడు ఆవేశానికి గురై ఇలాంటిపని చేసి ఉంటాడని పోలీసులు తెలిపారు.