breaking news
Data Analytical Center
-
పరిశోధన, ప్రయోగాల నిలయం ఏఎన్‌యూ
ఏఎన్‌యూ(గుంటూరు): ఆచార్య నాగార్జున యూనివర్సిటీలోని డాక్టర్ వైఎస్సార్ కాలేజ్ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ విద్యతోపాటు పరిశోధనలు, ప్రయోగాలు, నూతన ఆవిష్కరణలలో తన ప్రత్యేకతను చాటుకుంటోంది. పలు జాతీయ అంతర్జాతీయ సంస్థల సహకారంతో ఇక్కడ ఏర్పాటు చేసిన అత్యాధునిక కేంద్రాల్లో దేశ రక్షణ, సమాచార రంగాలతోపాటు సమాజ హిత పరిశోధనలు, ప్రయోగాలు కొనసాగిస్తోంది ఇక్కడ ఏర్పాటైన కొన్ని కేంద్రాల విశేషాలివీ.. మల్టీ ఆబ్జెక్ట్ ట్రాకింగ్ రాడార్ సిమ్యులేటర్ ఈ ప్రాజెక్టును శ్రీహరికోటకు చెందిన షార్ ఏఎన్‌యూ ఇంజినీరింగ్ కాలేజీకి అప్పగించింది. ఉపగ్రహాలను కక్ష్యలోకి ప్రవేశించజేసే సమయంలో ఉపగ్రహాల పార్ట్లు టార్గెట్ల వారీగా విడిపోయి భూమిమీద, సముద్రంలో ఏ ప్రాంతలో పడ్డాయనేది గుర్తించేందుకు ఇవి దోహదం చేస్తాయి. డిజైన్ అండ్ డెవలప్మెంట్ ఆఫ్ సీడీఎంఏ ట్రాన్స్ రిసీవర్ ఈ ప్రాజెక్టును డీఆర్డీఓ (డిఫెన్స్ రిసోర్స్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్) ఏఎన్‌యూ ఇంజినీరింగ్ కాలేజీకి అప్పగించింది. శత్రు దేశాలు మన దేశానికి సంబంధించిన రక్షణ, రహస్య సంభాషణలు ట్రాప్ చేయకుండా ఈ రిసీవర్ ప్రధానంగా ఉపయోగపడుతుంది. బిగ్ డేటా ఎనలిటిక్స్ సెంటర్ కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజినీరింగ్ ఆధ్వర్యంలో కొనసాగుతున్న ఈ సెంటర్లో సాఫ్ట్‌వేర్‌కు సంబంధించిన క్లౌడ్ కంప్యూటింగ్, మెషిన్ లెర్నింగ్, బిగ్ డేటా, ఐఓటీ తదితర అంశాలపై పరిశోధనలు, ప్రయోగాలు జరుగుతున్నాయి. ఆక్వా రైతులకు చెరువుల్లో వ్యర్థాల వల్ల తలెత్తే ఉష్ణ సాంద్రతను తెలియజేసే ప్రాజెక్టుతోపాటు గుడ్డి వాళ్ళు రోడ్డుపై నడిచేందుకు ఉపయోగపడే కళ్ళజోడును ఈ సెంటర్లో రూపొందించడం విశేషం. పలు సాంకేతిక అంశాలకు సంబంధించిన మరో నాలుగు ప్రాజెక్టుల ప్రతిపాదనలను ఇక్కడి నుంచి రూసాకు పంపారు. శాటిలైట్ డేటా ఎనాలసిస్ అండ్ అప్లికేషన్ సెంటర్ ఇస్రో సహకారంతో 2014లో ఈ సెంటర్‌ను ఏర్పాటు చేశారు. ఇస్రో(ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్) సంస్థ మన దేశ సమాచార రంగంలో కీలకమైన ఐఆర్ఎన్ఎస్ఎస్ (ఇండియన్ రీజినల్ నావిగేషన్ శాటిలైట్ సిస్టమ్)కు సంబంధించిన, ఉపగ్రహాల హై ఫ్రీక్వెన్సీ స్ట్రక్చర్డ్ సిమ్యులేటర్ అనే ప్రత్యేక లైసెన్స్డ్ సాఫ్ట్‌వేర్‌పైనా పరిశోధనలు జరుగుతున్నాయి. ఈ సాఫ్ట్వేర్ ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాష్ట్రాల్లో ఏఎన్‌యూలోనే అందుబాటులో ఉంది. ఏపీఎస్ఎస్డీసీ ఆధ్వర్యంలో త్రీడీ ఆటోమేషన్ సెంటర్ ఆంధ్రప్రదేశ్ స్కిల్ డెవలప్మెంట్ సెంటర్‌కు ఫ్రాన్స్‌కు చెందిన దస్సాల్ట్ సంస్థతో ఉన్న ఎంఓయూలో భాగంగా ఏఎన్‌యూలో రూ.5 కోట్ల వ్యయంతో త్రీడీ ఆటోమేషన్ సెంటర్‌ను ఏర్పాటు చేశారు. ఏపీలోని 62 ఇంజినీరింగ్ కళాశాలల విద్యార్థులకు త్రీడీ టెక్నాలజీపై శిక్షణ ఇచ్చేందుకు ఏఎన్‌యూ రాష్ట్ర స్థాయి నోడల్ సెంటర్‌గా కూడా కొనసాగుతోంది. వీఎల్‌ఎస్‌ఐలో పేటెంట్ స్థాయి పరిశోధనలు ఇంజినీరింగ్ కళాశాలలోని వీఎల్ఎస్ఐ(వెరీ లార్జ్ స్కేల్ ఇంటిగ్రేటెడ్ ఎక్స్‌లెన్సీ సెంటర్)ను ఇన్టెల్ సాఫ్ట్వేర్ సంస్థ సహకారంతో ఏఎన్‌యూలో ఏర్పాటు చేశారు. ఈ సెంటర్లో జరిగిన పరిశోధననలకు పేటెంట్ కూడా లభించింది. ఈ సెంటర్‌కు సుమారు ఐదు కోట్ల రూపాయల విలువైన సాఫ్ట్వేర్, పరికరాలను ఓ కంప్యూటర్ రంగ సంస్థ ఉచితంగా అందజేసింది. -
మియాపూర్‌లో ‘సమాచార విశ్లేషణ’
సాక్షి, రంగారెడ్డి జిల్లా ప్రతినిధి: హైదరాబాద్‌లో మరో ప్రతిష్టాత్మక సంస్థ కొలువుదీరనుంది. ప్రభుత్వపథకాలు, బ్యాంకు రుణాలు, వ్యక్తిగత వివరాల సమాచార మార్పిడి, విశ్లేషించేందుకు ‘సమాచార విశ్లేషణాకేంద్రం (డాటా ఎనలైటికల్ సెంటర్) ఏర్పాటు కానుంది. శేరిలింగంపల్లి మండలం మియాపూర్‌లోని సర్వే నంబర్ 20,28 తేదీల్లో దాదాపు 50 ఎకరాల విస్తీర్ణంలో ఈ కేంద్రాన్ని నెలకొల్పేందుకు రాష్ట్ర ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది. ఈ మేరకు స్థలాన్ని పరిశీలించాలని రంగారెడ్డి జిల్లా యంత్రాంగానికి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాజీవ్‌శర్మ తాజాగా లేఖ రాశారు. మెట్రో రైల్వే స్టేషన్‌కు సమీపంలో ఈ సెంటర్ ఉండేలా చూడాలని నిర్దేశించారు. ఆధార్ అనుసంధానిత ప్రాజెక్టుల అమలుకు దిక్సూచిగా ఈ కేంద్రం పనిచేయనుంది. ఆస్తుల రిజిస్ట్రేషన్లకు, పాస్‌పోర్టుల జారీ, పింఛన్ల మంజూరు, బ్యాంకు ఖాతాలు, ఆదాయ పన్ను చెల్లింపు సమయంలోను ఆధార్ విశిష్ట సంఖ్య నమోదును తప్పనిసరి చేశారు. దీంతో తప్పుడు సమాచారం పొందుపరిచినా, ప్రభుత్వ పథకాల్లో అనర్హులున్నా తేల్చేందుకు వివిధ సందర్భాల్లో సమర్పించిన డాటాతో విశ్లేషిస్తారు. తద్వారా అక్రమార్కుల గుట్టు బయటకురావడమేగాకుండా.. సమాచార వాస్తవికత ను నిర్ధారించుకునే అవకాశం కలుగుతుంది. దీనివల్ల ప్రభుత్వ పథకాలు దుర్వినియోగం జరగకుండా.. పన్ను ఎగవేతదారులను గుర్తించేందుకు వీలు పడుతుందని ప్రభుత్వ వర్గాలు అంటున్నాయి. కోహెడలో ఫైరింగ్ రేంజ్! హయత్‌నగర్ మండలం కోహెడలో పోలీస్ ఫీల్డ్ఫైరింగ్ రేంజ్ ఏర్పాటు చేయాలని ప్రభుత్వం సూత్రప్రాయంగా నిర్ణయిం చింది. హైదరాబాద్ నగర పోలీసు విభాగానికి ప్రత్యేక శిక్షణాశిబిరం లేకపోవడంతో పొరుగున ఉన్న మహబూబ్‌నగర్ లేదా మొయినాబాద్‌లోని ఫీల్డ్ ఫైరింగ్ రేంజ్‌ను ఉపయోగించుకుంటున్నారు. ఈ నేపథ్యంలో ప్రత్యేకంగా ఫీల్డ్ ఫైరింగ్ రేంజ్‌ను సమకూర్చుకోవాలని నగరపోలీస్ కమిషనర్ మహేందర్‌రెడ్డి నిర్ణయించారు. దీనికి అనుగుణంగా కోహెడలో పది ఎకరాలను కేటాయించాలని కోరుతూ కలెక్టర్ రఘునందన్‌రావుకు ప్రతిపాదనలు పంపారు. ఈ మేరకు గుట్టలు, కొండలతో ఫైరింగ్‌కు అనువుగా ఉన్నట్లు గుర్తించిన భూమిని ఇచ్చేందుకు రెవెన్యూ యంత్రాంగం సర్వేను నిర్వహించింది. త్వరలోనే భూమి కేటాయింపుల అనుమతుల పరిశీలనకు ప్రతిపాదనలను ప్రభుత్వానికి పంపనున్నట్లు ఉన్నతాధికారి ఒకరు ‘సాక్షి’కి తెలిపారు.