breaking news
Durham University
-
తల్లి గర్భంలోనే రుచుల మక్కువ
లండన్: కొందరు కొన్ని రకాల ఆహార పదార్థాలపై జిహ్వచాపల్యం ప్రదర్శిస్తారు. మరికొందరు వాటిని చూడగానే ఇబ్బందిగా మొహంపెడతారు. ఇలా ఆహారాన్ని ఇష్టపడడం లేదా పడకపోవడం తల్లి గర్భంలో ఉన్నప్పుడే మొదలవుతుందని ఇంగ్లాండ్‌లోని డర్హాం యూనివర్సిటీ పరిశోధకుల అధ్యయనంలో తేలింది. తల్లి తీసుకొనే ఆహారం, వాటి రుచులకు గర్భంలోని శిశువులు చక్కగా స్పందిస్తున్నట్లు గమనించారు. 18–40 ఏళ్ల వయసున్న 100 మంది గర్భిణులకు 4డీ అల్ట్రాసౌండ్ స్కానింగ్ నిర్వహించారు. 32, 36 వారాల గర్భంతో ఉన్నప్పుడు రెండుసార్లు స్కానింగ్ చేశారు. 100 మందిని మూడు గ్రూపులుగా విభజించారు. స్కానింగ్‌కు 20 నిమిషాల ముందు మొదటి గ్రూప్‌లోని గర్భిణులకు క్యారెట్‌ను, రెండో గ్రూప్‌లోని వారికి క్యాబేజీని 400 ఎంజీ మాత్రల రూపంలో ఇచ్చారు. మూడో గ్రూప్‌లోని గర్భిణులకు ఏమీ ఇవ్వలేదు. క్యారెట్ మాత్ర తీసుకున్న మహిళల గర్భంలోని శిశువుల ముఖాల్లో చిరునవ్వు కనిపించింది. క్యాబేజీ మాత్ర తీసుకున్న వారి గర్భంలోని శిశువులు మాత్రం ఇష్టం లేదన్నట్లుగా ముఖం చిట్లించారు. మాత్రలేవీ తీసుకోనివారి గర్భంలోని శిశువుల్లో ఎలాంటి ప్రతిస్పందన లేదు. ఈ అధ్యయనం వివరాలను సేజ్ జర్నల్‌లో ప్రచురించారు. గర్భిణి తీసుకొనే ఆహారం శిశువును కచ్చితంగా ప్రభావితం చేస్తుందని పరిశోధకులు చెప్పారు. గర్భంతో ఉన్నప్పుడు ఆరోగ్యకరమైన ఆహారం తీసుకొంటే జన్మించిన బిడ్డలు చక్కటి ఆహారపు అలవాట్లు అలవర్చుకొంటారని తెలిపారు. గర్భస్థ శిశువలకు నిర్ధిష్ట ఆహారం పరిచయం చేస్తే భవిష్యత్తులో దానిపైవారు మక్కువ పెంచుకుంటారని సూచించారు. -
రేప్’ సవాల్‌పై క్యాంపస్‌లో కలకలం!
సాక్షి, న్యూఢిల్లీ : యూనివర్శిటీ పరిధిలో, వెలుపలున్న ఇంటర్మీడియట్, డిగ్రీ కళాశాలల్లో విద్యార్థినీ విద్యార్థులు కొత్త విద్యా సంవత్సరాన్ని వినూత్నంగా జరుపుకునేందుకు ప్రయత్నిస్తారన్నది తెలిసిన విషయమే. సంప్రదాయ సంస్కతి కలిగిన భారత్‌లో ఒకలాగా, పాశ్చాత్య సంస్కతి కలిగిన దేశాల్లో ఒకలాగా విద్యార్థి లోకం ఈ వేడుకలు జరపుకుంటోంది. ఈ వేడుకల్లో భాగంగా సీనియర్లు, కొత్తగా కాలేజీల్లోకి అడుగుపెట్టే విద్యార్థులను ర్యాగింగ్ చేయడం సర్వ సాధారణమే. ఒక్కోసారి ఈ ఆట పట్టించడం శ్రుతి మించి రాగాన పడినట్లు వేధింపులకు దారి తీయడమే కాకుండా ఆత్మహత్యలకూ దారి తీస్తుండడంతో భారత్‌లోనే కాకుండా పాశ్చాత్య దేశాల్లో కూడా విద్యార్థుల ‘ర్యాగింగ్’ నివారణకు కఠిన చట్టాలు తీసుకొచ్చారు. అయినాసరే! అక్కడక్కడ విద్యార్థులను ఆటపట్టించడం శ్రుతిమించి జరుగుతున్నాయి. (ర్యాగింగ్: 600 గుంజీలు తీయించిన సీనియర్లు..) ఇంగ్లండ్‌లోని డుర్హామ్ యూనివర్శిటీలో మంగళవారం నాడు అలాంటి కలకలమే చెలరేగింది. యూనివర్శిటీ ప్రెషర్స్ బ్యాచ్‌లోని సంపన్న బాబులు తమ బ్యాచ్‌లోని పేద అమ్మాయిని వెతికి పట్టుకొని రేప్ చేయాలంటూ సీనియర్లు సవాల్ విసిరారు. యూనివర్శిటీకి సంబంధించిన ఫేస్బుక్ గ్రూప్‌ల్లో ఈ సవాల్ చెక్కర్లు కొట్టడమే కాకుండా, దానిపై చర్చోప చర్చలు జరిగాయి. ‘డుర్హామ్ బాయ్స్ మేకింగ్ ఆల్ ది నాయిస్’ గ్రూప్లోనైతే 60 మంది యూజర్లు ఈ సవాల్‌పై స్పందించారు. రేప్ చేస్తే ఏమవుతుంది ? గోల చేసి, గగ్గోలు పెడతారా ? కేసులు పెడతారా ? జైల్లో పెట్టిస్తారా? అనే సందేహాలతోపాటు గతంలో ఇదే యూనివర్శిటీలో చదవిన అమ్మాయిల్లో దాదాపు 35 మంది అమ్మాయిలు తాము రేప్‌లకు గురయ్యామని చెప్పారు తప్పా, ఎవరూ పోలీసులకు వెళ్లి ఫిర్యాదు చేయలేదంటూ రేపిస్టుల తరఫున వకాల్తా పుచ్చుకున్న వాళ్లు ఉన్నారు. ‘ఒవర్హియర్డ్ ఎట్ డుర్హామ్ యూనివర్శిటీ’ ఫేస్బుక్ లాంటి గ్రూపులో ఇలాంటి సవాళ్లను విమర్శిస్తూ వ్యాఖ్యలు చేశారు. (‘ఆడాలని, పాడాలని ఇబ్బంది పెడుతున్నారు’) జూనియర్లే వారిలో వారు ఇలాంటి ఆకతాయి సవాళ్లు విసురుకుంటున్నారని కొంత మంది సీనియర్లు ఫిర్యాదు చేయగా, ఇంకా క్యాంపస్‌లోకి కూడా అడుగుపెట్టని జూనియర్లు ఇలాంటి సవాళ్లు ఎలా విసురుతారని ఇతరులు ప్రశ్నిస్తున్నారు. కళాశాలలో క్రమశిక్షణను కోరుకునే విద్యార్థిని విద్యార్థులు మాత్రం నేరుగా యూనివర్శిటీ డీన్, అధ్యాపకుల వద్దకు వెళ్లి ఇలాంటి క్రమశిక్షణారాహిత్యాన్ని క్షమించరాదంటూ ఫిర్యాదు చేశారు. ఫిర్యాదుపై యూనివర్శిటీ పాలక మండలి స్పందిస్తూ, ‘ఫేస్బుక్ గ్రూపుల్లో చెక్కర్లు కొడుతున్న అసభ్య వ్యాఖ్యలపై యూనివర్శిటీ క్రమశిక్షణా సంఘం వెంటనే రంగంలోకి దిగి దర్యాప్తు జరపుతుంది. నిజంగా విద్యార్థులెవరైనా తప్పు చేసినట్లయితే వారిపై క్రమశిక్షణా చర్యలు తీసుకుంటాం. అవసరమైతే సదరు విద్యార్థులను క్యాంపస్ క్రమశిక్షణ, సంస్కతిని పరిరక్షించేందుకు క్యాంపస్ నుంచి వెలి వేస్తాం’ అంటూ బుధవారం హెచ్చరించింది. ఈ నెల 28వ తేదీన యూనివర్శిటీ ప్రెషర్స్ డే. ఈ క్యాంపస్‌లో గతంలో నలుగురు విద్యార్థులు రేప్ కేసులను ఎదుర్కొన్నారు. థాయ్‌లాండ్ తరఫున అంతర్జాతీయ రగ్బీ ఆడిన 20 ఏళ్ల క్రీడాకారుడు క్రిస్టాఫర్ ట్విగ్ ‘రగ్బీ సోషల్ నైట్’ వేడుకల్లో ఓ విద్యార్థిని రేప్ చేసినట్లు కేసు నమోదయింది. ట్విగ్ తాను చేసిన నేరాన్ని ఒప్పుకోకుండానే తాను రేప్ చేసిన అమ్మాయికి క్షమాపణలు చెప్పడంతో ప్రాసిక్యూటర్లు ఆ విద్యార్థిపై కేసును కొట్టివేశారు. 2016, జనవరి నెలలో యూనివర్శిటీ విద్యార్థుల సంఘం కార్యదర్శిగా పనిచేసిన లూయీ రిచర్డ్సన్, మద్యం మత్తులో ఉన్న ఓ విద్యార్థినిని రేప్ చేసినట్లు ఆరోపణలతో కేసు నమోదయింది. 15 నెలల అనంతరం విచారణకు వచ్చిన కేసులో మూడు గంటలపాటు విచారణ జరిపి కేసును కొట్టివేశారు. క్యాంపస్‌కు సంబంధించి మరో రెండు కేసులను కూడా కోర్టులు క్షమాపణలతోనే కొట్టివేశాయి. -
అదిగదిగో ప్రమాద ఘంటికలు!
జీవప్రపంచం వాతావరణంలో జరిగే మార్పులు ఆల్పైన్ జాతి మేకల బరువుపై ప్రభావం చూపుతున్నట్లు తాజా పరిశోధన ఒకటి చెబుతోంది. ఆల్పైన్ మేకలు 1980తో పోలిస్తే 25 శాతం మేర బరువు తగ్గినట్లు ఉత్తర ఇంగ్లాండ్‌లోని డర్హమ్ యూనివర్శిటీ పరిశోధకులు చెబుతున్నారు. ఆల్పైన్ మేకలు రొమేనియా పర్వత ప్రాంతాలు, పోలండ్‌లోని టార్టా పర్వత ప్రాంతాలు, టర్కీలోని కొన్ని ప్రాంతాలు, న్యూజిలాండ్‌లోని దక్షిణ దీవిలో ఎక్కువగా కనిపిస్తాయి. ‘‘శరీర పరిణామం, బరువు తగ్గిపోవడం అనేది ఆల్పైన్ మేకలకు మాత్రమే పరిమితమైన వ్యవహారం కాకపోవచ్చు. జంతు ప్రపంచంలో చాలా జాతులపై వాతావరణ మార్పులు ప్రభావం చూపుతున్నాయి అనడానికి ఇది తిరుగులేని సాక్ష్యం’’ అంటున్నారు పరిశోధనకు నేతృత్వం వహించిన డా. టామ్ మాన్సన్. బరువు, పరిమాణం తగ్గడం అనేది వాటి శక్తిసామర్థ్యాలపై కూడా ప్రభావం చూపుతుంది. మునపటిలా చలికాలాన్ని తట్టుకునే సామర్థ్యం వాటిలో ఉండడం లేదు. గతంతో పోల్చితే ఆహారాన్వేషణలో చూపే ఉత్సాహం మేకలలో తగ్గిపోయింది. ఆహార అన్వేషణ కంటే విశ్రాంతికే ఎక్కువ సమయం కేటాయిస్తున్నట్లు చెబుతున్నారు పరిశోధన బృందంలో ఒకరైన డా.స్టీఫెన్ విల్స్. ప్రమాదం నుంచి తప్పించుకోవడంలో ఆల్పైన్ మేకలకు గొప్ప పేరు ఉంది. ఎంత ప్రమాదం చుట్టుముట్టినా...అప్పటికప్పుడు వచ్చిన మెరుపు ఆలోచనతో అవి ప్రమాదం నుంచి బయటపడతాయి. రకరకాల ఈలలు, కూతలతో తోటి మేకలకు కూడా ప్రమాద హెచ్చరికను చేరవేస్తాయి. అసాధారణ నైపుణ్యాలతో ప్రమాదాల నుంచి బయటపడే ఆల్పైన్ మేకలకు తాజా ప్రమాదం గురించి తెలియకపోవచ్చు. తెలిసినా చేయగలిగేది ఏమీ లేక పోవచ్చు. పాపం!