అణువణువునా విలక్షణం
సమీక్షణం
పుస్తకం : ఉత్తమ లాటిన్ అమెరికన్ కథలు
అనువాదం : ఎలనాగ
విషయం : మూలకథల ఆత్మలు ధ్వంసం కాకుండా వాటిని మరో భాషలోకి అనువదించటం కత్తిమీద సాము. ఆ కర్తవ్యాన్ని విజయవంతంగా నిర్వర్తించారు ఎలనాగ. లాటిన్ అమెరికన్ దేశాలకు సంబంధించిన ఉత్తమ కథాసాహిత్యాన్ని తెలుగులోకి అనువదించడం ద్వారా మహోపకారం చేశారు.
జ్ఞానపుష్టితో కూడిన ఈ 20 కథల్లో ఆకర్షణీయ మార్మికత కనిపిస్తుంది. అద్భుతమైన ఎత్తుగడ, ఊహకందుతూనే వయ్యారంగా సాగే నడక, అబ్బురపరచే శైలి, విభిన్నమైన శిల్పం, విలక్షణమైన ముగింపు... ఇవీ దాదాపు అన్ని కథల నిర్మాణ రహస్యం. అర్జెంటీనా కథ ‘ప్యారిస్‌లోని ఓ యువతికి ఉత్తరం’ ఒక నిగూఢ కావ్యం. మతిస్థిమితం లేని కొడుకును ఆస్పత్రికి పంపే ముందు ఓ తల్లి పడిన యాతన పోర్టోరికో కథ ‘నిర్దోషులు’లో గుండెలు పిండేస్తుంది. పాములు, కప్పలు, చేపలు, కొంగలే పాత్రధారులుగా విభిన్న కథనాన్ని అందిస్తుంది ఉరుగ్వాయ్ కథ ‘ఎర్రకాళ్ల కొంగలూ మేజోళ్లూ’. కొలంబియా కథ ‘కొంచెం సబ్బునురగ... అంతే’ సాదాసీదాగా సాగి, చివర్లో అబ్బురపరుస్తుంది. పెరూ కథ ‘వార్డ్‌రోబూ, ముసలాయనా, మృత్యువూ’ ప్రవాహ శైలితో కట్టిపడేస్తుంది. మెక్సికో కథ ‘ప్రేమ వెనకాల మరణం’, పారాగ్వాయ్ కథ ‘ఖాళీక్షేత్రం’, క్యూబా కథ ‘ఆత్మగౌరవం’... దేనికదే ప్రత్యేకం. ‘బూజు వాసన గల అతని శ్వాస తాలూకు వేడి ఆవిరి’, ‘చలి ఇక్కడ పడుకుని, కూచుని, నడుస్తోంది’ వంటి వాక్యాలు పుస్తకం పొడవునా చదువరుల దాహం తీరుస్తాయి.
- ఎమ్వీ రామిరెడ్డి
పేజీలు: 168
వెల: 150
ప్రతులకు: అనువాదకుడు, 73, నక్షత్ర కాలనీ, బాలాపూర్ గ్రామం, వయా కేశోగిరి, హైదరాబాద్-5. ఫోన్: 9866945424
సినిమాతల్లికి జోహార్!
పుస్తకం : వందేళ్ల సినిమాకు వందనం
రచన : మధు వాకిటి
వందేళ్ల సినిమా చరిత్రను అద్దంలో చూపే ప్రయత్నమిది. భారతీయ సినిమా పుట్టు పూర్వోత్తరాలను స్థాలీపులాక న్యాయంగా వివరిస్తూనే, తెలుగు సినిమా అభివృద్ధికి పునాదిరాళ్లుగా, మైలురాళ్లుగా నిలిచిన కొంతమంది సినీ ప్రముఖుల్ని స్మరించుకోవడం బాగుంది. దశాబ్దాల వారీగా తెలుగు సినిమా ప్రస్థానాన్ని వివరిస్తూ, కొన్ని ఆణిముత్యాల్లాంటి సినిమాల గురించి విశ్లేషించారు. సినిమాల ఎంపిక విషయంలో ఇంకొంత కసరత్తు చేసి ఉండాల్సింది.
- శ్రీబాబు
పేజీలు: 136; వెల: 150
ప్రతులకు: అన్ని ముఖ్య
పుస్తక కేంద్రాలు
జాజ్వల్య ప్రేమభావన
పుస్తకం : ప్రేమలో మనం (వచనం)
రచన : బి.గీతిక
విషయం : ప్రేమని కురచ చేసి, కామం కింద, మోహం కిందకి దిగజార్చి మానవీయ ప్రేమ సంబంధాలను కించపరుస్తున్న వాతావరణంలోకి, ‘ప్రేమలో మనం’ అంటూ బి.గీతిక చేసిన అక్షర ప్రయాణం మనస్సును ఇంద్రధనస్సు మీద ఊరేగిస్తుంది. ఈ లేఖాత్మక ప్రేమ అక్షరాలు ప్రేమలోని ముగ్ధత్వానికీ, ప్రౌఢత్వానికీ మధ్య సమన్వయం కుదుర్చుతూ, పాఠకుడిని సుమనస్కుడిని చేస్తాయి. ఇందులో పరిపూర్ణ జవాబులు లభించే ప్రశ్నలుంటాయి. ఆలోచనల్ని రగిలించే జవాబులూ ఉంటాయి. అంతర్మథనంలోకి జాలువారే పుప్పొడి వాక్యాల ప్రేమభావనలుంటాయి. నిజానికిది మొదటి పుస్తకమే అయినా, ప్రేమ, అందం, విరహం, వీడ్కోలు, ఏకాంతం, సున్నితత్వం, మంత్రమయ్యే మాటలు, తొలిచూపుల వేకువలు, స్వప్నలోకాల్లోని శబ్దాలు... అన్నీ విచిత్రంగా హృదయానికి మరింత మార్దవాన్నిస్తాయి. అక్కడక్కడా పక్కింటి పండుగాడు, నళిని, బుడగల కోసం అల్లరి చేసే పిల్లల తోడ్పాటుతో మోసపోని, మోసం చేయని, జీవితాన్ని జాజ్వల్యమానంగా వెలిగించే ప్రేమ భావనలతో నింపేస్తారు రచయిత.
- డా॥నూకతోటి రవికుమార్
కొత్త
పుస్తకాలు
ధ్వని సిద్ధాంత వైజ్ఞానిక వివేచన
హిందీ మూలం: డా.కృష్ణకుమార్ శర్మ
తెలుగు: డా. బొద్దుల వేంకటేశం
పేజీలు: 336; వెల: 300
ప్రతులకు: బి.సరోజ, 9-8-49, రాంనగర్, కరీంనగర్-505001. ఫోన్: 8106708918
దుఆ (ప్రగతిశీల ముస్లిం కవిత్వం)
రచన: పఠాన్ రసూల్‌ఖాన్
పేజీలు: 40; వెల: 30
ప్రతులకు: రచయిత, 1-35, కోనేటి వీధి, యర్రగొండపాలెం, ప్రకాశం-523327;
ఫోన్: 9397076152
గురుబ్రహ్మ
రచన: ధేనువుకొండ శ్రీనివాసరావు
పేజీలు: 64; వెల: 50
ప్రతులకు: www.logili.com
ఇవి నిజాలు కావా? (కవిత్వం)
రచన: దూబగుంట రామకృష్ణ
పేజీలు: 82; వెల: 40
ప్రతులకు: రచయిత, 6-8-988బి, ఎన్జీఓ కాలనీ, తిరుపతి.
ఫోన్: 9490108518
అక్షరంలో ప్రళయాగ్నులు (కవిత్వం)
రచన: మరో చలం
పేజీలు: 56; వెల: 40
ప్రతులకు: సీహెచ్.కృష్ణప్రియ, 1-4/3-36, సంజయ్‌గాంధీ కాలనీ, విద్యాధరపురం, విజయవాడ-12