breaking news
Daytime temperature
-
చలికాలంలోనూ ఉక్కపోత!
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో చలికాలంలోనూ పగలు, రాత్రి ఉష్ణోగ్రతలు అధికంగా నమోదవు తున్నాయి. బంగాళాఖాతంలో రెండ్రోజుల క్రితం అల్పపీడనం ఏర్పడటంతో గాలిలో తేమ శాతం తగ్గింది. అలాగే తూర్పు దిశ నుంచి గాలులు వీస్తుండటంతో రాష్ట్రంలో వేడి వాతావరణం నెలకొందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం డైరెక్టర్ నాగరత్న ‘సాక్షి’కి తెలిపారు. మూడ్రోజుల వరకు పరిస్థితి ఇలాగే ఉంటుందని, ఆ తర్వాత మళ్లీ ఉష్ణోగ్రతలు పడిపోతాయని వివరించారు. గత 24 గంటల్లో హైదరాబాద్లో సాధారణం కంటే 5 డిగ్రీలు అధికంగా 22 డిగ్రీల రాత్రి ఉష్ణోగ్రత నమోదైంది. పగటి ఉష్ణోగ్రత కూడా 3 డిగ్రీలు అధికంగా 32 డిగ్రీలు రికార్డయింది. మహబూబ్నగర్లో రాత్రి ఉష్ణోగ్రత 4 డిగ్రీలు అధికంగా 23 డిగ్రీలు, పగటి ఉష్ణోగ్రత 3 డిగ్రీలు అధికంగా 34 డిగ్రీలు నమోదైంది. రామగుండం, నిజామాబాద్ల్లోనూ రాత్రి ఉష్ణోగ్రతలు సాధారణం కంటే 3 డిగ్రీలు అధికంగా 20 డిగ్రీల చొప్పున నమోదయ్యాయి. ఆ రెండు ప్రాంతాల్లో పగటి ఉష్ణోగ్రతలు ఒక డిగ్రీ అధికంగా 32 డిగ్రీల చొప్పున రికార్డయ్యాయి. హన్మకొండలో పగలూ రాత్రి ఉష్ణోగ్రతలు సాధారణం కంటే 2 డిగ్రీలు అధికంగా నమోదయ్యాయి. అక్కడి పగటి ఉష్ణోగ్రత 33 కాగా, రాత్రి ఉష్ణోగ్రత 21 డిగ్రీలుగా రికార్డయింది. -
అప్పుడే భగభగ
మండుతున్న ఎండలు 36 డిగ్రీలకు చేరిన పగటి ఉష్ణోగ్రత హడలిపోతున్న జనం పోచమ్మమైదాన్ : నెల రోజుల ముందుగానే భానుడు భగభగ మంటున్నాడు. నాలుగు రోజులుగా పగటి ఉష్ణోగ్రతలు రికార్డు స్థాయిలో నమోదవుతున్నాయి. ఉదయం 8 గంటల వరకు కొంత చల్లగా ఉంటోంది. ఆ వెంటనే సూర్య భగవానుడు తన ప్రతాపం చూపిస్తున్నాడు. బుధవారం పగటి ఉష్ణోగ్రత 36 సెల్సియస్ డిగ్రీలుగా నమోదైంది. గత ఏడాది ఇదే సమయంలో పగటి ఉష్ణోగ్రత 29 సెల్సియస్ డిగ్రీలు మాత్ర మే ఉంది. మధ్యాహ్నం 12గంటల నుంచి సాయంత్రం 4గంటల వరకు ఎండ తీవ్రత అధికంగా ఉంటున్నది. సహజంగా మార్చి మొదటి వారంలో పెరగాల్సిన ఎండలు.. ఫిబ్రవరి మొదటివారంలోనే మండిపోతుండడంతో ప్రజలు హడలిపోతున్నారు. రానున్న రోజుల్లో ఇంకా ఎండలు ఎలా ఉంటాయోనని అందోళన చెందుతున్నారు. వాతావరణ మార్పులతో ఈ విధమైన పరిస్థితులు వస్తున్నాయని, ఈ ఏడాది వేసవిలో 50 డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉందని వాతావరణ నిపుణులు పేర్కొంటున్నారు.