‘D/o ప్రసాదరావు కనుబడుటలేదు’ వెబ్ సిరీస్ రివ్యూ
రాజీవ్ కనకాల, ఉదయభాను, వసంతిక, శ్రీరామ్ వెంకట్ ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన వెబ్ సిరీస్ ‘డాటర్ ఆఫ్ ప్రసాద్ రావు కనబడుటలేదు. ‘రెక్కీ’, ‘విరాటపాలెం’ తరువాత సౌత్ ఇండియా స్క్రీన్స్ బ్యానర్ మీద కె.వి. శ్రీరామ్ నిర్మించిన ఈ సిరీస్‌కి కృష్ణ పోలూరు దర్శకత్వం వహించారు. ఫిబ్రవరి 27 నుంచి జీ5లో స్ట్రీమింగ్ అవుతున్న ఈ వెబ్ సిరీస్ ఎలా ఉంది? రివ్యూలో చూద్దాం. తల్లిదండ్రులు, పిల్లలపై తాము పెంచుకునేది, పంచుకునేది ప్రేమ మాత్రమే. కాని పరిగెడుతున్న కాలంతో పోటీ పడతూ మారుతున్న ఈ సమాజంలో అదే ప్రేమ కాస్త తడబడుతూ తమ పిల్లలపై భయాన్ని కలుగజేస్తోంది. కన్న పిల్లల పై బాధ్యత తో కూడా ఆప్యాయత ఉండాలి కాని అనుమానంతో కూడిన భయం ఉండకూడదు అని చెప్పే సిరీస్ ఈ D/o ప్రసాదరావు కనుబడుటలేదు. నిజానికి పిల్లలున్న ప్రతి తల్లిదండ్రులు తప్పనిసరిగా చూడాల్సిన సిరీస్ ఇది. వాస్తవ ఘటనలపై అల్లుకుని అత్యంత వాస్తవికంగా తీసిన ఈ సిరీస్ టీనేజ్ పిల్లలున్న ప్రతి తల్లిదండ్రులకు ఓ హెచ్చరిక లాంటిది. మరీ ముఖ్యంగా ఆడపిల్లలున్న తల్లితండ్రులకు ఈ సిరీస్ ఓ కనువిప్పులాంటిది అని చెప్పవచ్చు. అంతలా ఏముందో ఈ సిరీస్ లో ఓ సారి చూద్దాం. ఊళ్ళో కిరాణ కొట్టు నడుపుకుంటున్నప్రసాదరావు కూతురు స్వాతి పట్టణంలోని ఉద్యోగం చేయడం కోసం భవాని హాస్టల్ లో చేరుతుంది. ప్రసాదరావుకి కూతురంటే వల్లమాలిన ప్రేమ. అందుకే 20ఏళ్ళ నుండి ఎక్కడకూ పంపని కూతురుని మొట్టమొదటిసారిగా కూతురు కోసం పట్టణంలో సాఫ్ట్ వేర్ ఉద్యోగం చేయడం కోసం కష్టంగా ఒప్పుకుంటాడు. అకస్మాత్తుగా స్వాతి కనిపించకుండా పోతుంది. కూతురుని వెతుక్కుంటూ ప్రసాదరావు హైదరాబాద్ కు వస్తాడు. కాని అనూహ్యంగా పోలీస్ విచారణలో స్వాతి చావుకు తన తండ్రి ప్రసాదరావే కారణమని తెలుస్తుంది. ఎంతో ప్రేమగా చూసుకున్న స్వాతి తండ్రి ప్రసాదరావు స్వాతి చావుకు కారణమెలా అయ్యాడు అన్న విషయాలు తెలుసుకోవాలంటే జీ5లో స్ట్రీమ్ అవుతున్న D/o ప్రసాదరావు కనుబడుటలేదు చూడాల్సిందే.వాస్తవ ఘటనలను ప్రతిబింబించేలా, పదునైన సంభాషణలతో లోతైన భావాలతో చాలా హృద్యంగా చిత్రీకరించాడు దర్శకుడు. అంతేకాదు సిరీస్ ఆఖర్లో వచ్చే ట్విస్ట్ ప్రేక్షకుల ఊహకందనిది. జీ5 ఓటిటి వేదికగా D/o ప్రసాదరావు కనుబడుటలేదు సిరీస్ మొత్తం 6 భాగాలలో స్ట్రీమ్ అవుతోంది. ఈ సిరీస్ మొత్తం చూశాక ఆడపిల్లలున్న తండ్రులు మాత్రం తమ ఆడబిడ్డపై అనుమానం కాదు అనుబంధం ముఖ్యమని ఖచ్చితంగా భావిస్తారు. వర్త్ టు వాచ్ ఫర్ ది ఫాదర్స్ హూ హ్యావ్ డాటర్స్.