breaking news
E - permit process
-
సరుకుల రవాణాకు ‘ఈ–పర్మిట్’
సాక్షి, జమ్మికుంట(హుజూరాబాద్): ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో పత్తి దిగుబడి ఏటా 35 లక్షల క్వింటాళ్లకు పైగా వస్తుంది. రైతులు పూర్తిగా విక్రయించినా మార్కెట్ దస్త్రాల్లో సగం కూడా నమోదు కావడం లేదు. మరి మిగతా సరుకులు ఎక్కడికి వెళ్తున్నాయి.. కొనుగోలుదారులు కట్టాల్సిన పన్నులను ఎవరు తన్నుకుపోతున్నారు.. సర్కారు ఖజానాకు ఏ మేరకు గండిపడుతోంది..? కొన్నేళ్లుగా అందరిలో వెల్లువెత్తుతున్న సందేహాలు ఇవి. ఆలస్యంగానైనా మేల్కొన్న రాష్ట్ర మార్కెటింగ్‌శాఖ అవినీతికి తెరదింపేందుకు కొత్తగా ఈ–పర్మిట్ విధానాన్ని అమల్లోకి తీసుకొచ్చింది. వ్యవసాయ ఉత్పత్తుల కొనుగోళ్లు, సరుకుల రవాణా, పన్నుల వసూళ్లలో అవినీతికి ఆస్కారం లేకుండా చర్యలు చేపట్టింది. ఇకపై లెక్కలు పక్కాగా చూపేందుకు పకడ్బందీ ఏర్పాట్లు చేసింది. భారీగా ప్రధాన పంటల దిగుబడులు.. ఉమ్మడి జిల్లాలో ఖరీఫ్, రబీ కలుపుకొని ఏటా 6.80 లక్షల హెక్టార్లలో వివిధ పంటలు సాగవుతాయి. ఇందులో రెండు లక్షల హెక్టార్లు పత్తి, మూడు లక్షల హెక్టార్లు వరి, లక్ష హెక్టార్లలో మొక్కజొన్న పండిస్తారు. 35 లక్షల నుంచి 40 లక్షల క్వింటాళ్ల పత్తి, 1.80 కోట్ల క్వింటాళ్ల వరి, 50 లక్షల క్వింటాళ్ల మొక్కజొన్న దిగుబడి వస్తుంది. మార్కెట్లో ఇరు సీజన్లలో క్రయవిక్రయాలు సాగుతాయి. వరి, మొక్కజొన్న పంటలను ప్రభుత్వ రంగ సంస్థలే అధికంగా సేకరిస్తుండగా, పత్తిని పూర్తిగా మిల్లర్లు, ట్రేడర్లు కొంటున్నారు. నిబంధనల ప్రకారం.. వ్యాపారులు సరుకుల కొనుగోళ్ల వివరాలను రోజూ మార్కెట్ అధికారులకు ఇవ్వాలి. బేళ్లు, గింజలు, బియ్యం, మక్కలు, ఇతర అపరాల ఎగుమతికి కార్యదర్శి నుంచి రవాణా పర్మిట్ తీసుకోవాలి. ఆర్థిక సంవత్సరం ముగిసేలోపు కొనుగోలు చేసిన సరుకుల విలువలో ఒకశాతం పన్నుగా చెల్లించాలి. మార్కెట్ ఆదాయానికి భారీగా గండి.. కొందరు వ్యాపారులు నిబంధనలను బేఖాతరు చేస్తున్నారు. కొన్న సరుకులు, మార్కెట్‌కు చూపుతున్న లెక్కలకు పొంతన ఉండడం లేదు. ప్రధానంగా మిల్లుల్లో కొంటున్న సరుకులను పూర్తిస్థాయిలో చూపడంలేదు. అధికారులకు రోజూ ఇవ్వాల్సిన వివరాలను నెలకు ఒక్కసారి కూడా సమర్పించడం లేదు. అడిగే దిక్కులేక చాలామంది వ్యాపారులు తప్పుడు లెక్కలతో మార్కెట్ ఆదాయానికి గండికొడుతున్నారు. కొన్ని ప్రాంతాల్లో లోపాయికారీ ఒప్పందాలతో మాన్యువల్ పర్మిట్లు తీసుకుంటూ సరుకులను రవాణా చేస్తున్నారు. గ్రామాల్లో రైతుల నుంచి నేరుగా పత్తి, ధాన్యం, మక్కలు ఖరీదు చేస్తున్న దళారులు ఆయా చెక్‌పోస్టుల్లో చేతివాటం ప్రదర్శిస్తూ సరుకులను జిల్లా సరిహద్దులు దాటిస్తున్నారు. ఇలా ఏటా లక్షలాది క్వింటాళ్లు వక్రమార్గంలో ఇతర ప్రాంతాలకు తరలిపోతున్నాయి. దీంతో సర్కారు ఖజానాకు రూ.కోట్లలో నష్టం వాలిల్లుతోంది. ఇది బహిరంగమే అయినా అధికారుల్లో చలనం కరువైంది. నామమాత్రపు తనిఖీలతో అక్రమ వ్యాపారానికి అడ్డులేకుండా పోయింది. ఎట్టకేలకు మేల్కొన్న మార్కెటింగ్‌శాఖ.. ఏళ్లుగా సాగుతున్న అవినీతిని ఎట్టకేలకు మార్కెటింగ్‌శాఖ గుర్తించింది. కొనుగోళ్లలో పారదర్శకత, పూర్థిసాయిలో పన్నుల వసూళ్లకు కొత్తగా ఈ–పర్మిట్ విధానాన్ని అమల్లోకి తెచ్చింది. కొత్త నిబంధనల ప్రకారం సదరుశాఖ రూపొందించిన వెబ్సైట్లో తొలుత మిల్లర్లు, ట్రేడర్లు వారి సంస్థలకు సంబంధించిన వివరాలను నమోదు చేసుకోవాలి. మార్కెట్ అధికారులు పరిశీలించాక యూజర్ ఐడీ, పాస్వర్డ్ ఇస్తారు. భద్రత కోసం పాస్వర్డ్ మార్చుకునే వీలుంది. వ్యాపారులు వెబ్సైట్లో లాగిన్ అయ్యాక సరుకుల కొనుగోళ్ల వివరాలను ఎప్పటికప్పుడు ఆన్లైన్లో పొందుపర్చాలి. యార్డులో అయితే కమీషన్ ఏజెంట్ ద్వారా ఎన్ని క్వింటాళ్లు కొన్నారనేది చూపితే సరిపోతుంది. ఎందుకంటే రైతుల వివరాలను మార్కెట్ సిబ్బంది రికార్డుల్లో చేరుస్తారు. గ్రామాల్లో, మిల్లుల్లో నేరుగా కొంటే.. సరుకులు అమ్మిన రైతుల వివరాల(చిరునామా, ఆధార్ నెంబర్, ఫోన్ నెంబర్)ను వ్యాపారులు పూర్తిగా నమోదు చేయాలి. నెలవారీ కొనుగోళ్ల ప్రకారం ప్రతినెలా పదో తేదీ లోపు పూర్తిగా పన్ను(సరుకుల విలువలో ఒకశాతం) చెల్లించాలి. ఇవి పాటిస్తేనే బేళ్లు, గింజలు, బియ్యం, మక్కలు, అపరాలు తదితర ఉత్పత్తుల రవాణాకు ఆన్లైన్లో ఈ–పర్మిట్ జారీచేస్తారు. ఈ విధానం గతనెల 26న ఉమ్మడి జిల్లాలో అమల్లోకి రాగా.. మిల్లర్లు, ట్రేడర్లు క్రమంగా వెబ్సైట్లో లాగిన్ అవుతున్నారు. రంగంలోకి విజిలెన్స్ బృందాలు.. ఇకపై వ్యాపారులు ఇష్టారాజ్యంగా పర్మిట్లు తీసుకునే వీల్లేదు. సరుకుల కొనుగోళ్ల మేరకే పర్మిట్లు ఇచ్చేలా వెబ్సైట్ రూపొందించారు. లెక్కల్లో చూపని వాటికి రవాణా అనుమతులు రాకుండా రూపకల్పన చేశారు. ఒకవేళ అక్రమ రవాణా చేస్తే చెక్‌పోస్టులో నిలిపివేస్తారు. చేతివాటంతో అక్కడి నుంచి తప్పించేందుకు ప్రయత్నించినా దాన్నీ అడ్డుకునేందుకు మార్కెటింగ్‌శాఖ పకడ్బందీ ఏర్పాట్లు చేసింది. రహదారులపై తనిఖీకి విజిలెన్స్ బృందాలను నియమించింది. ఈ–పర్మిట్ లేకుండా రవాణా చేస్తూ పట్టుబడితే వ్యాపారులు చెల్లించాల్సిన పన్ను కంటే 5 నుంచి 8 రెట్లు అధికంగా జరిమానా వసూలు చేయాలని నిర్ణయించింది. దొంగ దందాతో సర్కారు ఖజానాకు తూట్లు పొడుస్తున్న దళారులపై కూడా విజిలెన్స్ ఉక్కుపాదం మోపనుంది. ఇకనుంచి అధికారులు గ్రామాల్లో నేరుగా జరిగే కొనుగోళ్లపై దృష్టి సారించనున్నారు. మార్కెట్ లైసెన్స్ లేకుండా వ్యాపారం చేసే దళారులపై కేసులు నమోదు చేసి జైలుకు పంపేందుకు రంగం సిద్ధం చేస్తున్నారు. -
గనుల శాఖలో ‘ఈ- పర్మిట్’
తాండూరు, న్యూస్‌లైన్: గనుల శాఖలో కొత్తగా ఈ -పర్మిట్ విధానం అమల్లోకి రానున్నది. ఈ విధానం ద్వారా లీజుదారులు ఇకపై గనుల నుంచి ముడిసరుకు తరలించేందుకు మైన్స్ కార్యాలయాలకు రావాల్సిన అవసరంలేదు. ఏడాది క్రితం గనుల లీజుకు ఆన్లైన్లో దరఖాస్తుల స్వీకరణకు శ్రీకారం చుట్టిన అధికారులు ఇప్పుడు పర్మిట్ల జారీకి కూడా ఆన్లైన్ విధానాన్ని అమలోకి తేనున్నారు. ప్రస్తుతం గనుల శాఖ లీజుదారులకు మ్యానువల్ పద్ధతిలో పర్మిట్లు జారీ చేస్తున్నది. ఈ పద్ధతిలో రవాణా చేయాలనుకున్న ముడిసరుకు పరిమాణం ప్రకారం లీజుదారులు స్థానిక ట్రెజరీలో చలానా చెల్లించి, గనుల శాఖ అసిస్టెంట్ డెరైక్టర్ కార్యాలయంలో అందజేస్తారు. అనంతరం ముడిసరుకు రవాణాకు పర్మిట్లను జారీ చేస్తారు. అయితే తరచూ అధికారులు కార్యాలయంలో లేకపోవడం, పర్మిట్లను ఓకే చేసేందుకు సిబ్బంది సతాయిస్తుండడం తదితర కారణాల వల్ల లీజుదారులకు ఇబ్బందులు తప్పడం లేదు. తద్వారా ముడిసరుకు రవాణా ఆలస్యమవుతోంది. ఇలాంటి ఇబ్బందుల నుంచి లీజుదారులకు విముక్తి కల్పిస్తూ పర్మిట్ల కోసం వారు మైన్స్ కార్యాలయం చుట్టూ తిరగాల్సిన అవసరం లేకుండా ఈ -పర్మిట్ విధానం అమలుకు తెలంగాణ ప్రభుత్వం పచ్చజెండా ఊపింది. ఈనెల 9వ తేదీ నుంచి ఈ కొత్త విధానం పది జిల్లాల్లో అమల్లోకి తీసుకువచ్చేందుకు గనుల శాఖ సంచాలకులు ఇప్పటికే మైన్స్ ఏడీ కార్యాలయాలకు ఆదేశాలు జారీ చేశారు. ఈ -పర్మిట్ విధానాన్ని పైలట్ ప్రాజెక్టుగా కరీంనగర్ జిల్లాలో గత ఏడాది మార్చిలోనే అమలు చేయగా విజయవంతమైంది. అయితే ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలోని పది జిల్లాల్లో పూర్తి స్థాయిలో ఈ విధానం అమలుకు కొత్త ప్రభుత్వం సన్నద్ధమైంది. గ్రానైట్, సుద్ధ, కంకర, షేల్తోపాటు తదితర చిన్నాపెద్ద తరహా ఖనిజాల రవాణాకు ఇక నుంచి ఈ -పర్మిట్ విధానం ద్వారా ఆన్లైన్లో పర్మిట్లు జారీ చేస్తారు. ఈ విధానం అమలుకు గనుల శాఖ ప్రత్యేకంగా సాఫ్ట్‌వేర్‌ను కూడా సిద్ధం చేస్తున్నది. లీజుదారులకు గనుల శాఖ ఎస్బీహెచ్, ఎస్బీఐ, హెచ్డీఎఫ్సీ తదితర పది బ్యాంకుల్లో నెట్ బ్యాంకింగ్ సౌకర్యాన్ని కూడా కల్పించనున్నది. నెట్‌బ్యాంకింగ్ ద్వారా లీజుదారులు ముడిసరుకు రవాణాకు పర్మిట్ కోసం డబ్బులను గనుల శాఖ ప్రధాన పద్దులో జమ చేస్తారు. అయితే లీజుదారులకు గనుల శాఖ ప్రత్యేకంగా ఐడీ నంబరును కేటాయిస్తున్నది. నెట్‌బ్యాంకింగ్ ద్వారా లీజుదారులు పర్మిట్ డబ్బులు జమ చేయగానే మైన్స్ ఏడీ సెల్ఫోన్లో ఇందుకు సంబంధించిన సమాచారం వస్తుంది. ప్రత్యేకంగా కేటాయించిన ఐడీ ద్వారా లీజుదారుడు ఎవరు, గని సర్వేనంబర్ తదితరాలతోపాటు లీజు కాలం వంటి వివరాలూ తెలుస్తాయి. అనంతరం ఏడీలు తమ డిజిటల్ సంతకంతో కూడిన పర్మిట్లను ఆన్లైన్లో లీజుదారునికి పంపిస్తారు. ఆన్లైన్లో వచ్చిన పర్మిట్లను లీజుదారులు ప్రింట్ రూపంలో డౌన్లోడ్ చేసుకొని, ముడిసరుకును రవాణా చేసుకుంటారు. సిమెంట్ కర్మాగారాలు ఉన్నప్రాంతాల్లో సిమెంట్ గ్రేడ్ లైమ్‌స్టోన్‌కు మాత్రమే ఈనెల 9 నుంచి ఈ -పర్మిట్ విధానం అమలు చేయడానికి గనుల శాఖ సన్నాహాలు చేస్తున్నది. ఇతర చిన్నాపెద్ద తరహా ఖనిజాల ముడిసరుకు రవాణాకు ఈ విధానం సాధ్యమైనంత తొందరగా అమల్లోకి తీసుకువచ్చేందుకు కసరత్తులు జరుగుతున్నాయని మైన్స్ వర్గాలు చెబుతున్నాయి.