అక్షర వాచస్పతిఅస్తమయం
* ప్రముఖ సాహితీవేత్త దాశరథి రంగాచార్య కన్నుమూత
* ఛాతీ నొప్పితో ఆస్పత్రిలో చేరిక... చికిత్స పొందుతూ తుదిశ్వాస
* గవర్నర్, సీఎం కేసీఆర్, వైఎస్ జగన్ సహా ప్రముఖుల సంతాపం
* నేడు ప్రభుత్వ లాంఛనాలతో అంత్యక్రియలు
సాక్షి, హైదరాబాద్: తెలుగు సాహితీ మాగాణంలో ‘మోదుగుపూలు’ పూయించిన అక్షర వాచస్పతి, నిజాం నిరంకుశ పాలనకు వ్యతిరేకంగా చిన్నతనంలోనే ఉద్యమబాట పట్టిన తెలంగాణ సాయుధ పోరాట యోధుడు డాక్టర్ దాశరథి రంగాచార్య (87) కన్నుమూశారు.
చాలా కాలంగా మధుమేహం, అధిక రక్తపోటు, ఊపిరితిత్తుల ఇన్ఫెక్షన్ వంటి జబ్బులతో బాధపడుతున్న ఆయనకు రెండు రోజుల క్రితం ఛాతీ నొప్పి రావడంతో కుటుంబ సభ్యులు దాశరథిని హైదరాబాద్ సోమాజీగూడలోని యశోద ఆస్పత్రిలో చేర్పించారు. అయితే షుగర్ లెవెల్స్, రక్తపోటు బాగా పెరిగిపోవడం, ఫలితంగా గుండె పనితీరు మందగించడంతో సోమవారం ఉదయం 6 గంటల సమయంలో ఆయన కన్నుమూశారు. ఆయన భౌతికకాయాన్ని వెస్ట్‌మారేడ్‌పల్లి నెహ్రూనగర్‌లోని ఆయన స్వగృహానికి తరలించారు. దాశరథికి భార్య కమల, కుమారుడు విరించి, కుమార్తెలు ఉదయశ్రీ, సుధ ఉన్నారు.
దాశరథి మరణవార్త తెలిసిన వెంటనే బంధువులు, అభిమానులు, కవులు, రచయితలు, పలువురు రాజకీయ, సామాజిక, సాహిత్య ప్రముఖులు పెద్ద సంఖ్యలో తరలి వచ్చి నివాళులర్పించారు. మంగళవారం మధ్యాహ్నం 12 గంటలకు మారేడుపల్లి శ్మశాన వాటికలో అంత్యక్రియలు నిర్వహించనున్నట్లు విరించి తెలిపారు. రాష్ట్ర డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి సహా పలువురు ప్రముఖులు దాశరథి రంగాచార్య భౌతికకాయాన్ని సందర్శించి నివాళులు అర్పించారు. సీఎం కేసీఆర్ దూతగా తాను వచ్చానని, సీఎం సూచన మేరకు దాశరథి అంత్యక్రియలను ప్రభుత్వ లాంఛనాలతో జరిపించనున్నట్లు కడియం వెల్లడించారు.
చిన్నతనం నుంచే ఉద్యమబాట...
వరంగల్ జిల్లా మరిపెడ మండలం చిన్నగూడూరులో 1928 ఆగస్టు 24న జన్మించిన దాశరథి హైస్కూల్లో చదువుకొనే రోజుల్లోనే ఉద్యమబాట పట్టారు. రూమీ టోపీ ధరించాలన్న నిజాం ఫర్మానాను ఎదిరించి పోరాడినందుకు స్కూల్ నుంచి డీబార్ కావడంతో ఆయన మార్గం ప్రజాఉద్యమమైంది. కొంతకాలంగా ‘విద్యార్థి సంఘం’ పేరుతో గ్రంథాలయం నడిపారు. కానీ పోలీసుల నిర్బంధం పెరిగిపోవడంతో అప్పటికే అన్నయ్య దాశరథి కృష్ణమాచార్య నడిచిన బాటలో అజ్ఞాతంలోకి వెళ్లారు.
గార్ల కేంద్రంగా అనేక కోయగూడేల్లో పోరాటాలు చేపట్టారు. అనారోగ్యంతో ఉన్న తల్లిని చూసేందుకు వచ్చిన ఆయన్ను పోలీసులు అరెస్టు చే యగా తప్పించుకొని బెజవాడ చేరుకున్నారు. కానీ ఆ తరువాత కొంతకాలానికి తెలంగాణ విముక్తి కావడంతో ఇంటికి వచ్చారు. కొంతకాలం ఉపాధ్యాయుడిగా వివిధ ప్రాంతాల్లో పని చేశారు. సికింద్రాబాద్ మున్సిపల్ కార్యాలయంలో ఉద్యోగం రావడంతో హైదరాబాద్‌కు వచ్చారు.
నిజాం నవాబు భారత ప్రభుత్వానికి లొంగిపోయిన తొలినాళ్లలో ప్రజలు అప్పటి బాధలన్నీ మరిచిపోయి ఉస్మాన్ అలీఖాన్‌ను ఆరాధిస్తారేమేననే భయంతో చిల్లర దేవుళ్లు అనే నవల రాసిన ఆయన...ఆ తరువాత రామాయణం, మోదుగుపూలు, మాయాజలతారు, ఏది నిజం, జీవనయానం వంటి 89 నవలలు రాశారు. చిల్లర దేవుళ్లు నవలకుగానూ ఆయనకు కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు లభించింది.
28 ఏళ్ల క్రితమే సికింద్రాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ డిప్యూటీ కమిషనర్‌గా పదవీవిరమణ పొందిన దాశరథి రంగాచార్యులు నిరాడంబర జీవితాన్ని గడిపారు. 1959లో సికింద్రాబాద్ మున్సిపాలిటీలో ఉద్యోగంలో చేరినప్పటి నుంచి తుదిశ్వాస విడిచేవరకూ ఆయన నెహ్రూనగర్‌లోని ఇంట్లోనే గడిపారు. మారేడ్‌పల్లి మున్సిపల్ ప్లే గ్రౌండ్ పక్కన ఉన్న ఇరుకైన సందులోని మూడు గదుల ఇల్లు ఆయన గడిపిన సాధారణ జీవితానికి అద్దం పడుతోంది.
సాహితీ రంగానికి తీరని లోటు
సాక్షి, హైదరాబాద్: సుప్రసిద్ధ సాహితీవేత్త డాక్టర్ దాశరథి రంగాచార్య మృతిపట్ల తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల గవర్నర్ నరసింహన్, ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్‌రావు సహా వివిధ రాజకీయ పార్టీల నేతలు వేర్వేరు ప్రకటనల్లో సంతాపం తెలిపారు. ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేశారు.
దాశర థి రంగాచార్య మరణంతో సాహితీలోకం ఒక గొప్ప వ్యక్తిని కోల్పోయింది. తెలుగు సాహిత్యానికి ఆయన చేసిన సేవలు, అందించిన రచనలు మరవలేనివి.
- గవర్నర్ ఈఎస్ఎల్ నరసింహన్
దాశరథి తన రచనల ద్వారా తెలంగాణ ఉద్యమ భావజాల వ్యాప్తికి కృషి చేశారు. పోరాటాల ద్వారా ప్రజల్లో స్ఫూర్తిని రగిలించిన గొప్ప వ్యక్తిగా ఆయన చరిత్రలో నిలిచిపోతారు.
- ముఖ్యమంత్రి కేసీఆర్
దాశరథి తెలుగు సాహితీ రంగానికి చేసిన సేవలు శ్లాఘనీయం. ఆయన కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతి తెలుపుతున్నా.
- వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి
తెలంగాణ సాయుధ పోరాట నేపథ్యం, భూస్వాముల దోపిడీపై దాశర థి గొప్ప సాహిత్యాన్ని సృష్టించారు.
- సీపీఐ జాతీయ ప్రధాన కార్యదర్శి సురవరం సుధాకరరెడ్డి
జీవితాన్ని ప్రజలకే అంకితమిచ్చిన కలం యోధుడు దాశరథి. ఆయన్ను నేటి తరం ఆదర్శంగా తీసుకోవాలి.
- సీపీఎం పొలిట్‌బ్యూరో సభ్యుడు బీవీ రాఘవులు
వేదాన్ని, విప్లవాన్ని సమాజ హితానికి అస్త్రాలుగా సంధించిన సవ్యసాచి దాశరథి. స్వాతంత్య్ర సమరయోధుడుగా, తెలంగాణ ఉద్యమకర్తగా ఆయన సేవలు మరవలేనివి
-రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు రమణాచారి
దాశరథి తెలుగును సుసంపన్నం చేశారు. ఆయన క్రియాశీల జీవనయానం తెలంగాణ సామాజిక గమనానికి అద్దం పడుతుంది.
- లోక్‌సత్తా నేత జయప్రకాశ్ నారాయణ
తెలంగాణ సాహితీ దిగ్గజం, నిజాం నిరంకుశపాలనపై ఎలుగెత్తి పోరాడిన దాశరథి రంగాచార్య మృతి రాష్ట్రానికి తీరనిలోటు
- టీపీసీసీ చీఫ్ ఎన్.ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, కార్యనిర్వాహక అధ్యక్షుడు మల్లు భట్టివిక్రమార్క