Duvvada Jagannadham
-
సల్మాన్ ఖాన్ సీటీమార్
బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్ సీటీ మార్ అంటూ చిందేసేందుకు సిద్ధమవుతున్నారు. తన తాజా చిత్రం ‘రాధే: యువర్ మోస్ట్ వాంటెడ్ భాయ్’లో తెలుగు ‘సీటీ మార్’ పాటని రీమిక్స్ చేసేందుకు రెడీ అవుతున్నారు. ప్రభుదేవా దర్శకత్వంలో సల్మాన్ ఖాన్ హీరోగా నటించిన చిత్రం ‘రాధే: యువర్ మోస్ట్ వాంటెడ్ భాయ్’. ఈ చిత్రాన్ని రంజాన్ సందర్భంగా మే నెలలో విడుదల చేయాలనుకున్నారు. అయితే కరోనా వైరస్ కారణంగా నెలకొన్న లాక్ డౌన్‌తో సినిమా విడుదల వాయిదా పడింది. తాజా సమాచారం ఏంటంటే.. అల్లు అర్జున్ హీరోగా నటించిన ‘దువ్వాడ జగన్నాథమ్’ చిత్రంలోని హిట్ సాంగ్ ‘సీటీ మార్.. సీటీ మార్..’ని ‘రాధే..’ చిత్రం కోసం రీమిక్స్ చేయనున్నారట. ఒరిజినల్ తెలుగు వెర్షన్‌కి సంగీతం అందించిన దేవిశ్రీ ప్రసాద్ హిందీ రీమిక్స్ పాటకి కూడా స్వరాలు అందించనున్నారని సమాచారం. కాగా అల్లు అర్జున్ ‘ఆర్య 2’ చిత్రంలోని ‘రింగ రింగ..’ పాటని సల్మాన్ ఖాన్ ‘రెడీ’ చిత్రంలో ‘ధింక చికా...’ అంటూ రీమిక్స్ చేయగా సూపర్ హిట్‌గా నిలిచిన సంగతి తెలిసిందే. ‘సీటీ మార్...’ హిట్ ట్యూన్ కాబట్టి రీమిక్స్ ట్యూన్ కూడా ఆకట్టుకుంటుందని ఊహించవచ్చు. దిశా పటాని, రణదీప్ హుడా, జాకీ ష్రాఫ్ తదితరులు నటించిన ‘రాధే: యువర్ మోస్ట్ వాంటెడ్ భాయ్’ చిత్రాన్ని రీల్ లైఫ్ ప్రొడక్షన్స్, సోహైల్ ఖాన్ ప్రొడక్షన్స్, సల్మాన్ ఖాన్ ఫిల్మ్స్ సంయుక్తంగా నిర్మించాయి. -
‘డీజే’ థ్యాంక్స్ మీట్
-
తిరుమలలో 'డీజే '
-
‘నేను కాదు...సినిమానే మాట్లాడుతుంది’
తిరుచానూరు: దువ్వాడ జగన్నాథం(డీజే) సినిమా విడుదల కోసం నేనూ ప్రేక్షకుడి మాదిరి ఎదురు చూస్తున్నానని హీరో అల్లు అర్జున్ అన్నారు. సినిమా గురించి తాను ఇప్పేడేమీ మాట్లాడేది లేదని, మరో రెండు రోజుల్లో సినిమానే మాట్లాడేస్తుందని నవ్వుతూ చెప్పారు. అల్లు అర్జున్, పూజా హెగ్డేలు జంటగా నటించిన డీజే ఈ నెల 23న విడుదల కానుంది. తిరుమల శ్రీవారి దర్శనం చేసుకున్న నిర్మాత దిల్‌రాజు, దర్శకుడు హరీష్ శంకర్‌లతో అల్లు అర్జున్ మీడియాతో మాట్లాడారు. అభిమానుల అంచనాలకు మించి డీజే సినిమా ఉంటుందని నిర్మాత దిల్‌రాజ్ తెలిపారు. శ్రీవేంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్‌పై నిర్మించిన 25వ చిత్రం డీజే. శ్రీవారి ఆశీస్సులు, అభిమానులు, ప్రేక్షకుల ఆదరణతో ఈ సినిమా ఘన విజయం సాధిస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. దర్శకుడు హరీష్ శంకర్ మాట్లాడుతూ.. అల్లు అర్జున్ నుంచి అభిమానులు కోరుకునే డ్యాన్స్, ఫైట్స్, వినోదం వంటి అన్ని అంశాలతో ఈ సినిమా ప్రతి ఒక్కరిని ఆకట్టుకుంటుందని తెలిపారు. హీరోయిన్ పూజా హెగ్డే మాట్లాడుతూ అందరరూ మెచ్చేలా ఈ సినిమా ఉంటుందన్నారు. ఈ సినిమాను ఇంటిల్లిపాది కలిసి ఆనందంతో చూసేలా ఉంటుందని అన్నారు. దర్శకుడు ఈ సినిమాను చాలా చక్కగా చేశారని తెలిపారు. ప్రముఖ డిస్ట్రిబ్యూటర్ ఎన్వీ. ప్రసాద్ మాట్లాడుతూ నిర్మాత దిల్‌రాజుకు శ్రీవారిపై అచంచలమైన భక్తి ఉందన్నారు. తను నిర్మించిన ప్రతి సినిమా రిలీజ్ చేయడానికి ముందు శ్రీవారిని దర్శించుకుంటారని తెలిపారు. ఈ సినిమాలోని ఓ పాటను బ్రాహ్మణ సంఘం అభ్యంతరం వ్యక్తం చేసిన నేపథ్యంలో లిరిక్స్‌ను మార్చినట్లు ఓ విలేకరి అడిగిన ప్రశ్నకు నిర్మాత దిల్‌రాజు, డైరెర్టర్ హరీష్ శంకర్లు ఈ సందర్భంగా తెలిపారు. [ ఫోటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి ] -
శ్రీవారి సేవలో 'డీజే '
తిరుమల: ఏడుకొండలపై కొలువైన శ్రీ వెంకటేశ్వర స్వామిని డీజే చిత్ర బృందం బుధవారం దర్శించుకుంది. హరీష్ శంకర్ దర్శకత్వంలో అల్లు అర్జున్ నటిస్తున్న డీజే(దువ్వాడ జగన్నాథం) సినిమా శుక్రవారం ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ మేరకు చిత్ర యూనిట్ ఈ రోజు శ్రీవారిని దర్శించుకుంది. హీరో అల్లు అర్జున్, నిర్మాత దిల్‌రాజు, దర్శకుడు హరీష్ శంకర్‌తో పాటు చిత్ర యూనిట్ శ్రీవారి సేవలో పాల్గొన్నారు. దర్శనం అనంతరం చిత్ర బృందానికి టీటీడీ అధికారులు తీర్ధప్రసాదాలు అందజేశారు. అల్లు అర్జున్ను చూసేందుకు అభిమానులు ఎగబడటంతో పోలీసులు అప్రమత్తమయ్యారు. -
డీజే మెనూ
దువ్వాడ జగన్నాథమ్ వంటలన్నీ స్పెషలే బన్నీ వంట బ్రాహ్మణుడిగా మంచి వంటలు చేయడమే కాదు సమాజంలో ఉన్న పుచ్చును కూడా ఏరిపారేస్తాడు కథలో రెండు వేరియేషన్స్ ఉంటాయంటున్నారు ఒక వేరియేషన్లో జంధ్యం వేసుకుంటాడు రెండో వేరియేషన్లో ఎవరినైనా ఏసేస్తాడు. ‘దిల్’ రాజు, శిరీష్, హరీష్ శంకర్ ‘ఎక్స్‌క్లూజివ్’గా చెప్పిన విషయాలు స్పెషల్ ఐటమ్‌గా ‘సాక్షి’ మీకు వడ్డించింది. చూస్తారేంటి... లాగించండి... ముందు టైటిల్! ‘డీజే’ అంటే డిస్క్ జాకీ. ఇది నిన్నటి మాట. ‘డీజే’ అంటే ‘దువ్వాడ జగన్నాథమ్’. ఇది ఇవాళ్టి మాట. బన్నీ (అల్లు అర్జున్) అభిమానులు ‘క్యా టైటిల్ హై’ అని మురిసిపోయారు. కథ రాసుకోకముందే దర్శకుడు హరీష్ శంకర్ ఈ టైటిల్ అనుకున్నారు తెలుసా? పైగా ఇది ఇప్పుడు అనుకున్న టైటిల్ కాదు. ఎప్పుడో నాలుగైదేళ్ల క్రితం అనుకున్నది. ‘దువ్వాడ జగన్నాథమ్’ అనే పేరు ఒక రోజు హరీష్ మైండ్‌లో ఫ్లాష్ అయింది. ‘అబ్బ భలే ఉందే’ అనుకున్నారు. ఈ టైటిల్‌తో సినిమా తీయాలని అప్పుడే ఫిక్సయ్యారు. కానీ, కథ అల్లడం అంటే టైటిల్ అనుకున్నంత ఈజీ కాదు కదా. ఆ తర్వాత వేరే సినిమాలతో హరీష్ బిజీ అయిపోయారు. మనసులో మాత్రం ‘దువ్వాడ జగన్నాథమ్’ అలా నిలిచిపోయాడు. రెండేళ్లు గిర్రున తిరిగాయి. అది 2015. అప్పుడు ‘దువ్వాడ...’ కథ మొదలైంది! సాయిధరమ్ తేజ్‌తో హరీష్ శంకర్ తీస్తున్న ‘సుబ్రమణ్యం ఫర్ సేల్’ షూటింగ్ ఫుల్ స్వింగ్‌లో ఉంది. నిర్మాత ‘దిల్’ రాజు షాట్ గాప్‌లో నెక్ట్స్ ఏంటి? అని హరీష్‌ని అడిగారు. అప్పటికే ఓ చిన్న పాయింట్ మైండ్‌లో మెదులుతోంది. 20 నిమిషాల్లో ఆ పాయింట్ చెప్పేశారు. ‘దిల్’ రాజుకి బాగా నచ్చేసింది. ‘మనం ఈ పాయింట్‌తో సినిమా తీస్తున్నాం’ కమిట్మెంట్ ఇచ్చేశారు. అలా 2015లో ‘దువ్వాడ...’ స్టోరీ మొదలైంది. జగన్నాథమ్ బన్నీకి బాగా నచ్చాడు ‘దిల్’ రాజుకి పాయింట్ చెబుతున్నప్పుడు హరీష్ శంకర్ మనసులో ఉన్న హీరో బన్నీ. పాయింట్ విన్న తర్వాత ‘దిల్’ రాజు మనసులోకొచ్చిన హీరో కూడా బన్నీయే. ఓ సందర్భంలో బన్నీకి ఆ 20 నిమిషాల పాయింట్‌ను ఆయన చెప్పారు. బన్నీకి బాగా నచ్చింది. ‘సినిమా చేద్దాం’ అని కమిట్మెంట్ ఇచ్చేశారు. ఇక్కడ ఒక ట్విస్ట్ ఏంటంటే... సాయిధరమ్‌తో ‘సుబ్రమణ్యం ఫర్ సేల్’ మొదలుపెట్టక ముందు ఆ కథను బన్నీకి చెప్పారు హరీష్. బన్నీకి ఆ స్టోరీ నచ్చింది. ‘వేరే కమిట్మెంట్ లేకపోతే నేనే చేసేవాణ్ణి’ అని హరీష్‌తో అన్నారు. రిలీజ్ అయ్యాక సినిమా చూసి, సూపర్ అంటూ హరీష్‌ని అభినందించారు. అలాగే ఏదైనా కథ ఉంటే చెప్పమని హరీష్‌ని అడిగితే... ‘ఓ 20 నిమిషాల పాయింట్ ఉంది.. చెబుతా’ అన్నారు. ‘దిల్’ రాజు చెప్పిన పాయింటే కదా... బాగుంది.. చేద్దాం అని హరీష్‌కి కూడా కమిట్మెంట్ ఇచ్చేశారు బన్నీ. కథేంటంటే.. విజయవాడ సత్యనారాయణపురంలో ఉంటాడు దువ్వాడ జగన్నాథమ్. మన కళ్లెదుట అన్యాయం జరిగినప్పుడు వెయ్యి కత్తులతో.. వంద తుపాకులతో దానికి కారణమైనవాళ్లను అంతం చేయాలనే కసితో మనలోంచి ఒకడు బయటికొస్తాడు. కానీ, భయాల వల్ల ఆ ఒక్కడు ఏమీ చేయకుండా నిస్సహాయుడిగా మిగిలిపోతాడు. అలా అనుకోకుండా బయటికొచ్చిన వ్యక్తి తనను తాను జస్టిఫై చేసుకుంటూ వెళ్లడమే ఈ సినిమా. మంచిపై చెడు గెలవడం అనేది పాయింట్. థ్రిల్ కలిగించే ట్విస్టులతో ‘దువ్వాడ జగన్నాథమ్’ కథను మలిచారు హరీష్ శంకర్. 2016 ఆగస్ట్ 28న మొదలు హీరో–ప్రొడ్యూసర్ నుంచి గ్రీన్ సిగ్నల్ రాగానే హరీష్ శంకర్ 20 నిమిషాల పాయింట్‌ని డెవలప్ చేసే పనిలో పడ్డారు. నాలుగైదు నెలల్లో స్టోరీ కంప్లీట్ అయింది. బన్నీకి వినిపించారు. ‘నువ్వింకా బాగా చేయగలవు భయ్యా..’ అంటూ సజెషన్ ఇచ్చారు. ఎవరేం చెప్పినా బెటర్మెంట్కే కదా.. హరీష్ ఆ మార్పులు చేశారు. ఈసారి ఇంకో మార్పు.. నో ప్రాబ్లమ్. అది కూడా చేసేశారు. ఇక ఏ మార్పూ అవసరం లేనంతగా స్టోరీ రెడీ అయిపోయింది. 2016 ఆగస్ట్ 28న పూజా కార్యక్రమాలతో సినిమా మొదలైంది. రెగ్యులర్ షూటింగ్ స్టార్ట్ అయింది అక్టోబర్ 21న. ప్రస్తుతం రెండు పాటలు మినహా షూటింగ్ పూర్తయింది. ఆ పాటల చిత్రీకరణతో కలుపుకుంటే సినిమా పూర్తి కావడానికి సుమారు 120 రోజులు పట్టింది. అది గాసిప్పురాయుళ్ల కథ ఈ సినిమాకి హిందీ సినిమాటోగ్రాఫర్ అయాంకా బోస్‌ని తీసుకున్నారు. షూటింగ్ సమయంలో ఆయనకూ, హరీష్ శంకర్‌కూ మధ్య ఏవో మనస్పర్థలు వచ్చాయనే వార్త హల్చల్ చేసింది. నిజం ఏంటంటే.. అయాంక భార్యకు డెలివరీ టైమ్. కండిషన్ కొంచెం క్రిటికల్‌గా ఉండటంతో ఆయన షూటింగ్ నుంచి కొన్నాళ్లు తప్పుకోక తప్పలేదు. ఇది తెలియక గాసిప్పురాయుళ్లు కథ అల్లేశారు. అయాంక బోస్ భార్య ఓ పాపకు జన్మనిచ్చారు. తల్లీ బిడ్డా క్షేమంగా ఉండటంతో డెలివరీ అయిన 20 రోజులకు మళ్లీ సెట్స్‌కి వచ్చేశారు అయాంక. బడ్జెట్ ఎంత? ‘దిల్’ రాజు అన్కాంప్రమైజ్డ్ ప్రొడ్యూసర్. కథ ఎంత డిమాండ్ చేస్తే అంత ఖర్చు పెట్టేస్తారు. ఈ సినిమాకి 60 నుంచి 70 కోట్లు ఖర్చు పెట్టాలనుకున్నారు. ఇప్పటివరకూ బన్నీ చేసిన సినిమాల్లో హయ్యస్ట్ బడ్జెట్ మూవీ ఇదే. ‘దిల్’ రాజు బేనర్లోనూ ఇదే ఎక్కువ బడ్జెట్. ‘శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్’కి ఇది 25వ సినిమా. అందుకే ‘దిల్’ రాజు ఈ సినిమాని ‘స్పెషల్’గా భావిస్తున్నారు. అలాగే, ‘ఆర్య’, ‘పరుగు’ వంటి హిట్స్ తర్వాత బన్నీతో ఆయన తీస్తున్న మూడో సినిమా ఇది. ‘హ్యాట్రిక్’కి గురి పెట్టారు. ఈ సినిమాని ‘దిల్’ రాజు ఓన్‌గా రిలీజ్ చేయాలనుకుంటున్నారు. టార్గెట్ కలెక్షన్స్ 120 కోట్లు అట. శాటిలైట్ ఎంత? మామూలుగా ‘దిల్’ రాజుకి సక్సెస్ఫుల్ ప్రొడ్యూసర్ అనే పేరుంది. ‘సరైనోడు’తో బన్నీ రేంజ్ ఇంకా పెరిగింది. ‘సుబ్రమణ్యం ఫర్ సేల్’ సక్సెస్‌తో హరీష్ ట్రాక్ రికార్డ్ బాగుంది. దాంతో సినిమాపై అంచనాలు పెరగడం సహజం. ఎప్పుడైతే ఫస్ట్ లుక్‌ని విడుదల చేశారో అప్పుడు అంచనాలు రెట్టింపు అయ్యాయి. దాంతో శాటిలైట్ హక్కులకు పోటీ మొదలైంది. పలు టీవీ చానెల్స్ పోటీ పడగా ‘జీ’ తెలుగు ఫ్యాన్సీ రేటు ఇచ్చి రైట్స్ దక్కించుకుంది. సుమారు 11 కోట్లకు హక్కులు అమ్మారట. బన్నీ బన్ గయా వెజిటేరియన్ ఇందులో బన్నీ వంట బ్రాహ్మణుడిగా కనిపించే సీన్స్ చాలా ఉన్నాయి. ఆ పాత్రకు సంబంధించిన సీన్స్ తీయడానికి 30–40 రోజులు పట్టింది. సినిమా ఆరంభం కావడానికి మూడు నెలల ముందే జగన్నాథమ్ పాత్రకు ప్రిపరేషన్స్ మొదలుపెట్టారు బన్నీ. కొంతమంది పురోహితులను కలిశారు. బ్రాహ్మణులతో మాట్లాడారు. భాషలో పట్టు సంపాదించుకున్నారు. బ్రాహ్మణ యువకుడి సన్నివేశాలు తీస్తున్నప్పుడు బన్నీ కొన్ని నియమాలు పాటించారు. ఆ పాత్ర చిత్రీకరణ అప్పుడు ముక్క ముట్టలేదు. అదేనండి.. కంప్లీట్ వెజిటేరియన్‌గా మారిపోయారు. జనరల్‌గా ఒక హీరో నుంచి డైరెక్టర్ తనకు కావాల్సింది రాబట్టుకుంటాడంటారు. కానీ, ఒక డైరెక్టర్ నుంచి బన్నీ చాలా రాబట్టుకుంటాడు. ఈ కథ బాగా రావడానికి తనే కారణం. – హరీష్ శంకర్ ‘కబాలి’ తర్వాత ఆ రికార్డ్ ‘దువ్వాడ...’దే! రజనీకాంత్ నటించిన ‘కబాలి’ టీజర్‌కి ఓ రికార్డ్ ఉంది. యూ ట్యూబ్‌లో అత్యధిక వ్యూస్ సాధించుకున్న సినిమాగా ‘నంబర్ వన్’ స్థానం దక్కించుకుంది. ఆ తర్వాత రికార్డ్ ‘దువ్వాడ జగన్నాథమ్’దే. కోటిన్నర వ్యూస్ దక్కించుకుంది. టీజర్‌కు ఇన్ని వ్యూస్ సాధించిన తొలి తెలుగు సినిమా ఇది. సౌత్ సినిమాల్లో ‘కబాలి’ తర్వాత సెకండ్ ప్లేస్ ‘దువ్వాడ...’దే. ‘బాహుబలి–2’ అంటే రెస్పెక్ట్ జూన్ 23న ‘దువ్వాడ..’ను రిలీజ్ చేయనున్నారు. అయితే ఇంకాస్త ముందే విడుదల చేయాలనుకున్నారని, ‘బాహుబలి–2’ కోసం వెనక్కి తగ్గారనే వార్తలు వచ్చాయి. వాస్తవానికి ఈ సినిమాకి సంబంధించిన వర్క్ పూర్తి కాలేదు. ఒకవేళ అన్ని పనులూ పూర్తయినా ‘బాహుబలి–2’ విడుదల సమయంలో ఈ సినిమాని రిలీజ్ చేయాలనుకోలేదు. ఎందుకంటే ఐదేళ్లు కష్టపడి, ఎక్కువ బడ్జెట్‌తో తీసిన సినిమాకి ఇచ్చే గౌరవంగా ‘దువ్వాడ..’ యూనిట్ భావించింది. పంచెకట్టుతో ఫొటోషూట్ కథ మొత్తం ఫైనలైజ్ అయ్యాక జగన్నాథమ్ గెటప్ గురించి కసరత్తులు మొదలయ్యాయి. బాలీవుడ్ డిజైనర్ సుబర్ణాని పిలిపించారు. జగన్నాథమ్ కట్టుకున్న పంచె, చొక్కా తదితర కాస్ట్యూమ్స్ ఆమే తయారు చేశారు. పంచె కట్టులో ప్రత్యేకంగా ఫొటోషూట్ చేశారు. అలాగే బన్నీ, చిత్రకథానాయిక పూజా హెగ్డేతో కూడా ఫొటోషూట్ జరిగింది. సేల్ మిస్ అయ్యి.. దువ్వాడకి సెట్ అయిన పూజ ‘సుబ్రమణ్యం ఫర్ సేల్’లో పూజా హెగ్డేని కథానాయికగా తీసుకోవాలని హరీష్ శంకర్ అనుకున్నారు. ఆమెతో మాట్లాడారు కూడా. అయితే అదే టైమ్‌లో హృతిక్ రోషన్ సరసన హిందీ సినిమా ‘మొహెంజొదారో’కి అడగడంతో పూజా హెగ్డే ఆ సినిమా కమిట్ అయ్యారు. ‘సుబ్రమణ్యం ఫర్ సేల్’ చేయకపోయినప్పటికీ హరీష్‌తో పూజ టచ్‌లోనే ఉన్నారు. నెక్ట్స్ సినిమాలో పూజని తీసుకోవాలని హరీష్ అనుకున్నారు. ‘దువ్వాడ...’ ఫైనలైజ్ కాగానే, అమెరికాలో ఉన్న పూజకి ఫోన్ చేసి, విషయం చెప్పారు. కథ, క్యారెక్టర్ విన్న వెంటనే గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశారామె. ఈ చిత్రంలో ఆమెది ఫ్యాషన్ డిజైనర్ క్యారెక్టర్. మా బేనర్‌కి ఇది 25వ సినిమా. బన్నీతో మూడో సినిమా. దేవిశ్రీ ప్రసాద్‌తో ఏడో సినిమా. హరీష్ శంకర్‌తో మూడో సినిమా. ఇన్నిసార్లు కాంబినేషన్ రిపీట్ అవుతోందంటేనే వేవ్‌లెంగ్త్ ఎంత బాగా కుదిరిందో ఊహించుకోవచ్చు. ఆల్రెడీ మా కాంబినేషన్లో బిగ్గెస్ట్ సక్సెస్‌లు చూశాం. ఇప్పుడు కూడా బ్లాక్ బస్టర్ హిట్‌ని టార్గెట్ చేశాం. – నిర్మాతలు ‘దిల్’రాజు, శిరీష్ జూన్ 23నరావడం పక్కా ప్రస్తుతం ‘డీజే’ పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు శరవేగంగా జరుగుతున్నాయి. జూన్ 23న రావడం పక్కా అంటున్నారు దర్శక–నిర్మాతలు. మరి.. జగన్నాథమ్ జోరు ఎలా ఉంటుందో చూద్దాం. -
జగన్నాథమ్ స్మైల్!
వందమందికి వంట చేసినా... ఓ అమ్మాయితో లవ్‌లో పడినా... ఒకడికి వార్నింగ్ ఇచ్చినా... కామెడీ చేసినా... ఆ మాటకొస్తే జగన్నాథమ్ఏం చేసినా భలే స్టైల్‌గా ఉంటుంది. డీజే (దువ్వాడ జగన్నాథమ్)గా అల్లు అర్జున్ చేస్తున్నప్పుడు ఆ మాత్రం స్టైల్ తప్పదు మరి అంటున్నారు దర్శకుడు హరీశ్ శంకర్. అల్లు అర్జున్ హీరోగా ఆయన దర్శకత్వంలో ‘దిల్’ రాజు, శిరీష్‌లు నిర్మిస్తున్న సినిమా ‘దువ్వాడ జగన్నాథమ్’. ఇటీవల అబుదాబిలో ఓ షెడ్యూల్ పూర్తయింది. ప్రస్తుతం హైదరాబాద్‌లో చిత్రీకరణ జరుగుతోంది. దర్శకుడు హరీశ్ శంకర్ మాట్లాడుతూ – ‘‘అల్లు అర్జున్ స్టైల్‌కి తగ్గట్టు కమర్షియల్ అంశాలతో పాటు సినిమాలో మంచి వినోదం ఉంటుంది. ప్రేక్షకుల పెదాలపై నవ్వులు పూయిస్తుంది. ప్రస్తుతం దినేష్ మాస్టర్ కొరియోగ్రఫీలో ఓ పాటను తెరకెక్కిస్తున్నాం. సినిమాలో ముఖ్యమైన అంశాలన్నీ హైలైట్ అయ్యేలా శ్రీమణి ఈ పాట రాశారు. బన్నీ డ్యాన్స్, సాంగ్ పిక్చరైజేషన్ అభిమానులకు కన్నుల పండగలా ఉంటుంది. దేవిశ్రీ ప్రసాద్ మంచి పాటలు ఇచ్చారు’’ అన్నారు. జగన్నాథమ్‌గా ఆల్రెడీ విడుదలైన గెటప్‌కి భిన్నమైన మరో గెటప్‌లో బన్నీ కనిపిస్తారని సమాచారం. పూజా హెగ్డే హీరోయిన్గా నటిస్తున్న ఈ చిత్రానికి కళ: రవీందర్, కూర్పు: ఛోటా కె. ప్రసాద్, కథనం: రమేశ్‌రెడ్డి–దీపక్‌రాజ్, కెమేరా: ఐనాక బోస్, సంగీతం: దేవిశ్రీ ప్రసాద్. -
వందకోట్లకు గురిపెట్టిన టాలీవుడ్ నిర్మాత!
కొత్త సంవత్సరంలో టాలీవుడ్ అగ్ర నిర్మాత దిల్ రాజు వందకోట్లను టార్గెట్‌గా పెట్టుకున్నట్టు తెలుస్తోంది. ఈ టార్గెట్‌ను అందుకోవడానికి ఆయన తీవ్రంగా కృషి చేస్తున్నారని, అందులో భాగంగా పలు చిన్నా, పెద్ద ప్రాజెక్టులను ఆయన ప్రకటించారని సన్నిహిత వర్గాలు తెలిపాయి. ఆయన తదుపరి ప్రాజెక్టు చిన్న సినిమా శతమానం భవతి. సంక్రాంతి పండుగ బరిలోకి దూకేందుకు ఈ సినిమా సిద్ధమవుతోంది. కాగా, ఆయన చేపట్టిన పెద్ద ప్రాజెక్టు దువ్వాడ జగన్నాథం. అల్లు అర్జున్ హీరోగా తెరకెక్కుతున్న ఈ సినిమా మేలో విడుదల కానుంది. మరో క్రేజీ ప్రాజెక్టు 'ఫిదా'. శేఖర్ కమ్ముల దర్శకత్వంలో ఈ సినిమా రూపొందుతోంది. ఇక నాచురల్ స్టార్ నానితో దిల్ రాజు నిర్మిస్తున్న 'నేను లోకల్' సినిమా ఫిబ్రవరిలో ప్రేక్షకులను పలుకరించబోతున్నది. రవితేజ హీరోగా అనిల్ రావిపూడి దర్శకత్వంలో మరో క్రెజీ ప్రాజెక్టును కూడా వచ్చే ఏడాది ద్వితీయార్థంలో విడుదల చేసేందుకు దిల్ రాజు ప్రయత్నిస్తున్నారు. మణిరత్నం రూపొందించిన 'డ్యుయెట్' సినిమా తెలుగు హక్కులను కూడా ఆయన కొనుగోలు చేశారు. మరికొన్ని ఇతర సినిమాలు కూడా చర్చల్లో ఉన్నాయి. ప్రస్తుతం నిర్మాణంలో ఉన్న నాలుగు సినిమాల ద్వారా నిర్మాతకు రూ. 70 కోట్ల వరకు ఆర్జించే అవకాశముందని, మరో రూ. 30 నుంచి రూ. 40 కోట్ల వరకు ఆర్జించాలని ఆయన టార్గెట్‌గా పెట్టుకున్నారని సన్నిహిత వర్గాలను ఉటంకిస్తూ 'డెక్కన్ క్రానికల్' తెలిపింది. -
రేసుగుర్రం వంశీతో..!
వరుస విజయాలతో ‘సరైన’ దారిలో ఉన్న అల్లు అర్జున్ ప్రస్తుతం హరీశ్ శంకర్ దర్శకత్వంలో ‘దువ్వాడ జగన్నాథమ్’ చిత్రంలో నటిస్తున్నారు. ఒకవైపు ఈ సినిమా చేస్తూనే మరోవైపు తన తదుపరి తెలుగు చిత్రానికి జెండా ఊపారట. వరుస విజయాలతో రేసు గుర్రంలా దూసుకెళుతు న్నారు బన్నీ. ఈ స్టైలిష్ స్టార్ కెరీర్లో ఘన విజయాన్ని నమోదు చేసుకున్న చిత్రాల్లో ‘రేసుగుర్రం’ ఒకటి. ఈ చిత్రానికి కథ అందించింది వక్కంతం వంశీ. అప్పటి పరిచయంతో వంశీ చెప్పిన కథ నచ్చటంతో వెంటనే ఆయన దర్శకత్వంలో ఓ ప్రాజెక్ట్‌ను ఓకే చేసేశారట. పలు హిట్ చిత్రాలకు కథ అందించిన వక్కంతం వంశీకి దర్శకుడిగా ఇది తొలి చిత్రం. బన్నీ 14 ఏళ్ల కెరీర్‌ని విశ్లేషిస్తే ఒక్క ‘ఆర్య’ చిత్రానికే కొత్త దర్శకుడికి అవకాశమిచ్చారు. మళ్లీ ఇన్నాళ్ళకు ఒక నూతన దర్శకుడితో సినిమా చేయడానికి గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం విశేషం. జనవరిలో ఈ చిత్రం పట్టాలెక్కనుందని సమాచారం. ‘దువ్వాడ జగన్నాథమ్’ తర్వాత లింగుస్వామి దర్శకత్వంలో తమిళ చిత్రం చేయడానికి అల్లు అర్జున్ అంగీకరించారు. లింగుస్వామి, వక్కంతం వంశీ.. ఈ ఇద్దరి సినిమాల షూటింగ్‌లూ ఇంచుమించు ఒకేసారి మొదలవుతాయట! -
బన్నీ బన్‌గయా డీజే!
స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ డీజేగా కనిపించడానికి రెడీ అయ్యారు. డీజే అంటే పార్టీలు, పబ్బుల్లో గట్రా కనిపించే డిస్కో జాకీ (డీజే) కాదండీ. ఇప్పుడీ పదానికి బన్నీ కొత్త అర్థం చెబుతున్నారు. అల్లు అర్జున్ హీరోగా హరీష్ శంకర్ దర్శకత్వంలో శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ సంస్థ నిర్మించనున్న చిత్రానికి ‘డీజే.. దువ్వాడ జగన్నాథమ్’ అనే టైటిల్ ఖరారు చేశారు. సినిమాలో హీరో ఊరు దువ్వాడ, పేరు జగన్నాథమ్ కావొచ్చని ఊహించవచ్చు. హైదరాబాద్‌లో నేడు ఈ సినిమా ప్రారంభం కానుంది. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ సంస్థ నిర్మించనున్న 25వ చిత్రమిది. ఈ చిత్రానికి దేవిశ్రీ ప్రసాద్ సంగీత దర్శకుడు.