పరిశోధన, ప్రయోగాల నిలయం ఏఎన్‌యూ

YSR ANU College of Engineering specializes in Research Innovation - Sakshi

ఇస్రో సహకారంతో డేటా ఎనాలసిస్‌ సెంటర్‌

వీఎల్‌ఎస్‌ఐ సెంటర్లో పేటెంట్‌ స్థాయి పరిశోధనలు

నూతన ఆవిష్కరణలతో బిగ్‌ డేటా ఎనలిటిక్స్‌ సెంటర్‌

అంతర్జాతీయ సంస్థ సహకారంతో త్రీడీ టెక్నాలజీ సెంటర్‌

ఏఎన్‌యూ(గుంటూరు): ఆచార్య నాగార్జున యూనివర్సిటీలోని డాక్టర్‌ వైఎస్సార్‌ కాలేజ్‌ ఆఫ్‌ ఇంజినీరింగ్‌ అండ్‌ టెక్నాలజీ విద్యతోపాటు పరిశోధనలు, ప్రయోగాలు, నూతన ఆవిష్కరణలలో తన ప్రత్యేకతను చాటుకుంటోంది. పలు జాతీయ అంతర్జాతీయ సంస్థల సహకారంతో ఇక్కడ ఏర్పాటు చేసిన అత్యాధునిక కేంద్రాల్లో దేశ రక్షణ, సమాచార రంగాలతోపాటు సమాజ హిత పరిశోధనలు, ప్రయోగాలు కొనసాగిస్తోంది ఇక్కడ ఏర్పాటైన కొన్ని కేంద్రాల విశేషాలివీ..  

మల్టీ ఆబ్జెక్ట్‌ ట్రాకింగ్‌ రాడార్‌ సిమ్యులేటర్‌
ఈ ప్రాజెక్టును శ్రీహరికోటకు చెందిన షార్‌  ఏఎన్‌యూ ఇంజినీరింగ్‌ కాలేజీకి అప్పగించింది. ఉపగ్రహాలను కక్ష్యలోకి ప్రవేశించజేసే సమయంలో ఉపగ్రహాల పార్ట్‌లు టార్గెట్‌ల వారీగా విడిపోయి భూమిమీద, సముద్రంలో ఏ ప్రాంతలో పడ్డాయనేది గుర్తించేందుకు ఇవి దోహదం చేస్తాయి. 

డిజైన్‌ అండ్‌ డెవలప్‌మెంట్‌ ఆఫ్‌ సీడీఎంఏ ట్రాన్స్‌ రిసీవర్‌  
ఈ ప్రాజెక్టును డీఆర్‌డీఓ (డిఫెన్స్‌ రిసోర్స్‌ డెవలప్‌మెంట్‌ ఆర్గనైజేషన్‌) ఏఎన్‌యూ ఇంజినీరింగ్‌ కాలేజీకి అప్పగించింది. శత్రు దేశాలు మన దేశానికి సంబంధించిన రక్షణ, రహస్య సంభాషణలు ట్రాప్‌ చేయకుండా ఈ రిసీవర్‌ ప్రధానంగా ఉపయోగపడుతుంది.  

బిగ్‌ డేటా ఎనలిటిక్స్‌ సెంటర్‌ 
కంప్యూటర్‌ సైన్స్‌ అండ్‌ ఇంజినీరింగ్‌ ఆధ్వర్యంలో కొనసాగుతున్న ఈ సెంటర్‌లో సాఫ్ట్‌వేర్‌కు సంబంధించిన క్లౌడ్‌ కంప్యూటింగ్, మెషిన్‌ లెర్నింగ్, బిగ్‌ డేటా, ఐఓటీ తదితర అంశాలపై పరిశోధనలు, ప్రయోగాలు జరుగుతున్నాయి. ఆక్వా రైతులకు చెరువుల్లో వ్యర్థాల వల్ల తలెత్తే ఉష్ణ సాంద్రతను తెలియజేసే ప్రాజెక్టుతోపాటు గుడ్డి వాళ్ళు రోడ్డుపై నడిచేందుకు ఉపయోగపడే కళ్ళజోడును ఈ సెంటర్‌లో రూపొందించడం విశేషం. పలు సాంకేతిక అంశాలకు సంబంధించిన మరో నాలుగు ప్రాజెక్టుల ప్రతిపాదనలను ఇక్కడి నుంచి రూసాకు పంపారు. 

శాటిలైట్‌ డేటా ఎనాలసిస్‌ అండ్‌ అప్లికేషన్‌ సెంటర్‌ 
ఇస్రో సహకారంతో 2014లో ఈ సెంటర్‌ను ఏర్పాటు చేశారు. ఇస్రో(ఇండియన్‌ స్పేస్‌ రీసెర్చ్‌ ఆర్గనైజేషన్‌) సంస్థ మన దేశ సమాచార రంగంలో కీలకమైన ఐఆర్‌ఎన్‌ఎస్‌ఎస్‌ (ఇండియన్‌ రీజినల్‌ నావిగేషన్‌ శాటిలైట్‌ సిస్టమ్‌)కు సంబంధించిన, ఉపగ్రహాల హై ఫ్రీక్వెన్సీ స్ట్రక్చర్డ్‌ సిమ్యులేటర్‌ అనే ప్రత్యేక లైసెన్స్‌డ్‌ సాఫ్ట్‌వేర్‌పైనా పరిశోధనలు జరుగుతున్నాయి. ఈ సాఫ్ట్‌వేర్‌ ఆంధ్రప్రదేశ్‌ తెలంగాణ రాష్ట్రాల్లో ఏఎన్‌యూలోనే అందుబాటులో ఉంది.

ఏపీఎస్‌ఎస్‌డీసీ ఆధ్వర్యంలో త్రీడీ ఆటోమేషన్‌ సెంటర్‌
ఆంధ్రప్రదేశ్‌ స్కిల్‌ డెవలప్‌మెంట్‌ సెంటర్‌కు ఫ్రాన్స్‌కు చెందిన దస్సాల్ట్‌ సంస్థతో ఉన్న ఎంఓయూలో భాగంగా ఏఎన్‌యూలో రూ.5 కోట్ల వ్యయంతో  త్రీడీ ఆటోమేషన్‌ సెంటర్‌ను ఏర్పాటు చేశారు. ఏపీలోని 62 ఇంజినీరింగ్‌ కళాశాలల విద్యార్థులకు త్రీడీ టెక్నాలజీపై శిక్షణ ఇచ్చేందుకు ఏఎన్‌యూ రాష్ట్ర స్థాయి నోడల్‌ సెంటర్‌గా కూడా కొనసాగుతోంది.   


వీఎల్‌ఎస్‌ఐలో పేటెంట్‌ స్థాయి పరిశోధనలు

ఇంజినీరింగ్‌ కళాశాలలోని వీఎల్‌ఎస్‌ఐ(వెరీ లార్జ్‌ స్కేల్‌ ఇంటిగ్రేటెడ్‌ ఎక్స్‌లెన్సీ సెంటర్‌)ను ఇన్‌టెల్‌ సాఫ్ట్‌వేర్‌ సంస్థ సహకారంతో ఏఎన్‌యూలో ఏర్పాటు చేశారు. ఈ సెంటర్లో జరిగిన పరిశోధననలకు పేటెంట్‌ కూడా లభించింది. ఈ సెంటర్‌కు సుమారు ఐదు కోట్ల రూపాయల విలువైన సాఫ్ట్‌వేర్, పరికరాలను ఓ కంప్యూటర్‌ రంగ సంస్థ ఉచితంగా అందజేసింది.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top