తెలుగులో నటించడం నాకు సవాల్‌గా అనిపించింది: ఫహాద్ ఫాజిల్
‘‘నిర్మాత కార్తికేయ ఫోన్ చేసి, ‘డోంట్ ట్రబుల్ ది ట్రబుల్’ కథ గురించి చెప్పారు. ఆ తర్వాత శశాంక్ వచ్చి కథ చెప్పారు. నా జీవితంలో ఇలాంటి కథ వినలేదనిపించింది. కథ చాలా నచ్చడంతో ఈ సినిమా చేయాలని ఫిక్స్ అయ్యాను’’ అని ఫహాద్ ఫాజిల్ తెలిపారు. శశాంక్ ఏలేటి దర్శకత్వంలో ఫహాద్ ఫాజిల్ హీరోగా, బేబి సారా, సౌరభ్ సచ్దేవ్ ఇతర పాత్రలు పోషించిన చిత్రం ‘డోంట్ ట్రబుల్ ది ట్రబుల్’. ఎస్ఎస్ రాజమౌళి సమర్పణలో శోభు యార్లగడ్డ, ప్రసాద్ దేవినేని, ఎస్.ఎస్. కార్తికేయ నిర్మించిన ఈ సినిమా అక్టోబరు 2న విడుదల కానుంది. ఈ నేపథ్యంలో శనివారం హైదరాబాద్‌లో ఫహాద్ ఫాజిల్ విలేకరులతో పంచుకున్న విశేషాలు. ∙‘డోంట్ ట్రబుల్ ది ట్రబుల్’ చిత్రంలో ప్రేమ, ఆప్యాయత, అనుబంధం వంటి చాలా అంశాలున్నాయి. మ్యాజిక్ అనేది ఒక భాగం మాత్రమే. ఈ సినిమాలో లోతైన అంశాలు, భావోద్వేగాలెన్నో ఉన్నాయి. చాలామందికి ఎన్నో విషయాలను అర్థమయ్యేలా చెప్పే చిత్రం ఇది. ఇందులో నేను చేసిన సూరి పాత్ర అద్భుతంగా ఉంటుంది. చెడు నుంచి మంచిగా మారే నా పాత్ర ప్రయాణం అందరికీ నచ్చుతుంది. సూరిలాంటి పాత్రలను జీవితంలో చాలామందిని చూశాను. నేను చేసే ప్రతి పనిలో నా బెస్ట్ ఇవ్వాలనుకుంటాను. మలయాళంలో కథను అర్థం చేసుకుని, డైలాగ్స్ నేర్చుకుని... ఇంగ్లిష్‌లోకి మార్చుకుని తెలుగులో నటించడం నాకు సవాల్‌గా అనిపించింది. అయినా ఈ ప్రయాణం నాకు ఎంతో నచ్చింది. ∙రాజమౌళిగారు మా సినిమాలోని కొన్ని సీన్స్ చూసి సలహాలు ఇచ్చారు. ఫైనల్ ఔట్పుట్ చూసి సంతోషపడ్డారు. ఆర్కా మీడియా బ్యానర్లోనే మరొక సినిమా చేస్తున్నాను. 2027లో ఆ ప్రాజెక్ట్‌ని ప్రకటిస్తారు.