breaking news
Creative skills
-
నిశ్శబ్దం: ఓ అద్భుత ఆంతరంగిక వాణి
ప్రకృతి మనకు అందించే శ్రవణానందకర శబ్దాలను విని ఆనందించేటందుకు, మనలోని సృజనాత్మక శక్తిని వెలికి తీసేటందుకు, రసాస్వాదనకు ఒక ప్రశాంత స్థితి, ఒక నిర్మలత కావాలి. అది నిశ్శబ్ద వాతావరణంలోనే కుదురుతుంది. ఆ కోణంలో చూసినపుడు మన సృజనశక్తులు జాగృతమై చైతన్యవంతమయ్యే ఓ అద్భుత స్థితికి కావలసిన ఆవరణను కల్పించేదే నిశ్శబ్దమంటే. ఒక చేతిలోని పదునైన ఉలిని ఒక కఠినమైన రాయిపై ఉంచి, మరొక చేతిలోని సుత్తితో లాఘవంగా, ఒడుపుగా తన మనసులోని అద్భుత రూపానికి జీవకళ ఉట్టిపడేటట్టుగా ఆకుంఠిత దీక్షతో శిల్పి పనిచేస్తుంటాడు. కావలసిన రంగులుంచుకున్న పళ్ళేన్ని ఒక చేతిలో, కుంచెను మరొకచేతిలో పట్టుకున్న ఓ చిత్రకారుడు తన ఊహాచిత్రానికి ఓ చక్కని రూపునిచ్చే తపోదీక్షలో ఉంటాడు. కలాన్ని తన చేతి వేళ్ళ మధ్య ఉంచుకుని ఆలోచనా క్షీరసాగరాన్ని మధనం చేస్తూ భావ సంక్లిష్టత, అస్పష్టతలనే కెరటాల గరళాన్ని అధిగమిస్తూ సాహిత్యామృతాన్ని అందించే యత్నం చేస్తుంటాడు రచయిత. ఈ సృజన ఒక నిశ్శబ్ద వాతావరణంలోనే సాధ్యమవుతుంది. నిశ్శబ్దంలో మనలోని ఏకాగ్రత, స్థిరత్వం, నిశ్చలతలు బలోపేతమవుతాయి. అపుడు మనం దృష్టి్ట కేంద్రీకరించగలుగుతాం. ఆంగ్ల భాషలో నిశ్శబ్దానికి, మౌనానికి అర్ధభేదం లేదు. నిశ్శబ్దం అనే ఒకేరకమైన మాటను వాడతారు. కాని, తెలుగుభాషలో ఈ రెండిటికి ఎంతో తేడా ఉండటమే కాదు ఎంతో లోతైన, విస్తృతమైన అర్థంలో వాడతాం.. కొన్ని సందర్భాలలో, ప్రదేశాలలో మనం నిశ్శబ్దంగా ఉండాలి. పాఠాలను, ప్రసంగాలను, సంగీత కచేరిలో సంగీతాన్ని వింటున్న వేళల్లో, గ్రంథాలయం లాంటి ప్రదేశాలలో ఉన్నప్పుడు నిశ్శబ్దంగా ఉండాలి. ఈ నిశ్శబ్దం పాటించటంలో మన ఇష్టాయిష్టాలతో ప్రమేయం లేదు. తప్పనిసరైన నియమం. అయితే, మౌనం మనం పాటించేది. వ్యక్తిగతం. మన ఇష్టపూర్వకంగా స్వీకరించేది. ధ్యానం ఒక నిశ్శబ్ద పయనం. మన అంతరంగమనే సాగరంలోకి వెళుతూ దాని ఘోషను వినగలిగే ఓ అద్భుత అవకాశం. ఈ మౌనం మనం నియమించుకున్న నిశ్శబ్దం ఒక ప్రశాంతమైన వాతావరణం. మన నడవడికను నెమరు వేసుకునే సందర్భం. మంచి, చెడులను తెలుసుకునేందుకు మనకై మనం పెట్టుకున్న నిబంధన. నిరంతర సుదీర్ఘ ప్రయాణం. అది మనల్ని ఉన్నతంగా ఆలోచింపచేస్తుంది మానవ దౌర్బల్యాలను, బలహీనతలను దాటగలిగే మానసిక స్థైర్యాన్ని ఈ నిశ్శబ్ద వాతావరణం మనకు ప్రసాదిస్తుంది. మన సాహిత్యకారులు నిశ్శబ్దం తాండవిస్తోంది అని వర్ణిస్తుంటారు. శబ్దశూన్యతే నిశ్శబ్దం అయినప్పుడు నర్తిస్తున్నదనటంలో అర్థమేమిటి? అపార్థాలతో కాపురం చేసే భార్యాభర్తల మధ్య మాటలుండవు. కాని, ఇరువురి మనసుల్లో అభివ్యక్తం కాని అనంతమైన ఆలోచనలు, భావాలు వారి మనోసంద్రపు తీరాన్ని తాకి మళ్లీ వెనకకు పోతుంటాయి. పై చెప్పిన మాటకు అర్థమిదే. భావాలు, మనోభావాలు ఘనీభవించిన స్థితే ఇక్కడ నిశ్శబ్దమంటే. పరపాలనలో మగ్గే ప్రజ తమ ఉచ్ఛ్వాస నిశ్వాసాల మీద కూడ అధికారాన్ని, నియంత్రణను చూపుతూ, తమధన, మాన, ప్రాణాలను దోచుకునే పాలకుల దౌర్జన్యం, దోపిడీ కొంతవరకే ఓర్చుకోగలరు. వాటిని నిశ్శబ్దంగా భరిస్తుంటారు. వారి స్వాతంత్య్ర కాంక్ష అగ్నిపర్వతపు లావాలా పొగలు కక్కుతుంటుంది. ఈ నిశ్శబ్దం విస్ఫోటనమైన వేళ వచ్చే పర్యవసనం భయంకరంగా ఉంటుంది. అది బీభత్సాన్ని సృష్టిస్తుంది. ఒక్కోసారి కొన్ని వందల మాటల్లో చెప్పలేనిది కూడ ఒక అర్థవంతమైన నిశ్శబ్దం సూచిస్తుంది. అది మన మనసుకు అద్దం పడుతుంది. నిశ్శబ్దం ఓ అద్భుతమైన శక్తి. మన అనేకమైన మిశ్రమ భావాలకు భాష్యం చెప్పగలదీ నిశ్శబ్దం. నిశ్శబ్దమిచ్చే ఏకాంతంలో, ఆలోచనలో సత్యశోధన చేయగలం. సత్యాన్ని దర్శించగలం. అందుకే నిశ్శబ్దం ఒ అద్భుత ఆంతరంగిక వాణి. – బొడ్డపాటి చంద్రశేఖర్, ఆంగ్లోపన్యాసకులు. -
గుంపులో గోవిందకు కాలం చెల్లింది.. అంతా క్రేజీ క్రియేటివ్స్ మాయ
నలుగురితో నారాయణ.. గుంపులో గోవింద.. ఇప్పుడు వర్కవుట్ అయ్యే కాన్సెప్ట్ కాదు! సాంకేతిక, సమాచార విప్లవం వచ్చాక.. కొత్తదనమనేది పాతబడి.. అర్థం మార్చుకున్నాక..కొంచెం క్రేజీ ఆలోచనే సృజనగా పబ్లిక్ డొమైన్లో గుర్తింపు పొందాక.. నలుగురితో నారాయణలకు గుంపులో గోవిందులకు కాలం చెల్లిపోయింది! క్రియేటివిటీ ఎంత హద్దులు దాటితే అంత యూనిక్‌గా మన్ననలందుకుంటోంది! ఈ ధోరణి పబ్లిసిటీ రంగంలో పోస్టరేసినట్టు కనపడుతోంది.. అలాంటి కొన్ని ప్రచారాలు.. ప్రకటనలు మీ ‘ఫన్’డే కోసం పులిరాజా గుర్తున్నాడా? ‘పులిరాజాకు ఏమైంది?’ అంటూ పెద్ద పెద్ద అక్షరాలతో వెలసిన హోర్డింగ్స్ గుర్తుకొచ్చాయా? దాదాపు రెండు దశాబ్దాల కిందటి విషయం. ఈ ఏకవాక్య ప్రకటన అప్పటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లోని ప్రజలందరిలో ఎక్కడలేని కుతూహలాన్ని కలిగించింది. ఒక్క ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఏంటి.. దేశవ్యాప్తంగానే (ఆయా భాషల్లో) సంచలనం సృష్టించింది. ఆ తర్వాత దానికి కొనసాగింపుగా మరో ప్రకటన వచ్చింది.. ‘పులిరాజాకు ఎయిడ్స్ వస్తుందా?’ అంటూ. ఇదీ అంతే ఆసక్తిని.. సెన్సేషన్‌ను రేకెత్తించింది. ఎయిడ్స్ ఉనికిలోకి వచ్చిన కొత్తలో దాని మీద ప్రజలకు అవగాహన కల్పించేందుకు చేసిన ప్రయత్నమే ఆ ప్రచారం. ప్రధానంగా లైంగిక (అపరిచిత వ్యక్తులు, అసురక్షిత ) సంపర్కం ద్వారా సంక్రమించే ఈ వ్యాధి గురించి ఎంత చర్చిస్తే అంత అవగాహన పెరుగుతుంది.. గుట్టుగా ఉంటే వ్యాధి బారిన పడే ప్రమాదం ఉంటుంది అనే చైతన్యాన్ని పెంపొందిచండం కోసం ఈ ప్రకటనను అలా డిజైన్ చేశారు. అందుకే ‘ఎయిడ్స్ గురించి మాట్లాండి.. నిశ్శబ్దాన్ని ఛేదించండి’ అనే ట్యాగ్‌లైన్‌నూ జోడించారు. ఆ ఉద్దేశం నెరవేరింది. దీని మీద పెద్ద చర్చే జరిగింది. ఎలాగోలా ఎయిడ్స్ అనే మాట జనాల మస్తిష్కాల్లో ముద్రపడిపోయింది. అది స్పృహను పెంచింది. ఎయిడ్స్‌పై అప్పటి వరకు చేసిన ప్రచారమంతా ఒకెత్తు పులిరాజా ఒక్కడు ఒకెత్తు అనేట్టుగా నిలిచిపోయింది. ఇలాంటి ప్రకటనలు చాలానే ప్రజల మెదళ్లను వశపరచుకున్నాయి. ఆ జాబితాలో కరపత్రాల నుంచి కమర్షియల్ యాడ్స్ దాకా చాలానే ఉన్నాయి. ఇంకా చెప్పాలంటే కళలూ అందులో చేరాయి. దానికి ఉదాహరణ పాప్ లెజెండ్ మైకేల్ జాక్సన్. నిజానికి ఇలాంటి చిత్రమైన స్టంట్‌తోనే పాప్ అభిమాన ప్రపంచం ఒక్కసారిగా ఆయన వైపు తలతిప్పింది. మైకేల్ జాక్సన్ ‘థ్రిల్లర్’ ఆల్బమ్ తెలుసు కదా! లవ్, మ్యూజిక్, డ్యాన్స్ అనే ఎవర్గ్రీన్ ఫార్ములాకు మనిషిని పీక్కుతినే జాంబీని జోడించి శ్మశానంలో చిత్రీకరించిన పాట. అప్పటి వరకు అతని ఏ పాటకు, డాన్స్‌కు రాని స్పందన, అభిమాన వెల్లువ థ్రిల్లర్‌తో వచ్చింది. అతనికంటూ ఓ ఫ్యాన్ బేస్‌ను ఏర్పాటు చేసింది. ఆ టైమ్‌లో ఎవరి ఊహకూ అందని ప్రయోగం అది. ఆ విజయం మైకేల్‌ను మళ్లీ వెనక్కి తిరిగి చూసుకోనివ్వలేదు. ఇలా తక్కువ ఖర్చుతో తక్కువ సమయంలో ఎక్కువ మంది దృష్టిని ఆకట్టుకోవాలంటే అందరూ నడిచే దారిలో నడిస్తే కుదరదు. ఔట్ ఆఫ్ ది బాక్స్ ఆలోచించాలి. ఎవ్వరూ చేయనిది చేయాలి. బడా స్టార్ల పరిమితుల్లో లేనిది, బిగ్‌షాట్స్‌కు సాధ్యం కానిది, కార్పొరేట్స్‌కు చిక్కని మ్యాజిక్ ఒకటి క్రియేట్ చేయాలి. అది నలుగురి నోళ్లల్లో నానుతుంది. ఆ ప్రచారమే వ్యాపారాన్నయినా.. సినిమానైనా లాభాల్లో నడిపిస్తుంది. అందుకే పబ్లిసిటీ కొత్త పద్ధతుల్లో కనిపిస్తోంది. చెరిగిపోదులే.. ఈ సమ్‌థింగ్ డిఫరెంట్ ధ్యాసలోని కొన్ని ఆలోచనలు.. ప్రగతిపథాన్ని స్పీడ్ బ్రేకర్లలా స్లో చేస్తున్నాయి అప్పుడప్పుడు. ముఖ్యంగా మహిళలకు సంబంధించి. ఉదాహరణకు కెమ్లిన్ మార్కర్ పెన్ యాడ్. ఇందులో భార్యకు సిందూరం బదులు మార్కర్ పెన్నుతో బొట్టు పెడతాడు భర్త. అనారోగ్యంతో మంచాన పడి అతను చనిపోతాడు. ఆమె బొట్టును చెరిపేందుకు ప్రయత్నిస్తుంటారు ఇతర స్త్రీలు. మార్కర్‌తో భర్త దిద్దిన ఆ బొట్టు చెరిగిపోదు. దీంతో ఆ భర్త ప్రాణాలతో లేచి కూర్చుంటాడు. ఇంచుమించు ఇది సతీ సావిత్రి కాన్సెప్ట్‌ను తలపిస్తుంది. అయినా ఆ యాడ్‌లో ఉన్న యూనిక్‌నెస్‌తో అది సక్సెస్ అయింది. లైటర్వీన్లో సుతిమెత్తగా కాస్త హాస్యరస ప్రధానంగా తీశారు కాబట్టి కొంచెం లోతుగా చూస్తే తప్ప దీని వెనుకున్న ముత్తయిదువ సెంటిమెంట్ అర్థంకాదు. క్రియెటివిటీకి పరాకాష్టగా కనిపించే ఇంకో యాడ్ హాథీ సిమెంట్స్ యాడ్. ఆత్మలు కూడా దూరలేనంత దృఢంగా తమ సిమెంట్‌తో కట్టిన నిర్మాణాలుంటాయని శ్మశానం, దెయ్యాలు, ఆత్మలు నేపథ్యంగా రూపొందించిన ఆ యాడ్ ద్వారా తన ప్రోడక్ట్‌ను ప్రమోట్ చేసుకుందీ కంపెనీ. ఛోటేమియా బడేమియా ఈ కామర్స్ బూమ్ మొదలైన కొత్తలో అది వ్యాపార ప్రకటనలకు ప్లాట్‌ఫామ్‌గా మారింది. కానీ ఆ ప్రకటనలు ఇలా స్టార్ట్కాగానే అలా రిమోట్ నొక్కేవాళ్లు లేదా స్కిప్ బటన్ మీదకు కర్సర్‌ను తీసుకెళ్లేవాళ్లు. అలాంటిది ఆ రిమోట్‌నే స్కిప్ చేశాయి ఫ్లిప్‌కార్ట్ యాడ్స్. చిన్న పిల్లలను పెద్ద వాళ్ల గెటప్‌లో చూపిస్తూ రొటీన్‌కు భిన్నంగా ఫ్లిప్‌కార్ట్ చేసిన ప్రయత్నం ఫ్లాష్సేల్లా సక్సెస్ అయ్యింది. అమెజాన్ దెబ్బకు అప్పటి వరకు ఉన్న ఈ కామర్స్ సైట్స్ చతికిలబడుతున్న సమయంలో ఈ యాడ్స్ .. మార్కెట్లో ఫ్లిప్‌కార్ట్ నిలదొక్కుకునేందుకు సాయపడ్డాయి. చూడక తప్పదు విలక్షణమైన ప్రకటనల ఫ్రేమ్‌లో సినిమా పబ్లిసిటీ, ట్రైలర్స్ కూడా ఇముడుతాయి. సినిమా అంటేనే లార్జర్ దాన్ లైఫ్ కలలకి దృశ్యరూపం. సినిమాకే కాదు వాటి ట్రైలర్లకూ లార్జెర్ దాన్ లైఫ్ ఉంటుందని నిరూపించి బాక్సాఫీస్‌ను ఫుల్ చేసుకుంది లక్ష్మీ గణపతి ఫిల్మ్స్. హాలీవుడ్ సినిమాలను తెలుగులోకి డబ్ చేసేది ఈ సంస్థ. పెక్యూలియర్.. హై పిచ్ వాయిస్‌తో ‘లక్ష్మీ గణపతి ఫిల్మ్స్ ‘సముద్రపుత్రుడు’.., ‘దెయ్యాల కోట’.., ‘వింత ప్రపంచం’ అంటూ టీవీ, రేడియో ప్రకటనల్లో చెబుతుంటే.. వినే వాళ్లకు ఈ సినిమా చూడకపోతే తమ కళ్లు దండగ అనే భావన కలిగేది. జూ జూ.. వైవిధ్యమైన ప్రకటనల ట్రెండ్‌లో టెలికమ్ సేవల కంపెనీలూ తమ ఐడియాలను నమోదు చేసుకున్నాయి. వీటిల్లో వొడాఫోన్ క్రియేట్ చేసిన జూ జూలది చెప్పుకోదగ్గ పాత్ర. వీటితో పండించిన ప్రకటనలే ఆ కంపెనీ బిజినెస్‌కు కాసుల సిగ్నల్స్ అందించాయి. అంతేనా ఐపీఎల్ (ఇండియన్ ప్రీమియర్ లీగ్)ను ఐఎఫ్ఎఫ్(ఇండియన్ ఫ్యామిలీస్ ఫేవరెట్)గా మార్చలేదూ! నిజానికి వోడాఫోన్ జూ జూలు దేశంలోకి ఎంట్రీ ఇచ్చింది కూడా ఐపీఎల్ ద్వారానే. ఈ మ్యాచ్‌ల మధ్యలోనే కదా వీటిని పెట్టి వోడాఫోన్ తన ప్రచార ప్రకటనలను ప్రసారం చేసింది. క్రికెట్ అభిమానులు ఐపీఎల్ కోసం టీవీ ముందు కూర్చుంటే వాళ్ల కుటుంబ సభ్యులు ఈ జూ జూల యాడ్స్ కోసం టీవీ ముందు ఆసీనులయ్యేవారు. అలా వారూ ఐపీఎల్‌కు అడిక్ట్ అయ్యారు. ఏలియన్స్ రూపంలో మాటల్లేకుండా జూజూలు చేసే అల్లరి వోడాఫోన్‌కు ఎంతటి పబ్లిసిటీనిచ్చిందో ఐపీఎల్‌కూ అంతటి క్రేజ్‌ను తెచ్చింది. అయితే ఇంచుమించు ఓ దశాబ్దం కిందట మిరిండా కూల్ డ్రింక్ కూడా ఇలాగే మాటల్లేని జూ జూలను పోలిన గుండు క్యారెక్టర్లతో మార్కెట్లోకి వచ్చింది. డ్రింక్ సంగతేమో కానీ ప్రచారంతో మాత్రం జనాల్ని చిల్ చేసింది. స్మార్ట్ కాకి ఇది హార్డ్ వర్క్ కాలం కాదు.. స్మార్ట్ వర్క్ కాలం. అందుకే నాటి కథల్లోని క్యారెక్టర్స్ కూడా నేటి కాలానికి అప్ డేట్ అవుతున్నాయి. మనందరి చిన్నప్పటి కాకి కథలోని కాకి కూడా. విపరీతంగా దాహమేసిన ఆ కాకి కూజాలో ఉన్న కాసిన్ని నీళ్లల్లో రాళ్లు వేసి.. ఆ నీళ్లను పైకి తెప్పించి దాహం తీర్చుకుని ఎంచక్కా ఎగిరిపోతుంది. కాలం మారినా దాహం మారదు కదా. అందుకే అప్డేటెడ్ నేటి కాకికీ దాహం వేస్తుంది. ఆ పక్కనే నాటి చాదస్తపు కాకీ ఉంటుంది తన ముక్కు దూరని చిన్న పాత్రలో ఉన్న కొంచెం నీళ్లల్లో రాళ్లు వేస్తూ. అప్డేటెడ్ కాకి దాన్ని వింతగా చూసి తన ముందున్న స్ప్రైట్ బాటిల్‌ను ముక్కుతో పొడిచి.. పౌంటెన్గా చిమ్మిన స్ప్రైట్‌తో దాహం తీర్చుకుని కులాసాగా ఫ్లై అవుతుంది. ఇది స్ప్రైట్ యాడ్ క్రియేటివిటీ. వావ్.. వాటేన్ ఐడియా అనిపించక మానదు.. స్ప్రైట్‌ను కొనిపించక మానదు. ఈ వరుసలోకే చేరుతుంది ఫెవికాల్ ప్రకటన కూడా. ఫాంటసీతో వీక్షకుడిని కట్టిపడేయడంలో దానిది ప్రత్యేక శైలి. ఫెవికాల్ నుంచి ఏదైనా యాడ్ వస్తే చూసి వదిలేయకుండా దాని మీద మిత్రబృందంతో చర్చపెట్టేలా చేస్తుంది. చేపలు పట్టడం మొదలు కలలో హీరోయిన్ యాడ్ వరకు థీమ్ ఒక్కటే అయినా దేనికదే భిన్నంగా కనువిందు చేసి జనాలను ఆ బ్రాండ్‌కి అతుక్కుపోయేలా చేస్తుంది. పోస్టర్సే స్టార్స్‌గా యాడ్ ఫిల్మ్ మేకర్‌గా కెరీర్‌ను ప్రారంభించిన రవిబాబు సినిమా డైరెక్టర్‌గా మారాక తనదైన శైలిని విడిచి పెట్టలేదు. పెద్ద పెద్ద స్టార్ కాస్ట్ లేకుండా కొత్తవాళ్లతో సినిమాలు తీసే రవిబాబు.. తన సినిమాలపై ప్రేక్షకుల అటెన్షన్‌ను సాధించేందుకు డిఫరెంట్‌గా పోస్టర్స్‌ను డిజైన్ చేస్తాడు. కేవలం వెరైటీ పోస్టర్ పబ్లిసిటీ ద్వారానే ప్రేక్షకులను థియేటర్‌కు రప్పిస్తాడు. ‘అల్లరి’ మొదలు ‘నచ్చావులే’, ‘మనసారా’, ‘అవును’.. ఇలా తన ప్రతి సినిమాకు రవిబాబు క్రియేట్ చేసిన పోస్టర్లు సినిమా లవర్స్‌నే కాదు సాధారణ ప్రజలనూ ఆకట్టుకున్నాయి. అంతకు ముందు తరంలో వంశీ సినిమా పోస్టర్లు సైతం ఆయనదైన సిగ్నేచర్‌తో ఇట్టే జనాల్లోకి వెళ్లేవి. ...తిని చూడు న్యూవేవ్ పబ్లిసిటీ మెథడ్స్‌లో హోటల్ బిజినెస్ టాప్‌లో ఉంది. తమ ఫుడ్ సెంటర్లకు సమాపక, అసమాపక క్రియలనే నామాలుగా పెట్టి ఈ రకమైన ప్రచారానికి తాలింపేస్తున్నారు. తెలుగు రాష్ట్రాల్లో స్ట్రీట్ ఫుడ్ కల్చర్ ఊపందుకున్నాక.. అప్పటి వరకు ఉన్న టిఫిన్ సెంటర్లు కాస్తా ఫుడ్కోర్ట్, దోసా ఆన్ వీల్స్ ఎట్సెట్రాగా మారాయి. ఈ కొత్త ట్రెండ్ కొత్త పేర్లను తీసుకొచ్చింది. ఇంగ్లిష్ పేర్ల స్థానంలో ‘రా.. తిని పో’,‘రా బావ తిని చూడు’, ‘భలేబావుంది’, ‘ఉప్పు కారం’, ‘దిబ్బరొట్టె’, ‘అద్భుతః’, ‘కోడికూర చిట్టిగారె’, ‘దా తిను’ వంటి పేర్లు వచ్చి చేరాయి. ఈ ఐడియా బాగా వర్కవుట్ అవడంతో కర్రీ పాయింట్లు, హోటళ్లు కూడా తమ సెంటర్లకు పునః నామకరణం చేసి ఈ కొత్త ఒరవడిలోకి ఎంటర్ అయ్యాయి. ‘సెకండ్ వైఫ్ రెస్టారెంట్’, ‘తిను బకాసుర’, ‘పొట్ట పెంచుదాం’, వంటి పేర్లతో, ‘మాయాబజార్’, ‘వివాహ భోజనంబు’ వంటి ఎవర్గ్రీన్ హిట్ సినిమాల పేర్లతోనూ రెంస్టారెంట్లు తెరచుకున్నాయి. ఫుడీలకే కాదు మీమర్లకూ ఫీడ్ అందించాయి. షాకింగ్? సర్ప్రైజ్?! కాన్యే వెస్ట్.. అమెరికన్ సింగర్. అక్కడి యూత్‌కి ఫ్యాషన్ ఐకాన్. రెండేళ్ల కిందట అతను ఇచ్చిన ఓ సర్ప్రైజ్ను ప్రపంచం ఈనాటికీ మరిచిపోలేదు. అమెరికా అధ్యక్ష ఎన్నికల బరిలో నిలబడుతున్నానని, అదీ ట్రంప్‌తో ఉన్న మంచి స్నేహాన్ని చెడగొట్టుకుని మరీ అంటూ ప్రకటించడంతో అంతా షాక్ తిన్నారు. తమ ఫేవరెట్ సెలబ్రిటీ అధ్యక్ష ఎన్నికల్లోనా? అంటూ ఆశ్చర్యానికిలోనైంది అక్కడి యువత. కట్ చేస్తే.. తన కొత్త ఆల్బమ్ కోసం అతను చేసిన పబ్లిసిటీ స్టంట్ అని తేలడంతో.. తిట్టిన తిట్టు తిట్టకుండా తిట్టారు కాన్యే వెస్ట్‌ను. అయ్యో వద్దమ్మా.. ఓ వర్షపు వేళ.. సిగ్నల్ పడి ట్రాఫిక్ ఆగిపోతుంది. ఒక కారు వెనుక సీట్ దగ్గరకు ఓ ట్రాన్స్ జెండర్ వచ్చి కారు అద్దాన్ని తడుతుంది మునివేళ్లతో. ఆ ట్రాన్స్‌జెండర్ డబ్బుల కోసం వచ్చిందేమో అనుకుని కార్లో ఉన్న పెద్దావిడ అద్దాలు దించి డబ్బులివ్వబోతుంది. ‘అయ్యో వద్దమ్మ టీ ఇవ్వడానికి వచ్చాను’ అంటూ తన చేతిలో ఉన్న టీ గ్లాస్‌ను ఆమెకు అందిస్తుంది. టీ తీసుకుని నిండు మనసుతో ఆ ట్రాన్స్‌జెండర్‌ను ఆశీర్వదిస్తుంది ఆ పెద్దావిడ. పేరున్న ఓ టీ బ్రాండ్ యాడ్ ఇది. ఆత్మగౌరవానికి ప్రతీకగా ఈ యాడ్ చాలా పాపులర్ అయింది. ఈ యాడ్ పాపులారిటీని మన పోలీసులూ వాడుకున్నారు.. ‘అమ్మో వద్దమ్మా’ అంటూ ట్రాఫిక్ మీద ప్రజలకు అవగాహన కల్పించేందుకు. దీన్నిబట్టి అర్థం చేసుకోవచ్చు.. ఆ యాడ్ చూపిన ప్రభావం ఎంతటిదో! ఇలా సామాన్యులను ప్రభావితం చేసిన ఎన్నో ప్రకటనలు మీమ్స్‌గా.. రీల్స్‌గా నెట్టింట వెల్లువెత్తుతున్నాయి. డాక్టర్లు..స్టాక్ మార్కెట్ ట్రేడర్లు.. వ్యాపార ప్రమోషన్లకే కాదు ఆఖరికి వెడ్డింగ్ కార్డుల్లోనూ వెరైటీకి పెద్ద పీట వేస్తున్నాయి క్రియేటివ్ మైండ్స్. ఇటీవలి కాలంలో తెలంగాణ యాసలో వెడ్డింగ్ కార్డ్స్ ప్రింట్ చేయడం ఫ్యాషన్‌గా మారింది. దీనికి అదనంగా డాక్టర్లయితే వారి టెర్మినాలజీలో, స్టాక్ మార్కెట్ ట్రేడర్లయితే ఐపీవో, పబ్లిక్ ఇష్యూ, ప్రమోటర్ వంటి పదాలు వాడుతూ శుభలేఖలకు కొత్త శోభను అద్దుతున్నారు. రియల్ లైఫ్ సరే.. రీల్ లైఫ్ పబ్లిసిటీకి సంబంధించి ఇక్కడొక సంగతి చెప్పుకోవాలి. ప్రకటనలతో తన ప్రోడక్ట్‌పై నమ్మకాన్ని.. ఆసక్తిని పెంచేలా చేయడంలో ఒకప్పుడు దేశంలోనే ఎవరూ చేయని సాహసం చేశాడు. కన్నడ దర్శక హీరో ఉపేంద్ర. కథకు.. సినిమాలో పాత్రలకు ఏ సంబంధం లేకుండా సినిమాకు టైటిల్ పెట్టే కొత్త ట్రెండ్‌ను క్రియేట్ చేశాడు. ‘ష్’, ‘ఓం, ‘ఏ’ వంటి ఒకే అక్షరంతో కూడిన టైటిల్స్ కన్నడనాటే కాకుండా తెలుగులో కూడా సెన్సేషన్ అయ్యాయి. సినిమా టైటిల్స్ వేయడంలో దివంగత దర్శకుడు ఈవీవీది సపరేట్ స్టయిల్. ముఖ్యంగా టెక్నీషియన్స్ టైటిల్ కార్డ్స్ విషయంలో ఆయన పద్ధతే వేరప్పా! ఎడిటర్‌కి కత్తెరేసినోడు అని, కొరియోగ్రఫీకి చిందులేయించింది అని, సంగీతానికి వాయించింది అని.. వాడుక పదాలను వాడేవాడు. దీన్నీ సినిమా ప్రమోషన్లో న్యూ వేగా భావించవచ్చు. ఇలా చెప్పకుంటూ పోతే కిరాణా కొట్టు నుంచి కాస్మిక్ ఎనర్జీ దాకా.. ఆయా రంగాలకు చెందిన ప్రోడక్ట్స్ ప్రమోషన్స్ అన్నీ ఒకదానితో ఒకటి సంబంధం లేకుండా పోటీ పడుతున్నాయి క్రియేటివిటీలో. ఆ సృజన కొనుగోళ్లను పెంచుతుందో లేదో తెలియదు కానీ కొనుగోలుదారుల మనసును మాత్రం గెలుచుకుంటోంది. అందుకే మార్కెట్లో గూడ్స్ కన్నా సృజనాత్మకమైన ఐడియాలకు మాత్రం పోటీ పెరిగింది. ఆ తిక్క ఉన్నవాళ్లదే గెలుపు మరి! ∙టి. కృష్ణ గోవింద్ -
డేటాను ఒడిసిపట్టి, విశ్లేషించే.. బిజినెస్ ఎనలిస్ట్
టాప్ స్టోరీ ఎనలిటికల్ స్కిల్స్ : అందుబాటులో ఉన్న డేటాను విశ్లేషించి, దాన్ని నిర్ణయాలు తీసుకునేందుకు వీలుగా క్లుప్తీకరించడానికి ఎనలిటికల్ టూల్స్ అవసరం. వీటికి సంబంధించిన స్కిల్స్ ఉండాలి. బిజినెస్ స్కిల్స్ : ఓ కంపెనీ కార్యకలాపాలు, లక్ష్యాలు, సమస్యలను అర్థం చేసుకునే నైపుణ్యం అవసరం. అప్పుడే సంబంధిత బిజినెస్ డెరైక్టర్లకు అవసరమైన సమాచారాన్ని అందుబాటులో ఉంచగలరు. క్రియేటివ్ స్కిల్స్: సృజనాత్మకంగా ఆలోచించడం ప్రధానం. విశ్లేషణ నివేదికలను బార్/లైన్ గ్రాఫ్స్; సర్క్యులర్ గ్రాఫ్స్ తదితర రూపాల్లో అందించాల్సి ఉంటుంది. అందువల్ల తప్పనిసరిగా గ్రాఫికల్ కమ్యూనికేషన్ స్కిల్స్‌ను పెంపొందించుకోవాలి. ఒక కంపెనీ/సంస్థ కొత్త ప్రణాళికలను రూపొందించు కునేందుకు డేటా ఎనలిటిక్స్ ఉపయోగపడుతుంది. కంపెనీ వ్యాపార అభివృద్ధికి ఉపయోగపడే నిర్ణయాలు తీసుకోవడంలో ఎనలిటిక్స్ నిపుణులు కీలక పాత్ర పోషిస్తారు. ఉదాహ రణకు ఒక కంపెనీ నగరంలో రిటైల్ ఔట్‌లెట్‌ను ఏర్పాటు చేయాలనుకుంటే వ్యాపారానికి అవకాశమున్న ప్రాంతం, అందుబాటులో ఉన్న వినియోగదారులు, వారి అభిరుచులు, ఆర్థిక పరిస్థితులు, ఏయే వస్తువులు ఉండాలని కోరుకుం టున్నారు? ఏయే వస్తువులకు డిమాండ్ ఉంది? రిటైల్ రంగంలో ఉన్న ఇతర పోటీదారుల పరిస్థితి ఎలా ఉంది? ఇలా వివిధ కోణాల్లో సమాచారాన్ని సేకరించి.. విశ్లేషించి.. సమగ్ర నివేదిక రూపొందించడమే డేటా ఎనలిటిక్స్. ఎనలిటిక్స్ కోర్సులను అందిస్తున్న సంస్థలు ఐఐటీ - హైదరాబాద్ కోర్సులు: సర్టిఫికెట్ కోర్స్ ఇన్ అడ్వాన్స్డ్ బిజినెస్ ఎనలిటిక్స్, ఫౌండేషన్స్ ఆఫ్ ప్రిడెక్టివ్ ఎనలిటిక్స్ వ్యవధి: ఐదు రోజులు వెబ్సైట్: www.iith.ac.in/analy/index.html ఐఎస్బీ- హైదరాబాద్ హైదరాబాద్‌లోని ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్.. సర్టిఫికెట్ ప్రోగ్రాం ఇన్ బిజినెస్ ఎనలిటిక్స్ (సీబీఏ)ను ఆఫర్ చేస్తోంది. ఇది ఏడాది వ్యవధి గల కోర్సు. క్లాస్‌రూం, టెక్నాలజీ ఆధారిత విధానాల ద్వారా బోధన ఉంటుంది. వెబ్సైట్: www.isb.edu ఐఐటీ - బాంబే కోర్సు: అడ్వాన్స్డ్ సర్టిఫికెట్ ప్రోగ్రామ్ ఇన్ బిజినెస్ ఎనలిటిక్స్; వెబ్సైట్: www.iitb.ac.in ఐఐఎం- బెంగళూరు ఎనలిటిక్స్‌లో ఏడాది వ్యవధి ఉన్న సర్టిఫికెట్ కోర్సును ఆఫర్ చేస్తోంది. బహుళజాతి సంస్థల్లో పనిచేస్తున్న ఉద్యోగుల కోసం ఈ కోర్సును ప్రవేశపెట్టింది. ఇంటర్‌డిసిప్లినరీ పరిశోధనల్లో డేటాను వినియోగించడం కోసం ప్రత్యేకంగా డేటా సెంటర్‌ను, ఎనలిటిక్స్ ల్యాబ్‌ను ఏర్పాటు చేసింది. వివరాలకు www.iimb.ernet.in ఐఐఎం- కోల్‌కతా ఎగ్జిక్యూటివ్ ప్రోగ్రాం ఇన్ బిజినెస్ ఎనలిటిక్స్ (ఉ్కఆఅ)ను ఆఫర్ చేస్తోంది. ఇది ఏడాది వ్యవధి గల ఎగ్జిక్యూటివ్ కోర్సు. 50 శాతం మార్కులతో బీఎస్సీ/బీటెక్ ఉత్తీర్ణతతోపాటు రెండేళ్ల పని అనుభవం. ఏదైనా కంపెనీలో పనిచేస్తుండాలి. వెబ్సైట్: www.iimcal.ac.in ఐఐఎం-లక్నో కెల్లీ స్కూల్ ఆఫ్ బిజినెస్, ఇండియానా యూనివర్సిటీ, యూఎస్ఏలతో సంయుక్తంగా ఐఐఎం-లక్నో సర్టిఫికెట్ ప్రోగ్రామ్ ఇన్ బిజినెస్ ఎనలిటిక్స్ ఫర్ ఎగ్జిక్యూటివ్స్‌ను ఆఫర్ చేస్తోంది. క్లాస్‌రూం, ఆన్లైన్ విధానాల్లో బోధన ఉంటుంది. వెబ్సైట్: www.iiml.ac.in ఐఐఎం- అహ్మదాబాద్ మేనేజ్మెంట్ నిపుణుల కోసం అడ్వాన్స్డ్ ఎనలిటిక్స్‌లో ఎగ్జిక్యూటివ్ ప్రోగ్రామ్‌ను అందుబాటులోకి తీసుకొచ్చింది. ప్రపంచవ్యాప్తంగా ఆన్లైన్లో కోర్సులను అందిస్తూ విశేష ఆదరణ పొందిన మాసివ్ ఓపెన్ ఆన్లైన్ కోర్సెస్ (మూక్).. తన ప్రొవైడర్స్ ఎడెక్స్ (www.edx.org), కోర్సెరా (www.coursera.org) ద్వారా ఎనలిటిక్స్‌లో ఎన్నో సర్టిఫికెట్ కోర్సులను ఆఫర్ చేస్తోంది. ఇవేకాకుండా ఐఐటీ - ఖరగ్‌పూర్, ఐఐటీ - రూర్కీ.. బిజినెస్ ఎనలిటిక్స్‌లో స్వల్పకాలం వ్యవధి ఉన్న కోర్సులను అందిస్తున్నాయి. ప్రైవేటు రంగంలో ఎన్ఐఐటీ లిమిటెడ్.. బిజినెస్ ఎనలిటిక్స్‌లో సర్టిఫికెట్ కోర్సును ఆఫర్ చేస్తోంది. ఎవరు అర్హులు? కొన్ని సంస్థలు కోర్సుల్లో ప్రవేశానికి ఇంజనీరింగ్/బిజినెస్ మేనేజ్ మెంట్/సైన్స్/కామర్స్/ మ్యాథమెటిక్స్/స్టాటిస్టిక్స్ తదితర అంశాల్లో బ్యాచిలర్‌స డిగ్రీని అర్హతలుగా పేర్కొంటున్నాయి. మరికొన్ని మాస్టర్స్ డిగ్రీలో ఉత్తీర్ణత సాధించాలని నిర్దేశిస్తున్నాయి. పని అనుభవాన్ని కూడా పరిగణనలోకి తీసుకుంటున్నారు. అయితే విశ్లేషణా సామర్థ్యం, అకడమిక్స్‌లో మంచి ప్రతిభ ఉంటే ఫ్రెషర్స్‌కు కూడా కోర్సులో ప్రవేశాలు కల్పిస్తున్నాయి. నగరంలో ఎన్నో ఉద్యోగాలు సిటీలో ఎన్నో బహుళజాతి సంస్థలు, స్వదేశీ సంస్థలు తమ కార్యకలాపాలను నిర్వహిస్తున్నాయి. ఐటీ సర్వీసెస్; ఎడ్యుకేషన్; మ్యానుఫ్యాక్చరింగ్; మార్కెటింగ్; ట్రావెల్ అండ్ టూరిజం; హెల్త్‌కేర్, బ్యాంకింగ్, బీమా, ఈ-కామర్స్ సంస్థల వరకు ఎన్నో నగరంలో కొలువుదీరాయి. ఇవి వ్యాపారాభివృద్ధికి బిజినెస్ ఎనలిటిక్స్ నిపుణులపైనే ఆధారపడ్డాయి. ఇందుకోసం భారీ స్థాయిలో జీతాలు ఇవ్వడానికీ సిద్ధంగా ఉన్నాయి. కాబట్టి నగరంలో బిజినెస్ ఎనలిస్టులకు అవకాశాలు కోకొల్లలు. ఔత్సాహికులు ఫ్రెషర్స్‌గా లేదా రెండు-మూడేళ్ల పని అనుభవంతో బిజినెస్ ఎనలిటిక్స్‌లో కెరీర్‌ను ప్రారంభించవచ్చు. అందుబాటులో ఉన్న ఉద్యోగాలు.. జూనియర్ బిజినెస్ ఎనలిటిక్స్ ఎగ్జిక్యూటివ్; సీనియర్ బిజినెస్ ఎనలిటిక్స్ ఎగ్జిక్యూటివ్; అసిస్టెంట్ మేనేజర్ (బిజినెస్ ఇంటెలిజెన్స్ అండ్ కస్టమర్ ఎనలిటిక్స్); డేటా మోడలర్(బిజినెస్ ఇంటెలిజెన్స్ అండ్ ఎనలిటిక్స్); బిజినెస్ కన్సల్టెంట్ (ఫైనాన్షియల్ ఎనలిటిక్స్); బిజినెస్ కన్సల్టెంట్ (బీపీవో/కేపీవో/ఐటీఈఎస్); ప్రాజెక్టు మేనేజర్ (ఎనలిటిక్స్); టీమ్ లీడర్. వేతనాలు ప్రతిభ ఉన్న ఎనలిటిక్స్ నిపుణులకు కార్పొరేట్ కంపెనీలు నెలకు రూ.80 వేల నుంచి రూ.లక్ష వరకు ఆఫర్ చేస్తున్నాయి. స్కిల్డ్ ఎనలిస్ట్లకు భారీ డిమాండ్ ‘‘మార్కెటింగ్‌లో ఊహించని మార్పులను విశ్లేషించి చెప్పగలిగే నిపుణులే.. ఎనలిస్ట్‌లు. గతం, వర్తమాన, భవిష్యత్తు అంశాలను విశ్లేషించగలిగే నేర్పు, ఓర్పులే ఎనలిస్ట్ కావాలనుకునే వారికి ఉండాల్సిన ప్రాథమిక లక్షణాలు. ప్రస్తుతం జాబ్మార్కెట్లో స్కిల్డ్ ఎనలిస్ట్లకు విపరీతమైన డిమాండ్ ఉన్నప్పటికీ సరిపడినంత నిపుణులు లేరు. ఈ రంగాన్ని కెరీర్‌గా ఎంచుకోవాలను కుంటే మ్యాథమెటిక్స్, అల్గారిథమ్, స్టాటిస్టిక్స్, గ్రాఫ్ థియరీ, అపరేషన్ రీసెర్చ్ వంటి అంశాల్లో పరిజ్ఙానం పెంచుకోవాలి. ఐఐటీ ముంబై, కాన్పూర్, చెన్నై, ట్రిపుల్ ఐటీ హైదరాబాద్, బెంగళూరు క్యాంపస్‌లలో డేటా ప్రోగ్రామ్స్ అందుబాటులో ఉన్నాయి. డేటా ఎనాలసిస్‌లో పూర్తిస్థాయి నైపుణ్యం సంపాదిస్తే అద్భుతమైన కెరీర్‌ను సొంతం చేసుకోవచ్చు’’ - ప్రొఫెసర్ పి.కృష్ణారెడ్డి, ఐటీఆర్ఏ ప్రోగ్రాం డెరైక్టర్, ట్రిపుల్ ఐటీ, హైదరాబాద్