రేప్‌’ సవాల్‌పై క్యాంపస్‌లో కలకలం!

Raping On Juniors Is Frightening In Durham University - Sakshi

సాక్షి, న్యూఢిల్లీ : యూనివర్శిటీ పరిధిలో, వెలుపలున్న ఇంటర్మీడియట్, డిగ్రీ కళాశాలల్లో విద్యార్థినీ విద్యార్థులు కొత్త విద్యా సంవత్సరాన్ని వినూత్నంగా జరుపుకునేందుకు ప్రయత్నిస్తారన్నది తెలిసిన విషయమే. సంప్రదాయ సంస్కతి కలిగిన భారత్‌లో ఒకలాగా, పాశ్చాత్య సంస్కతి కలిగిన దేశాల్లో ఒకలాగా విద్యార్థి లోకం ఈ వేడుకలు జరపుకుంటోంది. ఈ వేడుకల్లో భాగంగా సీనియర్లు, కొత్తగా కాలేజీల్లోకి అడుగుపెట్టే విద్యార్థులను ర్యాగింగ్‌ చేయడం సర్వ సాధారణమే. ఒక్కోసారి ఈ ఆట పట్టించడం శ్రుతి మించి రాగాన పడినట్లు వేధింపులకు దారి తీయడమే కాకుండా ఆత్మహత్యలకూ దారి తీస్తుండడంతో భారత్‌లోనే కాకుండా పాశ్చాత్య దేశాల్లో కూడా విద్యార్థుల ‘ర్యాగింగ్‌’ నివారణకు కఠిన చట్టాలు తీసుకొచ్చారు. అయినాసరే! అక్కడక్కడ విద్యార్థులను ఆటపట్టించడం శ్రుతిమించి జరుగుతున్నాయి. (ర్యాగింగ్‌: 600 గుంజీలు తీయించిన సీనియర్లు..)

ఇంగ్లండ్‌లోని డుర్హామ్‌ యూనివర్శిటీలో మంగళవారం నాడు అలాంటి కలకలమే చెలరేగింది. యూనివర్శిటీ ప్రెషర్స్‌ బ్యాచ్‌లోని సంపన్న బాబులు తమ బ్యాచ్‌లోని పేద అమ్మాయిని వెతికి పట్టుకొని రేప్‌ చేయాలంటూ సీనియర్లు సవాల్‌ విసిరారు. యూనివర్శిటీకి సంబంధించిన ఫేస్‌బుక్‌ గ్రూప్‌ల్లో ఈ సవాల్‌ చెక్కర్లు కొట్టడమే కాకుండా, దానిపై చర్చోప చర్చలు జరిగాయి. ‘డుర్హామ్‌ బాయ్స్‌ మేకింగ్‌ ఆల్‌ ది నాయిస్‌’ గ్రూప్‌లోనైతే 60 మంది యూజర్లు ఈ సవాల్‌పై స్పందించారు. రేప్‌ చేస్తే ఏమవుతుంది ? గోల చేసి, గగ్గోలు పెడతారా ? కేసులు పెడతారా ? జైల్లో పెట్టిస్తారా? అనే సందేహాలతోపాటు గతంలో ఇదే యూనివర్శిటీలో చదవిన అమ్మాయిల్లో దాదాపు 35 మంది అమ్మాయిలు తాము రేప్‌లకు గురయ్యామని చెప్పారు తప్పా, ఎవరూ పోలీసులకు వెళ్లి ఫిర్యాదు చేయలేదంటూ రేపిస్టుల తరఫున వకాల్తా పుచ్చుకున్న వాళ్లు ఉన్నారు. ‘ఒవర్‌హియర్డ్‌ ఎట్‌ డుర్హామ్‌ యూనివర్శిటీ’ ఫేస్‌బుక్‌‌ లాంటి గ్రూపులో ఇలాంటి సవాళ్లను విమర్శిస్తూ వ్యాఖ్యలు చేశారు. (‘ఆడాలని, పాడాలని ఇబ్బంది పెడుతున్నారు’)

జూనియర్లే వారిలో వారు ఇలాంటి ఆకతాయి సవాళ్లు విసురుకుంటున్నారని కొంత మంది సీనియర్లు ఫిర్యాదు చేయగా, ఇంకా క్యాంపస్‌లోకి కూడా అడుగుపెట్టని జూనియర్లు ఇలాంటి సవాళ్లు ఎలా విసురుతారని ఇతరులు ప్రశ్నిస్తున్నారు. కళాశాలలో క్రమశిక్షణను కోరుకునే విద్యార్థిని విద్యార్థులు మాత్రం నేరుగా యూనివర్శిటీ డీన్, అధ్యాపకుల వద్దకు వెళ్లి ఇలాంటి క్రమశిక్షణారాహిత్యాన్ని క్షమించరాదంటూ ఫిర్యాదు చేశారు. ఫిర్యాదుపై యూనివర్శిటీ పాలక మండలి స్పందిస్తూ, ‘ఫేస్‌బుక్‌ గ్రూపుల్లో చెక్కర్లు కొడుతున్న అసభ్య వ్యాఖ్యలపై యూనివర్శిటీ క్రమశిక్షణా సంఘం వెంటనే రంగంలోకి దిగి దర్యాప్తు జరపుతుంది. నిజంగా విద్యార్థులెవరైనా తప్పు చేసినట్లయితే వారిపై క్రమశిక్షణా చర్యలు తీసుకుంటాం. అవసరమైతే సదరు విద్యార్థులను క్యాంపస్‌ క్రమశిక్షణ, సంస్కతిని పరిరక్షించేందుకు క్యాంపస్‌ నుంచి వెలి వేస్తాం’ అంటూ బుధవారం హెచ్చరించింది. ఈ నెల 28వ తేదీన యూనివర్శిటీ ప్రెషర్స్‌ డే. ఈ క్యాంపస్‌లో గతంలో నలుగురు విద్యార్థులు రేప్‌ కేసులను ఎదుర్కొన్నారు. 

థాయ్‌లాండ్‌ తరఫున అంతర్జాతీయ రగ్‌బీ ఆడిన 20 ఏళ్ల క్రీడాకారుడు క్రిస్టాఫర్‌ ట్విగ్‌ ‘రగ్‌బీ సోషల్‌ నైట్‌’ వేడుకల్లో ఓ విద్యార్థిని రేప్‌ చేసినట్లు కేసు నమోదయింది. ట్విగ్‌ తాను చేసిన నేరాన్ని ఒప్పుకోకుండానే తాను రేప్‌ చేసిన అమ్మాయికి క్షమాపణలు చెప్పడంతో ప్రాసిక్యూటర్లు ఆ విద్యార్థిపై కేసును కొట్టివేశారు. 2016, జనవరి నెలలో యూనివర్శిటీ విద్యార్థుల సంఘం కార్యదర్శిగా పనిచేసిన లూయీ రిచర్డ్‌సన్, మద్యం మత్తులో ఉన్న ఓ విద్యార్థినిని రేప్‌ చేసినట్లు ఆరోపణలతో కేసు నమోదయింది. 15 నెలల అనంతరం విచారణకు వచ్చిన కేసులో మూడు గంటలపాటు విచారణ జరిపి కేసును కొట్టివేశారు. క్యాంపస్‌కు సంబంధించి మరో రెండు కేసులను కూడా కోర్టులు క్షమాపణలతోనే కొట్టివేశాయి. 

Read latest International News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top