breaking news
domalapenta
-
TSRTC: రాత్రివేళల్లోనూ శ్రీశైలం బస్సులు
సాక్షి, హైదరాబాద్: పవిత్ర కార్తీక మాసాన్ని పురస్కరించుకుని తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణ సంస్థ ప్రయాణికులకు శుభవార్త తెలిపింది. శ్రీశైలం వెళ్లే భక్తులకు ఈ నెల 20 వరకు రాత్రి వేళల్లో ఎక్కడా ఆగకుండా శ్రీశైలంలో దర్శనం చేసుకునేలా వీలు కల్పించారు. ప్రస్తుతం రాత్రివేళల్లో ఘాట్ రోడ్ల వద్ద బస్సులను నిలిపి తిరిగి ఉదయం వేళల్లో ఫారెస్ట్ అధికారులు బస్సులను అనుమతించేవారు. ఈ నేపథ్యంలో టీఎస్ఆర్టీసీ రంగారెడ్డి రిజినల్ రీజియన్ మేనేజర్ ఎ.శ్రీధర్ ఎంజీబీఎస్, జూబ్లీ బస్టాండ్ల నుంచి వచ్చే ఆర్టీసీ బస్సులను మున్ననూర్, దోమలపెంట చెక్‌పోస్టుల వద్ద నిలపకుండా రాత్రివేళల్లోనూ ప్రయాణానికి అనుమతించాలని ఫారెస్ట్ అధికారులకు విన్నవించారు. ఇందుకు అంగీకరించిన తెలంగాణ ఫారెస్ట్ అధికారి రాకేష్ మోహన్ డోపిడియాల్ ఈ నెల 20 వరకు అనుమతిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. ఈ సందర్భంగా శ్రీధర్ మాట్లాడుతూ... హైదరాబాద్ నుండి శ్రీశైలం వెళ్లే ప్రయాణికులు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని సూచించారు. రాత్రివేళల్లో బస్సులను అనుమతించిన ఫారెస్ట్ అధికారులకు కృతజ్ఞతలు తెలిపారు. (క్లిక్ చేయండి: ఐకానిక్ డబుల్ డెక్కర్ బస్సులు.. వచ్చేస్తున్నాయ్!) -
అమూల్య ప్రతిభ
నల్లమల అడవుల్లో ఓ కుగ్రామం దోమలపెంట. ఆ ఊరిలో పుట్టిన అమ్మాయి ఇమ్మడి అమూల్య. యూఎస్‌లో అడుగుపెట్టబోతోంది... విద్యార్థిగా కాదు! యంగ్ ఉమెన్ లీడర్షిప్ ప్రతినిధిగా...!! యూఎస్ కాన్సులేట్ ఎంపికలో విజేతగా!! ‘స్టడీ ఆఫ్ ద యూఎస్ ఇన్స్టిట్యూట్స్ 2022’ ప్రోగ్రామ్‌కు ఎంపికైంది మన తెలుగుమ్మాయి అమూల్య. ఆమె సొంతూరు మహబూబ్ నగర్ జిల్లాలోని దోమలపెంట. నల్లమల అడవుల్లో అభివృద్ధికి దూరంగా ఉన్న గ్రామం అది. ఇప్పుడు హైదరాబాద్‌లోని ‘రాజ బహద్దూర్ వెంకట రామారెడ్డి ఉమెన్స్ కాలేజ్’లో బీఎస్సీ ఫోరెన్సిక్ సైన్స్‌లో రెండవ సంవత్సరం చదువుతోంది. కాలేజ్‌లోని ఎన్ఎస్ఎస్, క్విల్స్ క్లబ్, ఐక్యూ ఏస్ క్లబ్, ఎస్‌యూసి క్లబ్‌లలో మెంబర్. ఎక్స్ట్రా కరిక్యులర్ యాక్టివిటీలలో చురుగ్గా ఉండేది. నల్గొండలో స్కూల్ రోజుల నుంచి కూడా అమూల్య వక్తృత్వం, వ్యాసరచనలలో ప్రైజ్‌లు అందుకుంది. ఇవన్నీ ఆమెను సామాజికాంశాల మీద నిర్వహించే ర్యాలీల్లో ముందు వరుసలో నిలబెట్టాయి. వీటికి తోడుగా ఆమె తన ఊరి స్కూల్ కోసం, ఆడపిల్లల చదువు గురించి స్వచ్ఛందంగా చేస్తున్న కార్యక్రమాలు కూడా తోడయ్యాయి. అమూల్య తన ఊరి కబుర్లు చెబుతూ నానమ్మ ఇమ్మడి సామ్రాజ్యం గారిని ప్రముఖంగా గుర్తు చేసుకుంది. ‘‘మా దోమలపెంటలో ఆడపిల్లలు చదువుకోవడం ఓ విచిత్రం. అలాంటిది మా నానమ్మ తన ఎనిమిది మంది కొడుకులతోపాటు కూతుర్ని కూడా చదివించింది. తాతయ్య పోవడంతో ఇంటి బాధ్యత పూర్తిగా నానమ్మ మీదనే పడింది. ఆమె బర్రెల పాలు అమ్మి అంతమందినీ చదివించింది. ఆడపిల్లలను బడికి పంపించని ఊరిలో, ఇన్ని ఆర్థిక కష్టాల మధ్య మా అత్తమ్మను చదివించడం అంటేనే ఆడపిల్లలు కూడా చదువుకోవాలని ఆమె ఎంత గట్టిగా నమ్మిందో తెలుస్తోంది. ఆ ప్రభావం మా అందరి మీదా ఉంది. పెద్ద నాన్నల నుంచి మా నాన్న చిన్నాన్నలు అందరూ ప్రభుత్వ ఉద్యోగాల్లో స్థిరపడ్డారు. వాళ్లు తమ ఊరికి, స్కూల్‌కి ఏదో ఒకటి చేయాలని మాట్లాడుకుంటూ ఉండేవాళ్లు. నేను కూడా ఏటా ఆగస్టు 15వ తేదీ, జనవరి 26న దోమలపెంట స్కూల్‌కి వెళ్లి విద్యార్థులకు యూనిఫామ్, పుస్తకాలు, ఇతర స్టేషనరీ ఇస్తుంటాను. స్కూలు ఆవరణను పరిశుభ్రంగా ఉంచుకోవడం, అమ్మాయిల ఉన్నత చదువులు ఎంత అవసరం అనే విషయాల మీద మాట్లాడేదాన్ని. నాన్న వాళ్లు మాత్రం ప్రగతిపథం అనే చారిటీతో స్కూల్‌కి వాటర్ ఫిల్టర్, ఫ్యాన్లు ఇచ్చేవాళ్లు. ఇవన్నీ నేను ఇష్టంగా చేస్తుంటాను. కొన్నేళ్ల కిందట మా ఊరిలో వీథి పక్కన పడి ఉన్న ఓ అమ్మాయిని ఓ ముసలావిడ దగ్గరకు తీసి పెంచింది. ఆ అమ్మాయి ఇప్పుడు టెన్త్ చదువుతోంది. కరోనా ఆన్లైన్ క్లాసుల సమయంలో తనకు స్మార్ట్ ఫోన్ కొనిచ్చాం. మంచి స్టూడెంట్ అని అప్పుడు తెలిసింది. టెన్త్ తర్వాత ఆ అమ్మాయి కాలేజ్ ఎడ్యుకేషన్ బాధ్యత కూడా మా కుటుంబమే తీసుకుంది. ‘మనం మనకోసం చేసుకున్న పని కంటే సమాజం కోసం చేసిన పనిలో ఎక్కువ సంతృప్తి దొరుకుతుంది’ అని నమ్ముతాను. యూఎస్ కాన్సులేట్ నన్ను ఎంపిక చేయడానికి ఇవన్నీ దోహదం చేశాయి. దశల వారీగా వడపోత మా కాలేజ్ వాళ్లు కొందరు విద్యార్థులను ఇంటర్వ్యూ చేసి ముగ్గురిని ఎంపిక చేసి ఆ ముగ్గురినీ హైదరాబాద్‌లో ఉన్న యూఎస్ కాన్సులేట్‌కి పంపించారు. వాళ్లను కాన్సులేట్ వాళ్లు మళ్లీ ఇంటర్వ్యూ చేస్తారు. ఈ ఇంటర్వ్యూ కాన్సులేట్‌లోనే జరుగుతుంది. కానీ కరోనా కారణంగా జూమ్ ఇంటర్వ్యూ చేశారు. దేశంలో అన్ని కాన్సులేట్ల నుంచి ఇంటర్వ్యూ రికార్డులు ఢిల్లీ కాన్సులేట్‌కి పంపిస్తారు. వాళ్లు వాటన్నింటినీ పరిశీలించి ఫైనల్‌గా ముగ్గురిని ఎంపిక చేస్తారు. ‘స్టడీ ఆఫ్ ద యూఎస్ ఇన్స్టిట్యూట్స్(ఎస్యూఎస్ఐ) 2022’కి ఎంపికైన ముగ్గురిలో నాతోపాటు అహ్మదాబాద్ నుంచి ఒకమ్మాయి, చెన్నై నుంచి ఒకమ్మాయి ఉన్నారు. కాన్సులేట్‌కి ఇచ్చిన నివేదికలో ‘నేను ఇవన్నీ ఎందుకు చేస్తున్నాను’ అనే వివరాలు రాయాలి. అలాగే ఈ ‘ఎస్యూఎస్ఐ ప్రోగ్రామ్‌కి హాజరైన తర్వాత ఆ సమాచారంతో సమాజానికి ఏ విధంగా ఉపయోగపడతాను’ అనే విషయాన్ని కూడా చెప్పగలగాలి. అందులో మన భావంతోపాటు ఇంగ్లిష్ ప్రావీణ్యత, లీడర్షిప్ క్వాలిటీలను కూడా పరిగణనలోకి తీసుకుంటారు’’ అంటూ ఎన్నో అమూల్యమైన విషయాలను వివరించింది అమూల్య. ఆమె జూన్‌నెల 23వ తేదీన యూఎస్ విమానం ఎక్కనుంది. 25వ తేదీ నుంచి యూఎస్, కాన్సాస్ రాష్ట్రంలోని ‘యూనివర్సిటీ ఆఫ్ కాన్సాస్’ లో మొదలయ్యే సమావేశాల్లో పాల్గొననుంది. ఆల్ ది బెస్ట్ అమూల్యా! మాకు గర్వకారణం! యూఎస్ కాన్సులేట్‌కు మేము మా విద్యార్థులను నామినేట్ చేసేటప్పుడు ‘ఆ విద్యార్థినే ఎందుకు నామినేట్ చేస్తున్నాం’ అనే అంశాన్ని సమగ్రంగా వివరించాలి. చదువులో చురుగ్గా ఉండడంతోపాటు సమాజానికి తన వంతు కంట్రిబ్యూషన్ ఇస్తున్న వారిని ఎంపిక చేయాలి. ఫౌండేషన్లు, చారిటీలు, ఎన్జీవోలతో కలిసి పని చేయడం వంటివి ప్రధానంగా ఉంటాయి. అమూల్య ఒక చిన్న గ్రామం నుంచి వచ్చిన అమ్మాయి. ఆడపిల్లల చదువు పట్ల పెద్దగా ఆసక్తి చూపించని మన భారతీయ గ్రామాల్లో అదొకటి. అలాంటి చోట నుంచి వచ్చిన ఈ అమ్మాయి తన జీవితాన్ని చక్కదిద్దుకోవడానికి మాత్రమే పరిమితం కాకుండా తనలాంటి ఆడపిల్లలందరూ ఎదగాలని కోరుకునేది. అందుకోసం గ్రామాలకు వెళ్లి ఆడపిల్లలకు ఉన్నత చదువు పట్ల అవగాహనతోపాటు, ‘ఇంటర్వ్యూలకు ఎలా సిద్ధం కావాలి’ వంటి విషయాల్లో మెళకువలు చెప్తుంటుంది. ఇన్ని అర్హతలు ఉండడం వల్లనే దేశంలో వివిధ రాష్ట్రాల నుంచి వచ్చిన వందలాది అప్లికేషన్ల నుంచి ఈ అమ్మాయికి అవకాశం వచ్చింది. ఒక చురుకైన అమ్మాయి తన సేవలను మరింత విస్తరింపచేయడంలో మా కాలేజ్ పాత్ర ఉన్నందుకు మాకు గర్వంగా ఉంది. – సంయుక్త, నోడల్ ఆఫీసర్, ఓవర్సీస్ స్టూడెంట్స్ ఎక్స్చేంజ్ ప్రోగ్రామ్, ఆర్బీవీఆర్ఆర్ ఉమెన్స్ కాలేజ్ – వాకా మంజులారెడ్డి -
మినీబస్సు బోల్తా.. ఒకరి మృతి
అమ్రాబాద్: శ్రీశైలం మార్గం దోమల పెంట వద్ద రోడ్డు ప్రమాదం జరిగింది. అమ్రాబాద్ మండలం దోమలపెంట వద్ద శ్రీశైలం రోడ్డులో మినీ బస్సు లోయలోకి బోల్తా పడింది. ఇందులో ఒకరు అక్కడిక్కడే మృతి చెందగా 16మంది గాయపడ్డట్టు సమాచారం. వివారాల్లోకి వెళ్తే బస్సు అమ్రాబాద్ వైపు నుంచి శ్రీశైలం వెళ్తుండగా బ్రేక్ ఫెయిల్ కావడంతో పై నుంచి కింద రోడ్డుపై పడింది. ఈ ఘటనలో ఓ వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందాడు. క్షతగాత్రులను దగ్గరలోని ప్రభుత్వాసుపత్రికి తరలించారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.