breaking news
	
		
	
  Dance shows
- 
      
                   
                                                     
                   
            ఆమె దాండియాకి ఇండియా నర్తిస్తుంది
దసరా నవరాత్రులు వస్తే దేశం తలిచే పేరు ఫాల్గుణి పాఠక్. ‘దాండియా క్వీన్ ఆఫ్ ఇండియా’గా పేరు గడించిన ఈ 56 సంవత్సరాల గాయని తన పాటలతో, నృత్యాలతో పండగ శోభను తీసుకువస్తుంది. 25 రూ పాయల పారితోషికంతో జీవితాన్ని ప్రారంభించి నేడు కోట్ల రూ పాయలను డిమాండ్ చేయగల స్థితికి చేరిన ఫాల్గుణి స్ఫూర్తి పై పండుగ కథనం.దేశంలో దసరా నవరాత్రులు జరుపుకుంటారు. కాని అమెరికాలో, దుబాయ్‌లో, గుజరాతీలు ఉండే అనేక దేశాల్లో వీలును బట్టి ప్రీ దసరా, పోస్ట్ దసరా వేడుకలు కూడా జరుపుకుంటారు. ఫాల్గుణి పాఠక్ వీలును బట్టి ఇవి ప్లాన్ అవుతాయి. ఆమె దసరా నవరాత్రుల్లో ఇండియాలో ఉంటే దసరా అయ్యాక కొన్ని దేశాల్లో దాండియా డాన్స్‌షోలు నిర్వహిస్తారు. లేదా దసరాకు ముందే కొన్ని దేశాల్లో డాన్స్ షోలు నిర్వహిస్తారు. ఆమె దసరాకు ముందు వచ్చినా, తర్వాత వచ్చినా కూడా ప్రేక్షకులకు ఇష్టమే. ఆమె పాటకు పాదం కలపడం కోసం అలా లక్షలాది మంది ఎదురు చూస్తూ ఉంటారు. అంతటి డిమాంట్ ఉన్న గాయని ఫాల్గుణి పాఠక్ మాత్రమే.తండ్రిని ఎదిరించి...ఫాల్గుణి పాఠక్‌ది తన రెక్కలు తాను సాచగల ధైర్యం. నలుగురు కూతుళ్ల తర్వాత ఐదవ కూతురుగా ముంబైలోని ఒక గుజరాతి కుటుంబంలో జన్మించింది ఫాల్గుణి. నలుగురు కూతుళ్ల తర్వాత ఐదవ సంతానమైనా అబ్బాయి పుడతాడని భావిస్తే ఫాల్గుణి పుట్టింది. అందుకే తల్లి, నలుగురు అక్కలు ఆమెకు ΄్యాంటు, షర్టు తొడిగి అబ్బాయిలా భావించి ముచ్చటపడేవారు. రాను రాను ఆ బట్టలే ఆమెకు కంఫర్ట్‌గా మారాయి. వయసు వచ్చే సమయంలో తల్లి హితవు చెప్పి, అమ్మాయిలా ఉండమని చెప్పినా ఫాల్గుణి మారలేదు. ఆ ఆహార్యం ఒక తిరుగుబాటైతే పాట కోసం తండ్రిని ఎదిరించడం మరో తిరుగుబాటు. తల్లి దగ్గరా, రేడియో వింటూ పాట నేర్చుకున్న ఫాల్గుణి పాఠక్ స్కూల్లో పాడుతూ ఎనిమిదో తరగతిలో ఉండగా మ్యూజిక్ టీచర్‌తో కలిసి ముంబైలోని వాయుసేన వేడుకలో పాడింది. ఆమె పాడిన పాట ‘ఖుర్బానీ’ సినిమాలోని ‘లైలా ఓ లైలా’. అది అందరినీ అలరించిందిగానీ ఇంటికి వచ్చాక తండ్రి చావబాదాడు.. పాటలేంటి అని. కాని అప్పటికే పాటలో ఉండే మజా ఆమె తలకు ఎక్కింది. ఆ తర్వాత తరచూ ప్రదర్శనలు ఇవ్వడం ఇంటికి వచ్చి తండ్రి చేత దెబ్బలు తినడం... చివరకు విసిగి తండ్రి వదిలేశాడుగాని ఫాల్గుణి మాత్రం పాట మానలేదు.త–థయ్యా బ్యాండ్తన ప్రదర్శనలతో పాపులర్ అయ్యాక సొంత బ్యాండ్ స్థాపించింది ఫాల్గుణి. దాని పేరు ‘త–థయ్యా’. ఆ బ్యాండ్‌తో దేశంలోని అన్నిచోట్లా నవరాత్రి షోస్ మొదలెట్టింది. నవరాత్రి ఉత్సవాల్లో దాండియా, గర్భా డాన్స్ చేసే ఆనవాయితీ ఉత్తరాదిలో ఉంది. ఫాల్గుణికి ముందు ప్రదర్శనలిచ్చేవారు కేవలం ఇన్స్ట్రుమెంటల్ మ్యూజిక్‌ను మాత్రమే వినిపిస్తూ డాన్స్ చేసేవారు. ఫాల్గుణి తనే దాండియా, గర్భా నృత్యాలకు వీలైన పాటలు పాడుతూ ప్రదర్శనకు హుషారు తేసాగింది. దాండియా సమయంలో ఎలాంటి పాటలు పాడాలో, జనంలో ఎలా జోష్ నింపాలో ఆమెకు తెలిసినట్టుగా ఎవరికీ తెలియదు. అందుకే ఆమె షోస్ అంటే జనం విరగబడేవారు. 2010లో మొదటిసారి నవరాత్రి సమయాల్లో ఆమె గుజరాత్ టూర్ చేసినప్పుడు ప్రతిరోజూ 60 వేల మంది గుజరాత్ నలుమూలల నుంచి ఆమె షోస్‌కు హాజరయ్యేవారు.ప్రయివేట్ ఆల్బమ్స్స్టేజ్ షోలతో పాపులర్ అయిన ఫాల్గుణి తొలిసారి 1998లో తెచ్చి ‘యాద్ పియాకీ ఆనె లగీ’... పేరుతో విడుదల చేసిన ప్రయివేట్ ఆల్బమ్ సంచలనం సృష్టించింది. ఊరు, వాడ ‘యాద్ పియాకీ ఆనె లగీ’ పాట మార్మోగి పోయింది. యువతరం హాట్ ఫేవరెట్‌గా మారింది. 1999లో విడుదల చేసిన ‘మైనె పాయల్ హై ఛన్కాయ్’... కూడా పెద్ద హిట్. ఈ అల్బమ్స్‌లో పాటలు కూడా ఆమె తన నవరాత్రుల షోస్‌లో పాడటం వల్ల ఆమెకు విపరీతమైన క్రేజ్ వచ్చింది.రోజుకు 70 లక్షలు2013 సమయానికి ఫాల్గుణి పాఠక్ నవరాత్రి డిమాండ్ ఎంత పెరిగిందంటే రోజుకు 70 లక్షలు ఆఫర్ చేసే వరకూ వెళ్లింది. నవరాత్రుల మొత్తానికి 2కోట్ల ఆఫర్ కూడా ఇవ్వసాగారు. ఆశ్చర్యం ఏమిటంటే నవరాత్రుల్లో అందరూ సంప్రదాయ దుస్తులు ధరించి దాండియా, గర్భా నృత్యాలు చేస్తారు. కాని ఫాల్గుణి ఆ దుస్తులు ఏవీ ధరించదు. ΄్యాంట్ షర్ట్ మీదే ప్రదర్శనలు ఇస్తుంది. ‘ఒకసారి ఘాగ్రా చోళీ వేసుకొని షో చేశాను. జనం కింద నుంచి ఇలా వద్దు నీలాగే బాగుంటావు అని కేకలు వేశారు. ఇక మానేశాను’ అంటుందామె.వెలుగులు చిమ్మాలిఫాల్గుణి ప్రదర్శన అంటే స్టేజ్ మాత్రమే కాదు గ్రౌండ్ అంతా వెలుగులు చిమ్మాలి. గ్రౌండ్‌లోని ఆఖరు వ్యక్తి కూడా వెలుతురులో పరవశించి ఆడాలని భావిస్తుంది ఫాల్గుణి. ప్రతి నవరాత్రి ప్రదర్శన సమయంలో నిష్ఠను పాటించి పాడుతుందామె. ‘నేను ఇందుకోసమే పుట్టాను. నాకు ఇది మాత్రమే వచ్చు’ అంటుంది. ఆమెకు విమాన ప్రయాణం అంటే చాలా భయం. ‘విమానం ఎక్కినప్పటి నుంచి హనుమాన్ చాలీసా చదువుతూ కూచుంటాను. అస్సలు నిద్ర పోను’ అంటుందామె. హనుమాన్ చాలీసా ఇచ్చే ధైర్యంతో ప్రపంచంలోని అన్ని మూలలకు ఆమె ఎగురుతూ భారతీయ గాన, నృత్యాలకు ప్రచారం కల్పిస్తోంది. తండ్రితోనేఏ తండ్రైతే ఆమెను పాడవద్దన్నాడో ఆ తండ్రికి తనే ఆధారమైంది ఫాల్గుణి. ఆమెకు 15 ఏళ్ల వయసులోనే తల్లి హార్ట్ ఎటాక్‌తో మరణించడంతో కుటుంబ భారం తనే మోసి ఇద్దరు అక్కల పెళ్లిళ్లు తనే చేసింది. తండ్రిని చూసుకుంది. వివాహం చేసుకోవడానికి ఇష్టపడని ఫాల్గుణి ‘నేను నాలాగే హాయిగా ఉన్నాను’ అంటుంది. గత 25 ఏళ్లుగా 30 మంది సభ్యుల బృందం స్థిరంగా ఆమె వెంట ఉంది. ప్రతి ప్రదర్శనలో వీరు ఉంటారు. వీరే నా కుటుంబం అంటుందామె. - 
      
                   
                               
                   
            అలరించిన వెస్లీకాలేజీ ఫెయిర్‌వెల్ షో

 హైదరాబాద్ సిటీ : జానపదం, సాంస్కృతిక ప్రదర్శనలతో సికింద్రాబాద్ లోని వెస్లీ బాలికల జూనియర్ కళాశాల ఉర్రూతలూగింది. శుక్రవారం నిర్వహించిన ఫెయిర్‌వెల్ పార్టీ కార్యక్రమం సందర్శకులను ఆద్యంతం అలరించింది. వెస్లీ జూనియర్ కళాశాల సీనియర్ బాలికలకు జూనియర్స్ వీడ్కోలు పలికారు. ఈ సందర్భంగా విద్యార్థినులు ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలు సందర్శకులను ఆకట్టుకున్నాయి. నృత్యాలు, క్యాట్‌వాక్ జరుగుతున్నంత సేపు కళాశాల ఆడిటోరియం సహా విద్యార్థినుల కేరింతలు, చప్పట్లతో మార్మోగింది. వివిధ రంగాల్లో ప్రతిభ కనబరిచిన విద్యార్థినులకు కళాశాల ప్రిన్సిపాల్ ప్రిసిల్లా సుహాసిని మెరిట్ సర్టిఫికెట్లు ప్రదానం చేశారు. ఫెయిర్‌వెల్ కార్యక్రమంలో లెక్చరర్లు, విద్యార్థినులు, వారి తల్లిదండ్రులు పాల్గొన్నారు. - 
      
                   
                               
                   
            టీవీక్షణం: ఈసారి ఝలక్ ఇచ్చేది ఎవరో!

 ఒకప్పుడు డ్యాన్స్ బేబీ డ్యాన్స్ ప్రోగ్రామ్ని మనవాళ్లు చాలా ఆసక్తిగా చూసేవారు. ప్రతివారం దాని కోసం ఎదురు చూసేవారు. ఎందుకంటే అప్పుడు మనకు అలాంటి డ్యాన్స్ షోలు కొత్త. కానీ ఇప్పుడు టీవీ ఆన్ చేస్తే చాలు... ప్రతి చానెల్లోనూ అలాంటి ప్రోగ్రాములు బోలెడన్ని కనిపిస్తున్నాయి. పిల్లలకొకటి, పెద్దవాళ్లకొకటి, సెలెబ్రిటీలకొకటి, సెలెబ్రిటీ భార్యాభర్తలకొకటి.... రకరకాల థీమ్స్‌తో డ్యాన్స్ షోలు ప్రసారమవుతున్నాయి. అయితే ఏవో కొన్ని మాత్రమే ప్రత్యేక రీతిలో సాగి ప్రేక్షకులను అలరిస్తున్నాయి. చానెళ్లకు లాభాలు తెచ్చిపెడుతున్నాయి. అలాంటి షోలన్నింటిలోకీ ముఖ్యంగా చెప్పుకోవాల్సింది... ‘ఝలక్ దిఖ్లాజా’ గురించి!
 
 యూకేలోని ‘బీబీసీ ఒన్’ చానెల్లో ప్రసారమయ్యే ‘స్ట్రిక్ట్లీ కమ్ డ్యాన్సింగ్’ షో కాన్సెప్ట్ ఆధారంగా చేసుకుని రూపొందించిందే ‘ఝలక్ దిఖ్లాజా’. కలర్స్ చానెల్‌వారు 2006లో దీన్ని ప్రారంభించారు. ఇప్పటికి ఆరు సిరీస్‌లు పూర్తయ్యాయి. ప్రముఖ సెలెబ్రిటీలను పోటీదారులుగా తీసుకొచ్చి, వాళ్లతో ఆడించి, అలరిస్తూ ఈ కార్యక్రమాన్ని విజయవంతంగా ముందుకు తీసుకెళ్తున్నారు. గెలిస్తే పేరుతో పాటు, పెద్ద మొత్తంలో ప్రైజ్ మనీ లభిస్తుంది కాబట్టి సెలెబ్రిటీలు కూడా పోటీపడుతుంటారు ఈ షోలో పాల్గొనడానికి. ప్రముఖ నటి మాధురీ దీక్షిత్, దర్శకుడు కరణ్ జోహార్, కొరియోగ్రాఫర్ రెమోఫెర్నాండెజ్‌లు న్యాయ నిర్ణేతలు కావడం కూడా షోని నంబర్‌వన్ పొజిషన్లో నిలబెట్టింది.
 
 ఇటీవలే ప్రారంభమైన ఏడో సిరీస్‌లో కూడా ఫేమస్ సెలెబ్రిటీలే ఉన్నారు. బెట్టింగుల కారణంగా అరెస్టయ్యి వార్తలకెక్కిన శ్రీశాంత్, ‘రంగ్ రసియా’ సీరియల్ హీరో ఆశిష్ శర్మ, ‘పలక్’గా ‘కామెడీ నైట్స్ విత్ కపిల్’లో కడుపుబ్బ నవ్విస్తోన్న కికు షర్దా, ప్రముఖ గాయకుడు సుఖ్వీందర్ సింగ్, డ్యాన్సర్ శక్తీమోహన్... ప్రముఖ వీజేలు సోఫియా చౌదరి, ఆండీ... టీవీ నటీనటులు కరణ్ థాకర్, క్రితికా కామ్రా, పూరబ్ కోహ్లీ, పూజాబోస్, మౌనీ రాయ్... దబాంగ్ డ్యాన్స్‌తో ‘ఇండియాస్ గాట్ ట్యాలెంట్’ ద్వారా చెప్పలేనంత పాపులర్ అయిన చిట్టి డ్యాన్సర్ అక్షత్‌సింగ్‌లు ఈ సిరీస్‌లో పోటీ పడనున్నారు. మరి వీళ్లలో అసలు సిసలు ఝలక్ ఇచ్చేదెవరో... విజేతగా నిలిచేది ఎవరో! - 
      
                   
                               
                   
            టీవీక్షణం: వినోదం వికటిస్తోందా?

 ఈ మధ్య ఏ చానెల్ పెట్టినా రెండు రకాల కార్యక్రమాలు ప్రధానంగా కనిపిస్తున్నాయి. ఒకటి హారర్ లేక క్రైమ్, రెండోది డ్యాన్స్. ముఖ్యంగా డ్యాన్స్ షోలు బాగా పెరిగిపోయాయి. బూగీవూగీ, డ్యాన్స్ ఇండియా డ్యాన్స్, నాచ్‌బలియే, డ్యాన్సింగ్ సూపర్‌స్టార్, ఝలక్ దిఖ్లాజా అంటూ హిందీ చానెళ్లు... రంగం, ఆట తదితర షోలతో తెలుగు చానెళ్లు సందడి చేస్తున్నాయి. మస్తు మస్తు డ్యాన్సులతో ప్రేక్షకులకు మజాని అందిస్తున్నాయి.
 
 అరవై నాలుగు కళల్లో డ్యాన్స్ కూడా ఒకటి. అయితే సంప్రదాయ నృత్యాలు స్జేజి ప్రదర్శనలకే పరిమితమవుతున్నాయి తప్ప, టెలివిజన్ సెట్లలో స్థానం సంపాదించలేకపోతున్నాయి. పాశ్చాత్య నృత్యరీతులు మాత్రమే టీవీ చానెళ్లలో కనిపిస్తున్నాయి. చిన్న పిల్లల దగ్గర్నుంచి, నడి వయస్కుల వరకూ వెస్టర్న్ డ్యాన్స్‌నే ఎంచుకుంటున్నారు. చానెళ్లవారు కూడా వాటినే ప్రోత్సహిస్తున్నారు.
 
 ఇప్పటి ట్రెండుని బట్టి ఇందులో తప్పేమీ లేదు. కానీ ఒక్కోసారి ఈ షోల ధోరణి శృతి మించుతోందనడంలో సందేహం లేదు. డ్యాన్సులు విపరీత పోకడలు పోతున్నాయి. ఆట షో గురించి వచ్చిన వివాదం తెలిసిందే. చిన్న పిల్లలకు పొట్టిపొట్టి దుస్తులు వేసి, ద్వంద్వార్థ ధోరణిగల పాటలకు డ్యాన్స్ చేయించడాన్ని తీవ్రంగా తప్పుబట్టారు. నిజానికిది ‘ఆట’లో మాత్రమే లేదు. దాదాపు అన్ని డ్యాన్స్ షోలలోనూ జరుగుతోంది. అలాగని పెద్దవాళ్ల డ్యాన్సులతో ఇబ్బంది లేదా అంటే కూడా ఊ అనలేం. వాళ్లు కూడా సినిమాలకు తీసిపోని విధంగా అసభ్య నృత్యరీతులను ప్రదర్శిస్తున్నారు. పైగా ఈ మధ్య సెలెబ్రిటీ జోడీల మధ్య పోటీలు పెడుతున్నారు. జీవిత భాగస్వామియే కాబట్టి ఫర్వాలేదనుకుంటున్నారో ఏమో గానీ... స్టేజిమీద రొమాన్స్‌ని హద్దు దాటిస్తున్నారు వారు. టీవీ అనేది పిల్లలకు కూడా అందుబాటులో ఉండే వినోద సాధనం. అందుకే ఇలాంటి వాటిని ప్రోత్సహించడం సరికాదు. అయితే వినోదం ఉండకూడదని కాదు. డ్యాన్స్ షోలని నిషేధించాలనీ కాదు. కొన్ని జాగ్రత్తలు పాటిస్తే చాలు. ఆ మధ్య ఇండియన్ ఐడల్ ఆడిషన్స్‌కి వచ్చిన ఓ చిన్నపిల్ల ఐటెమ్ సాంగ్ పాడింది.
 
 దాంతో జడ్జిలు ఆ పాప తల్లిని పిలిచి, ఇలాంటివి ప్రోత్సహించి పాప భవిష్యత్తును పాడు చేయకండి, మంచి పాటలు నేర్పించండి అని చెప్పారు. డ్యాన్స్ షోలకు కూడా ఇది వర్తిస్తుంది. పిల్లల మనసులపై చెడు ప్రభావం పడ కుండా ఉండేందుకు కొన్ని పాటల్ని ఎంచుకోకుండా నియంత్రించాలి. పెద్దలకు కూడా కొన్ని రకాల విన్యాసాలు చేయకుండా హద్దులు పెట్టాలి. నియమాలు విధించాలి. లేదంటే చెడును తీసుకెళ్లి స్వయంగా మన పిల్లల చేతుల్లో పెట్టినట్టవుతుంది. ఈమాత్రం జాగ్రత్త కూడా తీసు కోకపోతే వినోదం వికటిస్తుంది. డ్యాన్స్ షో కాస్తా డేంజరస్ షో అవుతుంది! 


