breaking news
Disc jockey
-
పెళ్లి వేడుకలో నచ్చిన పాట పెట్టలేదని..
పెళ్లి వేడుక అంటే సహజంగా ఆటలు, పాటలు, డ్యాన్స్ లతో సందడిగా ఉంటుంది. డీజే మ్యూజిక్ హోరుతో ఇలా కోలాహలంగా ఓ పెళ్లి వేడుకలో తాగుబోతులు వీరంగం సృష్టించారు. మద్యం మత్తులో ఉన్న ఓ గ్రూప్ వ్యక్తులు తమకు 'డీజే వాలా బాబు మేరా గానా బజాదే' పాట కావాలని పట్టుబడగా.. మరో గ్రూప్ వ్యక్తులు 'నాగిని ట్యూన్' అయితేనే తాము డ్యాన్స్ చేస్తామని బెట్టుచేశారు. దీంతో ఈ రెండు గ్రూపుల మధ్య పెద్ద గొడవ జరిగింది. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు పెళ్లి వేడుక వద్దకు వచ్చి ఆరుగురిని అదుపులోకి తీసుకున్నారు. ఈ ఘటన ఉత్తరప్రదేశ్ లోని కాన్పూర్ లో జరిగింది. మంగళవారం రాజేంద్రకుమార్ అనే వ్యక్తి కూతురు పెళ్లి జరుగుతుండగా.. మద్యం మత్తులో ఉన్న రెండు గ్రూపులు తమకు నచ్చిన పాటనే డీజే జాకీ పెట్టాలంటూ గొడవకు దిగారు. దీంతో ఆరుగురిని అదుపులోకి తీసుకున్న పోలీసులు వారికి గట్టి వార్నింగ్ ఇచ్చి విడిచిపెట్టారు. -
ఈసారి కూడా డిస్క్జాకీలకు అనుమతిలేదు
హైదరాబాద్: ఈసారి కూడా గణేశ్ ఉత్సవాలు, నిమజ్జనం సమయంలో డిజె(డిస్క్ జాకీ)లకు అనుమతి ఇవ్వకూడదని గణేష్ ఉత్సవ కమిటీ నిర్ణయించింది. గణేశ్ ఉత్సవాలు, నిమజ్జనం ఏర్పాట్లపై సచివాలయంలో ఉత్సవ కమిటీ సమావేశం జరిగింది. సమావేశానికి ఉపముఖ్యమంత్రి మహమూద్ అలీ, హొం శాఖ మంత్రి నాయిని నరసింహా రెడ్డి, ఎక్సైజ్ మంత్రి పద్మారావు, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాజీవ్ శర్మ, ఉత్సవ సమితి ప్రతినిధులు, అఖిలపక్ష నేతలు, అన్నిశాఖల అధికారులు హాజరయ్యారు. గణేష్ ఉత్సవాలు ప్రశాంతంగా జరిగేందుకు తగిన ఏర్పాట్లు చేయాలని నిర్ణయించారు. ఈ సారి కూడా డీజే(డిస్క్జాకీ)లకు అనుమతి ఇవ్వకూడదని తీర్మానించారు. హుస్సేన్‌సాగర్‌పై భారం తగ్గించి నగర శివార్లలో కూడా నిమజ్జనం చేసేలా చర్యలు తీసుకోవాలని నిర్ణయించారు. గణేష్ మండపాలకు ఉచితంగా 24 గంటలూ విద్యుత్ సరఫరా చేయాలని గణేష్ ఉత్సవ సమితి అధ్యక్షుడు భగవంతరావు కోరారు. సమావేశం ముగిసిన తరువాత ఉప ముఖ్యమంత్రి మహమూద్ అలీ, హొం మంత్రి నాయని మాట్లాడుతూ హైదరాబాద్ పరిధిలో చెరువుల ఆక్రమణలను పూర్తిగా తొలగిస్తామని చెప్పారు. -
సంగీత సాగరంలో ఓలలాడించే.. డీజే
అప్‌కమింగ్ కెరీర్ : కాస్మోపాలిటన్, మెట్రో నగరాల్లో రాత్రికాగానే మరో ప్రపంచం నిద్ర నుంచి మేల్కొంటుంది. పార్టీలకు ప్రారంభ గీతం మొదలవుతుంది. నిశాచరులకు మత్తెక్కించే సంగీతం కావాలి. వారిని సంగీత సాగరంలో ఓలలాడించి, హుషారుగా స్టెప్పులేయించే ఫాస్ట్‌బీట్ మ్యూజిక్ ఇచ్చే కళాకారుడే.. డిస్క్జాకీ(డీజే). మనదేశంలో నైట్ లైఫ్ కల్చర్ పెరుగుతుండడంతో యువతను ఆకర్షిస్తున్న కెరీర్.. డీజేయింగ్. ఉపాధికి, ఉద్యోగావకాశాలకు ఢోకా లేకపోవడంతో ఎంతో మంది డీజేగా అవతారం ఎత్తుతున్నారు. రీమిక్సింగ్, మ్యూజిక్ ప్రొడక్షన్ వంటి విభాగాల్లోనూ డీజేలు పనిచేస్తుంటారు. క్లబ్బులు, పబ్బులతోపాటు ఈవెంట్ మేనేజ్మెంట్ సంస్థలు, రేడియో స్టేషన్లు, టీవీ ఛానళ్లలోనూ డీజేలకు అవకాశాలు లభిస్తున్నాయి. ఫ్రీలాన్స్ డీజేయింగ్కు మనదేశంలో భారీ మార్కెట్ ఉందని నిపుణులు అంటున్నారు. ప్రొఫెషనల్ డీజేలు సాధారణంగా ఆహుతులకు నచ్చే మ్యూజిక్ ఇవ్వాల్సి ఉంటుంది. పార్టీ మూడ్ తీసుకురావడంలో డీజేలదే కీలక పాత్ర. ఇది అసలుసిసలైన గ్లామర్ ఫీల్డ్. ఇందులో గుర్తింపు తెచ్చుకోవాలంటే క్రియేటివిటీ ఉండాలి. మ్యూజిక్ సెన్స్ తప్పనిసరి. సంగీతంపై ఆసక్తి, అభిరుచి ఉండాలి. రీమిక్సింగ్తో కొత్తకొత్త ప్రయోగాలు చేస్తుండాలి. జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో సంగీతంలో వస్తున్న మార్పులను పసిగట్టాలి. పార్టీల్లో సమయోచితంగా తమ ప్రతిభతో అతిథులను అలరిస్తే డబ్బుకు లోటుండదు. డీజేగా కెరీర్లో స్థిరపడాలనుకునేవారు ప్రారంభంలో సీనియర్ల దగ్గర పనిచేయాలి. తమకు డిమాండ్ ఎక్కడ ఉందో తెలుసుకోవాలి. డిస్క్ జాకీలుగా ఒకప్పుడు పురుషులే ఉండేవారు. ప్రస్తుతం మహిళలు కూడా డీజేలుగా అదరగొడుతున్నారు. అర్హతలు: డిస్క్ జాకీ కెరీర్లోకి ప్రవేశించేందుకు ఎలాంటి విద్యార్హతలు అవసరం లేదు. దీనిపై మనదేశంలో ప్రభుత్వ రంగంలో ప్రత్యేకంగా కోర్సులు కూడా లేవు. కొన్ని ప్రైవేట్ సంస్థలు శిక్షణ ఇస్తున్నాయి. వేతనాలు: డీజేలకు ప్రారంభంలో నెలకు రూ.10 వేల వేతనం లభిస్తుంది. పనితీరుతో గుర్తింపు తెచ్చుకుంటే డిమాండ్‌ను బట్టి ఎంతైనా సంపాదించుకోవచ్చు. నెలకు లక్షల్లో ఆర్జించే డీజేలు మనదేశంలో ఉన్నారు. ఈవెంట్స్‌లో డీజేలదే జోరు ‘‘పల్లె, పట్టణం అనే తేడా లేకుండా పార్టీ ట్రెండ్ పెరుగుతోంది. ఎప్పటికప్పుడు మారుతున్న వెస్ట్రన్, ఇండియన్ మ్యూజిక్‌లను మిక్స్ చేసి ఫ్యూజన్‌ను వినిపించడమే ప్రొఫెషనల్ డీజేల ప్రత్యేకత. రీమిక్స్, ప్రొడక్షన్ రెండింట్లో వినూత్నంగా ఆలోచించి మంచి అవుట్‌పుట్ తీసుకొచ్చే డీజేలకే ప్రాధాన్యం ఉంటుంది. డీజే శిక్షణనిచ్చేందుకు ఇప్పుడిప్పుడే అన్ని నగరాల్లో ఇన్స్టిట్యూట్స్ ఏర్పాటవుతున్నాయి. పూర్తిస్థాయి ప్రొఫెషనల్‌గా, పార్ట్‌టైమ్‌గా కూడా పనిచేసుకోవచ్చు. క్రేజ్‌ను బట్టి.. ఒక్కో ప్రోగ్రామ్‌కు రూ.10 వేల నుంచి రూ.లక్ష వరకూ సంపాదించవచ్చు. - సాయి పృథ్వీ, ఫస్ట్ ర్యాంక్ డీజే, హైదరాబాద్